చింతపట్ల సుదర్శన్
ఊరంతా బలాదూర్‌గ తిరిగి దొరికిందేదో తిని అవసరం ఉన్నా లేకపోయినా మొరిగి కూలిన ఇంటికి చేరింది డాగీ. అప్పటికీ అరుగు ఎక్కిన డాంకీ గోడకు ఆనుకుని మూలగడం వినిపించింది. డాంకీ మూలుగుతున్నదా, శాస్త్రీయ సంగీతాన్ని ముక్కలుగా విరిచేస్తున్నదా అన్నది మొదట అర్థం కాలేదు డాగీకి తర్వాత అది బాధలో వస్తున్న మూలుగు అని అర్థం అయింది. ఏంటి ‘బ్రో’ వర్షాల కారణంగా కండ్ల కలక, వైరల్‌ఫీవర్ తగులుకుంటున్నాయట. ఆ రెండిరటిలో ఏదైనా వచ్చిందా ఏమిటి అనడిగింది డాగీ. ఆ రెండూ మనుషుల్తో కబడ్డీ ఆడుకుంటాయి కానీ గాడిదల జోలికి రావులే. ఇది మనుషులు చేసిన రౌడీయిజం, దుర్మార్గం అన్నది డాంకీ మూలుగు పెద్దదిచేసి. మనుషులా, రౌడీలా, దుర్మార్గులా అసలు ఏం జరిగిందో చెప్పు ‘బ్రో’ ఏం చెప్పను ఖర్మ. ఖర్మ సిద్ధాంతం మనుషులకే ననుకున్నా నాలాంటి డాంకీలనూ పట్టిపీడిస్తున్నట్టుంది. ఊరికే తిని తొంగోడమేనా? కూసింత కళాపోషణ అక్కర్లేదా? కళాపోషణ కేవలం మనుషుల జాగీరా తాత సొమ్మా అనుకున్నా ‘బ్రో’ అదే నా అవస్థకు దారితీసింది. కళాపోషణకంటే ఊరికే తిని తొంగోవడమే ‘బెటర్’ అని అర్థం అయింది అంది డాంకీ. మనుషుల్లో ఏ పనీ రానివాళ్ల్లు రౌడీలు గానూ, ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైరైనవారు కవులుగానూ మారుతున్నారు. మరి నువ్వేమిటి గాడిదవై ఉండీ కళాపోషకుడవవుదామనుకోవడం నాకు నచ్చలేదు. నీ మూలుగులు వింటే జాలి వేస్తున్నది, అవును బ్రో నేను చేసినపనికి నామీద నాకే ‘సెల్ఫ్‌పిటీ’ కలుగుతున్నది. అబ్బ మనుషులా.. వాళ్ల్లు వెనకా, ముందూ చూడకుండా, ఇక్కడా అక్కడా తెలీకుండా దుడ్డు కర్రతో బాదారు. వెంటపడి తరిమారు ‘బ్లూ క్రాస్’ వాళ్లు ఉన్నారనే ధ్యాస లేకుండా, అరిచి ‘గీ గీ’ మన్నా చెవిని పెట్టక కొట్టారు ‘బ్రో’ అంది మరో జత మూలుగులు గాలిలోకి వదిలి డాంకీ. మనవాళ్లు ఈ మధ్య చట్టసభల్లో విషయం చెప్పకుండానే గంటలు గంటలు మాట్లాడుతున్నారు. నువ్వూ అలాగే అసలు సంగతి ప్రస్తావించకుండా కాలహరణం చేస్తున్నావు. చెప్తా చెప్తా అక్కడికేవస్తున్నా. సాయంకాలం ఇంకా పొద్దు మిగిలుంది కదా, చీకటి రౌడీలు వీధిలోకి రాలేదుకదా అని అలా చల్లగాలికి షికారుకు వెళ్తే నా లోపలి కళాకారుడు సంతోష పడ్తాడని సముద్రంకేసి వెళ్లా. ఆహా ఆ అలల సౌందర్యం, పడిలేచే కెరటాలు, గాలిపాడే గీతాలు ఎంత బాగా ఎంజాయ్ చేశానో అలా ఆ దృశ్యాన్ని కడుపునిండా నింపుకుని వచ్చేస్తే ఇప్పుడీ మూలుగులు ఉండేవికావు. బీచిలోంచి ఇసుకలో అలా నడుస్తూ దగ్గరలో ఉంది కదా కొండ, ఆ కొండని ఎక్కాలనే దుర్బుద్ధి పుట్టింది. ఎందుకూ కొండ ఎక్కడం నాలుక్కాళ్ల తీపుల కోసమా అంది డాగీ. కొండమీద ఏదో నిర్మాణాలు జరుగుతున్నవి కాదా సరదాగా చూసి వద్దామా అని మనుషుల కంటపడకుండా ఎక్కి వెళ్లా, మట్టికుప్పలు, ఇసుక పిరమిడ్లు, సిమెంటు బస్తాలు, అంతస్తులు నిలబెట్టే ఇనుపరాడ్లు చూస్తూ ఉంటే ఓ ఆడ లీడర్ పరివారంతో రావడం గమనించా. ఆమె నోటిదురుసు తెల్సిన వాణ్ణికదా ఓ మట్టికుప్ప వెనుక దాక్కున్నా. ఎవరా లేడి ఈ మధ్య కొడుక్కి కోటిన్నరపెట్టి కారు కొన్నావిడేనా అబ్బో ఆవిడ నోరు విప్పిందంటే నేనూ నా ఫ్రెండ్సంతా కలిసి అరచినదానికంటే ఎక్కువే. దాక్కుని మంచి పనిచేశావు డాగీ.
ఆవిడ కనబడకుండాపోయేసి మెల్లగా వెనక్కి తిరిగి రావడం మొదలుపెట్టాను. ఓ వెధవ నన్ను చూడనే చూశాడు. ఎక్కడ్నించి వచ్చిందిరా ఈ గాడిద ‘ఇక్కడ కడ్తున్నది అతిధిగృహమా, సచివాలయమా, అన్నయ్య స్వంత గృహమా అని ఆరాతీయడానికి దత్త పుత్రుడో, స్వంతకొడుకున్న పెద్దాయనో పంపించలేదుకదా పట్టుకోండిరా దీన్ని అని అరిచాడు. అక్కడ ఉండేవాళ్లంతా రౌడీ వెధవలేకదా నన్ను ‘రౌండప్’ చేశారు. రేపు ఎన్నికలకు తలలు పగలకొట్టే ట్రెయినింగ్ తీసుకుంటున్నారేమో నలుగురు రౌడీ వస్తాదులు నా వెంట పడ్డారు. ఇక చెప్పేదేముంది. నాకళాతృష్ణ చప్పున చల్లారింది. ఒళ్లు వాతలు తేలింది. చావు తప్పి కన్ను లొట్టపోకుండా తప్పించుకొచ్చాను. ఈ నొప్పులు తగ్గడానికి రేపు పశువుల ఆసుపత్రికి వెళ్లాల్సిందే అని మూలుగులు కంటిన్యూ చేసింది డాకీ.
పెద్దవాళ్ల వ్యవహారంలో గాడిదలు కూడా తల దూర్చాలా. కొండమీద బల్డింగులు కడితే నీకేం నష్టం, కష్టం. దేవుళ్లంతా కొండల మీదే కదా కొలువై ఉన్నారు. ప్రజలకు ఉచితాలు ఇచ్చి, అనేక పథకాలు, ఒట్ల కోసమే అయితే నేం, అమలుచేసే వాళ్లు దేవుళ్లు కారా కొండమీద కొలువుండ రాదా అన్నాడు అబ్బాయి అరుగు ఎక్కుతూ. డాంకీవై ఉండి సముద్రానికి వెళ్లడం ఎందుకో, కొండ ఎక్కడం దేనికో దబిడి దబిడి దెబ్బ తినడం ఎందుకో అన్నది డాగీ. నా బంగారు పుట్టలో వేలుపెడితే, నే కుట్టనా? అన్నదట చీమ. నా సరదా చట్టు బండలైంది. వీపు ఇండిగో విమానం మోతైంది అంది డాంకీ.