Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

గ్రామీణవ్యవస్థ పటిష్ఠతే మేలు

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951 జనాభా లెక్కల ప్రకారం, గ్రామాల్లో 82.7శాతం ప్రజలున్నారు. వీరు తమ జీవన భృతిని తమ నివాసప్రాంతాల్లో సంపాదించుకునేవారు. ఇప్పుడు గ్రామాల్లో 69.1శాతం జనాభా ఉన్నారు. వీరి సంఖ్య మరింత తగ్గడానికి దోహదంచేసే విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. గ్రామీణప్రాంతాల జనాభా అత్యంత వేగంగా పట్టణాలు, నగరాలకు చేరుతున్నారు. ఫలితంగా నగరప్రాంతాల్లో మురికివాడలు అత్యధికంగా ఏర్పడుతున్నాయి. పనులులేని కార్మికులు సుదూర ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్నారు. ఇలా ఎలా జరుగుతోంది? దీనివల్ల ప్రయోజనమా? నష్టమా అనేది విస్తృతంగా చర్చించవలసిన సమయం. అంతేకాదు అత్యవసరం. గ్రామీణ ఆర్థికవ్యవస్థ తరిగిపోతోంది. జీడీపీ వ్యవసాయ వాటా స్వాతంత్య్రం వచ్చేనాటికి దాదాపు 6.5శాతం కాగా, నేడది 23శాతం మధ్య ఉందని అంచనా. ఇది ఆందోళనకరమైన థోరణి. పట్టణాలు, నగరాల్లో పల్లెల్లో కంటే కాలుష్యం చాలా ఎక్కువ. నీటి వాడకం చాలా ఎక్కువ. మురికికాల్వలు, వాడల్లో నివాసాలు అపరిమితమైన రోగాలను కలిగిస్తున్నాయి. పల్లెల్లో పనులు, ఉద్యోగాలు లేక పట్టణాలు, నగరాలు, ఇతర దేశాల బాటపడుతున్నారు. పాలనా విధానాలతోపాటు వ్యవసాయరంగం కుదేలై పోయింది. ధనిక రైతులు పట్టణాల్లో నివసిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు నష్టాలతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుకున్న యువత వ్యవసాయంపై మక్కువ చూపడం లేదు. తల్లి దండ్రులూ తమ పిల్లలు బాగా చదువుకొని, పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆశిస్తున్నారు. చదివిన వారందరికీ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు నిరుద్యోగ భారతమైందని అనేక సర్వేలు చెప్పినా పాలకులు అంగీకరించరు. మానవ చర్యల వల్ల ప్రకృతి విధ్వంసం, పర్యా వరణ కాలుష్యం, భూతాపం భరించలేని స్థాయికివెళ్లి మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న వేళ ప్రజలు, సామాజిక అధ్యయన వేత్తలు, పాలకులు ఆలోచించవలసిన అవసరం ఉంది. భూమండలంలో జీవరాశి అంతమయ్యే కాలం ఎంతో దూరంలేదని శాస్త్రవేత్తల హెచ్చరిక చేస్తున్నా పాలనా విధానాలు పెద్దగా మారలేదు. వ్యవసాయరంగంలో మహిళలు గణనీయంగా తగ్గిపోతున్నారు. పెద్ద వయసు వాళ్లే గ్రామాల్లో ఉంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గ్రామాల్లో సేవలరంగం, బ్యాంకులు, ఇతర సంస్థల్లో పనిచేసే అవకాశాలను పెంచి యువతను అటువైపు మళ్లించినట్లయితే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం తగ్గుతుంది. రైతులకు వ్యవసాయంలో యంత్ర పరికరాలు, పంట నిల్వకు గిడ్డంగుల నిర్మాణం, మిల్లుల సౌకర్యాలు కల్పిస్తే రైతులు తమ ఇళ్ల వద్ద నుండే ఉత్పత్తులను విక్రయించే అవకాశం కలిగితే దళారుల దందా చాలా వరకు తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాలకు విరివిగా రవాణా, వైద్య చికిత్సలు, బ్యాంకులు ఏర్పాటుచేస్తే గ్రామీణ నిరుద్యోగం తగ్గుతుంది. ప్రతి జిల్లాకు స్థానిక ఉత్పత్తులను వినియోగించే చిన్న, పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వీరికి బ్యాంకులు రుణసౌకర్యం కలిగించాలి. ఇలా నగరాల్లో కిక్కిరిసిన జనాభాను తగ్గించడానికి గ్రామాలను చిన్న పట్టణాలుగా తయారు చేయగలిగితే నగరాల్లో ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. పచ్చదనం పెరగడానికి అవకాశం గ్రామాల్లో సాంకేతిక విద్యా సౌకర్యాలు పెంచాలి. గ్రామాలకు ఏమాత్రం ప్రాధాన్యంలేని, విధ్వంసకర అభివృద్ధి వైపు పాలక విధానాలుంటున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో తరచూ సంక్షోభాలు చోటు చేసుకోవడానకి కారణాలేమిటని పాలకులు, మేథావులు, ఆర్థిక ప్రణాళికా రచనలు చేసేవారు ఆలోచించాలి. నగరాలు మరింత విస్తరించడం, భారీ పరిశ్రమలు ఏర్పాటు మూలంగా అడవుల నరికివేత మితిమీరిపోతోంది. ఫలితంగా క్రూర జంతువులు గ్రామాల వేపువస్తూ ప్రజలను భయ భ్రాంతులను చేస్తున్నాయి. వ్యవసాయం ఆధునికీకరణ పేరుతో భూములను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టి రైతులను మరింత దారిద్య్రంలోకి నెట్టడానికే నేటి కేంద్ర పాలకుల ఆలోచనలు ఉంటున్నాయి. వ్యవసాయం భారం కావడం వల్ల, అప్పులు తీర్చలేక రైతులు ప్రతిఏటా వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే పాలకులు రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాలతో కాలం గడుపుతున్నారు. చదువుకున్న యువకులు గ్రామాలు వదలి పట్టణాలు, నగరాలు చేరి మంచి ఉద్యోగాలు లభించక చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు, లేదా తాత్కాలిక ఉద్యోగాలుచేస్తూ గడుపుతున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగరాల్లో ఉండే విద్య, వైద్యం వసతులు కల్పించి వ్యవసాయరంగాన్ని పటిష్టంచేసి గ్రామస్థాయిలో పాలనావ్యవస్థను నెలకొల్పగలిగితే సమాజస్వరూపమే మారిపోయి పేదరికం దాదాపు నిర్మూలన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బడాపెట్టుబడిదారుల, కార్పొరేట్లను అపార ధనవంతులుగా మారిస్తే గౌతమ్‌ అదానీ లాంటి వాళ్లు దేశాన్ని లూటీ చేస్తారు. స్థానికంగా ఆహార పంటలకు, వాణిజ్య పంటలకు ప్రోత్సాహంఇచ్చి, ధాన్యానికి, వాణిజ్య ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలుచేసి ఎగుమతిచేస్తే అధిక ఫలితం పొందవచ్చు. లేదా రైతులు నష్టపోకుండా ఎగుమతి సౌకర్యాలు ఏర్పాటుచేసి రైతు ఆదాయాన్ని పెంచవచ్చు కదా. అప్పుడు రైతులు, రైతు కూలీలు, దిగువ తరగతి ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఆశించరు కదా! ఈ పరిస్థితిమారి పరిస్థితులు మెరుగుపడాలంటే గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృధ్ధి పరచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచాలి. టి.వి.సుబ్బయ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img