Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

చమురు ఉత్పత్తి కోత`ఆర్థిక భారం

అంజన్‌ రాయ్‌

ముడిచమురు ఉత్పత్తిలో కోత విధించాలని సౌదీ అరేబియా అకస్మికంగా నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తలెత్తింది. ఈ చర్య ఆర్థిక రంగానికి ఎంతమాత్రం ఉపయోగకరం కాదు. ఆర్థికరంగంపై భారం పడటం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌదీ అరేబియా నిర్ణయంతో ఒపెక్‌ దేశాలతోపాటు ఇతర సభ్యదేశాలు కూడా ముడిచమురు ఉత్పత్తిలో కోత విధించనున్నట్లు ప్రకటించాయి. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. రష్యా, కువైట్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇరాక్‌, అల్జీరియా, ఒమన్‌ దేశాలు కూడా చమురు ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి. మే నెల నుండి ఈ కోత అమలులోకి రానున్నది. బహుశ ఈ సంవత్సరం చివరివరకు ఈ కోత కొనసాగవచ్చునని చెబుతున్నారు. అంటే ఎక్కువకాలం చమురు ఉత్పత్తిపై కోత కొనసాగడం చమురు మార్కెట్‌లో ప్రకంపనలు రేపుతున్నది. చమురు దిగుమతి చేసుకునే దేశాలు ఆర్థికభారాన్ని మోయవలసి ఉంటుంది. కొవిడ్‌19 కాలంలోనూ చమురుకోత వల్ల ప్రపంచ ఆర్థికరంగం కుదేలైన విషయం తెలిసిందే. ఈనిర్ణయం అమెరికాను మరింతగా ఆందోళన కలుగుచేస్తున్నది. తాత్కాలికంగా రోజుకు 2 మిలియన్‌ బేరళ్ల ముడిచమురు ఉత్పత్తి తగ్గుతుందని అంచనావేశారు. ప్రపంచవ్యాప్త డిమాండ్‌లో రెండు శాతానికి ఇదిసమానమవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకేసారి భారీగా ముడిచమురు ఉత్పత్తికోసం అంతర్జాతీయ మార్కెట్‌లలో చమురుధరలు అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ వార్త తెలిసినవెంటనే ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లలో 5.5శాతం ముడిచమురు ధరలు పెరిగిపోయాయి. చమురు ఉత్పత్తి కోత అకస్మిక నిర్ణయంపై చిన్నచిన్న ఉత్పత్తిదారులు ఏమాత్రం సంతోషంగాలేరని వదంతులు వ్యాపించాయి. అమెరికా ప్రోత్సాహంతో చిన్నచిన్న ఉత్పత్తిదారులు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే అవకాశంకూడా లేకపోలేదు. ఈ సంవత్సరం చివరినాటికి బ్యారెల్‌ ముడిచమురు ధర 100 డాలర్లకు ఎగబాకవచ్చునని చమురు మార్కెట్‌ నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన నేపధ్యంలో ఇప్పుడిప్పుడే ప్రపంచం చేరుకుంటున్న దశలో పొందిన ఫలితాలన్నీ తుడిచిపెట్టుకు పోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. వడ్డీరేట్లు తాజాగా పెరగనున్నాయి. ఫలితంగా ప్రపంచార్థికమాంద్యంలో సుస్థిరత దెబ్బతింటుంది. ఇదొక పెద్దకుదుపు అవుతుంది. ఇటీవల సెంట్రల్‌బ్యాంకులు అప్పుడప్పుడు వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ఆర్థికమార్కెట్‌లలో ఒడిదుడుకులను నిలువరించి ఆర్థికవ్యవస్థను నిలకడగా ఉంచే ప్రయత్నమే ఇది. ఈ స్థితిలో చమురుధరలు పెరుగుదల తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. ఈప్రభావం అన్ని రకాల వస్తువులపైన ఉంటుంది. సెంట్రల్‌ బ్యాంకులు ఈ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని తగినచర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ముడిచమురు ఉత్పత్తిని తగ్గించడంవల్ల ఆర్థికరంగంపై దాని ప్రభావం తిరుగులేని కష్టాలను కలిగిస్తుంది. ప్రపంచ భౌగోళిక రాజకీయాలపైన కూడా దీని ప్రభావం గణనీయంగా ఉంది. చమురు ఉత్పత్తుల కోతను అమెరికా తీవ్రంగా విమర్శించింది. అధిక ధరలు రష్యా ఉక్రెయిన్‌లపై తన యుద్ధాన్ని కొనసాగించడానికి దోహదం చేస్తాయని అమెరికా చమురు కోతలను విమర్శించింది. గత సంవత్సరం అక్టోబరులో కూడా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో కొత విధించింది. అప్పుడుకూడా అమెరికా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అంతేకాదు..ఈ నిర్ణయం పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని కూడా అమెరికా సౌదీని బెదిరించింది. సౌదీకి వ్యూహాత్మకమైన ఆయుధాలు, ఇతర పరికరాల విక్రయాన్ని గణనీయంగా తగ్గించివేస్తామని అమెరికా బెదిరించింది. గతంలో వలే కాకుండా ప్రస్తుతం సౌదీ అరేబియా అమెరికా బెదిరింపులను పరిగణలోకి తీసుకోవడంలేదు. ఇటీవల సౌదీకి చైనాతో పెరిగిన సాన్నిహిత్యం మరింత ధైర్యం చేకూర్చింది. ఇటీవల ఇరాన్‌సౌదీల మధ్య చైనా సఖ్యత కూర్చింది. ఇది ఈ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులను మార్చి వేస్తుందని పరిశీలకులు అంచనావేశారు. అయితే ఇరాన్‌ ఇప్పటికే అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుందన్న సందేహాలు సౌదీకి ఉన్నాయి. అణ్వాయుధాలను తమను లక్ష్యంగా చేసుకుని ఉత్పత్తి చేస్తున్నారేమోనన్న సందేహంకూడా సౌదీకి ఉన్నాయి. అయినప్పటికీ చైనా చొరవ తీసుకొని రెండుదేశాల మధ్య సయోధ్యను కుదర్చడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పగలిగేరు. రష్యా, చైనాలు ఒపెక్‌ ఇతర చమురు ఉత్పత్తిదేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి సహకరించడం ద్వారా సౌదీ అమెరికాను ఎదురించే శక్తి స్థోమతలను సంతరించుకుంది. చమురు ఉత్పత్తికోత నిర్ణయం తీసుకున్న తర్వాత రష్యా చమురు అమ్మకం ద్వారా ఆదాయాన్ని పెంచుకోగలిగింది. సౌదీ చమురు పరిశ్రమ రోజుకు 5లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించింది. రష్యా కూడా అదేస్థాయిలో ఉత్పత్తిని తగ్గిస్తానని తెలియజేసింది. పశ్చిమదేశాలు రష్యాపై విధించిన ఆంక్షలను తేలికగా అధిగమించి ఆదాయాన్ని పెంచుకోగలిగింది. భారతదేశానికి మాత్రం తక్కువధరతో ముడిచమురును విక్రయించడానికి రష్యా ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. అయితే తక్కువ ధరకు కొనుగోలుచేసే ముడిచమురు వినియోగదారులకు ఉపయోగపడకుండా అంబానీ, అదానీలాంటి వారి కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా బీజేపీ నాయకత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రజాప్రయోజనాలకు కాకుండా లక్షలాది కోట్లు కుబేరుల చెంతకే చేరుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img