Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

చంద్రుడిపై నివాసాలు..!

రావా చందమామ వినరావా మా కథ, వింటె మనసు వుంటె చేరనీవా నీ దరి మామా చందమామ, నువు వూ అంటే క్యూ కట్టమా మామా చందమామ. అబ్బో ఏంటిబావ ఏకంగా చంద్రమండలానికి నిచ్చెన వేస్తున్నావు, ఏంటా కథ నాక్కూడా కొంచెం చెప్పవయ్యా. చెప్పేదేమీ లేదయ్యా. నువు బట్టలు సర్దుకొని రడీగా ఉండు. ఏంటయ్యా అంతఅర్జెంటా అంతె. మరి మనది ప్రజాప్రభుత్వం పేరిట చెలామణి అవుతున్న పెట్టుబడిదారీ ప్రభుత్వం. నిన్ను నన్ను పక్కకు తోసేసి ఆదాని లాంటివారు ముందెళ్లి ఆక్రమించుకుని మన లాంటి వారికి అమ్మకాలుచేస్తారు. సరెలేవయ్యా అసలు చంద్రయాన్‌`3 ద్వారా మన శాస్త్రజ్ఞులు సాధించిన విజయం అసామాన్యమైనది. రెండుసార్లు విఫలమైనా మూడోసారి సాధించిన ఈ విజయం ద్వారా ప్రపంచాన్ని నివ్వెరపోయేట్లు చేసి మన దేశానికి ఘనమైన ఖ్యాతి సాధించింది. నిజమె యిప్పటికె అక్కడ నీరుందని రుజువు చేసింది. ఇప్పుడు చంద్రునిపైన ఆగస్టు 23న లాండ్‌ అవుతుంది. ప్రపంచంలో ఏ దేశమూ చేయలేనిపని మన శాస్త్రవేత్తలు సాధించడంతో దేశ మంతా సంబరాలు చేసుకుంటోంది. మనకంటె ముందు చైనా, రష్యా, అమెరికా ప్రయత్నించినా ఈ ఘనకార్యం సాధించలేదు. నిజంగా ఈరోజు మన శాస్త్రవేత్తల కృషివల్ల మన దేశ ప్రగతి ప్రపంచ పటంలో స్థానం సంపాదించుకుంది. నిజమె అసలు అభివృద్ధి అనేది శాస్త్రవేత్తల వలనె జరుగుతుంది. ఆకులు కట్టుకుని, కనబడిన పుట్టకు, చెట్టుకు మొక్కిననాటినుండి యింతవిజయం సాధించేదశకు చేరిన మానవప్రగతి సామాన్యమైందికాదు. అది సరె బావ యింత విజయానికి కారకుడైన శాస్త్రవేత్త విజయంకోసం తిరుమల వెళ్లి మొక్కడం చూస్తె యింకా మనిషి పరాధీనుడేనా అనిపిస్తోంది. ఎంత సైన్సు అభివృద్ధిచెందినా అందుకుకారకుడైన శాస్త్రవేత్త తాను నిమిత్త మాత్రుడనని, అంతా దైవ సంకల్పమని భావించడంలో ఔచిత్యం నాకు అవగతం కావడంలేదు. ఇందులో అర్థం కానిదే ముంది. ఇంకా ఈ విశ్వంలో తనకుతెలియనిది చాలాఉంది అని తెలుసుకొనే ప్రయత్నానికి కనిపించనిశక్తి సహాయం కావాలను కుంటున్నాడు.
ఈ ప్రకృతిలో మనిషి పుట్టుకకు ముందె భూమి, ఆకాశం, అడవులు అన్నీ ఏర్పడి ఉన్నాయి. వాటిని మనకు కనిపించని దైవం ఏర్పాటు చేశాడని ఈనాటికి నమ్మే వారే ఎక్కువ. శాస్త్రవేత్తలు అవన్నీ పరిణామ క్రమంలో ఏర్పడినవని తెలిసినా ఎందుకైనా మంచిది మనకు కావలసింది విజయం. దానికోసం అదృశ్య శక్తికి మొక్కడం తప్పులేదని మొక్కుతున్నారని అనుకుంటాను. అది సరె విజయం చేకూరిన తరువాత ఆ క్రెడిట్‌ భగవంతుని ఖాతాలో వేయడం నా మనసు అంగీకరించడం లేదు. సర్వ శక్తులు ఉపయోగించి నిద్రాహారాలు లేకుండ కష్టపడి ఫలితంకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి దేవుడి దయవల్ల విజయం సాధించామనడం బాధగా ఉంది. ఇందులో నువు బాధపడాల్సిందే ముంది. అంత తేలికగా మాట్లాడకు. దేశ అధ్యక్షుడు, దేశ ప్రధాని దగ్గర నుండి ప్రతి ప్రజానాయకుడు తిరుమల వెళ్లి హుండీలో కానుకలు చెల్లించి గుడిచుట్టు తిరుగుతుంటె సామాన్యుడు అంతటి గొప్పవారె వెళ్లి మొక్కితే తాను వెళ్లకపోవడం తప్పుగా భావించి అప్పుచేసి తిరుమల వెడుతున్నాడు. అనుకోకుండా పరోక్షంగా వారి వల్ల ప్రజల్లో దైవారాధన పెరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడ వెడితె తెల్లవారేసరికి వార్తాపత్రికలలో వారి ఫొటోలు రావడంతో తెలిసో తెలియకో నాయకులు, న్యాయమూర్తులు దైవారాధన వల్ల అన్యాపదేశంగా ప్రోత్సహించినట్లవుతోంది. ఇందు కలడందులేడన్న ప్రహ్లాదుడు దగ్గర నుండి ప్రతి అణువణువునా భగవంతుడున్నాడని ప్రస్తుత ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నా దైవారాధన ఇంటికి పరిమితం చేయకపోవడంతో పరోక్షంగా ప్రజల్లో పెంచిన వారవుతున్నారు. దాంతో ఎంతో ట్రాఫిక్‌ ఉన్న రోడ్లపై కూడ గుడులు వెలిసి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అసలు నమ్మకం సైన్సుకు బద్దవిరోధి. ఆ నమ్మకాలు, మూఢ నమ్మకాలుగా మారితె సాధించిన ప్రగతి నిర్వీర్యమై పోతుంది. ఎప్పటికైనా చంద్రునిపై నివాసం సాధ్యపడవచ్చు.
సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img