Monday, March 27, 2023
Monday, March 27, 2023

గొప్ప ప్రజానాయకుడు గోవింద్‌ పన్సారే

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

సమాజాన్ని గురించి ఆలోచిస్తూ దానిమార్పుకు జీవితాంతం శ్రమించిన ఆదర్శమూర్తి, త్యాగధనుడు గోవింద్‌ పండరినాథ్‌ పన్సారే. గోవింద్‌ పన్సారే(82), ఆయన సతీమణి ఉమా పన్సారే(72)లపై కొల్హాపూర్‌లో 16-02-2015న సమాజ తిరోగమనవాదులు దాడిచేశారు. 20-02-2015న గోవింద్‌ పన్సారే మరణించారు. పన్సారే మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌జిల్లా శ్రీరాంపుర్‌ తాలూకా కొల్హర్‌ గ్రామంలో 26-11-1933న పేద కుటుంబంలో జన్మించారు. తన ఐదు ఎకరాల భూమిని వడ్డీ వ్యాపారులు ఆక్రమించుకోగా పన్సారే తండ్రి పండరీనాథ్‌ చిన్న చిన్న పనులు చేశారు. తల్లి పట్టుదలతో గోవింద్‌ బిఎ(ఆనర్స్‌), ఎల్‌ఎల్‌బి కొల్హాపూర్‌ రాజారామ్‌ కళాశాలలో చదివారు. పేదరికం వలన ఆయన వార్తా పత్రికలను పంచారు. కొంతకాలం మునిసిపాలిటీ కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేశారు. తర్వాత మునిసిపాలిటీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి చివరికి న్యాయవాదిగా స్థిరపడ్డారు.
పన్సారే క్రియాశీల కార్యకర్త, సంఘ సంస్కర్త, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. రాష్ట్ర సమితి కార్యదర్శిగా, సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. కార్మికులను చైతన్య పరిచారు. 1962 భారతచైనా యుద్ధ సమయంలో అరెస్టు చేసిన ప్రథమ కమ్యూనిస్టు పన్సారే. ఆయన1987 మే ఉపన్యాసం ‘శివాజీ ఎవరు?’ శీర్షికతో కరపత్రంగా తర్వాత చిన్న పుస్తకంగా ప్రచురించడమైంది. అనేక భాషల్లోకి అనువదించిన ఈ పుస్తకం ఏడు ముద్రణలతో మరాఠీతో సహా రెండులక్షల ప్రతులు అమ్ముడైంది. ఈ పుస్తకం ద్వారా పన్సారే ‘ఛత్రపతి శివాజీ ముస్లిం వ్యతిరేకి, బ్రాహ్మణ సమాజ సంరక్షకుడు’ అన్న సాంప్రదాయవాదుల ప్రచారాలను ఖండిరచారు. శివాజీ పేదల పక్షపాతి, రైతుల, శూద్రుల, స్త్రీల, ముస్లింల సంక్షేమంకోసం పాటుపడ్డారని ఉదాహరణలతో వివరించారు. పన్సారే అనేక సామాజికాంశాల మీద పన్నెండు పుస్తకాలు రాశారు. వీటిని వివిధ భాషల్లోకి అనువదించడమైంది. గాంధి హంతకుడు గాడ్సేను సంఫీుయులు దేశభక్తునిగా, దైవసమానునిగా కీర్తించినప్పుడు పన్సారే వ్యతిరేకించి గాడ్సే జీవిత చీకటి కోణాలను బైటపెట్టారు. పేదల సమస్యల పరిష్కారానికి, అవినీతి, కులవివక్ష, మతఛాందసం, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారు. గోద్రా మత ఘర్షణలను, ముంబై తీవ్రవాదదాడులను తీవ్రంగా వ్యతిరేకించారు, నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఆ సంఘటనల్లో నిజాయితీ పోలీసు అధికారులకు మద్దతు పలికారు. వారిపై ప్రభుత్వాల దమనకాండను ఖండిరచారు. స్త్రీ, కార్మిక సంక్షేమానికి, మానవహక్కుల పరిరక్షణకు ఉద్యమించారు. దబోల్కర్‌ హత్య తర్వాత మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం ‘స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని’ ప్రతిపాదించినప్పుడు కార్మికసంఘ నాయకుడైన పన్సారే ఆ పథకంలోని అపాయకర సామాజికాంశాలను ఉద్యోగులకు వివరించి ఆ పథకం అమలు కాకుండా చేశారు. పేదవారైన చెరుకు రైతులకు అనుకూలంగా అనేక కోర్టు కేసులను ఉచితంగా వాదించారు. ఈ సందర్భాలలో పంచదార పరిశ్రమల అధిపతులు కోట్ల రూపాయలకు ప్రలోభపెట్టినా లొంగలేదు. రైతులపక్షం వీడలేదు. న్యాయవాదిగా డబ్బు సంపాదన అవకాశాలను కూడా వదులుకున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు, ప్రపంచీకరణ ఉదారవాద ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా అనేక ప్రజాఉద్యమాలు నడిపారు. మహాత్మా ఫూలే, సాహు మహారాజ్‌, అంబేద్కర్‌ల భావాలకు పన్సారే ప్రగాఢ అనుచరుడు. ప్రజలను చైతన్యపరచడానికి, అన్యాయాలు, అణచివేతలను గుర్తించి ఎదిరించడానికి అనేక ఉద్యమాలను, నిరంతర కార్యక్రమాలను నడిపారు. ఎదిరింపు, ఆందోళన పద్దతులతో ప్రపంచాన్ని మార్చవచ్చుననే ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని పీడిత ప్రజల మనసుల్లో రగిలించారు. వందల కిలోల ధాన్యం, నెయ్యి, ఇతర సామగ్రిని బుగ్గిచేస్తున్న యజ్ఞాలను వ్యతిరేకిస్తూ కొల్హాపుర్‌లో ఉద్యమాలు నడిపారు. ప్రజలలో హేతువాద దృక్పథం మేల్కొలుపుకు ‘వివేక్‌ జాగృతి’ కార్యక్రమాలు నిర్వహించారు. మతవాద సంస్థలైన భజరంగదళ్‌, విశ్వ హిందు పరిషత్‌ల ఆగ్రహానికి గురయ్యారు. పన్సారే ఏకైక కుమారుడు అవినాశ్‌ 35 ఏళ్ల వయస్సులో మరణించారు. కొడుకు శవం ప్రక్కన నిల్చొని ఆయన, అవినాశ్‌ శేష కార్యక్రమాలను ఎవరు పూర్తిచేస్తారని ప్రశ్నించి, వెంటనే గుండెను కరిగించే బాధలో కూడా చతురతతో, మేము పూర్తిచేస్తామన్నారు. అలానే చేశారు. కుమారునికి, ఇద్దరు కుమార్తెలకు కులాంతర వివాహాలు చేశారు. పన్సారే అజాతశత్రువు. పరపక్షీయులు, ప్రతిపక్షీయులు, నిష్పక్షీయులు అందరినీ కలుపుకొని ఉద్యమాలుచేశారు. సంస్థలను, వాటి సభ్యులను విమర్శించకుండా సంస్థల దురాశయాలను, వ్యక్తుల దురాచారాలను సమాజానికి వివరించారు. సర్వసమాజ సమన్వయం సాధించి, సర్వ జనామోదంతో, సర్వుల సహాయ సహకారాలతో సామాజిక మార్పుకు సర్వశక్తులు ఒడ్డి పనిచేశారు. రిక్షా కార్మికులు, శ్రమజీవులు, మహారాష్ట్ర డబ్బావాలాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, లౌకికవాదులు, ఉద్యోగులు, వామపక్ష వాదులు, ప్రతిపక్ష నేతలు, పాలకపక్ష మిత్రులు, మితవాదులు కాని రాజకీయ నాయకులు, ప్రగతికా ముకులు, శాస్త్రీయ దృక్పథ ప్రచారకులు, అన్ని తరగతుల ప్రజలు పన్సారేపై దాడిని ఖండిరచారు. గోవింద్‌ పన్సారే మరణానికి బాధపడ్డారు, సంతాపం తెలిపారు. మేమంతా దాభోల్కర్‌లమే, పన్సారేలమేనని నినదించారు. మతఛాందసుల అమానవ చర్యలను నిరసించారు. మరాఠీ రచయిత విద్యాబాల్‌ మానవత్వ సాంప్రదాయాలు అంతరించినందుకు బాధపడుతూ, పేదల సమస్యల పరిష్కారానికి పనిచేశారన్నారు. మహారాష్ట్రలో వామపక్షాల క్రియారాహిత్యాన్ని గుర్తిస్తూనే, ‘‘ఉత్సాహపూరిత కార్మిక సంఘాల ఉద్యమాలతో, 1960లలో ఒక ఊపు ఊపిన సామ్యవాద భావాలు, మానవ విలువలు పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధిచెందిన నేటి మహారాష్ట్రలో ప్రజలను ఆకర్షించలేకపోతున్నాయి. 1980ల తర్వాత కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు సంఘపరివారశక్తుల ప్రవేశానికి దారి కల్పించాయి.’’ అని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడు అజిత్‌ అభ్యంకర్‌ బాధ పడ్డారు. విద్యారంగం లాంటి కీలకాంశాలను కాంగ్రెస్‌ అశ్రద్ధచేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని సామ్యవాద ఆలోచనాపరుడు అరవింద్‌ గుప్తా అన్నారు. ఫడ్నవిస్‌ ప్రభుత్వం ‘‘సాంప్రదాయ’’ ప్రకటనలకే పరిమితమైంది. సంతాప సభలకు, తీర్మానాలకు కూడా అనుమతించలేదు. అసంతృప్తి అంతమయ్యే దాకా ఉద్యమాలు ఆగవు. ఉద్యమకారులు అమరులు. మహానుభావుల జీవితకాలంలో చాలామంది వారిని పట్టించుకోరు, భావసారూప్య సహచరులతో సహా. ‘‘ఈయన లేని లోటు తీర్చలేనిది’’ వంటి పడికట్టు పదాలతో, మరణించినప్పుడు, సంతాపిస్తారు. పన్సారే తన కొడుకు అకాలమృత్యువు తర్వాత ఆచరించిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు నిజమైన నివాళి కాగలదు. సమానత అవకాశాలను అందరికీ అందించడానికి సామాజిక శాస్త్రవేత్తలు, కార్యకర్తలు ముందుగా తమ స్వల్ప విబేధాలను విస్మరించి, విప్లవదిశలో పయనించాలి. ప్రజలకు ప్రత్యామ్నాయాలను సూచించి, ప్రదర్శించి నమ్మకాన్ని కలిగించాలి. సమాలోచనా సమయమిది. మతవాద సంఫీుయులు దేశంలోని విద్యా, సామాజిక, సాంస్కృతిక రంగాలను ఆక్రమించి బహుళత్వ ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకికభావాలకు, రాజ్యాంగస్ఫూర్తికి తూట్లుపొడిచి సామాజిక ఉద్యమకారులను, తమ భావజాలాలతో ఏకీభవించనివారిని చంపుతున్న నేటి అరాచక పాలనలో కూడా భౌతికవాదులు, ప్రగతిశీలురు సంఘటితమవ్వకపోతే భావితరాలు మన్నించవు. ప్రజాపక్షీయుల ఐకమత్యంతో మతఛాందసులకు ఓటమి తప్పదు. ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి
సెల్‌: 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img