Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

చెప్పాలని ఉంది కానీ…

రా బావ ఏంటి చాలా హుషారుగా పాట పాడుతూ వస్తున్నావు ఏంటి కథ. పార్వతి చాలా రోజులకు వచ్చాడు మీ అన్నయ్య మరో కాఫీ పట్టుకురా. ఇపుడు చెప్పు ఏంటి కథ. ఆ ఏముంది రోజూ ఉండే కథలేగానీ గుండె విప్పి చెప్పాలని ఉంది. భలే చెప్పాలని ఉంది..గుండె విప్పాలని ఉంది అని సినిమా పాటుంది అది విని వస్తున్నావా.. అదేం లేదు. అటువంటి పాట ఒకటుందని నాకు తెలియదుగాని మనసులోని మాట నలుగురితో చెప్పాలనిఉంది కాని భయపడుతున్నా. భయమెందుకు నీ దగ్గర భయంలేదు. కాని సెంటరులో వందమందిఉన్న చోటె చెప్పాలని ఉంది. కాని భయంతో చెప్పలేకపోతున్నా. అంత భయపడే విషయం ఏముంది? ఏం లేదు అందరికీ తెలిసినది ప్రతి పక్షనాయకులు పబ్లిక్‌గానే చెబుతున్నారు. మరి వారిని ఏం చేయడంలేదుగ.. మరి అవే విషయాలైతే నీకుమాత్రం భయమెందుకు. అదుగో అక్కడేఉంది విషయం అధికారంలో ఉన్నవారిని విమర్శిస్తే పార్టీ నాయకుల్ని ఏమీ చేయరు. అదే విమర్శ మనంచేస్తే అధికార పార్టీ వారు ఇంటికొచ్చి తన్ని వెడతారు. ఆ మాట నిజమే. అయితే నువ్వు కూడా ఒక పార్టీలో చేరి అప్పుడు విమర్శించు.
నాకు తెలియక ఆడుగుతాను వాక్‌స్వాతంత్య్రం మనిషికా.. పార్టీకా.. అన్ని పార్టీలలో కల్సినాయకులు వందల సంఖ్యలోనే ఉంటారు. సభ్యులు లక్షో, లక్షన్నరో ఉంటారు. మరి 140కోట్ల జనాభాకు భావ వ్యక్తీకరణ లేకుండా పోయిందికద. మరి మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశం అంటారు ఆ సంగతేంటి? అది నిజమే బావ ఆంగ్లేయులు నేర్పిన విడగొట్టు పాలించు అనేది మన నాయకులు బాగా వంటపట్టించు కున్నారుగాని ఆనాడు గురజాడ మతములన్నియు మాసిపోవును జ్ఞాన మొక్కటి నిలిచిపోవును అన్నమాటగాని, అంబేద్కరు చెప్పిన కులమతా లను కాక దేశాన్ని, సమాజాన్ని ప్రేమించమని చెప్పినమాట పక్కనపెట్టి వ్యవహరిస్తున్నారు. వాటికి విరుద్ధంగా అప్రజాస్వామికంగా పాలిస్తున్నారు. నిజమే బావ నీ ఆందోళన నాకు అర్థమైంది ఎంతమంది పత్రికలలో వ్యాసాలు రాసినా, ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో, రాజ్యసభలో గగ్గోలు పెట్టినా ఆ మోది, షా ద్వయానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. వారికి కావల్సింది అధికారం గానీ మీరు నమ్మిన హిందుత్వం అందరి నెత్తిన రుద్ది యితర మతస్థుల్ని ఇబ్బంది పెట్టడం. నీకు అంత ఆవేదనగా ఉంటే ఏదో ఒక పార్టీలోచేరి నీ మనసు శాంతించేదాకా పాలకులను విమర్శించు. అంతేనంటావా ఈ సమాజంలో ఒక వ్యక్తిగా నా అభిప్రాయాలు చెప్పలేనంటావా. నీవే అంటున్నావుగా విమర్శిస్తే జైలు ప్రాప్తిరస్తు అని. అదే నా బాధ వ్యక్తి స్వేచ్ఛ నశించిపోయింది. వ్యక్తుల బదులు పార్టీలువచ్చాయి. ఆ పార్టీలలో అధినాయకునికి ఉన్న స్వేచ్ఛ ఇతరులకు ఉండదు. వ్యక్తిత్వంపోయి మూకస్వామ్యమే ప్రజాస్వామ్యంగా మిగిలింది. లక్షమంది సభ్యులున్న పార్టీలో అధినాయకునిమాట మిగతా వారందరూ పాటించి తీరవలసిందే. అదే నా బాధ బావ. ప్రజాస్వామ్యంలో వ్యక్తి మిగలడం లేదు. నాయకుని తత్వమే అందరూ ఆచరించాలి. ఆ రకంగా పరతత్వంలోకి బలవంతాన నెట్టబడుతున్నాడు. ప్రజలు ఎన్ను కునేది వారి అవసరాలు తీర్చడానికేగానీ ప్రజల ఆస్తులు ఇష్టమొచ్చినట్లు పార్టీ ఆఫీసులకు, బడాపారిశ్రామిక వేత్తలకు, స్వాములకు దారాదత్తం చేయమని కాదు.
మనమున్నా, పోయినా భూమి శాశ్వతం. తరతరాలుగా మనిషి మనుగడకు భూమి అవసరం. అటువంటి భూముల్ని అన్యాక్రాంతం చేయడం అదికారంలో ఉన్నవాళ్లు ఆక్రమించుకోవడానికి కాదుగ వారిని ఎన్నుకునేది. నీ ఆవేదన నాకు అర్థమైంది బావ. నీ వన్నట్లు ప్రజాక్షేత్రంలో విమర్శించడానికి వీలులేక కదా విద్యాధికులైన యువకులు అడవులకేగి భార్యా పిల్లల్ని అనాధలు చేస్తున్నారు. అయినా పెరిగిన సాంకేతికతను పాలకులు వినియోగించుకొని అడవుల్లో ఎక్కడ దాక్కున్నా వారిని చంపడానికి వినియోగిస్తున్నారు. ఓట్లు ద్వారా సాధించలేనిది ప్రపంచంలో ఏ దేశంలోనైనా విప్లవం ద్వారానే ప్రభుత్వాలు మారాయి. వారు నమ్మిన సిద్ధాంతానికి వేలమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారి పిల్లలు అనాధలుగా మారుతున్నారు. నిజమే ప్రధాని పదవులలో ఉండి ఇందిరాగాంధి కూడా ఒకసారి విప్లవం వర్థిల్లాలి అన్నది. అందరూ ఆ పదం వాడుతూనే ఉన్నారు. విప్లవ రచయితలు, సాంస్కృతిక విప్లవం అంటున్నారు. మరొకరు మరో దానికి వాడుతున్నారు. రష్యాలో జరిగిన విప్లవం నాటి నుండి ఆ పదానికి విలువ పెరిగింది. అది సరే అసలు ఈ రోజే మనసువిప్పి చెప్పాలని ఎందుకనిపించింది. ఏంలేదు. నాల్గు సెంట్లు కొనుక్కొని ఇల్లు కట్టాగద బావ. అవును అయితే ఏమైంది. నాకేం కాలేదు. మా ఇంటి పక్కన రెండు ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంది. ఒక నాయకుడు తెల్లారేసరికి చుట్టూ కంచెవేసి తాళం వేసి వెళ్లాడు. ఈ రోజు కనబడితే అడిగాను. నీకెందుకురా. గత ప్రభుత్వంలో దాని పక్కనే అప్పటి శాసనసభ్యుడు ఆక్రమిస్తే అడగనోడివి ఇప్పుడెందుకు నోరు పెగిలింది. నోరుమూసుకో నోరువిప్పావంటే నువ్వు మిగలవని భయపెట్టి వెళ్లాడు. ప్రాణంపోతే పోయింది సెంటరులో లెనిన్‌లా స్టూల్‌పై నిలబడి చెప్పాలని ఉంది. కాని భయంగా ఉంది. ఇలా నాయకులందరూ అధికారం ఉపయెగించుకుని ప్రజల ఆస్తిని కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కద. నిజమే రాజకీయ పార్టీలలో యిమడలేవు. వ్యక్తిగా నీ మాట కనీసం పత్రికలలో కూడా రాదు వచ్చినా ఆ తరువాత నువు రాయగలవని వార్నింగు అందుకున్నారు. అందుకే కదా మేధావులు ఇంటికే పరిమితమయ్యారు. అయితే చూస్తూ నోరుమూసుకుని ఊరుకోవాలంటావా. అంతకంటే ఏం చేయగలం చెప్పు. ప్రజల్లో చైతన్యం తేవాలి. అందుకు సిద్ధపడితే తిరగాలి. మధ్య తరగతి మందహాసం అని మనసులోలేని నవ్వు పెదాలపై పులుముకాని నవ్వుతూ తలవంచుకుని వెల్లడం తప్ప మనం ఏం చేయలేం. ఎపుడో కడుపుమండిన రోజున వర్గపోరాటం వస్తుంది. అప్పటివరకు మనం చూస్తూ ఉండవలసిందే. గుండెలోని వ్యథ గొంతులో ఆపుకోవాలి. అప్పటివరకు చెప్పాలని వున్నా చెప్పలేం గుండె విప్పలేం.
సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img