Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

చరిత్రలో జాతీయోద్యమం ఉజ్వల ఘట్టం

ఈడ్పుగంటి నాగేశ్వరరావు

వంద సంవత్సరాలకు పైగా భారత జాతీయోద్యమం సాగిన పరిణామం ఆధునిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం. 20వ శతాబ్దంలో సమస్త ప్రజానీకాన్ని కదిలించిన మహత్తరమైన జాతీయ విముక్తి ఉద్యమాలు ప్రపంచం యావత్తు జరిగాయి. భారతదేశం, మరొక పెద్దదేశం చైనా, దక్షిణాఫ్రికా, అల్జీరియా, ఈజిప్టు, వియత్నాం మరో 100కి పైగా దేశాల్లో వలస పాలన నుండి విముక్తి కోసం గొప్ప చారిత్రాత్మకమైన పోరాటాలు సాగాయి. బహుశ మానవాళి చరిత్రలో ఇంతటి ప్రపంచ వ్యాపిత ఉద్యమాలు మరొకటి జరగలేదేమో. భారత జాతీయ ఉద్యమానికి ఉన్న విశిష్టతలు ఏమిటి? పరిస్థితులు ప్రత్యేకతలు ఏమిటి? అనే దానిపై పరిశోధకులు ఇంకా రాస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో మహత్మాగాంధీ, నెహ్రూ, వల్లభాయి పటేల్‌ వీరంతా జాతీయవాదులు. కొంతమందికి సోషలిస్టు భావాలు కూడా ఉన్నాయి. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, మౌలానా అబుల్‌ కలామ్‌ అజాద్‌వీరందరూ జాతీయోద్యమానికి ప్రధాన స్రవంతికి నాయకత్వం వహించారు. వీరితో పాటు అనేక పాయలుగా గదర్‌ ఉద్యమం, భగత్‌సింగ్‌, జాతీయ విప్లవకారులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఇంకా అనేకమంది జాతీయవాదులు కూడా ప్రజలను చైతన్యపరచడంలో, సంఘటిత పరచడంలో తమ పాత్ర నిర్వహించారు. చరిత్రకారులు చెప్పేదేమంటే భారతదేశంలో మహిళలను, రైతాంగాన్ని జాగృతపరచి వీధుల్లోకి తీసుకొచ్చి చైతన్యపరచినటువంటి ఒక ప్రధాన పాత్ర పోషించింది మహాత్మాగాంధీ. దళిత వర్గాల్లో ఒక చైతన్య స్పూర్తిని రగిలించింది అంబేద్కర్‌. వర్గ చైతన్యాన్ని, కార్మికోద్యమాలను, జమీందారీ వ్యతిరేక పోరాటాన్ని చేపట్టింది కమ్యూనిస్టులు. సోషలిస్టులు, ముఖ్యంగా ఆచార్య నరేంద్రదేవ్‌, రామ్‌మనోహర్‌ లోహియా, జయప్రకాష్‌ నారాయ్‌ణ్‌ వంటివారు. కమ్యూనిస్టు నాయకులు గిరిజన తండాల్లో, అడవుల్లో రైతాంగ పోరాటాలు నిర్వహించారు. ఎమ్‌.ఎన్‌.రాయ్‌, డాంగే, సింగారవేలు చెట్టియార్‌ మన ఆంధ్ర దేశంలో సుందరయ్య, రాజేశ్వరరావుల పాత్ర చిరస్మరణీయమైంది. అలాగే ఇద్దరు మహనీయులను మనం గుర్తు చేసుకోవాలి. తామ్రపత్ర గ్రహీతలు 1930లో గాంధీజీ ఉద్యమ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నవారు కంభంపాటి సత్యనారాయణ, మద్దుకూరి చంద్రశేఖరరావు. వీరు విశాలాంధ్ర విజ్ఞాన సమితి నిర్మాతలు. విశాలాంధ్ర కమ్యూనిస్టు పత్రికను నిర్వహించారు. మరో అంశం ‘ఐడియా ఆఫ్‌ ఇండియా’. భారతదేశం అనే భావన అంతకు పూర్వం ఒక విధంగా ఉండేది అది సాంస్కృతికంగా. కానీ ఐడియా ఆఫ్‌ ఇండియా జాతీయోద్యమంలో భాగంగా ముందుకొచ్చింది. మనం భారతీయులం.. హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్దులు, పారశీకులు తదితరజాతులున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ భాష లున్నాయి. ప్రాంతాలున్నాయి. చిన్నచిన్న సామ్రాజ్యాలు, సంస్థానాలు ఉన్నాయి. ఇదొక భారతదేశం. ఈ భావన ముందుకొచ్చి మనల్ని వలస పాలనలో, ఇనుప సంకెళ్లలో బంధిస్తున్నటువంటి ఈ వలస పాలన నుంచి విముక్తి చెందాలనే భావన నుండే ఐడియా ఆఫ్‌ ఇండియా అవిర్భవించింది. పలుభాషలు, సంస్కృతులు, మతాల వైవిధ్యంగల భారతదేశంలో ఏకాభిప్రాయంగా ముందుకొచ్చింది. భారత స్వాతంత్య్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 100కు పైగా దేశాల్లో విముక్తి ఉద్యమాలు జరిగాయి. కొన్ని దేశాల్లో మిలిటరీ పాలన వచ్చింది. మత రాజ్యాలు వచ్చాయి. భారతదేశం మాత్రం ఐక్యంగా నిలవగలిగింది. ఈ అంశాన్ని అందరూ పరిశీలిస్తున్నారు. భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజల ఓటు హక్కు కొనసాగుతోంది. ప్రజారంజక పాలనలో కొన్ని దశల్లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. జమిందారీ విధానం రద్దు, భూ సంస్కరణలు, ప్రభుత్వ రంగం వగైరా..వగైరా వచ్చాయి. ఇది మనదేశం సాధించిన ఒక ప్రగతి. ముఖ్యంగా వయోజనులకు ఓటుహక్కు అద్భుతమైనది, ప్రత్యేకమైనది. పశ్చిమ దేశాల్లో సైతం ఓటు హక్కు ఒక్కసారిగా పూర్తిగా రాలేదు. కొంతకాలం ఆర్థిక సంపద కలిగిన వారికి, కొంతకాలం మేధావులకు, కొంతకాలం పురుషులకు, చివరిలో స్త్రీలకు ఓటు హక్కు వచ్చింది. కానీ భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో ప్రతి ఒక్కరికీ వయోజనులు, పురుషులు, మహిళలు, మత భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు ప్రసాదించింది అంబేద్కర్‌ తదితరులు రూపొందించిన రాజ్యాంగం. ఇదొక విశిష్టమైన అంశం. రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉంది. స్వాతంత్య్రం వచ్చింది. కానీ సామాజిక న్యాయం సిద్ధించలేదని అంబేద్కర్‌ అన్నారు. ‘‘ఈ దేశం నాకొక పవిత్రమైన కర్తవ్యం కల్పించింది. నాకు చేతనైన మేర రాజ్యాంగాన్ని రూపొందించాను. రాజకీయ హక్కు కల్పించిన ఈ దేశం సామాజిక, ఆర్థిక హక్కు, సమాన హక్కు కల్పించనట్లయితే ఈ రాజ్యాంగానికి లక్ష్యం ఏమైనట్లు? రాజ్యాంగ రూపకల్పన చేసిన వారి లక్ష్యాలు, ఆశయాలు ఉంటాయా?’’ ఇదొక ప్రమాదకరమైన పరిస్థితి అనేది అంబేద్కర్‌ హెచ్చరిక. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినప్పటికీ మౌలిక స్వభావాన్ని ఇంకా కోల్పోలేదు. దానికి చాలామంది దోహదపడ్డారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ తదితర అనేకమంది కృషి దీని వెనుక ఉంది. కానీ ప్రస్తుతం ప్రమాదరకమైన ధోరణి వచ్చింది. దీన్ని ఒక మతరాజ్యంగా రూపొందించు కోవాలన్న భావన అంతర్లీనంగా సాగి ఇప్పుడు పెల్లుబికి బైటకు వచ్చింది. ఒక మత రాజ్యంగా అంటే హిందువులు మెజారిటీగా ఉన్నారు కనుక హిందూ మత రాజ్యమా...ఇంకేదైనానా? హిందు, హింది, హిందూత్వ నినాదం ప్రచారంలో ఉన్నది. ఒకే భాష ప్రాధాన్యత సంతరించుకుంటే బహుభాషలు ఉన్న ఈ దేశ పరిస్థితి ఏమిటి? అన్నింటిలోనూ అది విద్యారంగమా, సాంస్కృతిక రంగమా, ప్రభుత్వ రంగమా అని కాదు అన్నింటిలోనూ.. జవాబుదారీతనం లేనటువంటి శక్తులు ప్రవేశిస్తున్నాయి. నరేంద్రమోదీని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన వెనక ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ని ఎవరు ఎన్నుకున్నారు? అదొక ప్రజాస్వామికసంస్థగా ప్రజలకు జవాబుదారీతనం కలిగిఉందా? రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఫ్‌ుకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వారికి కావలసిన భూమికను వారు ఏర్పరచుకుంటున్నారు. అంటే ఈ దేశంలో ఈరోజు జరుగుతున్నది ఒక జవాబు దారీతనం లేని ఒక విశాలమైన సంస్థ.. సెమి మిలిటరీ సంస్థ.. తన భావ జాలాన్ని మరొక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి పార్టీ ద్వారా అమలు పరచే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ఒక విఘాతమైనది. పాత సంక్షేమ రాజ్యానికి సంబంధించిన అన్నింటినీ కూలదోస్తున్నది. అందుకే చాలామంది మేధావులు.. కేవలం వామపక్ష మేధావులే కాదు.. ప్రజాస్వామ్య వాదులు.. లౌకిక వాదులు అందోళన చెందుతున్న అంశం ఏమంటే... ఈ విధానాలు కొనసాగితే ఈనాటి భారతదేశం ఇలా ఉంటుందా? మన దేశ భవిష్యత్తు ఏమిటి..? రాజ్యాంగంలో లౌకిక రాజ్య స్థాపనగా పేర్కొన్నాం, సామాజిక న్యాయాన్ని పేర్కొన్నాం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా పేర్కొన్నాం, ఇతర అనేక హక్కులను పేర్కొన్నాం. భిన్న అభిప్రాయాలు కలిగిన వారిని జైల్లో పెడుతున్నారు. పత్రికా స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారు. ఏ ఆహారాన్ని తినాలో నిర్దేశిస్తున్నారు. మరి ఈనాటి ప్రజాస్వామ్య భారతదేశం ఇలాగే ఉంటుందా? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామిక వాదులు, లౌకిక వాదులంతా ఐక్యంగా ఐడియా ఆఫ్‌ ఇండియాను కాపాడుకోవాలి. మానవ హక్కులను కాపాడు కోవాలి. ఇటువంటి మెరుగైనపరిస్థితికి పాటుపడాలిగానీ.. తిరోగమన పంథాలో ఇదే విధానం కొనసాగితే, పోరాటాల ద్వారా మనం సాధించుకున్నవి విఘాతం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పత్రికల ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇవాళ మీడియాపైన కంట్రోల్‌ పెరిగింది. ఒక పార్టీకి పెరిగింది. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియా భావాలను ప్రభావితం చేసే శక్తులు వచ్చాయి. ధనిక వర్గాలు కొనుగోలు చేసే ఎన్నికల బాండ్ల ధనంలో 75 శాతం ఒకే పార్టీకి వెళుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి వెళుతున్నాయి ఇవన్నీ ప్రమాదకరమైనఘంటికలు మోగిస్తున్నాయి. విశాలాంధ్ర వంటి పత్రికలు మరింతగా ప్రజలను చైతన్యపరచడం ద్వారా మన కర్తవ్యాలను నెరవేర్చగలవని ఆశిస్తున్నాను. వ్యాస రచయిత విశాలాంధ్ర పూర్వ సంపాదకులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img