Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

చంద్రయాన్‌ 3 గొప్ప మోదీదేనట…!

జి.ఓబులేశు

ఆగస్టు 23 భారతదేశ చరిత్రలో మరో నూతన ఆవిష్కరణ జరిగింది. చంద్రయాన్‌3 విజయ వంతంగా చంద్రునిపై ఎలాంటి ఆటంకం లేకుండా దిగింది. ఇంతవరకు ఏ దేశం అడుగిడని దక్షిణధృవ ప్రాంతంపై అడుగిడటం భారతదేశం సాధించిన ప్రత్యేక విజయం. 140 కోట్లమంది భారతీయుల ఆనందానికి అవధులు లేవు. ఇంతటి గొప్ప ఆవిష్కరణనను విజయ వంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల, ఇంజినీర్ల, సమాచార, సాంకేతిక నిపుణులు, హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ సిబ్బంది, బిఎస్‌ఎన్‌ఎల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థల నిరంతర శ్రమ, త్యాగం, దీక్షా దక్షతలు అన్నీ కమలనాధుల ప్రచారం యావ ముందు బలాదూర్‌ అయినాయి. అంతరిక్ష పరిశోధనతో సహా వివిధ శాస్త్ర సాంకేతిక రంగాలలో గత 7దశాబ్దాలలో సాధించలేని విజయాలను ఈ 9 ఏళ్లలో సాధించగలిగాము. దీనికంతటికీ కారణం మోదీ అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం, ఆయనకున్న దీర్ఘదృష్టి ఆయన తీసుకున్న వ్యక్తిగత శ్రద్ధ అని సత్యకుమార్‌ లాంటివారు మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ వ్యాసాలు ఇస్తున్నారు. ‘‘కాదేదీ కవితకు అనర్హం. ప్రతిదీ కవితామయమేనోయ్‌’’ కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల అని శ్రీశ్రీ చెప్పిన మాటలు బీజేపీ పరివారానికి చక్కగా అతుకుతాయి. 2019లో చంద్రయాన్‌2 కూలిపోయినప్పటి నుండి నిన్నటివరకూ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఇతరరంగాల నిపుణులు 4సంవత్సరాలు నిస్వార్థంగా అహో రాత్రులు కష్టపడి పనిచేసారు. హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు 17నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా, సకాలంలో విక్రమ్‌ లాంచర్‌కు కావాల్సిన విడిభాగాలను కడుపులు కాల్చుకుంటూ తయారుచేసి ఇచ్చారు. ఇస్రోకు నిధుల కోత విధించారు. మరి మోదీ ప్రోత్సాహం, సహకారం ఏంటో? దక్షిణాఫ్రికా దేశాలలో 4రోజుల పర్యటన ముగించుకొని అక్కడ నుంచి ఎకాఎకిన కర్నాటక ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్లకుండా ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించి శాస్త్రవేత్తల వీపులు నిమరటమే సహకారం, ప్రోత్సాహం అంటే ఏమనుకోవాలి. ఈ విజయంలో, ప్రయోగంలో విభిన్న మతాలకు చెందిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లు ఉన్నారు. మతాతీత రాజ్యాంగం అమలు చేస్తామని ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన ‘‘పెద్దమనుషులు’’ విక్రమ్‌ లాండర్‌ అడుగుపెట్టిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేయటం రాజ్యాంగ ఉల్లంఘన, ఇతర మతస్థులను చులకన చేయటంకాదా? చంద్రయాన్‌2 కూలిన ప్రాంతానికి ‘తిరంగ’ అని పేరుపెట్టడంలో కమలనాధుల కురచబుద్ధులు ఇట్లే అర్థమవుతాయి. 52 సంవత్సరాలపాటు జాతీయజెండాను ‘తిరంగ’ను గౌరవించని, గుర్తించని సంఫ్‌ుపరివార్‌ తానులో ముక్కే మోదీ. అందుకే విఫలమైన చోటును తిరంగ, విజయం సాధించిన చోటును శివశక్తి అని నామకరణం చేయడం. పుక్కిట పురాణాల్లో చంద్రశేఖరుడి నెత్తిన ఉన్న చంద్రరేఖ చల్లనిదేవుడని తాపములు తీర్చు చందమామ అని జాబిల్లి అని అనుకొనే మనకు భూమి నుండి ఊడిపడిన ఒక శకలం అని శాస్త్రీయ పరిశోధన రుజువుచేసింది. దేశంలోని ప్రభుత్వరంగం నేటి ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోయినా అవసరమైన మేరకు నిధులు సమకూర్చకపోయినా దేశప్రజలు, దేశ ప్రతిష్ఠను పెంచడానికి ఈ 70 సంవత్సరాల కాలంలో ఎంతో శ్రమించారు. 17నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా హెవీ ఇంజినీరింగ్‌ సిబ్బంది విడిభాగాలను సకాలంలో తయారుచేసి ఇవ్వడం, బిఎస్‌ఎన్‌ఎల్‌ను గొంతు నులిమి ఉన్న అరకొర ప్రాణంతో కమ్యూనికేషన్‌ వ్యవస్థను సమకూర్చడం దేనికి సంకేతం? మోదీ ప్రభుత్వం స్పేస్‌ టెక్నాలజీని, అంతరిక్ష పరిశోధనా కేంద్రాలను కొంత ప్రైవేటీకరిస్తున్న వాస్తవాన్ని కప్పిపుచ్చి శాస్త్రవేత్తల, ఇంజినీర్ల విజయాన్ని తమఖాతాలో వేసుకోవటానికి కమలనాధులు ఆరాటపడుతున్నారు. కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన ఆశా, అంగన్‌వాడి, ఉద్యోగులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పిలిచి వారి జీతభత్యాల విషయంలో ఎలా అయితే అన్యాయం చేశారో అలానే చంద్రయాన్‌ విజయ వంతానికి కృషి చేసిన వారికి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వరంగ పరిశ్రమలో బడ్జెట్‌ కేటా యింపులు ఇవ్వక, ఉద్యోగులను అవస్థలకు గురిచేసి కూడా తగుదునమ్మా అంటు వారి కృషిని, విజయాన్ని కమల నాధుల ఖాతాలో వేసుకోవటాన్ని జాణతనం అనుకోక ఏమను కోవాలి. ప్రతిష్టాత్మకమైన, నాణ్యమైన ఉత్పత్తు లతో దేశ ప్రతిష్టను పెంచుతున్న ప్రజల అవసరాలు తీర్చుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు, అవసరా లకు నిధులు సమకూర్చుతూ లాభాపేక్ష లేకుండా దేశసేవకు అంకితమైన ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఎండబెట్టి ప్రైవేటు వ్యక్తులకు ద్వారాలు తెరవడం వల్ల ఎంత నష్టపోయామో కొవిడ్‌ సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల వాలకం, ప్రభుత్వ ఆస్పత్రుల సేవలు చూచిన తర్వాతనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధిరాలేదు. ప్రజలను మత విశ్వాసాల్లో ముంచి తేల్చడానికి వికృత చేష్టలకు, మత ప్రచారాలకు పూనుకుంటున్నారు. చంద్రయాన్‌2 ప్రయోగించిన ఇస్రో చైర్మన్‌ పేరు శివన్‌, ప్రస్తుత చైర్మన్‌ పేరు సోమనాథ్‌ గనుక శివభక్తుడైన మోదీవీరిని చూచి పరవశించిపోయారని పిచ్చిరాతలు రాస్తున్నారు. ఎవ్వరం ఇంతవరకు చేరుకోని చంద్రుడి దక్షిణధృవానికి మన చంద్రయాన్‌3 విక్రమ్‌ లాండర్‌ చేరుకోవటం శివనామాలవల్ల, భక్తి ప్రపత్తుల వల్లకాదని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల వల్లనే అనే యాదార్థాన్ని ఇప్పటికైనా మూఢభక్తులు గుర్తించితే మంచిది. నెహ్రూ డిఆర్‌డీఓ స్థాపన, ఇందిరాగాంధీ ఇస్రో ఏర్పాటు లేకుండానే మోదీ ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎలా ముందుకు పోతున్నదో మోదీ భజనపరులు శెలవిస్తే బాగుంటుంది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img