Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

కొండమీది దేముడు

రా బావ ఏంటి ఈ రోజు కోపంగా పళ్లు బిగించి మరీ వస్తున్నావు. ఏముంటుంది ప్రతిరోజు దినపత్రిక చదివిన తరువాత మనసున్న ప్రతి వాడికి కోపం రావడమో, దు:ఖం రావడమో తప్పదు గదా. అది సరే ఈ రోజు కోపానికి కారణం ఏం చదివావు అసలేం జరిగింది. నీకేమయ్యా నిదానంగా తాపీగా ఏం జరిగిందంటావు. నాకే గనుక ఒక నెల ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఇటువంటి సనాతన వాదుల్ని, మూఢ నమ్మకాలు వ్యాప్తిచేసేవారిని మొత్తం కట్టగట్టి జైల్లో పెడతాను. లేకపోతే హిట్లరులాగ కాల్చివేస్తా. నక్సలైట్లను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ఓట్ల కోసం ప్రజల్ని మూఢనమ్మకాల్లో ముంచెత్తే రాజకీయ నాయకుల్ని పిట్టల్లాగ కాల్చివేస్తా అబ్బో చాలా కోపంగా ఉన్నారు. కొంచెం కూల్‌గావయ్యా. ఇప్పుడు విను రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రజల్ని మూఢనమ్మకా లతో ముంచెత్తే మాట నిజమే. ఈరోజు ఏం చదివావు. నిదానంగా అడుగుతావేంటి బావ. శ్రీకాకుళం జిల్లాలో కొండమీద దేముడు వెలిశాడని గుడికట్టి ప్రతి సంవత్సరం ఉత్సవం పేరిట కొండెక్కలేక జారి పడి కొంతమంది చనిపోతుంటే ప్రభుత్వం మెట్లదారి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా. నిజమే మరణాలకు దారితీసే ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది చేరే ప్రతిచోటా రక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ప్రభుత్వానికుంది. అటువంటి దారుణ సంఘటనలు బాధ కలిగించే విషయమే.
అసలు నాకు తెలియక అడుగుతాను. రాష్ట్రపతి, ప్రధాని దగ్గర నుండి శాసనసభ్యులవరకు దైవదర్శనం చేసుకుంటుంటే సామాన్య ప్రజలు వెళ్లకుండా ఉంటారా. ప్రతి అణువుఅణువునా దేముడుంటాడని విస్తృతంగా ప్రచారంచేసే పీఠాధిపతులు చెబుతుంటే ఇంట్లో పూజలతో సరిపెట్టుకోకుండా కొండలమీద, గుట్టలమీద గుళ్లుకట్టి అమాయకుల్ని చంపడం దేనికో. నిజమే మనసు ప్రశాంతత కోసం గతంలో నదుల పక్కనో, పర్వతాలపైనా గుళ్లు కడితే ప్రస్తుతం ప్రతి రోడ్డుపైన గుడి కట్టడం ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించడాలు ఎక్కువైంది. చివరకు సినిమా స్టార్లు ఇంటిలోనే గుడి కట్టడం కూడా చూస్తున్నాం. అది సరే ఇంట్లో గుడిలోని ఫొటోలో లేని దేముడు గుడిలో ఉంటాడా. ఇది చివరకు వ్యాపారంగా మారింది. పత్రికల వాళ్లను ప్రలోభపెట్టి ఒక రాయిచూపించి దేముడు వెలిశాడని రాయించి ప్రచారం చేయించి జన ప్రవాహం పెరిగిన తరువాత లక్షల్లో సంపాదించడం మొదలైన కొన్నాళ్లకు తప్పనిసరై దేవాదాయ శాఖకు అప్పగించడం ఇదంతా వ్యాపారంగా మారింది. గుడి కట్టి సంపాదన మొదలైన తరువాత స్థానిక ప్రజా నాయకుడికి వాటా ఇవ్వడం, ఇదంతా బైటపడిన తరువాత పత్రికలలో వచ్చిన తరువాత తీరుబడిగా దేవాదాయ శాఖ అధికారులు వచ్చి దాన్ని హంగామా చేయడం ఇదంతా ఒక ప్రక్రియలాగ జరిగిపోతోంది బావ. నిజమే అంతెందుకు ప్రతి సంవత్సరం కేదారనాథ్‌, బద్రీనాద్‌ యాత్రకు వెళ్లి ఎంతోమంది కొట్టుకుపోయి చనిపోతున్నారు. అప్పటికీ అక్కడి అధికారులు కొంతకాలందర్శనం ఆపివేస్తారు. అక్కడ నడవలేక డోలీలలో వెడతారు. మోసేవారు అడిగినంత ఇవ్వాలి. గతంలో కాశీకి వెళ్లినవారు కాటికి వెళ్లినట్లే అనేవారు. అడవిమార్గాన నెలల తరబడి నడిచివెళ్లి దారిలో చాలామంది మృతి చెందేవారు. తిరిగి వచ్చిన వారు పునర్జన్మగా భావించి బంధువులకు విందు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు బదిరీనాథ్‌ యాత్ర ఆ కోవలోకి వచ్చింది. ప్రస్తుతం తిరుపతికి వెళ్లని వారుండరేమో అనే విధంగా తాకిడిచూస్తున్నాం. నిజమేబావ మనిషిని నిర్లక్ష్యంచేసి దేవుని చుట్టూ తిరుగుతున్నా అందుకే వరహాలరావు అంటాడు తాను మనిషిని ప్రేమిస్తాగాని మనిషి చెక్కిన రాతి బొమ్మను కాదంటాడు. నీవు చదివావో లేదో ఒక శిల్పి నెలల తరబడి చెక్కిన విగ్రహాన్ని చూచిన స్వార్థపరులు దాన్ని తీసికెళ్లి గుడికట్టి సంపాదించాలని దొంగిలిస్తుంటే అవిగ్రహాన్ని తీసుకువెళ్లే బండికి అడ్డంపడి స్వామి స్వామి అంటూ అరుస్తుంటే బండి చక్రాలకిందపడి రెండుకాళ్లుపోయినా ఆ స్వార్థశక్తులు పట్టించుకోలేదని హృదయం ద్రవించేలా మోదుకూరి జాన్సన్‌ ఒక నాటకం రాశాడు.
ఇంతకూ దేముడు మనిషిని పుట్టించాడా లేక మనిషే దేముడ్ని తయారు చేశాడా అనేది నాకు పెద్దసందేహం. ఇందులో సందేహించే దేముంది? ఏ విగ్రహం చెక్కినా ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి గుడికట్టినా అన్నీ మనిషే. ఇందులో భిన్న వాక్కులకు చోటులేదు. అది సరే ఒక విశ్వబ్రాహ్మణుడు ఎంతో కష్టపడి ఒక దేవత విగ్రహం తయారుచేస్తే దాన్ని ఆ ఊరుపెత్తందార్లు దాన్ని ప్రతిష్టించి గుడి కట్టారు. ఆ తరువాత ఆ ఊరి ప్రజలంతా వెళ్లి పూజలు చేస్తుంటే సదరు విశ్వ బ్రాహ్మణుడు పూజలు చేయలేదు సరికదా ఆ దేవతకు నమస్కారం కూడా చేయకపోవడం గమనించి గ్రామస్తులు ఆయన్ని అడగ్గా నేనుచేసిన రాతి బొమ్మకు నేను నమస్కరించడమేమిటన్నాడట. దాంతో ఆగ్రహించిన పెత్తందార్లు సదరు శిల్పిని గ్రామ బహిష్కరణ చేశారట. అది సరే బావ మనిషి చేసిన బొమ్మకున్న విలువ మనిషికి లేకుండా పోయింది. గుడి నిర్మాణానికి అయితే చందాలిస్తారు. గాని అకలితో అలమటించేవాడికి గుప్పెడన్నం పెట్టరు. పేదవాని పిల్లల చదువుకు రూపాయి కూడా యివ్వరు. కేవలం ఒంగి నమస్కారం చేసి గుడిలో భోజనాలు చేసినంత మాత్రాన దేముడు కరుణిస్తాడా. అసలు కన్పించని దేముడు కరుణిస్తాడా!. కనిపించే కరుణామయుడే కరుణిస్తాడు. మనిషి చేసిన బొమ్మకు మనిషే దాసోహం అనడం మంచిది కాదు. ప్రతి మనిషి సాటి మనిషిని ప్రేమించి ఆదుకోవడమే మనిషి లక్షణంగా మారాలి.
వ్యాస రచయిత సెల్‌:9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img