Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

క్రీడాంగణం నుంచి కమ్యూనిజంలోనికి

భరద్వాజ

అది 1940. ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీలో 12వ ఒలింపిక్‌ క్రీడలు జరిగాల్సి ఉంది. మనం అప్పటికి ఇంకా బ్రిటిష్‌ పాలనలోనే ఉన్నాం. కోల్‌కతా లోనే ఓ పదిహేనేళ్ల అమ్మాయి. అప్పుడామె పేరు ఇలాసేన్‌. బంగ్లాదేశ్‌ లోని జెస్సోర్‌ జిల్లా బగూతియా గ్రామానికి చెందిన ఆమె తండ్రి నాగేంద్ర నాథ్‌ కు ఓ సందేశం వచ్చింది. ఇలాసేన్‌ను హెల్సింకీ లో జరిగే ఒలంపిక్‌ క్రీడల్లో పాల్గొనడానికి ఎంపిక చేశారని. 15 ఏళ్ల ఇలా పరుగు పందెంలో మంచి పేరు తెచ్చుకుంది. అథ్లెటిక్స్‌లో దిట్ట అనిపించుకుంది. ఇంగ్లీషు, బెంగాలీ పత్రికల్లో ఇలా సేన్‌ క్రీడాభినివేశం గురించి వార్తలు తరచుగానే వస్తూ ఉండేవి. అంతకు రెండేళ్లకు ముందే ఇలా కు జాతీయ జుబా సంఘ 1937, 1938లో జూనియర్‌ చాంపియన్షిప్‌ అవార్డులు ఇచ్చింది. పదమూడేళ్లకే క్రీడల్లో దాదాపు 50 బహుమతులు గెలుచుకున్న అమ్మాయి ఇలా. క్రీడల్లో ఆమె ఆసక్తి, అప్పటికే సాధించిన విజయాలు గమనిస్తే ఒలింపిక్‌ క్రీడలకు ఎంపిక కావడంలో ఆశ్చర్యం లేదు. అయినా సాదా సీదా ప్రభుత్వోద్యోగి కూతురికి ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా గొప్పే. బెంగాల్‌ ప్రెసిడెన్సీలో ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనే అవకాశం వచ్చిన మొదటి అమ్మాయి ఆమేనంటారు. అయితే అప్పటికే యూరప్‌ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒలింపిక్‌ క్రీడలు రద్దయినాయి. ఒలింపిక్‌ క్రీడలు రద్దయిన సందర్భాలు ఇప్పటి వరకు రెండు మూడే ఉన్నాయి. అదీ ప్రపంచ యుద్ధాల కారణంగానే. మొదటి సారి 1916లో జరగవలసిన ఒలింపిక్స్‌ మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా జరగలేదు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940లోనూ రద్దయినాయి. ఈ సారి టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్‌ క్రీడలు కూడా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి కారణంగా ఒక సంవత్సరం వాయిదా పడ్డాయి. ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనే అవకాశం చేజారి పోవడం పదిహేనేళ్ల వయసులో ఉన్న ఇలా కు కూడా బాధ కలిగించి ఉండవచ్చు.
1942లో ఇలా బెథూన్‌ పాఠశాలనుంచి ఇంటర్మీడియట్‌ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. ఆ తరవాత బెతూన్‌ కళాశాలలోనే పట్టభద్రురాలయ్యారు. ఆ తరవాత పదమూడేళ్లకు గానీ ఆమె బెంగాలీలో ఎం.ఏ. చేయలేకపోయారు. బెతూన్‌ విద్యాసంస్థలను ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ నెలకొల్పారు. ఆయన బాలికల విద్యను, వితంతు వివాహాలను ప్రోత్స హించారు. భాల్య వివాహాలను వ్యతిరేకించారు. బెతూన్‌ కళాశాలలో ప్రవేశించగానే ఇలా బాలికల సంఘంలో చేరి మార్క్సిజం అధ్యయనం చేయడం ప్రారంభించారు. మార్క్సిజం చదవడం అంటే ఆ రోజుల్లో రహస్య కార్యకలాపమే. 18 ఏళ్లకే ఇలా కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలయ్యారు. ఆ తరవాత ఆమె వెనుదిరిగి చూడలేదు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైనికులకు అమ్మాయిలను విక్రయించడాన్ని అడ్డుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ మహిళా ఆత్మ రక్షా సమితి ఏర్పాటు చేసింది. ఇలా అందులో చేరారు. ఈ కమిటీ పేదరికం, ఆకలి నిర్మూలనకు సైతం పాటుపడేది. ఈ సంఘం తరఫున ఇలా అనేక ప్రాంతాలలో పర్యటించవలసి వచ్చింది. బెంగాల్‌ కరవు వచ్చినప్పుడు ఇలా విశేషమైన కృషి చేశారు. ఆ సమయానికి ఆడవాళ్లు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటే విచిత్రంగా చూసే వారు.
ఇలా తల్లిదండ్రుల స్వస్థలం ప్రస్తుతం బంగ్లా దేశ్‌ లో ఉంది. ఆమె పుట్టింది, చదువుకున్నది మాత్రం కోల్‌ కతాలోనే. జీవిత చరమాంకం కూడా భారత్‌ లోనే గడిచింది. అయితే ఇలా జమీందారీ కుటుంబానికి చెందిన రామేంద్రనాథ్‌ ను పెళ్లి చేసుకున్నారు. ఆయన స్వస్థలమూ ప్రస్తుతం బంగ్లా దేశ్‌ లోనే ఉంది. భారత-బంగ్లా సరిహద్దు ప్రాంతం అది. దేశ విభజన తరవాత అనేక మంది బంగ్లా దేశ్‌ నుంచి భారత్‌ కు వచ్చేసినా రామేంద్రనాథ్‌ తల్లి మాత్రం బంగ్లా దేశ్‌ లోనే ఉండిపోవాలనుకున్నందువల్ల ఇలా, ఆమె భర్త కూడా అక్కడే ఉండిపోయారు. రామేంద్ర నాథ్‌ కూడా కమ్యూనిస్టే కనక ఇలాను పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు. రామేంద్ర నాథ్‌ ను పెళ్లి చేసుకున్న తరవాత ఇలా సేన్‌ ఇలా మిత్రా అయిపోయారు.
దేశ విభజన తరవాత కోల్‌కతా, తూర్పు బెంగాల్‌, బిహార్‌ లోని కొన్ని ప్రాంతాల్లో కలహాలు చెలరేగాయి. కమ్యూనిస్టు పార్టీ ఆదేశం మేరకు ఇలా మిత్రా మహాత్మా గాంధీతో పాటు నౌఖాలీలో, అల్లర్లు జరుగుతున్న ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి మత సామరస్యం కోసం కృషి చేశారు. అప్పుడే ఆమె సాంప్రదాయిక హిందూ కుటుంబ ఆవరణ దాటి సామాన్య జనంతో మమేకం అయ్యారు. ప్రధానంగా సంథాల్‌ తెగ జనం మధ్య పని చేశారు. అయితే సంథాల్‌ తెగల వారి ఇళ్లు మురికిగా ఉండడం ఆమెకు నచ్చేది కాదు. అందువల్ల వారు ఆమెను రాణీమా అనే వారు.
దేశ విభజన తరవాత కమ్యూనిస్టు పార్టీపై పాకిస్తాన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంవల్ల ఇలా మిత్రా సహా నాయకులను అజ్ఞాత వాసంలో ఉండాలని కమ్యూనిస్టు పార్టీ ఆదేశించింది. ఆ సమయానికి ఆమె గర్భవతి. ఆమె నెమ్మదిగా కోల్‌ కతా చేరుకుని కొడుకుకు జన్మనిచ్చారు. కాని ఆ కోడుకు పెరిగింది మాత్రం బంగ్లా దేశ్‌ లో నానమ్మ దగ్గరే.
ఆ తరవాత ఆమె బంగ్లా దేశ్‌ లోని మారుమూల ప్రాంతమైన నాచోల్‌ చేరి రైతుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అదే 1948-1950 మధ్య జరిగిన తేబాగా ఉద్యమానికి నాంది. ఇలా మిత్రా నాయకత్వంలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పుడు తూర్పు బెంగాల్‌ లోని ముస్లిం లీగ్‌ ప్రభుత్వం దమనకాండ కొనసాగించింది. ఇలా మిత్రాను సరిహద్దు దాటించి కాపాడాలని రైతు నాయకులు అనుకున్నా ఆమె అంగీకరించలేదు. తన కామ్రేడ్స్‌ అందరూ సురక్షితంగా ఉండేదాకా తాను కదలనన్నారు. వందలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలను అరెస్టు చేశారు. తెబాగా ఉద్యమానికి ఇలా మిత్రానే నాయకురాలేనని ఒప్పుకోవాలని చిత్రహింసలు పెట్టారు. పోలీసుల చిత్రహింసలకు గురై 50 నుంచి 100 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలు వదిలారు. ఆ తరవాత ఇలా మిత్రానే చిత్రహింసలకు గురి చేశారు. ఆమె మహిళ అయినందువల్ల మరింత చిత్ర హింస అనుభవించవలసి వచ్చింది.
నాచోల్‌ పోలీసు స్టేషన్లో ఇలా మిత్రాను నగ్నంగా ఉంచారు. తిండి కాదు కదా మంచి నీళ్లయినా ఇవ్వ లేదు. వేడిగా ఉన్న కోడి గుడ్లను ఆమె మర్మాంగంలోకి దోపారు. రెండు కర్రల మధ్య కాళ్లు ఉంచి నొక్కారు. ఆమె కుడి మడమలోకి మేకు దింపారు. అత్యాచారం కూడా చేశారు. అక్కడి నుంచి నవాబ్‌ గంజ్‌ (బంగ్లా దేశ్‌) జైలుకు తీసుకెళ్లారు. 1954 దాకా ఆమె జైలులోనే ఉన్నారు. కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. ఆమె క్రీడాకారిణి అయినందువల్ల, సంకల్ప బలం ఉన్నందువల్ల బతికిబట్టకట్టగలిగారు. రాజ్‌ షాహీ కోర్టులో ఆమె తనను పెట్టిన చిత్రహింసలనే కాక తన మీద జరిగిన అత్యాచారాన్ని కూడా వెల్లడిరచారు. ఆమె బాధామయ గాథ నిరసనలకే కాదు పశ్చిమ బెంగాల్‌ లోని సుభాశ్‌ ముఖర్జీ, తూర్పు బెంగాల్‌ లోని గులాం ఖుద్దూస్‌ ఆమె మీద కవితలల్లడానికీ ముడి సరుకైంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంవల్ల పే రోల్‌ మీద చికిత్స కోసం కోల్‌ కతా రావడానికి అనుమతించారు. అప్పుడే ఎం.ఎ. పూర్తి చేసి కళాశాలలో అధ్యాపకురాలయ్యారు. నాలుగు సార్లు బెంగాల్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆమె జీవితం అంతా పోరాటాల మయమే. క్రీడాకారులకు ఉండే మనోధైర్యం, కమ్యూనిస్టులకు ఉండే దృఢ దీక్షే ఆమెను బతికించింది. బంగ్లా దేశ్‌ విమోచనోద్యమ సమయంలో ఆమె ఇల్లు పోరాడే వారందరికీ విడిది. బంగ్లాదేశ్‌ విముక్తిని తన విముక్తిగా భావించారు. బంగ్లా దేశ్‌ విముక్తమైన తరవాత రెండు సార్లు ఆ దేశానికి వెళ్లొచ్చారు. 1925 అక్టోబర్‌ 18న జన్మించిన ఇలా మిత్రా 2002 అక్టోబర్‌ 13న తుడి శ్వాస విడిచారు. ఆమె మనవడు రితేంద్రనాథ్‌ అమెరికాలో ఉంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img