Friday, June 9, 2023
Friday, June 9, 2023

చరిత్ర, తత్త్వశాస్త్రానికి శాస్త్రీయ దృక్పథమే గీటురాయి

డా॥ కత్తి పద్మారావు

భారతదేశంలో క్రీ.పూ.7వ శతాబ్దం నుండే తాత్విక, సాంస్కృతిక అధ్యయన ఉద్యమాలు విస్తృతంగా వచ్చాయి. ఇందులో మౌఖిక, లిఖిత ఉద్యమాలు పరస్పర సంబంధితాలుగా, వైరుధ్యాలుగా కొనసాగాయి. వైదిక ఉద్యమాలకు ప్రత్యామ్నాయ ఉద్యమాలుగా చార్వాక, బౌద్ధ, జైన, సాంఖ్య ఉద్యమాలు వచ్చాయి. వైదిక ఉద్యమంలో ఎందరో ఆర్య రుషులు పాల్గొన్నారు. వారిలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి వారు ముఖ్యులు. చార్వాక ఉద్యమంలో చార్వాకులు, లోకాయతలు, భౌతికవాదులు ఎందరో పాల్గొన్నారు. వైదికవాదులు ప్రకృతిని పూజిస్తే, చార్వాక వాదులు ప్రకృతిని జీవితానికి అన్వయిస్తూ విశ్లేషించారు. మానవుడు తనకీ ప్రకృతికీ, తనకీ సమాజానికీ ఉండే అంతఃస్సంబంధాన్ని వాస్తవజ్ఞానం నుండి అర్థం చేసుకోగలుగుతాడు. వాస్తవాలు, వాస్తవేతర అంశాల భావనల ఘర్షణ నుండి తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికవాదం పుట్టాయి. అందుకే భారతదేశంలో తాత్త్వికచర్చ జ్ఞానానికి దారితీసింది. భూమిలో నుండి నీటిని వేరు ద్వారా వృక్షానికి ఎలా అందిస్తుందో, తత్వశాస్త్రం కూడా మనిషికి కావల్సిన జ్ఞానాన్ని అందిస్తుంది. జ్ఞానానికి జిజ్ఞాస, విచక్షణ పునాది. హేతు దృక్పథం ఆయువు. భారతదేశ ప్రాచీనతత్త్వవేత్తల్లో మిక్కిలిప్రసిద్ధుడు కపిలుడు. అతని తాత్త్విక దృక్పథం అసమానమైనది. తనదంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న తత్త్వవేత్త ఆయన. కపిలుడు రూపొందించిన సాంఖ్య తత్త్వం ప్రకృతిని విశ్లేషించి మానవ జీవితానికి అన్వయిస్తుంది. కపిలుడు కార్యకారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇలా మహోన్నతమైన తాత్త్వికుల బోధనలను మన విద్యావ్యవస్థలోకి జొనిపి ముందుకు తీసుకువెళ్ళాల్సిన విద్యా ప్రణాళికలు భారత, రామాయణ, భాగవత కథల ద్వారా జ్ఞానాన్ని బోధించాలనుకోవడం అశాస్త్రీయమవుతుంది. ఈనాడు భారతదేశ పాఠ్య ప్రణాళికలో వస్తున్న మార్పులు ఆందోళన కల్గిస్తున్నాయి. చరిత్రలో సామాజిక సాంస్కృతిక అంశాలను జోడిరచి రచించిన ప్రామాణిక పాఠ్యగ్రంథ కర్తలు డి.డి.కోశాంబి, రొమిల్లా థాపర్‌, ఆర్‌.ఎస్‌.శర్మ, డా.బిపిన్‌ చంద్ర, సతీష్‌ చంద్ర, ఉపేంద్ర గుప్త, బి.ఎస్‌.ఎల్‌.హనుమంతరావు, కంభంపాటి సత్యనారాయణ వంటి రచయితల గ్రంథాలను త్రోసి రాజని నెట్టివేసి పుక్కిట పురాణాల్ని చరిత్రగా రూపొందించడం భారతదేశ ఔన్నత్యాన్ని తగ్గించడమే. భారతదేశం చారిత్రకంగా చాలా సంపన్నమైనది. చరిత్రలో ముఖ్యంగా పురావస్తు శాస్త్రజ్ఞులు పాతరాతి, కొత్తరాతి, కంచు, రాగి, ఇనుము యుగాలుగా విభజించారు. ఈ యుగాలన్నీ కూడా పునాదులు రూపొందించిన యుగాలే. దీనికి భారతదేశ మూలవాసులు ఈ యుగాల నిర్మాతలు. అయితే వారి చరిత్రను నెట్టివేయడం కోసం పౌరాణిక చరిత్రను ముందుకు తీసుకొచ్చారు. పౌరాణిక కథనా కథనాలు వేరు. చరిత్ర వేరు. పౌరాణిక కథల్ని కథలుగా తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక వాదాన్ని వాదంగా తెలుసుకోవచ్చు. అందుకని చరిత్రను విస్మరించరాదు. నిజానికి ప్రతి ఉత్పత్తి పరికరానికి ఒక చరిత్ర ఉంది. కుండకు చాలా చరిత్రే ఉంది. సింధూ నాగరికతలో దాని ప్రాధాన్యత బలంగా ఉంది. ఆహారసేకరణ దశ, ఆహారఉత్పత్తి దశ ఇవి రెండూ చరిత్రలో చాలా ముఖ్యమైనవి. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు సమన్వయము అయితే గానీ సామాజిక, భౌతిక జీవననిర్మాణ చరిత్ర ఏర్పడదు. ఆ చరిత్రలో మానవ పరిణామ దశలు దాగుంటాయి. పురావస్తు శాస్త్రం దాగుంటుంది. సామాజిక శాస్త్రం దాగుంటుంది. ఇవి మొత్తం చారిత్రక సంపదను మనం తోసి పుచ్చరాదు. ఇకపోతే భాషలు ఏర్పడిరది ప్రకృతి అనుకరణ నుండే. బహు భాషలుగా ఉన్నప్పటికీ కూడా అర్థం ఒక్కటే. తక్కువ భాషతో ఎక్కువ భావాన్ని దళితులు, గిరిజనులు వ్యక్తీకరించారు. దళితులు, గిరిజనులు భాషల్లో క్రియాపదాలు ఎక్కువగా ఉంటాయి. భాష శ్రమ నుండి పుట్టింది. శ్రమలేని జాతులు భాషను ఊహా కల్పనలతో నింపేశారు.
భాష ప్రాధాన్యత ఒక మనిషి నుంచి మరొక మనిషికీ, ఒక సమూహం నుండి మరొక సమూహానికి తమ భావాలను తెలియజేయడం. దీన్ని దళితులు, గిరిజనులు అతి సూక్ష్మంగా సాధించారు. మూలవాసుల్ని నిర్లక్ష్యం చేయడం కోసం చరిత్రను, భాషా శాస్త్రాన్ని, తత్త్వ శాస్త్రాన్ని సాంప్రదాయక పాఠ్య గ్రంథ నిర్ణేతలు నిర్లక్ష్యం చేస్తున్నారు. దానివల్ల విద్యార్థులకు భారతదేశ మూలాలు తెలియకుండాపోతాయి. భారత దేశ మూలాలను అర్థం చేసుకున్న వారు డా.బి.ఆర్‌ అంబేద్కర్‌. ఇవ్వాళ భారతదేశం వెనుకబడి ఉండడానికి కారణం వర్ణ వ్యవస్థ. అయితే భారతదేశంలో ఉన్న మేధావుల్లో మనుస్మృతి మూలాలను చదివినవారు అంబేద్కర్‌ ఒక్కరే. ముఖ్యంగా జాతీయోద్యమంలో ఉన్న గాంధీó, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, బాల గంగాధర్‌ తిలక్‌ వీరందరూ మనుస్మృతిని అనుసరించిన వారు. మనుస్మృతి భావాలను వ్యతిరేకించిన వారు సాహు మహారాజ్‌, మహాత్మా ఫూలే, డా.బి.ఆర్‌. అంబేద్కర్‌, లోహియా, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, అయోధి దాస్‌ వంటి వారు. ఎదిరించిన వారిలో కూడా మూలాన్ని చదివిన వారు అంబేద్కరే. మనుస్మృతి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మొదలైన వేదాల సారం.
అందుకే మనుస్మృతి మొత్తంలో వేదాల స్తుతే ఎక్కువగా ఉంటుందనీ డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ అన్నారు. అయితే ఆధునిక భారతీయ విద్యార్థులు, మొత్తం భారతీయులు రెండు వాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు వాదాలూ తెలుసుకొని భారతదేశ పురోభివృద్ధికి తమ జీవన శైలిని మలచుకోవలసిన అవసరం ఉంది. అందుకే భారత రాజ్యాంగ స్పూర్తి అన్ని తరగతుల ప్రజలకు అవసరం. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఒకే ఓటు, ఒకే రాజ్యాంగవిలువ కూడా ఉన్నాయి. అలాగే తమ చరిత్రను తాము తెలుసుకునే హక్కు, తమ హక్కుల్ని తాము తెలుసుకునే అవకాశం వల్ల వారి దేశీయత మరింత బలపడుతుంది. అంబేద్కర్‌ గొప్ప జాతీయవాదిగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ సమతుల్యతను రాజ్యాంగంలో పొందు పరిచారు. పరిపాలనలో గానీ, విద్యార్జన పద్ధతిలో గానీ అన్ని జాతులవారికీ, అన్ని భాషల వారికీ సమానావకాశాలు ఉండాలి. భారతదేశంలో ప్రధానంగా మాట్లాడుతున్న హిందీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, ఒరియా భాషలలోనూ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ, ఓండ్రము భాషలలోనూ అనంత సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక సంపద ఉంది. ఈ విషయాన్ని అంబేద్కర్‌, నెహ్రూ, ఇద్దరూ సప్రమాణంగా చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జీవిస్తున్న తెగలను ఒకసారి పరిశీలిస్తే అంధ, బగత, భిల్లు, చెంచు, గదబ, గోండు, గవుదు, హిల్‌రెడ్డి, జాతపు, కమ్మర, కట్టు నాయకన్‌, కొలాం, కొండ దొర, కొండ కాపు, కొండరెడ్డి, ఖోండు, కోటియా, కోయ, కులియా, మాలీ, మన్నె దొర, ముఖదొర, నాయక్‌, పర్ధాన్‌, రెడ్డి దొర, రోణ ` రేన, సవరలు, సుగాలీ, తోటి, వాల్మీకి, యానాది, ఎరుకలుగా వర్గీకరణ జరిగింది. ఇలా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ మొత్తంగా ఎన్నో మౌఖిక, లిఖిత. భాషా జాతుల సంస్కృతులు ఉన్నాయి. అందుకే లౌకిక ప్రజాస్వామ్య దృక్పథంతో భారతదేశ చారిత్రక, తాత్త్విక అధ్యయనం ఈనాటి విద్యా సంపన్నత అవుతుంది. భారత రాజ్యాంగ స్ఫూర్తితో చరిత్రను, తత్త్వ శాస్త్రాన్ని, సాంకేతిక జ్ఞానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసే వైపు పాలకవర్గం నడవాల్సిన చారిత్రక సందర్భమిది. అప్పుడే మేధావులు, విద్యార్థులు, సమాజం నూత్న పథంలో గమిస్తుంది.
వ్యాస రచయిత ఫోన్‌ : 9849741695

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img