Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

జనజీవనంలో సీపీఐది చరిత్రాత్మక పాత్ర

డి. రాజా,
సీపీఐ ప్రధాన కార్యదర్శి

దేశ స్వాతంత్య పోరాటంలో, జనజీవనంలో సీపీఐ చరిత్రాత్మక పాత్ర నిర్వహించింది. ఇప్పుడు బీజేపీ ప్రజావ్యతిరేక పాలన, ఆశ్రిత పెట్టుబడి దారీ విధానంపై, ఫాసిస్టుశక్తుల నుంచి దేశ రక్షణకు సీపీఐ వీరోచితపోరాటం కొన సాగిస్తున్నది. 1925లో పార్టీ వ్యవస్థాపక ప్రథమ మహాసభకు ముందే మన కామ్రేడ్స్‌ కార్మికవర్గం సమస్యల పరిష్కారంకోసం, కార్మికులను సమీకరించి సంఘాలు ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర నిర్వహించారు. 1920లో ఏఐటియూసీని నెలకొల్పి కార్మిక ఉద్యమాలను నిర్వహించారు. ఏఐటియూసీలో స్వాతంత్య్ర పోరాటయోధులు లాలా లజపతిరాయ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, దేశబంధు చిత్త రంజన్‌దాస్‌, సుభాస్‌ చంద్రబోస్‌ లాంటివారు వివిధ పదవులు నిర్వహించారు. రష్యన్‌ విప్లవ నేపధ్యంలో కమ్యూనిస్టు భావజాలం బ్రిటీషు పాలకులను బెంబే లెత్తించింది. దీంతో సీపీఐ స్థాపనకు ముందునుంచే పనిచేస్తున్న మన ప్రముఖ కామ్రేడ్స్‌పైన బ్రిటీషు పాలకులు తీవ్ర దమనకాండకు పాల్పడ్డారు. కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభకాలంలోనే డాంగే, సింగారువేలు చెట్టియార్‌, ముజఫర్‌ అహమ్మద్‌, షౌకత్‌ ఉస్మాని తదితర నాయకులను అరెస్టు చేశారు. కాన్పూరు బోల్ష్‌విక్‌ కుట్రకేసును బనాయించారు. ఇది కమ్యూనిస్టు ఉద్యమంలో మైలురాయివంటి ఘటన. పేద, శ్రామిక ప్రజల విముక్తికోసం కమ్యూనిజం ఒక్కటే మార్గమని కాన్పూరు కుట్రకేసులో మన కామ్రేడ్స్‌ వాదించారు. ఈ కేసు తర్వాత కమ్యూనిస్టులను పూర్తిగా జైళ్లలో పెట్టడం, హింసించడం వల్ల మన కామ్రేడ్స్‌ మరింత బలోపేతమయ్యారు. 1925 డిసెంబరు 26న సీపీఐ పార్టీని స్థాపించారు. దేశవ్యాప్తంగా పని చేస్తున్న కమ్యూనిస్టులు ఈ చరిత్రాత్మక సభకు హాజరయ్యారు. పేదలకు, కార్మికులకు, కర్షకులకు, అణగారిన వర్గాలకు సీపీఐ అండదండ అయింది. ఆనాటినుంచి ప్రజల, దేశ అభివృద్ధికి సీపీఐ ఎనలేని కృషిచేసింది. ఎర్రజెండా సమున్నతంగా నిలిచి శ్రామికుల, రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతోంది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఉద్యమానికి, అజెండాకు విప్లవ స్పూర్తిని అందించింది. కమ్యూనిస్టుల పోరాటంలో వ్యవసాయ సంస్కరణలు, కార్మికులకు హక్కులు లభించాయి. ప్రభుత్వరంగ సంస్థలు, సోషలిస్టు సమాజ నిర్మాణ భావజాలం ముందుకు వచ్చింది. అనంతరం ఆలిండియా కిసాన్‌సభ (ఏఐకెఎస్‌), అఖల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) ఏర్పడ్డాయి. ప్రగతిశీల రచయితల సంఘం (పీడబ్ల్యుఏ) ఏర్పడి మేథావులకు, రచయితలకు నిలయమైంది. కళాకారుల కోసం ఇఫ్టా ఏర్పాటైంది. తెలుగనాట ప్రజానాట్యమండలి ఏర్పాటై కళాకారుల వేదికగా మారి సమాజంలో సాంస్కృతికంగా పెనుమార్పులకు దోహదంచేసింది. కాంగ్రెస్‌ సోషలిస్టుపార్టీ భాగస్వామ్యంతో జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాస్‌ చంద్రబోస్‌ల నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టమైంది.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా ప్రజాసమూహాల సమస్యలు పరిష్కారం కాలేదు. పేదరికం, అక్షరాస్యత, అసమానతలు, వ్యాధులు, కులాల అడ్డంకులు, సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటిపైన సీపీఐ పోరాడి గణనీయమైన విజయాలు సాధించింది. తెలంగాణలో రైతాంగ తిరుగుబాటు పోరాటం బెంగాల్‌లో తెభగా ఉద్యమం ఇంకా అనేక ఉద్యమాలు సీపీఐ ఆధ్వర్యంలో జరిగాయి. అనేక ప్రాంతాలలో రైతాంగ, భూ పోరాటాలు జరిగి విజయాలు సాధించాయి. దేశం నలు మూలల ప్రజల సమాజం అభ్యున్నతి కోసం సీపీఐ ఉవ్వెత్తున ఉద్యమాలు నిర్వహించింది. దేశంలో ప్రథమ ప్రతిపక్షపార్టీగా నిలవడమేకాక ఒక రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచిన పార్టీగా సీపీఐ పేరుపొందింది. వీరోచిత పోరాటాలు నడిపిన సీపీఐ ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో ప్రజల హృదయాలలో స్థానం పొందింది. ఈ ఎన్నికలలో నెహ్రూ కంటే సీపీఐ నాయకుడు రావి నారాయణరెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. స్వాతంత్య్ర పోరాటంలోనే గాక అనంతరం అనేక పదుల దేశద్రోహ కేసులు, దమనకాండ, అణచివేతలకు పాలకులు పాల్పడినప్పటికీ సీపీఐ నాయకత్వంలో జరిగిన కార్మిక వర్గ పోరాటాలు మరింత బలోపేతమయ్యాయి.
పార్లమెంటరీ ప్రజాసామ్యం పరిధిలోనే పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ లలో ప్రజలసమస్యలపై ఏ పార్టీ కంటే మిన్నగా కేంద్రీకరించి పనిచేసింది. చట్టసభలు నియమించిన వివిధ కమిటీలలో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పనిచేసింది. మతశక్తులకు వ్యతిరేకగా ప్రత్యేకించి పంజాబ్‌లో ఖలిస్థానీల తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత సామాజిక సంస్కరణలకోసం, కుల నిర్మూలనకోసం చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం పెంపుదల కోసం అవిశ్రాంతంగా కృషిచేసింది. మతతత్వం, ఆశ్రిత పెట్టుబడీదారీ విధానం పైన, రాజ్యాంగ పరిరక్షణకోసం తీవ్రంగా పోరాడుతోంది. ఘనమైన చరిత్ర కలిగిన సీపీఐకి సంకుచిత ఆలోచన, సాంకేతికపరమైన అంశాన్ని అనుసరించి ఎన్నికల కమిషన్‌ పార్టీకి జాతీయ హోదాను రద్దుచేసింది.
పార్టీ నిర్వహించిన వీరోచిత పోరాటాలే ప్రజల హృదయాలలో పార్టీని నిలిపాయికానీ ఈసీఐ సర్టిఫికెట్‌ కాదు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, సోషలిజంకోసం దేశవ్యాప్తంగా సీపీఐ ప్రజాపోరాటాలు నిర్వహిస్తూనే ఉంటుంది. పార్టీ నిర్వహించే ప్రజాపోరాటాలను ఎన్నికల కమిషన్‌ ఏమీ నిరోధించలేదు. ఎర్రజండా ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలను పార్టీ ముమ్మరం చేస్తుంది. పార్టీని, ప్రజాసంఘాలను మరింత బలోపేతం చేయడం మా ప్రాధమిక లక్ష్యం. దేశంలో ఇప్పుడు సెక్యులరిజం మౌలిక సూత్రాలపైన, సామాజిక న్యాయంపైన, ప్రజాసంక్షేమంపైన గతంలో ఏనాడూలేని స్థాయిలో దాడి జరుగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శక్తులనుండి రాజ్యాంగాన్ని, దేశప్రజలను రక్షించేందుకు ఉధృత పోరాటాలు నిర్వహిస్తాం.
ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు దేశాన్ని ప్రమాదకరమైన ఫాసిస్టు పంధావైపు నడిపిస్తున్నాయి. దేశంలో సుసంపన్నమైన వైవిధ్యాన్ని ధ్వంసం చేసేందుకు ఈ శక్తులు పూను కున్నాయి. స్వతహానే ఈ శక్తులు అప్రజాస్వామిక స్వభావాన్ని కలిగి ఉన్నాయి. విమర్శించేవారిని, అసమ్మతి తెలిపేవారిని దేశద్రోహులుగా ముద్రవేస్తున్నారు. ప్రత్యేకించి కమ్యూనిస్టులపై వీరు కేంద్రీకరించారు. కమ్యూనిజం ప్రమాదరకమైన సిద్ధాంతమని కొన్ని నెలలక్రితం ప్రధాన మంత్రి ముద్రవేశారు. వామపక్షాల నుండి మాత్రమే సిద్దాంతపరమైన సవాళ్లు ఎదురవుతాయని ప్రధానమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు బాగా అర్థంచేసుకున్నాయి. ప్రజానుకూల, సమసమాజం, సెక్యులరిజం, సామాజిక న్యాయంకోసం దేశం ముందు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించ గల సామర్ధ్యం కమ్యూనిస్టులకు ఉందని ఈ శక్తులకు తెలుసు. ఆర్‌ఎస్‌ఎస్‌ విచ్ఛిన్నకర ఎజండాను రూపుమాపగల శక్తి వామపక్ష భావజాలానికి మాత్రమేఉంది. మనం కలిసి ముందుకు వెళ్లడం, కలిసిపోరాడటం చేయడం ద్వారా ప్రజలతో మమేకమైతే ప్రత్యామ్నాయ అజెండాను దేశం ముందు ఉంచగలం. ప్రజల ఈతిబాధలను పట్టించుకొని వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు వారితో కలిసిమెలసి పనిచేయాలి. అప్పుడు పార్టీకి జాతీయ హోదా అతి త్వరలోనే వస్తుంది. ప్రజలను చేరుకుని, వారి కష్టనష్టాలను తెలుసుకుని వారికి సహాయంగాఉండి వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు దోహదం చేయవలసిన ప్రథమ కర్తవ్యం కమ్యూనిస్టులకు ఉంది. మన పోరాటాల సమయంలో జైళ్లకు వెళ్లవచ్చు. లేదా హత్యలకు గురికావచ్చు. అయినప్పటికీ మనం ఓడిపోం. పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img