Friday, March 31, 2023
Friday, March 31, 2023

చైనా జనాభా ఎందుకు తగ్గింది?

చైనా ప్రభుత్వం కఠినంగా అమలు చేసిన ‘వన్‌ చైల్డ్‌ పాలసీ(ఏక సంతాన విధానం)’ తో 1980ల నుంచి జనాభా పెరుగుదల రేటు తగ్గుతోంది. ఒకరి కన్న ఎక్కువ సంతానాన్ని కన్న కుటుంబాలకు అధిక ఆర్థిక జరిమానాలు, ఇండ్ల నుంచి ఖాళీ చేయించాలనే కఠిన నిబంధనలు విధించారు. ఈ నిర్ణయాలతో చైనాలో కుటుంబ పరిమాణంతో పాటు యువ జనాభా తగ్గడం, వయోవృద్ధులు పెరగడం సమాంతరంగా జరుగుతున్నది. స్వచ్ఛంద సంస్థల విశ్లేషణల ప్రకారం చైనా యువత ఆలస్యంగా పెళ్లిళ్ళు చేసుకోవడం, తక్కువ పిల్లల్ని లేటు వయస్సులో కనడం ప్రారంభమైంది. 2013 – 2020 మధ్య కాలంలో నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతుల సంఖ్య 13.46 మిలియన్ల నుంచి 8.14 మిలియన్లకు పడిపోయింది. గత మూడు దశాబ్దాల్లో తొలిసారి సంతానం కలిగిన దంపతుల సగటు వయస్సు 24.1 నుంచి 27.5 ఏండ్లకు పెరిగింది. చైనా తొలి సారి మరణాల సంఖ్య కన్న జననాల తగ్గడం 2022లోనే జరిగింది. 2021 కన్న 2022లో జననాల సంఖ్య 10 శాతం పడిపోయినట్లు విశ్లేషిస్తున్నారు.
చైనా విధించిన ఏక సంతాన విధానంతో యువత సంఖ్య, జననాల రేటు తగ్గడం గమనించిన ప్రభుత్వం నేడు ఇద్దరు సంతాన విధానం ఆలస్యంగానైనా తీసుకురావడం ముదావహం. నేడు పెద్ద కుటుంబాలు కావాలంటూ చైనా ప్రభుత్వం దంపతులిద్దరికీ ప్రసూతి సెలవులను ఇవ్వడం, పన్ను రాయితీలు కల్పించడం, కుటుంబాలకు ఇతర సహాయాలు చేయడం, ఆసుపత్రి ఖర్చులు తగ్గించడం జరుగుతున్నది. చైనా పట్టణాల్లో పిల్లల పెంపకం ఖరీదైన వ్యవహారంగా మారడం (వైద్య ఆరోగ్య, విద్యా సంస్థల ఖర్చులు)తో అధిక సంతానానికి దంపతులు జంకుతున్నారు. ప్రపంచంలో 2వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో నేడు కరోనా మహావిపత్తు, శ్రామికుల జనాభా తగ్గడం, లాంటి కారణాలతో ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో కదలడం జరుగుతున్నది. దినదినం చైనాలో శ్రామిక లోకం పలుచ బడడం, వృద్ధాప్యంలోకి జారడం లాంటి కారణాలతో నేటి యువతపై పని ఒత్తిడి పెరుగుతోంది. చైనా జనాభాలో 5వ వంతు వయో వృద్ధులుగా మారడంతో ఆ దేశంపై భారం అధికంగా పడుతున్నది. 2035 నాటికి చైనా జనాభాలో 3వ వంతు(40 కోట్లు) జనాభా వయస్సు 60 ఏండ్లు దాటి ఉంటుందని అంచనా వేశారు. ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఇండియాలో యువ జనాభా అధికంగా ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య దేశానికి శాపంగా మారింది. పర్యావరణానికి, వాతావరణ ప్రతికూల మార్పులకు జనాభా పెరుగుదల ప్రతిబంధకంగా కూడా మారుతున్నది. చైనా జనాభా తగ్గడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలుసుకోవాలి. చైనాలో చవకగా దొరికే శ్రామిక శక్తి క్షీణించడంతో చైనా ఉత్పత్తులపై దాని ప్రభావం పడుతుందని, ప్రపంచాన్ని చుట్టేస్తున్న చవకైన చైనా తయారీ వస్తువుల ధరలు పెరుగుతాయని అంటున్నారు. చైనాలో శ్రామిక శక్తి, యువ జనాభా తగ్గడంతో నైపుణ్య యువత కొరత ఏర్పడి చాలా బహుళ జాతి సంస్థలు తమ కార్యాలయాలను వియత్నాం, మెక్సికో, భారత్‌ లాంటి ఇతర దేశాలకు తరలిస్తున్నారని వింటున్నాం. జనాభా పలుచబడితే ఆయా దేశాల్లో వినియోగదారులు, స్థిరాస్తుల క్రయవిక్రయాలు కూడా తగ్గుతాయని తద్వారా అభివృద్ధి కుంటుపడుతుందని అంచనా. చైనాలో ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏండ్లుగా నిర్ణయించటంతో వృద్ధుల జనాభా పెరుగుతూ దేశ వైద్య ఆరోగ్య రంగానికి అధిక సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఒక దేశ జనాభా అతిగా పెరిగినా, తగ్గినా ఆ దేశంపై మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలపై కూడా దాని దుష్ప్రభావం పడుతుంది. చైనా జనాభా తగ్గినా, భారత్‌ జనాభా పెరిగిన అందులో ఇమిడిన కష్టనష్టాలను ఆయా దేశాలు ఎదుర్కోక తప్పదు. యువ భారతానికి నిరుద్యోగ సమస్య, వృద్ధ చైనాకు యువత కొరత సమస్య వెంటాడుతూనే ఉంటాయి. దేశ జనాభాలో సమతుల్యత పాటించడం, యువశక్తిని నైపుణ్య నిధిగా మలుచుకోవడం, వయోవృద్ధుల సంక్షేమానికి గొడుగు పట్టడం నిరంతర ప్రక్రియగా సాగాలి. ప్రతి వ్యక్తి తాను ఎదుగుతూ దేశాభివృద్ధిలో భాగం కావడానికి కృషి చేస్తూ నిరుద్యోగ సమస్యల వలయంలోంచి బయట పడేందుకు ప్రాధాన్యత నివ్వాలి.
డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి, 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img