సాత్యకి చక్రవర్తి
చైనాతో సంబంధాలకు అనుకూలంగా తైవాన్‌తో తన దశాబ్దాల దౌత్య సంబంధాలకు హోండురాస్ ప్రభుత్వం తెరదించింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏకైక చైనాగా గుర్తిస్తూ, తైవాన్‌తో అన్ని దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు లాటిన్‌అమెరికా ఖండప్రాంతమైన హోండురాస్ ప్రభుత్వం ప్రకటించింది. హోండురస్ తీసుకున్న ఈ తాజానిర్ణయం, దశాబ్దాల తైవాన్ అనుకూల ఆధిపత్యం తర్వాత గత ఏడాది ప్రారంభంలోే ఎన్నికైన వామపక్ష పాలన విదేశాంగ విధానాన్ని సూచిస్తుంది. తైవాన్‌లో తిష్టవేసిన అమెరికా రాజకీయపార్టీలు హోండురస్ నిర్ణయంతో ఖంగు తిన్నాయి. అమెరికా వంటి పెట్టుబడీదారీ దేశాల జోక్యంతో తైవాన్ తన మిత్రదేశాలపై బెదిరింపు చర్యలకు పాల్పడుతూ వచ్చింది. గత రెండేళ్లుగా చైనాతో మరింతగా వైరుధ్యంగా ఉన్న తైవాన్, తమతో దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్న పదమూడు దేశాలలో కొన్నింటిపై హోండురస్ తీసుకున్న తాజా నిర్ణయం తీవ్రప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే హోండురాస్ తీసుకున్న తాజా విదేశాంగ విధానంలో కొంత అస్పష్టత ఉంది. తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగమని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది. తైవాన్`చైనాలమధ్య ఘర్షణ తీవ్రంగాఉన్న సమయంలో, హోండు రాస్ తీసుకున్న తాజా నిర్ణయం, అమెరికాకు గట్టి షాక్ అనే చెప్ప వచ్చు. 1949లో నెలకొన్న అంతర్యుద్ధంకాలంలో చైనా, తైవాన్ రెండుగా విడిపోయి నప్పటినుండి చైనా ‘‘ఒక చైనా’’ విధానానికి గుర్తింపు పొందేందుకు బిలియన్లు ఖర్చు చేసింది. చైనా తైవాన్‌ను తన ప్రావిన్స్‌లలో ఒకటిగానే గుర్తిస్తూ వచ్చింది. అయితే తైపేలో ఎన్నికైన ప్రభుత్వం మాత్రం దీనిని దీర్ఘ కాలంగా వివాదాస్పదం చేస్తూనే వచ్చింది. తాజాగా హోండురాస్ విదేశాంగ మంత్రి గత వారం చైనాకు వెళ్లడంతో తైవాన్‌తో హోండురాస్ సంబంధాల ముగింపుకు మార్గం సుగమమైంది. హోండురస్ అధ్యక్షుడు జియోమారా కాస్ట్రో తన ప్రభుత్వం బీజింగ్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. హోండురస్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే, హోండురస్‌తో తన సంబంధాలను మెరుగుపరచనున్నట్లు చైనాప్రకటించింది. చైనా, హోండు రస్‌లు తమ దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నట్లుగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ ట్వీట్ చేశారు. తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ మాట్లాడుతూ హోండురాస్‌లోని తమ రాయబార కార్యా లయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మెక్సికో అధ్యక్షుడు ఒబ్రడార్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా లాటిన్ అమెరికన్‌దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాల మెరుగుదలకు, సహకారానికి అనేక చర్యలు తీసుకున్నారు. హోండురాస్ ప్రభుత్వ తాజా నిర్ణయం లాటిన్ అమెరికన్ ప్రాంతాన్ని నిర్మించే ప్రక్రియను మాత్రమే బలోపేతం చేస్తుంది.