Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

గుండ్రేవులతోనే కెసి కెనాల్‌ ఆయకట్టుకీ దుస్థితి!

వి. శంకరయ్య

నికర జలాల కేటాయింపులు వున్నప్పటికీ గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణం అటకెక్కించినందుననే ఈ రోజు బేసిన్‌లో నీటిఎద్దడి ఏర్పడగానే కెసి కెనాల్‌ ఆయకట్టు రైతులు నీటికోసం వెంపర్లాడ వలసివస్తోంది. దశాబ్దాల తరబడి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా నిత్య క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమకు న్యాయం జరగలేదు. నేడు ఎత్తిపోతల పథకాలవద్ద ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తేగాని రాష్ట్రప్రభుత్వం దిగిరాలేదు. విద్యుత్‌ చార్జీలు చెల్లించలేనిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వుందంటున్నారు. అదే సమయంలో పులిచింతల పట్టిసీమ ఎత్తిపోతల పథకంవుంది కాబట్టి రెండిరటి నుండి 9500 క్యూసెక్కులు నీళ్లు కృష్ణడెల్టాకు విడుదల చేస్తున్నారు. ఈ వెసులుబాటు రాయలసీమ రైతులకు లేదు. తుంగభద్రపై 20 టియంసిలు సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణం జరిగివుంటే ఇలాంటి అవకాశమూ రాయలసీమ వాసులకుదక్కేది. కురువృద్ధులు ఇంజనీర్‌ సుబ్బారాయుడు ఎంతో శ్రమించి రూపకల్పనచేసిన ఈ పథకం కాగితాలకే పరిమితం అయింది.
ట్రిబ్యునల్‌ కేటాయింపులు నుండి కొంత రాష్ట్రంలోనే సర్దుబాటు కాగా తుంగభద్ర నుండి 21.89 టియంసిల నికర జలాల కేటాయింపులు వున్నప్పటికీ రెండున్నర లక్షల ఎకరాల కెసి కెనాల్‌ ఆయకట్టుకు కేవలం 1.20 టియంసిల నీటినిల్వ సామర్ధ్యం గల సుంకేసుల బ్యారేజీ ఒక్కటే వుంది. దేశంలోనే నికరజలాలు కేటాయింపులు వున్న ఏ ఆయకట్టుకు ఈ దుర్గతి వుండకపోవచ్చు. ఈ లోపు 2.975 టియంసిల సామర్థ్యంతో అలగనూరు బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించినా నేడు అది పశువులమేత పొరంబోకుగా వుంది. దానికి వ్యయంచేసిన నిధులు కాంట్రాక్టర్లు అధికారగణం మేసేయగా ప్రస్తుతం ఓటికుండగా మిగిలింది. ఇది గతం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013 నవంబర్‌లో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణానికి డిపిఆర్‌ రూపొందించడానికి 54.95 లక్షల రూపాయల వ్యయంతో జీవో జారీ చేశారు. ఈ కాంట్రాక్టు హైదరాబాద్‌కు చెందిన సంస్థ దక్కించుకొని 2890 కోట్ల రూపాయలు వ్యయంతో 20 టియంసిలు నీటి నిల్వ సామర్థ్యం రిజర్వాయర్‌ నిర్మాణానికి డిపిఆర్‌ సమర్పించింది. 2014లో తెలుగుదేశంహయాం మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణం గురించి హామీఇచ్చినా అమలుకు రాలేదు. తెలంగాణతో ముడిపడి వున్నందున పైగా కెసిఆర్‌కు చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగావున్న స్పర్థల నేపథ్యంలో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణంపై దృష్టిపెట్టే అవకాశం లేకుండాపోయింది. గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మించితే తెలంగాణలో జోగులాంబ గద్వాలజిల్లాలో మూడుగ్రామాలు పూర్తిగానూ, రెండు గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురౌతాయి. మొత్తంమీద 2371 ఎకరాలు ముంపుప్రాంతంగా వుంటుంది.
చంద్రబాబునాయుడు పట్టిసీమ ఎత్తిపోతలపథకం నిర్ణీత వ్యవధిలో పూర్తిచేసి గోదావరి జలాలతో సీమ పొలాలు తడుపుతున్నానని పదేపదే చెప్పినా రాయలసీమ ప్రజలు నమ్మలేదు. తుదకు 2019 ఫిబ్రవరిలో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణానికి టెండర్లు పిలవడం, ఈ లోపు ఎన్నికలు రావడంతో పనులు మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా వల్లెవేసిన మాటతప్పను మడమతిప్పను అనే హామీలు నమ్మిన రాయలసీమ ప్రజలు ఏకపక్షంగా తీర్పుఇచ్చారు. ఇప్పుడు పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్టయిందని వాపోతున్నారు. ముఖ్యమంత్రి పదవిచేపట్టిన జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సత్సంబంధాలు కొనసాగించిన తరుణంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణానికి తెలంగాణనుండి అనుమతిపొందివుండవచ్చు. గోదావరి, కృష్ణ నదుల అనుసంధానంపై పలుదఫాలు ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చలు సాగించినా గుండ్రేవుల ఊసేజాడలేదు. జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రాధాన్యతల్లో లేకపోవడం రాయలసీమకు శరాఘాటంగా మిగిలింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థలు ఆస్తులు పంపకం పక్కనబెట్టి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోట్లాది రూపాయలు విలువగల సెక్రటేరియట్‌ భవనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డినుండి సులభంగా స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెంది ఒక్క అంశంలోనూ తెలంగాణ నుండి లాభపడిరదిలేదు.
మరోవేపు ఎవరు సలహా ఇచ్చారో లేక జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా నిర్ణయం తీసుకున్నారో ఏమో దిక్కుమాలిన రివర్స్‌ టెండర్‌ విధానం తెరమీదకువచ్చి ఒక్క జీవోతో అమలులో వున్న టెండర్లు అన్నీ రద్దుచేశారు. ఆఖరుకు ముఖ్యమంత్రి తండ్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిహయాంలో జరిగిన టెండర్లు రద్దుఅయ్యాయి. తదుపరి 14 ప్రాధాన్యత ప్రాజెక్టులు ఎంపికకాగా అందులో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణంవున్నా ఆచరణలో గుండు కొట్టించడం అందరికీ తెలిసిందే. అంతర్‌ రాష్ట్ర జలవివాదాలతో కూడిన రాయలసీమ ప్రాజెక్టుల అంశంలో చంద్రబాబునాయుడు కన్నా జగన్మోహన్‌ రెడ్డికి వెసులుబాటు అవకాశాలువున్నా నెరవేర్చలేకపోయాడు. గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణం జరిగితే కర్నూలు పట్టణం దాహార్తి శాశ్వతంగా తీరుతుంది. ఉమ్మడి కర్నూలుజిల్లా పశ్చిమ ప్రాంతంలోని ప్రజలకు తాగునీరు అందుతుంది.
తాజాగా గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణవ్యయం 5500 కోట్లకు చేరిందంటున్నారు. మరింత కాలయాపన జరిగితే నిర్మాణ వ్యయంఎంత పెరుగుతుందో! కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ముందు కెసి కెనాల్‌కు గతంలో ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిని ఆంధ్రప్రదేశ్‌ బేసిన్‌ ఆవలకు తరలించుతోందని ఆ నీటికి కోతపెట్టి తనకు కేటాయించాలని విచారణాంశాల్లో ఒకటిగా చేర్చింది. బేసిన్‌ అంశాన్ని ప్రముఖంగా తీసుకువస్తోంది. కాని తనుమాత్రం గోదావరి జలాలను కృష్ణబేసిన్‌కు తరలించుతున్నా రాయలసీమకు చెందిన ఒక్క ఎమ్మెల్యే నోరుతెరిస్తే ఒట్టు. వీరందరికీ హైదరాబాద్‌లో స్థిరాస్తులున్నందున ఒక్కరూ రాజకీయంగా ప్రకటన ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. తుదకు రాష్ట్రమంత్రులు కూడా నోరువిప్పడంలేదు. భవిష్యత్తులో ట్రిబ్యునల్‌ తీర్పు ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.
విశ్రాంత పాత్రికేయులు, సెల్‌: 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img