Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

కృష్ణా జల వివాదంలో మరో ట్విస్ట్‌!

వి. శంకరయ్య

ప్రత్యేక తెలంగాణ (2014లో) ఏర్పడినప్పటి నుండి బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డులో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వాదిస్తున్నారు. బేసిన్‌లో అన్ని రాష్ట్రాల మధ్య నీటి పంపకం జరిగినప్పుడనే అంశం మాత్రం ఆయన మరుగు పర్చుతున్నారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తుదితీర్పు వచ్చే వరకు కృష్ణ యాజమాన్య బోర్డు పరిధి నిర్ణయించకూడదని అభ్యంతరం చెప్పారు. అయితే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇదే అంశం లేవనెత్తారు. ఈ అంశంపై తెలంగాణ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఉపసంహరించుకుంటే, ‘‘న్యాయ’’ పరమైన చిక్కులు ఏమీ లేకుంటే, కొత్త ట్రిబ్యునల్‌కు గాని ఇప్పుడున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు గాని నివేదించుతామని కేంద్ర మంత్రి షెకావత్‌ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు సుప్రీంకోర్టులో వున్న కేసు ఉపసంహరణకు తెలంగాణ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ వెనక్కి తీసుకొనేందుకు ఇదే కేసులో భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్‌ కర్నాటక రాష్ట్రాలు ఆగస్టు 27 వ తేదీన న్యాయమూర్తి చాంబర్‌లో విచారణ సందర్భంగా అభ్యంతరం పెట్టడంతో కేసు ధర్మాసనానికి బదిలీ జరిగింది. కృష్ణా జలాలు తిరిగి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపకం జరిగేందుకు ట్రిబ్యునల్‌ నియమించే ప్రయత్నానికి తొలి బ్రేక్‌ పడిరది.
దీనికి సుదీర్ఘమైన నేపథ్యముంది. 2013లో బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పు వెలువడగానే ఇది తమకు సమ్మతం కాదని కర్నాటకకు అనుకూలంగా వుందని ఆల్మట్టి ఎత్తు పంచుకొనే అవకాశం వుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసి బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు నోటిఫై కాకుండా స్టే తెచ్చింది. అదే సమయంలో ఆర్డీయస్‌కు బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ నాలుగు టిఎంసిలు కేటాయించడంపై కర్నాటక సుప్రీంకోర్టుకు ఎక్కింది.
ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విభజితమైంది. వాస్తవంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిధులు నీళ్లలో అన్యాయం జరగిందనే ప్రత్యేక ఉద్యమం సాగినందున ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు పంపుతూ ఈ అంశంలో తన వాదనను ట్రిబ్యునల్‌కు నివేదించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు జవాబు రాసి చేతులు దులుపుకొంది. వాస్తవంగా దేశంలో ఏ నదీజలాలనైనా 1956 అంతర్‌ రాష్ట్ర జల వివాద చట్టం కింద నియమితమయ్యే ట్రిబ్యునల్స్‌ తప్ప మరే వేదిక పరిష్కరించే అవకాశం లేదు. న్యాయపరమైన ఈ అంశం తెలిసీ ప్రస్తుతం తెలంగాణ కృష్ణ బోర్డును నీటి వాటాలు తేల్చమని కోరడం ఒకింత ఆశ్చర్యమే.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు కెక్కింది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సరైన సమాధానం రాలేదని బచావత్‌ ట్రిబ్యునల్‌తో పాటు బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పులో కూడా తెలంగాణకు న్యాయం జరగలేదని తన వాదనగా వినిపించింది.
బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తమ వాదనలు వినాలని ట్రిబ్యునల్‌ పరిధి పెంచాలని నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందన్న తమ విజ్ఞప్తులపై కేంద్రం సరిగా స్పందించ లేదని తెలంగాణ తన ఫిర్యాదులో పొందుపర్చింది. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఇటు కర్నాటక మరో వేపు తెలంగాణ వేసిన కేసులన్నీ సుప్రీంకోర్టులో 2015లో విచారణకు వచ్చాయి. ఈ సందర్భంలో కేసు విచారణకు తీసుకున్న ధర్మాసనం కృష్ణా జలాల పంపకంలో ప్రస్తుతమున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ పరిధి గురించి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది. కాని రెండు మూడు వాయిదాల్లోనూ కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పలేదు. తుదకు డిసెంబర్‌ నెలలో ధర్మాసనం గట్టిగా పట్టుపట్టడంలో గడువు పొడిగించిన బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీళ్ల పంపకాల వరకే పరిమితం కావాలని కేంద్రం అఫిడవిట్‌ వేసి రెండు తెలుగు రాష్ట్రాల కొంపలు కూల్చింది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఏక పక్షంగా వుందని తమకు న్యాయ సమ్మతంగా లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వేసిన కేసుతో పాటు తెలంగాణ ఫిర్యాదు వున్నా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. అప్పట్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ గాని ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. ఆ రోజుల్లో కర్నాటక లాబీ కేంద్రంలో చురుకుగా పని చేసి కేంద్రం అఫిడవిట్‌ తమకు అనుకూలంగా చూసుకొంది.
ఇంత కథనం ఎందుకు చెప్పవలసి వుందంటే ఆ రోజుల్లో కేంద్రం బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ పరిధి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య అని చెప్పి వున్నా లేక మౌనం పాటించి వున్నా సుప్రీంకోర్టు తీర్పు వేరు విధంగా వుండేది. కేంద్రం అఫిడవిట్‌ వేయడంతో ట్రిబ్యునల్‌ పరిధి రెండు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకప్పుడు సువర్ణవకాశం పోగొట్టుకున్న రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం చాలీచాలని కృష్ణా నీళ్ల కోసం క్షేత్రస్థాయిలో సిగపట్లు పట్టుకొంటున్నాయి. వివిధ కోర్టుల్లో కేసులు వేస్తున్నాయి. తుదకు కొత్త ట్రిబ్యునల్‌ కోసం సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకొనేందుకు తెలంగాణ చేసిన తొలి యత్నానికి తాజాగా బ్రేక్‌ పడిరది. దీనిపైననే తెలంగాణ ప్రభుత్వం బాగా ఆశలు పెంచుకొంది. ఒక వేపు కొత్త ట్రిబ్యునల్‌ కోసం అన్ని యత్నాలు చేస్తూ వాస్తవంలో ట్రిబ్యునల్‌ చేయవలసిన నీటి కేటాయింపులు బోర్డు చేత చేయించుకొనేందుకు ద్విముఖ వ్యూహం పన్నింది.
అంతేకాదు. ఒక వేళ మున్ముందు సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించినా తెలంగాణ అభ్యర్థిస్తున్నట్లు మరో ట్రిబ్యునల్‌ వేసేందుకు న్యాయపరంగా అవకాశాలు లేవు. ఎందుకంటే బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు నోటిఫై జరగలేదు. ప్రస్తుతం బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు అమలు వుంది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు న్యాయపరంగా అతీగతీ తేలకుండా మూడవ ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలా నియమించుతుంది? అందుకే కేంద్ర మంత్రి న్యాయ పరమైన చిక్కులు లేకుంటే అనే షరతు పెట్టినట్లుంది. ఒక వేళ తెలంగాణ అభ్యర్థనను బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు నివేదించినా అంత కన్నా చిక్కులు తప్పవు. ఎందుకంటే బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఈ పాటికే బేసిన్‌లోని రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన నీటి కేటాయింపులు ‘‘వినియోగంలో’’ వుంటే వాటి జోలికి వెళ్లలేదు. ఇది సంప్రదాయం. సహజ న్యాయ సూత్రం కూడా. 65 శాతం నీటి లభ్యత కింద లభ్యమైన నికర జలాలను సరాసరి కింద లభ్యమైన మిగులు జలాలను మాత్రమే పంపకం చేసింది. తను ఇచ్చిన తీర్పు ఒక వేపు గాలిలో వుంటే తెలంగాణ కోరుతున్నట్లు బచావత్‌ ట్రిబ్యునల్‌తో పాటు తను ఆమోదించిన ఆంధ్రప్రదేశ్‌లో వినియోగంలో వున్న కృష్ణ జలాలను అడ్డంగా మళ్లించి తెలంగాణకు తిరిగి కేటాయించడం ఎంత వరకు సాధ్యం? పైగా బచావత్‌ ట్రిబ్యునల్‌ లాగే బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కూడా తన తీర్పులో తను కేటాయించిన నీరు వినియోగంలో వుంటే 2050 తర్వాత వచ్చే ట్రిబ్యునల్‌ లేదా అథారిటీ తిరిగి పంపకం చేసే అవకాశం లేదని చెప్పింది. ఈ ట్రిబ్యునల్సే కాదు. దేశంలో ఏ నదీ జలాలు పంపిణీ చేసే ఏ ట్రిబ్యునల్‌ అయినా ఈ సహజ న్యాయ సూత్రం పాటించడం పరిపాటే.
వ్యాస రచయిత సెల్‌ 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img