Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

గురుకుల విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యం

చెట్టుపల్లి మల్లిఖార్జున్‌

సంక్షేమ గురుకుల విద్యాలయాలంటే శాస్త్ర-సాంకేతిక రంగాల అభివృద్ధితోపాటు సమాజ అభివృద్ధికి బాటలు వేసే ఆధునిక విద్యాక్షేత్రాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థాపితమైన గురుకులాలు తెలుగునేలపై గత మూడు దశాబ్దాలకు పైగా స్వయం నిర్ణయాధికారాలతో విలసిల్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ గురుకుల విద్యాలయాలపై ఇటీవల మంత్రిమండలి తీసుకొన్న రాజకీయ నిర్ణయం గురుకుల విద్యా వ్యవస్థకు, స్వయం నిర్ణయాధికారాలకు గొడ్డలిపెట్టుగా మారనుంది. మంత్రిమండలి నిర్ణయాలు అమలైతే తెలంగాణలో ఆధునిక విద్యా వ్యవస్థకు ఆయువు పోస్తున్న గురుకుల విద్యాలయాల ప్రతిష్ట మసక బారుతుంది. దీంతో లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుతో పాటు గురుకుల విద్యాలయాల అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది.
గురుకుల విద్యాసంస్థలపై బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో కాంగ్రెస్‌, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి రాజకీయ జోక్యం చేసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం గడచిన ఏడేళ్లుగా అన్ని ప్రభుత్వ విభాగాలపై రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అందులో భాగంగానే గురుకుల విద్యావ్యవస్థపై రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న రాజకీయ నిర్ణయం లక్షలాదిమంది విద్యార్థుల్లో భయాందోళన కలిగిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను గురుకులాలకు శాశ్వత ఆహ్వానితులను చేయడం ఆందోళనకరం.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల యూనిట్‌గా గురుకుల విద్యాలయాలకు ప్రవేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం ప్రకారం గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం అసెంబ్లీ నియోజకవర్గ యూనిట్‌గా ఎంపిక చేసి చేసి 50% స్థానిక రిజర్వేషన్ల అమలుకు నిర్ణయించింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అధిక సంఖ్యలో ప్రవేశాలు పొందే ఆస్కారం ఉంది. భవిష్యత్తులో గురుకుల విద్యాలయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల మాదిరిగా మారే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ప్రజాప్రతినిధుల రాజకీయ జోక్యానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
1984లో ప్రారంభమైన ఈ గురుకులాల స్థాపనలో ముఖ్య ఉద్దేశం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేని విద్యావిధానం అమలు చేయడం. గత తొమ్మిదేళ్లుగా డా. ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ గురుకుల విద్యావ్యవస్థలో తీసు కొచ్చిన విప్లవాత్మక మార్పులు, వినూత్న పాఠ్యప్రణాళికల అమలు ఫలితంగా తెలంగాణరాష్ట్రంలోని అన్ని సాంఘిక, గిరిజనసంక్షేమ గురుకుల విద్యాలయాలు కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా దూసుకుపోతున్నాయి. వీటి ప్రభావం రాష్ట్రంలోని బీసీ, మైనారిటీ గురుకులాలపై అనివార్యంగా పడిరది. తప్పని పరిస్థితుల్లో మిగిలిన అన్ని ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులు, అధికారులు సోషల్‌ వెల్ఫేర్‌ తరహాలో ప్రణాళికలు రూపొందించు కున్నాయి. సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అదనపు బోధనా పాఠ్య ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలతో పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తున్నారు. బోధనా- బోధనేతర సిబ్బంది నియామకం,మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆన్‌ లైన్‌ డిజిటల్‌ తరగతులు, లైబ్రరీ, సువిశాలమైన క్రీడాప్రాంగణాలు తదితర సౌకర్యాలను కల్పించేందుకు డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చేస్తున్న కృషి ఎనలేనిది. కానీ ఇవన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వందలాది గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
గడచిన ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి భూమిని కేటాయించడం లేదు, సరిపడా నిధులు మంజూరు చేయడం లేదు. అద్దె భవనాల్లో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇక బాలికల/మహిళా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థినుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గురుకుల విద్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి కల్పించాల్సిన మౌలిక వసతుల గురించి అసెంబ్లీ వేదికగా ఏనాడూ చర్చించని తెలంగాణ మంత్రి మండలి గురుకుల విద్యాలయాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల రాజకీయ జోక్యానికి మాత్రం ఆమోదం తెలపడం శోచనీయం.
స్వయం నిర్ణయాధికారాలతో రాణిస్తున్న సంక్షేమ గురుకుల విద్యాలయాలను పంజాబ్‌, దిల్లీ, కర్ణాటక, మేఘాలయ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచే కాకుండా కేంద్రం నుండీ ఉన్నతాధికారుల బృందాలు వచ్చి సందర్శించాయంటే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అమలవుతున్న నాణ్యమైన విద్యావిధానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గురుకులాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విచారకరం.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (ఖణIూజు ం) 2019-20 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాలు కనీస మౌలిక వసతులు, నాణ్యమైన విద్య లేక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్య నుండి డిగ్రీ స్థాయి విద్య వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 69,37,640. అందులో ప్రభుత్వ విద్యాలయాల్లో 28,37,635 (40.9%),ఎయిడెడ్‌ విద్యాలయాల్లో 1,03,902 (1.5%), ప్రయివేట్‌ విద్యాలయాల్లో 39,84,609 (57.4%), కేంద్ర విద్యాలయాల్లో 11,494 (0.2%) మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ అధీనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులసంఖ్య 3,74,087 అంటే రాష్ట్రంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల్లో కేవలం 5.3% మాత్రమే. వీరిలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులసంఖ్య 1,49,680 (4%). గిరిజన గురుకుల విద్యాలయాల విద్యార్థుల సంఖ్య 51,623 (0.13%). బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య 93,360. (0.24%). మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థలో 79,424 (0.21%) మంది విద్యార్థులు ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు కేవలం 5.3% మాత్రమే. అంటే మిగతా 94.7% మంది విద్యార్థుల్లో 42.4% మంది విద్యార్థులు నాన్‌-రెసిడెన్షియల్‌ విధానంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీటితోపాటు రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఎస్సీ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87,273. షెడ్యూల్డు తెగల సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఎస్టీ సంక్షేమ శాఖ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 24,405. వీరు రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందినవారు. ఈ పేద వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది.
తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితి మరీ దారుణంగా పడిపోతుందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 25,131 ప్రభుత్వ పాఠశాలల్లో 100 కంటే తక్కువ మంది విద్యార్థులు నమోదవుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు లేకుండా 916 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని తెలంగాణ విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్‌ పేరుతో తగ్గించడం చట్టవిరుద్ధం. కానీ తెలంగాణ విద్యాశాఖ రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకరణ) పేరిట తీసుకున్న నిర్ణయంతో సుమారు 2,000 ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులసంఖ్య నమోదు కాక మూతబడ్డాయి. వీటిలో ఎక్కువగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలతో పాటు ఆదివాసీ గూడెల్లో ఉన్నటువంటి పాఠశాలలు మూసివేయడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ప్రాథమిక విద్యకు నోచుకోవడం లేదు.
లక్షలాది నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ విద్యాసంస్థలను ధ్వంసం చేస్తోంది. రాష్ట్రంలోని అనేక ఉన్నతస్థాయి విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు సరిపడా నిధులు, నియామకాలు లేక కునారిల్లుతున్నాయి. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకుండా నాణ్యమైన విద్యతో ఆదర్శవంతంగా నడుస్తున్న గురు కులాల్లో రాజకీయ జోక్యానికి తెర లేపడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యానికి తెరతీసిన రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి.
వ్యాస రచయిత ఉస్మానియా విశ్వవిద్యాలయం
రాజనీతి శాస్త్ర విభాగం పరిశోధకులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img