Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

గవర్నర్లా? రాజకీయ ‘డోలక్‌లా’?

‘‘ఒక రాజకీయ నాయకుడు రాజకీయపరంగా ఎన్నికల్లోనో విజయం పొందినంత మాత్రానవారు ప్రధానమంత్రి పదవినో మరొక పదవినో స్వీకరించినంత మాత్రాన న్యాయమూర్తులు వారిపై పొగడ్తలు కురిపించేస్థితికి అలవాటుపడితే న్యాయవ్యవస్థపైనే ప్రజల విశ్వాసం కాస్తా సడలిపోతుందని మరచి పోరాదు’’ జస్టిస్‌ వి.డి.తుల్జా పూర్కర్‌ (1980లో ఉవాచ) ‘‘ఆలోచనలోనూ ఆచరణలో ప్రవర్తనలోనూ ప్రభుత్వాలు రాష్ట్రాల్లో, కేంద్రంలో కులాతీత, మతాతీత భావాలకు అనుగుణంగా నడుచుకోవాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ఇందుకు విరుద్దంగా ప్రభుత్వాలు రాజకీయపార్టీలు లౌకిక రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు గవర్నర్ల ద్వారా రాష్ట్రపతిపాలన అనివార్యం అవుతుంది’’సుప్రీం జస్టిస్‌ జీవన్‌రెడ్డి, జస్టిస్‌ ఎస్‌.సి
అగర్వాల్‌ ప్రకటించిన తొమ్మిది మంది జడ్జిలలో ఏడుగురు ఉమ్మడి తీర్పు ఇవ్వగా ఇద్దరు మాత్రం మౌనం వహించారు. (11.03.1994, బొమ్మయ్‌ కేసు)
అలాగే, ‘‘న్యాయమూర్తులు పదవీ విరమణానంతరం రిటైర్మెంట్‌ దశలో రాజకీయ ప్రాపకం ఫలితంగా తమకువచ్చే ఎలాంటి పదవినీ స్వీకరించరాదని స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి’’జస్టిస్‌ ఎ.పి.షా భారత లా కమిషన్‌ మాజీ అధ్యక్షులు(16.02.2023) ఇదిలాఉండగా, ‘‘గవర్నర్లు అనేవారు పాలనా రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చరాదని మహారాష్ట్ర పరిణామాల సందర్భంగా స్వయాన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్‌ తాజాగా ప్రకటించాల్సి వచ్చింది. (15.02.2023) ఇంతకీ విచిత్రమేమంటే, ఇంతమంది రాజ్యాంగ నిపుణులు, న్యాయశాస్త్ర కోవిదులు, రిటైర్మెంటు దశలో ఉన్న న్యాయమూర్తులకు ధర్మాసన విధుల గురించి ‘క్లాసు’ తీసుకొంటున్న ఘడియల్లోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రకటించిన గవర్నర్లలో కొంతమంది వివాదాస్పదమైన జస్టిస్‌లు కూడా ఉండటం, దేశంలో అదో చర్చనీయాంశంగా తలెత్తడం జరిగింది. అలాంటి వివాదాస్పద న్యాయమూర్తుల్లో ఒకరుగా వార్తల్లోకి ఎక్కినవాడు జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఉంటూ విధినిర్వహణలో పేరు ప్రఖ్యాతులు పొందిన సీనియర్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను నిష్కారణంగానూ, అకస్మాత్తుగానూ పాలకవర్గ సలహాపై బదిలీ చేయవలసివచ్చింది. ఈ ఆకస్మిక పరిణామాలు కూడా ఎటువంటి వివాదాస్పద పరిస్థితుల్లో జరిగింది? మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా శ్రీమతి లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి భారత రాజ్యాంగానికి కట్టుబడి విధులు నిర్వహిస్తానని ప్రతినబూనుతున్న క్షణంలో చెన్నయ్‌కి చెందిన పలువురు న్యాయవాదులు దూసుకువచ్చి ‘‘విక్టోరియా గౌరి మతమైనారిటీలకు వ్యతిరేకంగా దూషిస్తూ ప్రసంగాలు చేస్తూ వచ్చినందున ఆమె హైకోర్టు న్యాయమూర్తి హోదాకు తగరని ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే ప్రస్తుతానికి ఆమె నియామకం గురించి సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ విషయాన్ని పెండిరగ్‌లో పెట్టింది. ఆమె 2006 నుంచి 2020 మధ్యకాలంలో బీజేపీతో కలిసిఉండి, ఆ పార్టీ మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె దళితులకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలను బీజేపీ నాయకురాలుగా చేసి ఉన్నందున ఈ నెల (ఫిబ్రవరి1)లో 21 మంది న్యాయవాదులు సంయుక్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖరాస్తూ విక్టోరియా గౌరి న్యాయమూర్తి పదవికి తగరని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 24 మంది న్యాయవాదులే కాకుండా మరికొందరు న్యాయవాదులు కలిసి మొత్తం మద్రాసు హైకోర్టు బెంచ్‌ నుంచి మరింతమంది లాయర్లుతోడై మొత్తం 98 మంది లాయర్లు విక్టోరియా గౌరికి అనుకూలంగా కోర్టుకెక్కారు. ఈ విచిత్రమైన విపత్కర పరిణామాలు ఇలా ఉండగానే సుప్రీం గౌరవ ప్రధానన్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ మహారాష్ట్ర పరిణామాల సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ పరిణామాలు, రాజకీయ ఉద్యమాల గురించి గవర్నర్లు ప్రదర్శించిన ఉత్సాహాన్ని లేదా ఆసక్తి పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ ప్రభుత్వం శాసనవేదిక నుంచి విశ్వాస ప్రకటన కోరుకుంటుందని, ఆ సందర్భంలో రాజకీయ పరిధిలోకి గవర్నర్‌ ప్రవేశించకూడదనీ పాఠం చెప్పాల్సి వచ్చింది! అంతేగాదు, మరో సందర్భంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ మాట్లాడుతూ, రిటైర్మెంట్‌ తర్వాత కూడా న్యాయమూర్తులు పాటించవలసిన నైతిక నియమాలగురించి ప్రస్తావిస్తూ ‘‘రిటైర్మెంట్‌ తర్వాత పదవులకోసం ఎదురుచూసే న్యాయమూర్తులు తమ స్వాతంత్య్రాన్ని మాత్రం అమ్మకానికి కుదువబెట్టరాదని’’ ఉత్తమమైన సలహా యిచ్చారు. దీనిపైన లా కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఏ.పీ.షా వ్యాఖ్యానిస్తూ ‘‘ఈ విషయంలో న్యాయమూర్తులు భారత ప్రజలకు లిఖిత పూర్వకమైన ఒప్పందం ద్వారా హామీ పడకపోవచ్చుగాని అది వారి నైతిక బాధ్యత’’ అని స్పష్టం చేయాల్సి వచ్చింది.! జస్టిస్‌ నజీర్‌ ఎందుకు నియమితులయ్యారు? ఇటీవల బీజేపీ పాలకమండలి సలహాపైన రాష్ట్రపతి ఆరు రాష్ట్రాల్లో కొత్తగా నియమించిన గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్‌కు ఎంపికచేసిన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఒక్కరే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి’’. ‘తలాక్‌’ అంశంపైన ముస్లిం మహిళల గౌరవహక్కుల్ని సమర్థించడమేకాకుండా, పౌరుల ‘‘గోప్యత’’ హక్కును ప్రాధమిక స్వతంత్రంగా గుర్తించి సమర్థించిన ఖ్యాతి నజీర్‌కు దక్కింది. అయితే అర్థాంతరంగా మోదీ ప్రభుత్వం చడీచప్పుడులేకుండా దేశంలో ‘‘దొంగనోట్ల చెలామణీ ముమ్మరాన్ని అరికట్టే పేరిట అర్థాంతరంగా పెద్ద కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి తొలగించిన నిర్ణయం మూలంగా కోట్లాది మంది దేశ ప్రజాబాహుళ్యం బ్యాంకుల వద్ద మారక లావాదేవీల ఇబ్బందులకు గురై రోజుల తరబడి గంటలకొలదీ పడిగాపులుపడిన ఫలితంగా సుమారు 130 మంది చనిపోయారు. ఈ దారుణ పరిణామానికి దారితీసిన బీజేపీ పాలకుల నిర్ణయాన్ని సమర్థించినవారు జస్టిస్‌ నజీర్‌! అంతేగాదు, అయోధ్యలో ఉండాల్సిన రామమందిరం స్థానంలో మసీదు నిర్మాణం ఉందన్న వాదనకు అనుకూలంగా తీర్పుఇవ్వడంలో నజీర్‌కు ప్రమేయం ఉండడం! ‘‘హిందు’’ పత్రిక ప్రత్యేక లీగల్‌ విలేకరి కృష్ణదాస్‌ రాజా గోపాల్‌ పేర్కొన్నట్లు (12.02.23) ‘‘వివాదాస్పదమైన రామజన్మభూమి టైటిల్‌ను హిందువులకు దఖలు పరచాలని తీర్పు చెప్పిన ప్రత్యేక ‘‘అయోధ్య ధర్మాసనంలో ఏకైక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఏకైక జడ్జి నజీర్‌ కావడం ఇంకో విశేషం! ఆ మాటకొస్తే అయోధ్య భూ వివాదంలో పాలకవర్గం తరఫున కొమ్ముకాయడానికి ఏ పరిస్థితుల్లో సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌ అయోధ్య తీర్పును రామమందిర నిర్మాణాన్ని ఆకస్మికంగా భుజాన వేసుకొని సమర్థించాల్సి వచ్చిందో, అవమాన పడవలసివచ్చిందో మనకు తెలుసు. గొగోయ్‌ లైంగిక వేధింపులకు గురైన గొగోయ్‌ ఆఫీసు ఉద్యోగిని ఆయన గుట్టురట్టు చేసిన సమయంలో ఆ అవకాశాన్ని ఆసరా చేసుకుని బీజేపీ పాలకులు గొగోయ్‌ చేతులు విరిచి మరీ అనుకూలంగా సంతకం గుంజుకున్న సంగతి లోకానికి నాడే తెలిసిపోయింది. అందువల్ల అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న అత్యంత సీనియర్‌ గవర్నర్‌గా పరిణిత మనస్సుగల విశ్వభూషన్‌ హరిచందన్‌ స్థానంలో ఇప్పుడు వచ్చిన అబ్దుల్‌నజీర్‌ పౌరుల ‘‘గోప్యత హక్కును’’ ప్రాథమిక హక్కుగా పరిగణించి మంచి తీర్పును లోగడ అదించిన న్యాయమూర్తి. అవకాశవాద రాజకీయాలకు అగ్రస్థానం ఇవ్వడంలో కాంగ్రెస్‌ పాలక నాయకులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలు బీజేపీ పాలకులకు ఏమాత్రం తీసిపోనివారేనని ఎమర్జెన్సీ రోజులు నిరూపించాయి. అందువల్ల నాడు అల్హాబాదుకోర్టు నిరంకుశ(ఎమర్జెన్సీ) పాలనకు అంకుశమై ఎలా స్వస్థి చెప్పించిందీ మనకు తెలుసు. చివరకి అరుణ్‌జైట్లీ లాంటి బీజేపీ నాయకులు సైతం పదవీవిరమణానంతరం న్యాయమూర్తులకు పదవుల ఎరజూపి లోబరుచుకునే పాలనా పద్ధతులు మారాలని కాంగ్రెస్‌ అధికారంలో ఉన్పప్పుడు మీసాలుతిప్పి మరీ ‘సుద్దులు’ వల్లించినవాళ్లే!. జస్టిస్‌ జీవన్‌రెడ్డి, జస్టిస్‌ ఎస్‌,సి. అగర్వాల్‌ చెప్పినట్లు ‘‘ఆలోచనలో, ఆచరణలో ప్రభుత్వం మతాతీత, కులాతీత లౌకికరాజ్యాంగ శక్తిగానే ఉండాలని రాజ్యాంగం ఆదేశిస్తోంది. ఈ ఆదేశాన్నే రాజకీయపార్టీలు అనుసరించాలని కోరకుంటోంది’’. రేపు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగవర్నర్‌ నజీర్‌ కూడా ఆదేశానికి కట్టుబడి తీరక తప్పదు! లేకపోతే, ఆకస్మాత్తుగా నజీర్‌ నియామకాన్ని మరోలా భావించే ప్రమాదంఉంది! ఇంతకూ కాలం ఎప్పుడు జే కొడుతుందో ఓ కవికుమారుని మాటల్లో విందాం. మనం
‘‘కలవరపడి వెనుదిరిగితే కాలం ఎగపడుతుంది.
కదనుతొక్కి చెలరేగితే కాలం భయపడుతుంది.
కర్మయోగి ఎన్నడూ కాలాధీనుడు కాదు
కనురెప్పలు మూతపడితే కాలం జోకొడుతుంది.
కంఠమెత్తి తిరగబడితే కాలం జే కొడుతుంది.’’!
(బహుపరాక్‌ఆంధ్రప్రదేశ్‌)!! ఎబికె ప్రసాద్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img