Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

క్యూబాపై ఆంక్షల రద్దుకు బైడెన్‌మీద ఒత్తిడి

బ్రంకో మార్సిటిక్‌

అమెరికాకు ఇప్పటికీ యుద్ధాలపట్ల ఆకలి తీరలేదు. ఎక్కడైనా రెండు దేశాల మధ్య యుద్ధమో, తీవ్ర ఘర్షణలు జరిగితే ఇద్దరికీ ఆయుధాలు అమ్ముకుని ఒకరికి మద్దతు ఇచ్చే విధానాన్ని పాటిస్తోంది. అదే సమయంలో చిన్న చిన్న దేశాలపై అర్థిక తదితర ఆంక్షలు విధించి వాటి పరిస్థితిని దిగ జారుస్తోంది. విధించే ఆంక్షలు సైతం క్రూరంగా, వివక్షా పూరితంగా, అక్రమంగా, చట్ట విరుద్ధంగా ఉంటున్నాయి. ఆంక్షలు ఎత్తివేయవలసిందిగా అనేక దేశాలు విజ్ఞప్తి చేసిన ప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. వారం రోజుల క్రితం కాంగ్రెస్‌కు(పార్లమెంటు) చెందిన 21మంది డెమొక్రటిక్‌ పార్టీ సభ్యులు, అధ్యక్షుడు జో బైడెన్‌కి ఒక లేఖ రాశారు. అందులో క్యూబా, వెనిజులా దేశాలపై విధించిన ఆంక్షలను ఇప్పటికైనా తొలగించాలని పేర్కొన్నారు. అలాగే డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనాకాలంలో ఆంక్షల విధానం సర్వసాధారణమైపోయింది. సరిహద్దుల్లో సంక్షోభం ఏర్పడి దక్షిణ సరిహద్దులనుండి దేశంలోకి వలసలు ఎక్కువయ్యాయి. ట్రంప్‌ ఆనాడు జారీ చేసిన ఆర్డర్‌ను కూడా రద్దు చేయాలని ఆ లేఖలో డెమోక్రటిక్‌ సభ్యులు కోరారు. పాలకపార్టీకి చెందిన సభ్యులే విజ్ఞప్తిచేయడం వల్ల వారి మాట అధ్యక్షుడు వింటాడని కూడా భావించలేం. ఆంక్షలకు గురైన దేశాలలో ప్రజలు అత్యంత తీవ్రమైన కష్టాలకు గురవుతున్నారని ఈ కష్టాలు అమెరికా వల్లనే జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.
రెండు సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు వెరోనికా ఎస్కోబర్‌ (డిటిఎక్స్‌), రాల్‌ గ్రిజల్వా (డిఏజెడ్‌) లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు. 2024లో బైడెన్‌ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్న కమిటీ ఉపాధ్యక్షుడు రాల్‌ గ్రిజల్వా మరొకరు సెనేటర్‌ బెర్నిశాండర్స్‌. వీరుగాక అనేకమంది ప్రగతిశీల సభ్యులు ఉన్నారు. వారిలో ఖన్నా, ఛుయి గార్సియాలతోపాటు కొత్తగా ప్రగతిశీల సోషలిస్టు సభ్యుల స్క్వాడ్‌లో చేరిన మరో ఆరుగురు కూడా ఉన్నారు. కొత్తగా చేరినవారిలో ఇహాన్‌ ఒమర్‌, సమ్మర్‌లి అయన్నా ప్రెస్‌లీ లేఖపై సంతకం చేయలేదు. మసాచుసెట్స్‌ నుండి గెలుపొందిన జిమ్‌ మాక్‌ గవర్న్‌ గతంలో కూడా అనేకసార్లు క్యూబా, వెనిజులాపై ఆంక్షలు తొలగించవలసిందిగా బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. లేఖపై ఇప్పుడు ఆయనకూడా సంతకం చేశారు. సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నార్తంప్టన్‌ కార్యాలయం ముందు ప్రదర్శన కూడా చేశారు. ఇంకా అనేకమంది ప్రగతిశీలురు వివిధ వేదికలకు ఈ సందేశం పంపించారు. మే 11వ తేదీన కాంగ్రెస్‌ వ్యవసాయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనూ అనేక దశాబ్దాలుగా క్యూబాపైన అమెరికా దిగ్బంధం విధించడాన్ని ఖండిరచింది. ఇప్పటికైనా మన విధానాలను సమీక్షించుకుని ఆయా దేశాలలో ప్రజలను హింసించడం మానుకోవాలని చాలా మంది సభ్యులు కోరారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం కలుగుతుందని వారు హెచ్చరించారు. ఇతర దేశాల ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అదిమన ప్రయోజనాలకు ఏమీ తోడ్పడదు. ప్రపంచ ప్రజలందరికీ ఆహారం అందేలా చూడవలసిన కర్తవ్యం ఉందని సమావేశంలో మాట్లాడిన గ్రెడ్జ్‌కాసర్‌ తెలియజేశారు. వెనిజులా, క్యూబా దేశాల నుండి ప్రజలు ఇతర దేశాలకు తరలి వెళుతున్నారని ఈ నేపధ్యంలో ఆంక్షలు తొలగించడం న్యాయంగా ఉంటుందని సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయితే రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు మాత్రం ఇంకా ఆంక్షలు పెంచాలని కోరుతున్నారు. ఆంక్షలు పెంచితే మరింత మంది ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రజలు తండోప తండాలుగా వలసవెళ్లడం, ఆహారంలేక పస్తులుండటం జరుగుతుంది. అది మన లక్ష్యం కాకూడదు. అని సభ్యులు తమ లేఖలో కోరారు.
క్యూబా, వెనిజులా దేశాలలో ప్రభుత్వాలను మార్చివేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నారు. దాదాపు ఆరుదశాబ్దాల కాలంగా క్యూబాను హస్తదిగ్బంధనం చేశారు. అయినప్పటికీ సోషలిస్టు దేశం క్యూబా ఆంక్షలను తట్టుకుని నిలిచి అనేక రంగాలలో పురోగతి సాధించింది. ముఖ్యంగా వైద్యరంగంలో అపారమైన పురోగతి సాధించింది. ఒబామా హయాంలో క్యూబా ప్రజలకు మెరుగైన జీవనం అందించాలన్న విధానం ఉండేది. ఆనాటి అరమరికలులేని పరిస్థితికి తిరిగివెళ్లాలని, ఇప్పటికైనా సరైన పద్ధతిలో ఆలోచించాలని సభ్యులు కోరారు. సరిహద్దుల్లో జరుగుతున్న సంఘటనలు బైడెన్‌ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలుగ చేస్తాయని, అందువల్ల ట్రంప్‌ కాలంలో విధించిన మరిన్ని ఆంక్షలతో పాటు అన్నిటినీ తొలగించాలని ఆ లేఖలో సభ్యులు విజ్ఞప్తి చేశారు. వామపక్షవాది మెక్సికో అధ్యక్షుడు ఆండ్రస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ కూడా ఇదే విధంగా బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల నుండి దేశంలోకి వలసవస్తున్నవారు ఎందుకు వస్తున్నారనేది ఆలోచించాలని, కేవలం ఆంక్షలే కారణమని ఒబ్రడార్‌ తెలిపారు. ఆ దేశాలలో పేదరికం నుండి ప్రజలు బైటపడకుండా ఉండటానికి అమెరికా విధించిన ఆంక్షలే కారణం. వెనిజులాలో పనిచేసే అమెరికా రాయబారి ఏడాదిక్రితమే ట్రంప్‌ విధానాన్ని ఎత్తివేయాలని బైడెన్‌ను కోరారు. వెనిజులాపై ఆంక్షలు తొలగించకపోతే అది మరో క్యూబాలాగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img