Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

కొండంత భారం – గోరంత సడలింపు

    డాక్టర్‌ సీ.ఎన్‌ క్షేత్రపాల్‌ రెడ్డి  

సామాన్యుడి వంటింటి మంటల సెగ తొమ్మిదేళ్ల తర్వాత మోదీ సర్కారును తాకింది. 2014 నాటి ఎన్నికల ప్రచార సభల్లో గ్యాస్‌ బండకు దండం పెట్టి తనకు ఓటు వేయాలని ప్రజల్ని మోదీ అభ్యర్థించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యాస్‌ ధరలతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తోందంటూ మొసలి కన్నీరు కార్చారు. నాడు గ్యాస్‌ బండ ధర రూ.414. గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలతో పాటు అన్ని నిత్యావసర వస్తువులు ధరల్ని తగ్గించి అచ్చేదిన్‌ తెస్తానని నమ్మబలికారు. అధికారం చేజిక్కగానే తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. 2015లో గ్యాస్‌ ధర అమాంతం రూ.606కు పెరిగింది. 2016లో రూ.747 కు చేరుకుంది. 2021 నాటికి రూ.819, 2022 చివరి నాటికి రూ.1150 దాటింది. తాజాగా రూ.1200లకు చేరువైంది. ఇలా తొమ్మిదేళ్ల కాలంలో గ్యాస్‌ ధరలు 144 శాతం పెరిగాయి.
దీంతో పాటు వినియోగదారులకు మోదీ ప్రభుత్వం మరో షాక్‌ఇచ్చింది. ఎల్పీజీ సిలిండర్లపై ఇస్తున్న రాయితీని క్రమంగాఎత్తేస్తూ వచ్చింది. 2016లో ప్రవేశపెట్టిన పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న పేదలకు మాత్రమే రూ.200 రాయితీ అని సన్నాయి నొక్కులు నొక్కింది. తక్కినవారంతా ఎల్పీజీ సిలిండర్‌ను మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సిందేనని కేంద్ర చమురుశాఖ స్పష్టం చేసింది. వంట గ్యాస్‌ సిలిండర్లపై జూన్‌ 2020 నుంచే సబ్సిడీని రద్దు చేసినట్టు తెలిపింది. నిజానికి 2020 నాటికి ఒక సిలెండరుపై ఇస్తున్న సబ్సిడీ సొమ్ము కేవలం రూ.40 కావడం గమనార్హం. ప్రభుత్వ రంగం సంస్ధలను తగ్గించేసి ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలనేది మోదీ ప్రభుత్వం అజెండాలో భాగంగానే వంటగ్యాస్‌ సబ్సిడీని తగ్గించేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు గ్యాస్‌ సబ్సిడీ కోసం సుమారు రూ.38 వేల కోట్లు నిధులు కేటాయించగా రెండోసారి అధికారంలోకి రాగానే ఆ సొమ్మును కుదించేయడాన్ని గమనిస్తే గ్యాస్‌బండను ప్రజల పాలిట గుది బండగా మార్చిన క్రమం అర్థమవుతుంది. గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ గణనీయంగా తగ్గిన విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిరచాయి. 2018-19లో సబ్సిడీ రూ.37,209 కోట్లుగా ఉంది. అది 2019-20లో రూ. 24,172 కోట్లకు తగ్గింది. 2020-21లో రూ.11,896 కోట్లకు పడిపోయింది. ఆ మొత్తం 2021-22 నాటికి రూ.1811 కోట్లకు పడిపోయింది. అదే తరుణంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీలు భారీగా నష్టాలను చవిచూశాయని, ఈ నష్టాలను పూడ్చేందుకు ఆయిల్‌ కంపెనీలకు వేలకోట్ల పరిహారాన్ని అందించి తాము ఎవరి పక్షమో తేటతెల్లం చేసింది.
గత తొమ్మిదేళ్ల మోదీ పాలనలో నిత్యావసర ధరలు 30 నుంచి 60 శాతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారమైంది. ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రతికుటుంబంలో నెల వారీ ఖర్చులు రెట్టింపయ్యాయి. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా మతతత్వ రాజకీయాల్ని నమ్ముకుని అధికారమదంతో మన్ను, మిన్ను కానక వ్యవహరించిన పాలకులకు ఇటీవల జరిగిన కన్నడనాట ఎన్నికల ఫలితాలు కళ్లు తెరిపించాయి. వారు నమ్ముకున్న మతతత్వ రాజకీయాలు. భజరంగ భళి నినాదాలు ఓట్లు రాల్చలేదు. ధరాభారంతో తాము ఎదుర్కొంటున్న కష్టాలకు బీజేపీ పాలనే కారణమని గ్రహించిన కన్నడ ఓటర్లు ఓటు దెబ్బ రుచిచూపించి అధికార పీఠం నుంచి దించేశారు. ఇది కన్నడ నాట ఉన్న ఓటరు తీర్పు మాత్రమే కాదని దేశం ఓటర్ల మూడ్‌ కూడా ఇలానే ఉందని గ్రహించిన పాలక పక్షం ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. మతతత్వ అజెండాతో మరో సారి జనాన్ని ఏమార్చలేమని గ్రహించి దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం పెరిగిన గ్యాస్‌ ధరల భారంలోంచి రూ. 200 ఉపసంహరించినట్టు ప్రకటించింది. ఇందుకు కారణం దేశవ్యాప్తంగా 30.50 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండడమే. రానున్న కొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఆందులో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువ. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో సిలిండరు రూ.500 లకే ఇస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని గ్యాస్‌ వినియోగదారు కుటుంబంలో ఇద్దరు చొప్పున గ్యాస్‌ బండకు దండం పెట్టి ఓటు వేయడం కోసం వెళితే ఏమి జరుగుతుందో కళ్లముందు కనిపించడంతోనే గ్యాస్‌ ధరల్ని తగ్గించిందనేది సుస్పష్టం.
తన పాలనతో మూడిరతలు పెరిగిన గ్యాస్‌ ధరలో రూ.200 తగ్గించి దేశ ప్రజలంతా పండగ చేసుకోండనే రీతిలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది రక్ష బంధన్‌, ఓనం పండుగల నేపథ్యంలో మహిళలకు ఇస్తున్న కానుక అనడం పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలు కలిగించే నిర్ణయాలే తాము తీసుకుంటామని పేర్కొనడంపై సామాన్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పేద, మధ్యతరగతి వర్గాలపై అంత ప్రేమ ఉంటే గ్యాస్‌ ధరల్ని తాను అధికారంలోకి రాకముందటి కన్నా తక్కువకే ఇవ్వాల్సి ఉంటుంది. అది చేయకుండా తొమ్మిదేళ్ల పాటు ధరలభారం మోపి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయన్న భయంతోనే ఈ గోరంత తగ్గించారని ప్రజలు సులభంగానే గ్రహించగలరు. ఉజ్వల కింద ఉన్న వారికి మరో రూ.200 అదనంగా సబ్సిడీ ప్రకటించడం వెనుక కారణాలున్నాయి. ఇటీవలే కేంద్రం విడుదల చేసిన నివేదికల ప్రకారం, దేశంలో మొత్తం 8.03 కోట్ల మంది ఉజ్వల గ్యాస్‌ వినియోగిస్తున్నారు. ఈ వినియోగదారుల్లో ఎక్కువ శాతం బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందినవారే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, అసోం తదితర రాష్ట్రాల్లోనే నాలుగు కోట్లకు పైగా ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లోనైనా పట్టు నిలుపుకునేందుకే అదనంగా మరో 200 సబ్బిడీ ప్రకటన.
ధరల నియంత్రణ బాధ్యతల నుంచి తప్పుకున్న మోదీ ప్రభుత్వం సామాన్యులను బలి పెట్టింది. 2017కి ముందు పెట్రోలు, డీజిల్‌ ధరలు ప్రతి మూడునెలలకు ఒకసారి మారుతూ ఉండేవి. కానీ 2017 జూన్‌ 15 నుంచి డైనమిక్‌ ఆయిల్‌ ప్రైస్‌ విధానం అమలులోకి వచ్చింది. దీంతో ప్రతిరోజు ఉదయం 6 గంటలకే పెట్రోలు బంకుల్లోనే తాజా ధరను ప్రకటించే విధానం మొదలైంది. ఈ క్రమంలోనే ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. యూపీఏ నాటికన్నా చౌకగా ముడి చమురు భారత్‌కు సరఫరా అవుతున్నా మోదీ ప్రభుత్వం ఇంధన ధరల్ని తగ్గించకుండా ప్రజల జేబుల్ని లూటీ చేస్తోంది. మోదీ వస్తే రూ. 40లకే పెట్రోలు అనుకున్న జనం నెత్తిన వచ్చిన నాటి నుంచి వడ్డన మొదలైంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే ఇంధన ధరల మోత ప్రారంభమైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇంధనంపై పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం 2.94 లక్షల కోట్లకు పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ 2021లో లోక్‌సభలోనే వెల్లడిరచారు. ఆయన ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆదాయం సుమారు 300 శాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమైంది.
ఇప్పటి వరకూ సామాన్యుల జేబులకు చిల్లులుపెట్టి సంపన్నులకు నజరానాలు ప్రకటించిన మోదీ ప్రభుత్వానికి ధరల్ని తగ్గించాలనే జ్ఞాన దంతం ఇప్పుడే మొలిచింది అనుకోలేము. ఉన్నట్టుండి సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలపై ప్రేమ కురిపించడం వెనుక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం ఉంది. జనంలోనూ ఈ మోసకారి ప్రభుత్వాన్ని ఇక సహించకూడదనే భావనలు బలపడుతుండడంతో ఎన్‌డీఏ వెన్నుల్లో వణుకు మొదలైంది. కాబట్టే ఈ ధరల తగ్గింపు ఎన్నికల స్టంట్‌.
సెల్‌: 9059837847

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img