Friday, June 9, 2023
Friday, June 9, 2023

గొప్ప ఆలోచనాపరుడు మార్క్స్‌

నిత్య చక్రవర్తి

ప్రపంచ జనావళి దోపిడీ నుంచి విముక్తి పొందడానికి కావలసిన సిద్ధాంతాన్ని అందించిన గొప్ప ఆలోచనాపరుడు కార్ల్‌మార్క్స్‌. ఆయన 1818 మే 5వ తేదీన జర్మనీలో జన్మించి 1883 మార్చి 14న లండన్‌లో మరణించారు. ప్రపంచాన్ని మార్చడానికి సమకూర్చిన సిద్ధాంతాలలో భాగస్వామి, మార్క్స్‌తో విడదీయలేని స్నేహ బంధం కలిగిన ఫ్రెడరిక్‌ ఏంగిల్స్‌, మార్క్స్‌ సమాధి వద్ద మాట్లాడుతూ ఇలా అన్నారు. మార్క్స్‌ చనిపోయిన తర్వాత మూడు రోజులకు మార్చి 17న ఆయన సమాధిని సందర్శించి తన స్నేహితుడికి నివాళి అర్పించారు. మార్చి 14 మధ్యాహ్నం 3గంటలకు 15 నిమిషాలకు తక్కువగా ఉన్న సమయంలో మార్క్స్‌ శాశ్వతంగా కన్నుమూశారని ఏంగెల్స్‌ తెలిపారు. ఆయనను వదిలి రెండు నిమిషాలు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ మార్క్స్‌ కుర్చీలోకూర్చుని ప్రశాంతంగా నిద్రించారు. ఆ నిద్ర శాశ్వత నిద్ర అని ఏంగిల్స్‌ చెప్పారు. ఆయన మరణంతో ఐరోపా, ఆమెరికాలలో సమరశీల పోరాటాలకు ఎనలేని నష్టం కలిగింది. దోపిడీకి గురవుతున్న శ్రామిక జనావళి స్పూర్తికి పెద్ద నష్టం జరిగింది. అని ఏంగిల్స్‌ అన్నారు. ఆయనలేని లోటు ఎన్నటికీ తీరనిది.
నేను హిందుస్థాన్‌ టైమ్స్‌ పత్రిక తరఫున 1990 జనవరిలో లండన్‌కు వెళ్లాను. మార్క్స్‌ 1851 నుంచి 1855 వరకు నివసించిన 28 డీన్‌ స్ట్రీట్‌కు(సోహో) చాలా సమీపంలో నేను ఉన్న హోటల్‌ ఉంది. మార్క్స్‌ నివసించిన ఫ్లాట్‌ను చూడాలని కోరుకున్నాను. ఆయన నివాసంలోనే ఐరోపా నుంచి అనేకమంది సుప్రసిద్ధ విప్లవకారులు వచ్చి మార్క్స్‌తో సమావేశమయ్యేవాళ్లు. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ నుంచి ఎక్కువమంది వచ్చేవారు. ఆ కాలంలో మార్క్స్‌ పరిశోధన, రచనవ్యాసంగంలో తలమునకలై ఉన్నారు. మార్క్స్‌ కుటుంబం పేదరికంవల్ల, అప్పుడప్పుడు అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి కారణంగా తరచుగా ఇళ్లు మారేవారు. 1951 జనవరిలో 28 డీన్‌ స్ట్రీట్‌లో ఫ్లాట్‌కు మారారు. అంతకుముందు చాలా దగ్గరలో 64 డీన్‌స్ట్రీట్‌లోని ఇంటిలో కొద్దికాలం ఉన్నారు. ఆ ఇంట్లోనే ఆయన కుమార్తె ఫాక్సి అనారోగ్యంతో చనిపోయింది. మార్క్స్‌ సతీమణి జెన్నీ కుమార్తె మరణంపై ఎంతగానో దు:ఖించారు. మార్క్స్‌ కుటుంబం 1848లో లండన్‌ వచ్చింది. అప్పటినుంచి విపరీతమైన చలి, ఆకలి, వ్యాధులు, నిరంతర ఆర్థికసమస్యలు వెంటాడాయి. జబ్బుతో బాధ పడుతున్న కుమార్తెను జెన్నీ చూసుకుంటూ రచనలో నిమగ్నమైన మార్క్స్‌కు ప్రశాంత వాతావరణం కల్పించారు. మార్క్స్‌ ఉన్న భవనంపైన అపార్టు మెంట్‌లో నివసించేవారు. నేను ఆ భవనం చూసేందుకు వెళ్లినప్పుడు కిందిఫ్లాట్‌లో ఒక రెస్టారెంటు ఉంది. ఆ రెస్టారెంటు యజమాని మార్క్స్‌ నివసించిన అపార్టుమెంటును చూసుకుంటున్నారు. అపార్టుమెంటు సందర్శకుల కోసం నిర్దిష్ట సమయాలు ఉండేవి. వారికోసం అవసరమైన ఫర్నిచర్‌ను కూడా రెస్టారెంటు యజమాని అక్కడ ఉంచేవారు. ఆ అపార్టుమెంటు రెండు గదులతోనే ఉండేది. ముందు గదిలోనే భోజనం, అధ్యయనం ఉండేవి. వెనుక గదిలో వంటచేయడం, నిద్రించడం ఉండేది. తాగడానికి ఇతర అవసరాలకు నీటిని కిందనుంచే తెచ్చుకోవలసి వచ్చేది. ఆ భవనంలో పౌష్టికాహార లోపంతో ఉన్న కుటుంబాలు చాలా నివసించేవి. మరుగుదొడ్డిలో నీటి సరఫరా కనెక్షన్‌ కూడా ఉండేదికాదు.
అనేకమంది మార్క్స్‌స్నేహితులు తమ దేశాల్లో ప్రభుత్వాలు వెంటాడటంతో ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ నుంచి ప్రముఖ విప్లవకారులు వచ్చి ఆయన వద్దే ఉండేవారు. ముందుగది 15అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండేది. అయినప్పటికీ మార్క్స్‌ అక్కడే అధ్యయనం చేసే వారు. గదిలో ఒక కుర్చీ, టేబుల్‌ మాత్రమే నాకు కనిపించాయి. ఆ టేబుల్‌వద్ద కూర్చుని మార్క్స్‌ రచనలు చేసేవారు. అదే కుర్చీలో కూర్చుని రాసుకునేవారని రెస్టారెంట్‌ యజమాని చెప్పారు. మార్క్స్‌ 28 డీన్‌స్ట్రీట్‌ అపార్టుమెంటు నుండి మరో మెరుగైన ఫ్లాట్‌కు మారేవరకు ఆ ఇంటిని ‘ది హౌస్‌ ఆఫ్‌ మెహర్‌’ అని పిలిచేవారు. ఇతర దేశాలనుంచి, అక్కడి ప్రభుత్వాల నుంచి తమనుతాము కాపాడుకునేందుకు స్నేహితులు మార్క్స్‌ దగ్గరకు వచ్చి ఉండేవారు. అదే ఇంటిలో సుదీర్ఘ చర్చలు సాగేవి. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఆ చర్చలు జరిగేవి. స్నేహితులతో సహా అందరికీ వంట చేసేందుకు అవసరమైన వస్తువులను దగ్గరలోని షాపుల్లో అప్పుపైన తీసుకురావడానికి ఎంతో శ్రమపడేవారు. ఇతర దేశాలనుంచి వచ్చే యువకులు సాయంకాలాల్లో మార్క్స్‌ను కలిసేవారు. రాత్రి భోజనం కోసమని వారు జెన్నీ చేతికి కొంతడబ్బు ఇచ్చేవారు. ఆతిధ్యం ఇవ్వడంలో జెన్నీ ఎంతో దయార్ద్రత కనబరచేవారు. మార్క్స్‌ ఇంట్లో పనిచేసే అమ్మాయి హెలెన్‌ డిముత్‌ ఎంతో రుచికరంగా వంటచేసేది.
మార్క్స్‌తో చర్చలు జరిగేసమయంలో పాల్గొన్నవారి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కొన్నిసార్లు ఒకరిపైఒకరు కలబడేవారు కూడా. చర్చల్లో ఉన్నవారికి జెన్నీ రాత్రి భోజనం అందించేది. మార్క్స్‌ జర్మనీ, ఫ్రాన్స్‌ నుంచి వచ్చే స్నేహితులవలెనే మద్యాన్ని ఎంతో ఇష్టంగా సేవించే వారు. ఒకరిద్దరు ధనికులైన స్నేహితులు మార్క్స్‌కు అధికంగా డబ్బు అందించేవారు. స్నేహితులతో కలిసి ఫెర్రింగ్‌డన్‌ వీధిలో ఉన్న వైన్‌షాపులో ఎక్కువగా కలుసుకునేవారు. అలా కలుసుకునే గ్రూపును మార్క్స్‌ ‘‘డి సినగోగ్‌’ అని పిలిచేవారు. 1852 కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు క్రిస్మస్‌ వేళల్లో రాత్రిపూట వైన్‌షాపులో కూర్చొని మద్యం సేవిస్తూ సుదీర్ఘంగా చర్చలు జరిపేవారు. ఆయన స్నేహితులతో చర్చలు జరుపుతున్నప్పుడు పేదిరికం, కుటుంబసభ్యులకు వ్యాధులు వెంటాడేవి. 1852 ఏప్రిల్‌లో మార్క్స్‌సంతానంలో ఒకరు ఫ్రాన్సిస్కా బ్రాంకైటిస్‌తో చనిపోయారు. ఆ పాపకు వైద్య చికిత్స చేయించ డానికి కూడా మార్క్స్‌ వద్ద డబ్బులుండేవి కావు. అంతిమంగా శవపేటిక కొనుగోలుకు కూడా డబ్బుల్లేవు. మార్క్స్‌ జీవితచరిత్రను 2011లో మేరి గాబ్రియెల్‌ ప్రచురించారు. మార్క్స్‌కోసం వచ్చిన ఒక గూఢచారి తన నివేదికలో, బట్టలుఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం తదితరపనులు చేసేవాడని, మద్యపానాన్ని ఇష్టపడేవారని, నిద్రకు నిర్దిష్ట సమయం ఉండేదికాదని పేర్కొన్నట్లు ప్రచురణకర్త మార్క్స్‌ జీవిత చరిత్రలో ఉదహరించారు. 1855 ఏప్రిల్‌లో మార్క్స్‌కుమారుడు టీబీతో మరణించాడు. లండన్‌ వచ్చిన తర్వాత ముగ్గురు సంతానం మరణించారు. మార్క్స్‌ ఎదుర్కొన్న అనేక విషాదఘటనలను ఏంగెల్స్‌ తన రచనల్లో పేర్కొన్నారు.
(నేడు మార్క్స్‌ 205వ జయంతి సందర్భంగా)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img