Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

గ్రామీణ ఉపాధికి మంగళమేనా?

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(నరెగా) 2005 ఆగస్టు 25న ఆమోదం పొందింది. ఆ చట్టాన్ని 2006, ఫిబ్రవరి నుంచి 200 జిల్లాలలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. 2007లో మరో 170 జిల్లాలలో దానిని అమలు చేయడం ప్రారంభించారు. 2008 ఏప్రిల్‌లో నరెగాను పూర్తిగా పట్టణ జనాభా కలిగిన జిల్లాల్లో తప్పించి దేశంలోని అన్ని జిల్లాలలో అమలుచేయడం ప్రారంభమైంది. మొదట్లో ఆ పథకాన్ని యూపీఏలోని నయా ఉదారవాద లాబీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ, ప్రభుత్వం మనుగడ వామపక్షాల మద్దతుమీద ఆధారపడి ఉంది కాబట్టి, వామపక్షాలు గట్టిగా పట్టుపట్టడంతో ప్రభుత్వానికి ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టక తప్పలేదు. కూలీల కడుపునింపే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి గ్రామీణహామీ పథకంపై కేంద్రం కక్ష సాధింపుకు దిగింది. 2023-24 బడ్జెట్‌లో ఈ పథకానికి అత్యంత తక్కువగా రూ.60వేల కోట్ల నిధులను విదిల్చింది. గడిచిన ఐదేండ్లలో ఇదే అత్యల్పం. దేశంలో అర్హులైన వారికి చట్టబద్ధంగా 100 రోజులపాటు పని కల్పించాలంటే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.2.72 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని పీపుల్స్‌ యాక్షన్‌ ఫర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ(పీఏఈజీ), ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చా నాయకులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలే దాదాపుగా రూ.25వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఇది పోను వచ్చే సంవత్సరానికి నికరంగా అందుబాటులో ఉండే నిధులు కేవలం రూ.35వేల కోట్లు మాత్రమే. ఇవి మొదటి క్వార్టర్‌కే సరిపోవని అంచనా. అవసరమైన నిధుల్లో 22శాతం నిధులను మాత్రమే కేంద్రం కేటాయించడం గమనార్హం. మొదటి నుంచీ అమలులో ఈ పథకాన్ని చిన్నచూపు చూస్తూ వచ్చారు. ఒక ఏడాది కాలంలో కేవలం 100రోజుల పని కల్పించడానికి మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. అది కూడా కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే కల్పిస్తామన్నారు. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఆ పథకం ప్రజలకు ఒక ఆర్థిక హక్కును కల్పించింది. ఉపాధి కల్పించడాన్ని ప్రభుత్వం నిరాకరించడం కుదరదు.
ఒక నిర్ణీత కాలంలోపు గనుక ఉపాధిని కల్పించకపోతే ఆ ఉపాధి కోరుకున్న వ్యక్తికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని రోజు రోజుకీ నీరుగారుస్తున్న వైనం చూస్తుంటే, ఈ పథకం మనుగడే ప్రశ్నార్థకం అనిపిస్తున్నది. భారత ప్రభుత్వం చేపడుతున్న అతిపెద్ద ప్రతిష్టాత్మక పథకంగా ఎంజిఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పేరు పొందింది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 613 జిల్లాలలోని 6349 బ్లాక్‌లు/మండలాల్లోని 2.38 లక్షల గ్రామ పంచాయితీలలో అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 28.49కోట్ల మంది కూలీల వద్ద 13.19 కోట్ల జాబ్‌ కార్డులున్నాయి. ఈ పథకం కింద ఉపాధి పొందుతున్న వారిలో 19.18శాతం మంది ఎస్సీలు, 14.96శాతం మంది ఎస్టీలు ఉన్నారు. 2013-14కాలంలో ఈ పథకం క్రింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 46 వ్యక్తి-పనిదినాలు, ప్రతీ వ్యక్తికీ రోజుకు రూ.133 సగటు వేతనం వంతున చెల్లించారు. భారత ప్రభుత్వం పాత పథకాలను, కొత్త పథకాలను కలిపి గ్రామీణ ప్రజలకు అదనపు ఉద్యోగ భద్రతను కల్పిస్తుంది. దీని ద్వారా గ్రామాలలోని ప్రజలు శారీరకశ్రమతో కూడిన పనులద్వారా వారి సంపదల సుస్థిరతకు, ఆహార భద్రతను మెరుగు పరచుకుంటున్నారు. నిర్వహణ వైఫల్యాలు, ప్రణాళిక రూపకల్పన, వాటి అమలులోలోపాలు ఈ పథకంలో ప్రధాన లోపాలు. ఈ పథకాలన్నిటిలో ఇచ్చే ప్రతిఫలం ఆహారధాన్యాలతో కూడిన వేతనం. దీనికి మూడుదశాబ్దాల ముందు చేపట్టిన జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, ఉపాధి హామీ పథకం, పనికి ఆహారపథకం, జవహర గ్రామసమృద్ధి యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్‌ యోజన తదితర పథకాల ద్వారా ప్రభుత్వం చివరికి ఈ పథకానికి రూపకల్పన చేసింది.
యూపీఏ-2 హయాం నుంచి ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం మొదలైంది. చాలా సంవత్సరాల పాటు బడ్జెట్లలో ఈ పథకానికి కేటాయింపు రూ.60,000 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అంటే పెరిగే ధరలకు అనుగుణంగానైనా కేటాయింపులను పెంచలేదన్నమాట. పార్లమెంటులో పెంపుదల గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఉపాధి కోరిన ప్రతివారికీ ఈ పథకంలో పని కల్పించాలి గనుక బడ్జెట్‌లో ఎంత కేటాయించామనేది ప్రాధాన్యత లేని అంశమని, ఎంతమంది ఉపాధి కోరితే అంతమందికీ పనికల్పించేలా వాస్తవ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం సమాధానం చెప్తూ ఉండేది. దాటవేతధోరణి అనుసరిస్తూ ఉంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 100 పనిదినాలు కల్పించి, వారికి జీవనోపాధి భద్రత కల్పించడం ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం. ఉపాధి హామీ పథకాన్నే తొలినాళ్ళలో మోదీ నిర్ద్వందంగా వ్యతిరేకించారు. అయితే అధికారంలోకి వచ్చాక దానిని రద్దుచేసే సాహసం చేయలేదు. కానీ పథకానికి ప్రతి సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపులలో క్షీణత ఉంది. 2019-20లో ఆ పథకం కింద అయిన వాస్తవ ఖర్చు రూ.71,687 కోట్లు. కానీ 2020-21లో కేటాయించింది రూ.61,500 కోట్లు మాత్రమే. నిజానికి ఆ సంవత్సరంలో లాక్‌డౌన్‌ కారణంగా పట్టణాలలో ఉపాధి కోల్పోయి గ్రామాలబాట పట్టినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉపాధిహామీ పథకానికి డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన, ఆత్మనిర్భర్‌ భారత్‌, ఏక్‌భారత్‌ శ్రేష్ట్‌ భారత్‌ పథకాలు బేకార్‌ పథకాలైనవి. ప్రభుత్వం ఆ ఏడాది రూ.1,11,500 కోట్లు కేటాయించక తప్పలేదు. ఆ మరుసటి ఏడాది, అంటే 2021-22లో మళ్ళీ బడ్జెట్‌ కేటాయింపు కోతపెట్టి రూ.73,000 కోట్లకే పరిమితం చేశారు. ఇది ఆ ముందటి ఏడాదిచేసిన వాస్తవఖర్చు కన్నా రూ.38,500కోట్లు తక్కువ. అయితే నవంబరు25న ప్రభుత్వం మరో రూ.10,000 కోట్లను కేటాయిస్తామని ప్రకటించింది. కానీ ఇది ఏ మూలకూ చాలదు. నవంబరు 25 నాటికే కూలీలకు రూ.9,888 కోట్లు బకాయిపడిరది. ఇప్పుడు అదనంగా కేటాయించి నది ఆ బకాయిలకే సరిపోతుంది. మరి ఏడాది పొడవునా పథకాన్ని కొన సాగించడం ఏ విధంగా సాధ్యపడుతుంది. ఈసారి బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25శాతం క్షీణతఉంది. బడ్జెట్‌ కేటాయింపుల్లో గత సంవత్సరంతో పోలిస్తే 34 శాతం తగ్గింపు చేశారు. ఉపాధి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోవాలి కానీ అందుకు విరుద్దంగా ప్రతి సంవత్సరం కేటాయింపు లలో తగ్గింపు జరుగుతున్నది. పథకాన్ని నీరుకార్చడం, బడ్జెట్‌ కేటాయింపులలో ఉపాధిహామీ పథకం కేవలం 1.3శాతం, రానున్న రోజులల్లో క్రమేణా రద్దు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత పేదలకు, అసంఘటిత రంగంలో ఉన్న రైతు కూలీలకు కడుపు నింపేదిగా ఉన్న పథకాన్ని పద్ధతి ప్రకారం దూరంచేసి పేదప్రజలపై తమ దాష్టికాన్ని చాటుతున్నది.
డాక్టర్‌ ముచ్చుకోట సురేష్‌బాబు
ప్రజాసైన్స్‌ వేదిక రాష్ట్ర అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img