Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

ఖలిస్థాన్‌ ఉద్యమానికి ఊపిరిలూదుతున్నది ఎవరు?

‘‘నేను భారతీయుడిని కాదు. భారతీయుడు అనే గుర్తింపు ఉండకూడదని నేను చెప్పడం లేదు. కానీ నాకు అది అవసరం లేదు. ఖలిస్థాన్‌ కోసం మేము చేస్తున్న పోరాటాన్ని చెడ్డదిగా చూడకూడదు. మేధోకోణంలో చూడాలి. సిక్కులు మొదట బ్రిటిష్‌ వారికి, ఇప్పుడు హిందువులకి బానిసలుగా ఉన్నారు.’’ ఇవి వివాదాస్పద ఖలిస్థాన్‌ ఉద్యమకారుడు అమృత్‌పాల్‌ సింగ్‌ మాటలు. ‘‘నేను బింద్రన్‌ వాలే కాలిగోటికి కూడా సమానుణ్ని కాదు’’ అని కూడా ఆయన అన్నారు. 2023, ఫిబ్రవరి 23న పంజాబ్‌లోని అజ్నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి వారిస్‌ పంజాబ్దే (పంజాబ్‌ వారసులం) సంస్థకు చెందిన అమృత్‌ పాల్‌సింగ్‌ అనుచరుడు లవ్‌ప్రీత్‌ సింగ్‌ తుఫాన్‌ను విడుదల చేయాలని అమృత్‌పాల్‌ సింగ్‌ నాయకత్వంలో సిక్కులు కత్తులు, తుపాకులు, గురుగ్రంధ సాహిబ్‌ పుస్తకాలను చేతబట్టి దాడిచేశాడు. సాయుధులైన సిక్కుల బెదిరింపులకు తలొగ్గి పోలీసులు లవ్‌ప్రీత్‌ సింగ్‌ను విడుదల చేశారు. ఆ తరువాత గురుద్వారాలలో గొప్ప స్వాగతం పొందిన అమృత్‌పాల్‌ సింగ్‌ ఖలిస్థాన్‌ వేర్పాటువాద ఉద్యమానికి భవిష్యత్‌ నాయకునిగా గుర్తింపు పొందాలని చూస్తున్నారు. ఖలిస్థాన్‌ ఉద్యమం 2.0కు నాయకునిగా అమృత పాల్‌ ఆవిర్భావం వెనక ఉన్న శక్తులేవి? నిద్రాణంగాఉన్న ఈ ఉద్యమం మళ్లీ పురుడు పోసుకోవడానికి ఎవరు ఊపిరిలూదుతున్నారు? పంజాబ్‌లో ఖలిస్థాన్‌, కాంగ్రెసేతర తొలిపార్టీ ఆప్‌ అధికారంలోకి రావడం, కాంగ్రెస్‌, బీజేపీలు పంజాబ్‌లో అధికారంలోకి రావటంలో వైఫల్యం చెందటం, పాకిస్థాన్‌ దివాలా తీసిన సందర్భంలో ఐఎస్‌ఐ సంస్థ చురుకుగా మారటం, తదితర పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో రాజకీయ, ఉగ్ర, కుట్ర కోణాలు ఈ ఉద్యమం వెనక ఉన్నాయా? అన్న ప్రశ్నలు నేడు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
భారత్‌లో పంజాబ్‌, పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో 25 నుండి 30 మిలియన్ల జనాభాతో ఉన్న సిక్కు మతం ప్రపంచంలో ఐదవ అతి పెద్ద మతం. గురునానక్‌ (1469-1539) స్థాపించిన సిక్కుమతం ఏకోస్వరో పాసన, సర్వ మానవ సమానత్వం, నిజాయితీలను ప్రబోధించింది. హిందూ, ఇస్లాంల నుండి సిక్కుమతంలోకి మతం మార్పిడిలను నిరోధించడానికి మొఘల్‌ పాలకులతో ఘర్షణవల్ల గురు అర్జున్‌సింగ్‌, గురు తేజ్‌బహదూర్‌ ప్రాణాలు కోల్పోయారు. సిక్కు మతాన్ని అన్యమతాల నుండి కాపాడుకోవడం, సాధారణ ప్రజలను హింసనుండి రక్షించుకోవాలనే ఉద్దేశంతో సిక్కులను సంఘటితశక్తిగా 13.4.1699న సిక్కుల పదవ గురువు గురుగోవింద్‌ సింగ్‌ ఖల్సా (పవిత్రమైన)స్థాపించారు.
భారత్‌లోని పంజాబ్‌, పాకిస్థాన్లోని పంజాబ్లో నివసించే సిక్కు ప్రాంతాలను కలిపి లాహోర్‌ రాజధానిగా ఖలిస్థాన్‌(పవిత్ర భూమి) ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఎప్పటినుండో సిక్కులలో ఉంది. సిక్కులకు ప్రత్యేకదేశం డిమాండ్‌ వెనక అనేక కారణాలు ఉన్నాయి. మహారాజా రంజిత్‌సింగ్‌ పాలనా కాలంలో చివరి సిక్కు సామ్రాజ్యం 1799 నుండి 1849 వరకు కొన సాగింది. రంజిత్‌ సింగ్‌ మరణం తర్వాత ఆంగ్లేయులు సిక్కులు నివసించే ప్రాంతాలను బ్రిటిష్‌ ఇండియా పంజాబ్‌ ప్రావిన్స్‌గా, స్వదేశీ సంస్థానాలుగా విభజించారు. బ్రిటిష్‌ వారు విభజించు`పాలించు సిద్ధాంతంలో భాగంగా హిందువులను, సిక్కులను వేరుచేసే ఉద్దేశంతో సిక్కులను సైన్యంలోకి ఎక్కువగా నియమించుకొని హిందువులను అణిచివేశారు. 1920, డిసెంబరు14న ఏర్పడిన అకాళీదళ్‌ పార్టీ సిక్కులు నివసించే ప్రాంతాలకు స్వతంత్ర ప్రతిపత్తి, సార్వభౌమాధికారం కావాలని డిమాండ్‌చేస్తూ వచ్చింది. 1929లో భారత జాతీయ కాంగ్రెస్‌ ‘‘పూర్ణ స్వరాజ్‌’’ కావాలని లాహోర్‌ సమావేశంలో తీర్మానం చేసినప్పుడు అంబేద్కర్‌, మహమ్మద్‌ ఆలీ జిన్నా, ధారాసింగ్‌ తదితరులు వ్యతిరేకించారు. పంజాబ్‌ను ముస్లిం రాష్ట్రంలో (పాకిసాన్థ్‌లో) కలపాలని ముస్లింలీగ్‌ డిమాండ్‌ చేసింది. ఈ డిమాండ్‌ ఖలిస్థాన్‌కు బీజంవేసింది. హిందూ ముస్లింలకు దూరంగా సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్థాన్‌ను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. 1947లో భారత్‌, పాకిస్థాన్‌లు వేరుపడినప్పుడు సిక్కులు నివసించే పంజాబ్‌ రెండుగా చీలిపోయింది. పాకిస్థాన్‌కువెళ్లిన పశ్చిమ పంజాబ్‌ తదితర ప్రాంతాల నుండి సిక్కులు భారత్‌లోని పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానాలకు అధిక సంఖ్యలో వలసవచ్చారు. దీనితో పాకిస్థాన్‌లోని సిక్కు జనాభా 19.8శాతం నుంచి 0.1శాతానికి తగ్గింది. 1966 సెప్టెంబరు నాటి పంజాబ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భాషా ప్రాతిపదికన సిక్కులు మాట్లాడే పంజాబీ భాషా ఆధారంగా సిక్కులు మెజారిటీగాగల పంజాబ్‌ రాష్ట్రం ఏర్పడిరది. హిందువులు అధికంగా గల హర్యానా రాష్ట్రంతో పాటు కొండ ప్రాంతాలను హిమాచల్‌ ప్రదేశ్‌లో కలిపారు. చండీగఢ్‌ను పంజాబ్‌, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా, కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు.
ఖలిస్థాన్‌ వేర్పాటు వాద ఉద్యమం 1978 నాటి జర్నేల్‌సింగ్‌ బింద్రన్‌వాలేకు, నిరంకారీ సిక్కుశాఖకు మధ్య జరిగిన ఘర్షణలతో ఊపందుకుంది. 1980 నుండి హిందూవ్యతిరేక హింసకు తెరలేపిన బింద్రన్‌వాలే వేలమంది సాయిధ అనుచరులను చేరదీశాడు. 1980-90 మధ్యకాలంలో బాంబులు, హత్యలు, కిడ్నాప్‌లు మొత్తంగా దాదాపు 22,000 మంది అశువులుబాసారు. పంజాబ్‌కేసరి పత్రిక ఎడిటర్‌ లాలాజగత్‌ నరేన్‌ను ఉద్యమకారులు హత్య చేశారు. 1982లో అకాలిదళ్‌తో కలిసి బింద్రన్‌వాలేపై ధర్మయుద్ధం ప్రకటించాడు. 1973 నాటి సిక్కుల ఆనందపూర్‌ సాహెబ్‌ తీర్మానాన్ని అమలు చేయాలని బింద్రన్‌వాలే డిమాండ్‌ చేశాడు. పంజాబ్‌కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఇవ్వడం, కేంద్రం అధికారాలను రాష్ట్రాలకు బదలాయించడం, హిందూమతం నుండి సిక్కు మతాన్ని ప్రత్యేక మతంగా గుర్తించడం, తదితర డిమాండ్లు ఆనందపూర్‌ సాహెబ్‌ తీర్మానంలో ఉన్నాయి. నదీజలాలలో ఎక్కువ వాటా, చండీగఢ్‌ను పంజాబ్‌కు ఇవ్వడం వీరి ఇతర డిమాండ్లు. ప్రజల సాధారణ సమస్యలనుకూడా తీరుస్తూ చిరకాలంలోనే బింద్రన్‌వాలే పంజాబ్‌లో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. 1982లో తన మకాంను అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోని హర్మిందిర్‌ సాహెబ్‌లోకి మార్చి తుపాకులు, బాంబులతో ఆలయంలో తిష్టవేశాడు. ఖలిస్థాన్‌ పేరుతో కరెన్సీని విడుదల చేయడమే గాక పాస్‌పోర్టులు జారీ చేశాడు. సిక్కుల అత్యంత విధాయక సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీపై ధ్వజమెత్తడం, బస్సులను హైజాక్‌చేసి సిక్కేతరులను చంపడం, ఖలిస్థాన్‌ వ్యతిరేకులను హతమార్చడం, పోలీసులు, అధికారుల, హత్యలు గోల్డెన్‌ టెంపుల్లోని ఎస్‌జీపీసీ కేంద్ర కార్యాలయం అకల్‌తక్త్‌ను కూల్చివేసి తుపాకులతో నింపడం వంటివి చేసిన బింద్రన్‌వాలే ఒక దశలో ‘‘ప్రతి సిక్కు 32 మంది శిక్కేతర్లను చంపాలి’’ అని పిలుపునిచ్చాడు. 1982 నుండి 84 మధ్యకాలంలో జరిగిన 1200 అల్లర్లలో 4100 మంది చనిపోయారు. 30 వేలమంది అరెస్టయ్యారు. అనేకసార్లు అరెస్ట్‌ అయినా రాజకీయపార్టీల మద్దతుతో విడుదలవుతూ వచ్చాడు. గోల్డెన్‌టెంపుల్‌ వేదికగాచేస్తున్న హింసకాండను అణిచివేయడానికి ఇందిరాగాంధీ ఆదేశంతో 1974 జూన్‌ 1 నుండి 8 వరకు నిర్వహించిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో 83 మంది సైనికులు, 1000 మిలిటెంట్లు మృతిచెందారు. ఆ తర్వాత సైన్యంలోని సిక్కు రెజిమెంట్లలో సిక్కు సైనికులు తిరగబడటంతో 100మంది సైనికులు చనిపోయారు. వెయ్యిమంది అరెస్ట్‌ అయ్యారు. ఖలిస్థాన్‌ 2.0గా భావిస్తున్న తాజా సంఘటనల్లో సిక్కులను ఆకర్షిస్తున్న అమృత పాల్‌ సింగ్‌ సందు (30 సంవత్సరాలు) 12 పాసై దుబాయిలో కుటుంబ రవాణా ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసి 2022లో భారత్‌కు తిరిగివచ్చి పంజాబ్‌లో తాజా దాడులు చేశాడు. అమృత్‌ (పవిత్ర జలం) ఇస్తూ ఖల్సాలోకి యువకులను ఆహ్వానించడం, ఘర్‌వాపసి(మతం మార్పిడి), డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారంచేస్తున్న ఈయన ఖలిస్థాన్‌ ఏర్పాటు తన లక్ష్యమని ప్రకటిస్తున్నాడు. ‘‘తనను తాను కాపాడుకోలేని జీసస్‌ ప్రజలను ఎలా కాపాడుతాడు?’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అమృతపాల్‌సింగ్‌ పరారీలో ఉన్నప్పటికీ ఖలిస్థాన్‌ ఉద్యమానికి వస్తున్న ప్రచారంచూస్తే ప్రజల్లో ఆకాంక్ష పూర్తిగా తగ్గలేదని చెప్పవచ్చు.
తండ ప్రభాకర్‌ గౌడ్‌, 9491822383

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img