Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

కౌలు రైతులను దగాచేస్తున్న ప్రచారార్భాటం

పి.జమలయ్య

వ్యవసాయరంగం సంక్షోభంలోకి కూరుకు పోయింది. దేశంలో ప్రతి రోజూ 28మంది అన్న దాతలు ఆత్మహత్యలు చేస కుంటున్నారు. రైతాంగ ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో, కౌలు రైతుల్లో రెండో స్థానంలో ఉంది. వీరిలోనూ చిన్న, సన్నకారు, కౌలు రైతులే ఎక్కువ. మారిన వ్యవసాయ పరిస్థితుల్లో కౌలు రైతులదే కీలకపాత్ర. కౌలు రైతులు లేనిదే వ్యవసాయం లేదు. సాగు చెయ్యని వారికి లక్షల కోట్లు సహాయం అందిస్తూ, వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన వివరాలను పరిశీలిస్తే కౌలు రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుస్తోంది.
సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులకు గత నాలుగేళ్లుగా పంట రుణాలతోపాటు అన్నిరకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందజేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. 2019- 2020 సీజన్లో 2,72,720 మందికి, 2020 -2021లో 4, 14,770 మందికి, 2021 -2022 సీజన్లో 5,24,203 మందికి, 2023 -2024 సంవత్సరంలో చాలా పెద్ద సంఖ్యలో సీసీఆర్సీ కార్డులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కనీసం 8.81 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలనే లక్ష్యంతో ఆర్బీకే కేంద్రాల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా కనీవినీ ఎరగని స్థాయిలో 7,77,417 మందికి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసామని వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ చేవూరి హరికిరణ్‌ తెలిపారు. కౌలు రైతులతో మేళాలు ఎక్కడ జరిగాయో కౌలు రైతులకు తెలియదు. కార్డులు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉండగా ఇతర వర్గాలకు చెందిన 3,25,872 మంది ఉన్నారు. జారీ చేసిన కౌలు గుర్తింపు కార్డుల్లో నూటికి సుమారు 50 శాతం కార్డులు బినామీ పేర్లతో పొందినవే ఎక్కువగా ఉన్నాయని సంఘం నిర్వహించిన సర్వేలో తేలింది. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో ఈ సంవత్సరం 380 మందికి గుర్తింపు కార్డులు జారీచేస్తే అందులో బీసీలు 112, ఎస్సీలకు 76, ఓసీలకు 192 మందికి ఇచ్చారు. వాస్తవంగా ఓసీలలో 15 మందే కౌలు రైతులున్నారు. మిగిలిన 177 మంది కౌలు రైతులు కాదు. బినామీలు, భూయజమానులు. కౌలు రైతులకు కార్డులు ఇప్పించడానికి మనస్సు అంగీకరించక… తమ బంధువుల పేరుతో, కారు డ్రైవర్ల పేరుతో, ఇంట్లో పని చేసే వారి పేర్లమీద కార్డులు రాయించారు. వాస్తవంగా భూములు సాగుచేస్తున్న కౌలు రైతులకు కార్డులు ఇప్పించడానకి ముందుకు రావడంలేదు. లక్ష్యానికి మించి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని ప్రచారం నిర్వహించి బయట ప్రపంచాన్ని నమ్మబలుకుతోంది. 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిటీ అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపింది. వాస్తవాన్ని అంగీకరించ కుండా ఆ మొత్తం కౌలు రైతుల సంఖ్యను తగ్గించి కేవలం 16లక్షల మందే ఉన్నారని చెప్పటం కళ్లు ఉండి చూడలేని కబోదిలాగా వ్యవహరించటం రాష్ట్ర ప్రభుత్వ కపటాన్ని విదితం చేస్తోంది. అంతేగాక గత ప్రభుత్వం నుంచిసులభంగా కార్డులు పొందిన కౌలు రైతులు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తెచ్చిన కౌలు రైతుల చట్టం వల్ల కార్డులు రావటం కనాకష్టంగా ఉంది.
పంట రుణాలు ఒక పెద్ద మోసం
ప్రతి ఏడాది ఇచ్చే పంట రుణాల్లో 10 శాతం ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే కనీసం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. నిర్ణయించుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఏ సంవత్సరమూ ఇవ్వలేదు. పైగా లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. పంట రుణాలు కూడా లక్ష్యం ప్రకారం ఇచ్చిన దాఖలాలు లేవు. గత సంవత్సరం కనీసం రూ.4000 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇదికూడా అమలు కాలేదు. నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలు రైతులకు రూ.6,668 కోట్లు పంట రుణాలు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నాలుగేళ్ళలో ఒక్కొక్క రైతుకు రూ.74,088లు సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు రూ.18,522లు ఇచ్చారు. ఒక ఎకరంలో వరి పండిరచడానికి కౌలు రైతుకు రూ.63వేలు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఇందులో నాలుగో వంతు కంటే తక్కువ ఇచ్చారు. కౌలు రైతు ఎన్ని ఎకరాలు సాగుచేసినా ఒక్కొక్కరికి రూ.50 వేలకు మించకుండా రుణం ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. అంటే నిర్ణయించుకున్న మొత్తంలో మూడో వంతే ఇస్తున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి కౌలు రైతులను ఆదుకున్నామని చెప్పటం విచిత్రంగా ఉంది.
వడ్డీ రాయితీలు అందని ద్రాక్ష
గత నాలుగేళ్లలో 30 వేల మందికి వడ్డీ రాయితీ క్రింద రూ.6 కోట్లు ఇచ్చారు. అంటే ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి రూ.2000లు. అంటే ఏడాదికి రూ.500 చొప్పున వడ్డీ రాయితీ ఇచ్చామని వైఎస్‌ ఆర్సీపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు.
కౌలు రైతులకు భరోసాలేని వైఎస్‌ఆర్‌ రైతు భరోసా
రాష్ట్రంలో సెంటు భూమిలేని కౌలు రైతులు 8 లక్షల నుంచి 10 లక్షల ఉంటారని గణంకాలు తెల్పుతున్నాయి. వీరిలోనూ ఎక్కువమంది పేద, బడుగు, బలహీన వర్గాలవారే. గత ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని వాగ్దానం చేసింది. ఈ లోపు ఎన్నికల జరిగాయి. ఈ సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ… రైతులతోపాటు ప్రతి కౌలురైతులకు సంవత్సరానికి రూ.13,500 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. తీరా అతి కొద్ది మందికి పెట్టుబడి సాయం అందించి చేతులు దులుపుకుంటున్నారు. వైస్‌ఆర్‌ రైతుభరోసా కింద గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు 3.92 లక్షల మందికి రూ.529 కోట్లు పెట్టుబడి అందించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇచ్చిన వాటిని కూడ కలుపుకున్నా ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే కౌలుగుర్తింపు కార్డులతో సంబంధంలేని అటవీ భూములు సాగుచేస్తున్న గిరిజన రైతులకు ఇచ్చిన వాటిని కూడా కలుపుకుని కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తున్నామని పేర్కొనడం దారుణం. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం 67వేల నుంచి 70వేల మందికే పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా ప్రతి సంవత్సరం 58లక్షల మంది సాగుదారులకు రూ.7వేల కోట్లకు పైగా ఇస్తూ కౌలురైతులకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ)లకు మాత్రమే రూ.100 కోట్లు మించి రైతు భరోసా ఇవ్వడం లేదు. ఇతర సామాజిక వర్గాలను వదిలేశారు. రైతుల్లో కులాలుగా చూసి పెట్టుబడిసాయం అందించటం ఎంత వరకు సమజంసం. వారు అందించే సహాయం కూడా పావుఎకరం సాగుకు సరిపోదు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, భూమిలేని కౌలు రైతులందరికి రైతు భరోసా అందించాలి.

  • ప్రకృతి విపత్తులు, చీడపీడలు వల్ల జరుగుతున్న నష్టానికి సహాయం ఏది? ప్రకృతి విపత్తుల వల్లనూ, చీడపీడల వల్లనూ కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కొక్క సందర్భంలో కనీసం పెట్టుబడీ రానిపరిస్థితి ఏర్పడుతోంది. ఈ నాలుగు సంవత్సరాల్లో పంటలు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలురైతులకు రూ.246 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేశారు. ఒక్కొక్క రైతుకు రూ.10,512లు, అంటే ఏడాదికి ఒక్కొక్కరికి రూ.2,628లు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇచ్చారు. ఇది విడ్డూరంగాఉంది. ఎకరానికి వరి పంటకు పెట్టిన పెట్టుబడిలో రెండు శాతం ఎంత దారుణమో. కనీసం పెట్టిన ఖర్చులు కూడా ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి.
    పంటల బీమా పరిహారం భూయజమానులకు సమర్పయామి !
    పంటల బీమా పరిహారం కింద గత నాలుగు సంవత్సరాల్లో రైతాంగానికి రూ.6,684 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం గొప్పగా బాకా ఊదుతోంది. కౌలు రైతులకు మాత్రం 1.73 లక్షల మందికి రూ.487 కోట్ల బీమా పరిహారం ఇచ్చారు. ఒక్కొక్క రైతుకు రూ.28,150లు. గత నాలుగేళ్లలో ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి ఇచ్చింది రూ.7037లు. రూ.6వేల కోట్లకు పైగా సాగు చెయ్యని భూ యజమానులకు దోచి పెట్టింది. కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టింది. పంటలు అమ్ముకునే వెసులుబాటు లేదు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే పరిస్థితి కూడాలేదు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img