డా.కె.నారాయణ
గ్రామాలకు తరలివెళ్లి, ప్రజలను కలుసుకొని సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సీపీఐ జాతీయసమితి దేశవ్యాప్తంగా సీపీఐ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చింది. దేశవ్యాపితంగా సీపీిఐ నాయకులు, కార్యకర్తలు ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నుంచి మే 15 వరకు విస్తృతంగా పర్యటించారు. ఏప్రిల్, మేమాసాలలో ఎండలు మండిపోతున్నా లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు చాలా ఓపిగ్గా తిరిగారు. ఎండ కాలం పొలం పనులు వుండవు కనుక ప్రజలను వారి ఇండ్ల వద్దే కలవ డానికి అవకాశం కలిగింది. దాదాపు అన్ని రాష్ట్రాలలో సీపీఐ శ్రేణులు కదిలాయి. తమ తమ స్థాయిలో 5నుంచి 500మంది వరకు కార్యకర్తలు ఇంటింటికి, షాపు షాపుకి పార్టీ ముద్రించిన కరపత్రాలను విస్తృతంగా పంపిణీచేస్తూ, ప్రజలతో మాట్లాడుతూ అక్కడ నెలకొన్న స్థానిక సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ పనిచేశాయి. దేశ వ్యాప్తంగా నెలకొన్న వివిధ సమస్యలను వివరిస్తూ సాగిన ఈ రాజకీయ ప్రచార యాత్రలకు మంచి స్పందన వచ్చింది. ఈ ప్రచార యాత్రలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, నాయకులను ప్రజలు సాదరంగా ఆహ్వానించి ఆ దళంతో పాటు అడుగులో అడుగులేస్తూ భుజంభుజం కలుపుతూ తిరిగారు. తాము ఎదుర్కొంటున్నసమస్యలు వివరించారు.
ఇదంతా ఒక ఎత్తు. ఇప్పడే వుంది అసలు పండుగ. ప్రజల మధ్య కలివిడిగా తిరగడం, మాట్లాడటం, సమస్యలు తెలుసుకోవడం, నూతన ఔత్సాహితులను కలవడంతో ప్రచార యాత్ర అంతా సక్సస్ అయిందనే భావనతో భుజాలు ఎగురేసుకుంటూ ‘పుంగనూరు జవాను రానూ వచ్చాడు. పోనూ పోయాడు’ (ఈ సామెతకు అనుగుణంగా వివిధ ప్రాంతాలలో వివిధ కథలు వున్నాయి) అన్న చందంగా వుంటే ఫలితం ఏమిటి అనేది మన ముందున్న ప్రశ్న. కళ కళ కోసం కాదు, ఉద్యమాలు ఉద్యమం కోసం కాదు, ధర్నాలు ధర్నాలు కోసం కాదు, ఆందోళనలు ఆందోళన కోసం కాదు అని మనందరం గుర్తించాలి. ఒక అంశంపై ఆందోళన జరుగుతుంటే అందులో చురుకుగా పాల్గొంటున్న కొత్త వ్యక్తులను గుర్తించాలి. వారితో వ్యక్తిగత పరిచయాలు పెంచుకోవాలి. వాళ్ళ అలవాట్లు, అభిరుచులు పరిశీలించాలి. ‘ఎత్తిన జెండా దించకోయ్ అంటూ కొత్తవారు కనీకనపడగానే కత్తులు దూసుకుపోయినా’ అనే చందాన మాట్లాడకూడదు. తొలుత వారిని మనం విశ్వాసంలోకి తీసు కోవాలి. మనల్ని వాళ్ళు విశ్వాసంలోకి తీసుకునే రీతిలో మన ప్రవర్తన ఉండాలి.
ఒక ఉద్యమం జరిగితే అందులో ఆ ఉద్యమ లక్ష్యాన్ని చేరుకున్నామా అనేది మనకు మనంగా బేరీజు వేసుకోవాలి. అలా అని మన ముందుకు వచ్చిన సమస్యలన్నీ అప్పటికప్పుడు పరిష్కారం కావు. అందులో తాత్కాలిక పరిష్కారం చూపగలిగేవి, దీర్ఘకాలిక పరిష్కారం చూపగలిగేవి ఉంటాయి. ఈ నేపథ్యంలోంచి మనం ఆలోచించి ఆ రకమైన పరిష్కార మార్గాలను మనమే బేరీజు వేసుకుని ముందుకెళ్లాలి.
ఉద్యమాల నేపథ్యంలో మనం కీలకంగా గుర్తించాల్సిన అంశాలు:
- మనం చేపడుతున్న ఉద్యమంలో పాత వారిని ఎంత మందిని ఉత్సాహపరచగలిగాం అనేది చూసుకోవాలి.
- నూతనంగా ఎంత మంది కొత్తవారిని మనవైపు ఆకర్షించగలిగాం అనేది కూడా చాలా ముఖ్యం.
- ఉద్యమం ప్రభావం ఎంతవరకు ఉందో క్షుణ్ణంగా పరిశీలించగలగాలి.
ఈ ఉద్యమంలో ఎంత మందిని ఆకర్షించగలిగామో సమీక్షించాలి. ఎవర్ని ఆకర్షించలేకపోయామని, కార్యకర్తలను ఉత్సాహ పరచలేకపోయామని మనవరకు మనం కల్తీ లేకుండా వున్నామని తేలితే అది ఉద్యమం అవుతుందా ఆలోచించాలి. మనకు మనం ఉద్యమం చేశాం అని మనకు మనంగా టిక్ మార్కు వేసుకుని సంతృప్తిపడితే అది మైలురాయిగానే వుంటుంది. (మైలురాయి కదలదు).
మనం నిర్వహించే సమీక్షలో మన కార్యకర్తలను ఉత్తేజపరిచామని నూతన యువకుల్ని ఆకర్షించామని తేలితే వాళ్ళను సమీకరించాలి. వారిలో రాజకీయ పరిజ్ఞానం పెంచే విధంగా చిన్నవో, పెద్దవో సమా వేశాలు నిర్వహించాలి. వారికి రాజకీయ పాఠశాలలను నిర్వహించాలి. సమీక్షలో సమస్యలు ఏవీ మన దృష్టికి రాలేదని తేలితే మేమంతా పరిశుభ్రంగా వున్నామని సంతృప్తి పడడానికి ప్రయత్నిస్తే ఇక మనల్ని బాగుచేసేవాళ్ళు ఎవరూ ఉండరు.
సమస్య మన దృష్టికి వచ్చినప్పుడు స్థానికంగా పరిష్కరించగలిగితే దాని కొరకు పట్టుదలతో కృషి చేయాలి. మండల స్థాయి, జిల్లా స్థాయిలో పరిష్కరించగలిగేవయితే ఆ సమస్యల్ని క్రోడీకిరించి అంశాల వారిగా వినతి పత్రాలు తయారు చేసుకుని బాధితులను ఎంత మందిని వీలైతే అంతమందిని సమీకరించి ప్రదర్శనగా అధికారుల వద్దకు తీసుకెళ్ళాలి. వినతి పత్రాలు సమర్పించాలి. దఫ దఫాలుగా మళ్ళీ అధికారులని కలసి ఏ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఏ సమస్య పరిష్కారం కాలేదు తెలుసుకోవాలి. బాధితులకు తెలపాలి. మనం అధికారుల ముందు పెట్టిన సమస్యల్లో కొన్ని పరిష్కారం అవుతాయి. కొన్ని సమస్యలు అధికారులు చేయిగల్గివుండి చేయకపోతే ఆ అధికారులను నిలదీయాలి. మనం ఎంపిక చేసుకున్న సమస్యలను పట్టుదలతో వెంటాడితే తప్ప పరిష్కారం కావు. అది చేయగలిగితే ఉద్యమకారులకు ఆత్మవిశ్వాసం, బాధితులకు ఉత్సాహం, పార్టీపై విశ్వాసం కలుగుతాయి. ఇవన్నీ కలిస్తేనే మనం చేస్తున్న ఉద్యమ స్వరూపం మరింత విస్తృతం అవుతుంది.
మనం నిర్వహించిన జాతాల ద్వారా ఎంత మందిని పార్టీలోకి, వివిధ ప్రజా సంఘాలలోకి ఆకర్షించామో అనేది కూడా చూడాలి. ఎలాంటి ఫలితాలు సాధించామో అనేది ఒక సంవత్సర కాలం సమీక్షించుకోవాలి. సానుకూల వైఖరి వచ్చినట్లైతే పార్టీ సజీవంగా వున్నట్టు. ఫలితాలు రానిచోట నిర్జీవంగా వున్నట్టు. కాబట్టి మన పార్టీ నిర్జీవంగా వుండాలా? సజీవంగా వుండాలా ఆయా శాఖలే తేల్చుకోవాలి.
వ్యాస రచయిత సిపిఐ జాతీయ కార్యదర్శి