Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జమిలి ఎన్నికలు జరుగుతాయా…!

ఎం కోటేశ్వరరావు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకటనతో పాటు ఒకేసారి పార్లమెంట్‌అసెంబ్లీల ఎన్నికలు జరిపే అంశం గురించి నివేదిక ఇవ్వాలని పూర్వ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దీంతో జమిలి ఎన్నికల కోసం అవసరమైన బిల్లు, రాజ్యాంగ సవరణల కోసమే ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలన్న చర్చ దేశంలో ప్రారంభమైంది. నరేంద్రమోదీ నాయకత్వం ఏది చేసినా బీజేపీకి, తాను, తన ఆశ్రితుల లబ్ది చూస్తారు అన్నది తెలిసిందే. గతంలోనే ఒకేసారి ఎన్నికల అంశం చర్చకు వచ్చింది ఇది సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశంఒకే ఎన్నికలంటూ వదలకుండా మోదీ చెప్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967 వరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆకాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం తెలిసిందే. దాని ఫలితమే 1969 లో కొన్ని అసెంబ్లీల రద్దు, తరువాత ముందుగానే 1970 లోపార్లమెంట్‌ రద్దు, 1971 ప్రారంభంలో ఎన్నికలు అన్న విషయం తెలిసిందే. ఒక దేశ వృద్ధి రేటు ఒకేసారి ఎన్నికలు జరపటం, ఎన్నికల ఖర్చు తగ్గింపు మీద, ఆ సమయంలో ప్రవర్తనా నియమావళి మీద ఆధారపడదు. చివరకు దేశం కోసం ధర్మం కోసం అనే పేరుతో ఈ వాదన అసలు ఎన్నికలే వద్దు అనేదాకా పోతుంది. ఆయా దేశాల జీడీపీలు, ఆదాయాలతో పోల్చితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల ఖర్చు నామమాత్రమే. పార్టీలు పెట్టే ఖర్చే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటోంది. దాని నివారణకు ఒకేసారి ఎన్నికలు పరిష్కారం కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు ఖర్చుచేసిన మొత్తాలతో సహా అరవైవేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేశారు. ఇది పోటీచేసిన అభ్యర్ధులు ఇచ్చిన సమాచారం మేరకు అంచనా తప్ప, వాస్తవ ఖర్చు దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. చీటికి మాటికి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పధకాల అమలు నిలిచిపోతుందన్నది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త కార్యక్రమాల ప్రకటనలను నివారించటం తప్ప వాటితో నిమిత్తం లేకుండా ముందే ప్రారంభమై సాగే పధకాల అమలు నిలిపివేత ఉండదు. రైలు మార్గాల నిర్మాణం, విద్యుదీకరణ, ప్రభుత్వ గృహాలు, రోడ్ల నిర్మాణం, పెన్షన్ల చెల్లింపు, చౌకదుకాణాల్లో వస్తువుల సరఫరా వంటివి ఏవీ ఆగటం లేదే. గతంలో గుజరాత్‌, హిమచల్‌ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పధకం పనులకు విడుదల చేయాల్సిన నిధులకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడా వెల్లడిరచకూడదని షరతు పెట్టింది.
కొన్నిదేశాల్లో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ, స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా చేసి ఖర్చును ఆదాచేయటం వల్ల అవి అభివృద్ధి సాధించినట్లు ఎక్కడా రుజువు లేదు. ఉదాహరణకు అమెరికాలో 19622019 మధ్య 57 ఏండ్లలో 26 సంవత్సరాలు తిరోగమన, 16 సంవత్సరాలు ఒక శాతంలోపు, ఐదు సంవత్సరాలు ఒకటిరెండు శాతం మధ్య వృద్ధి నమోదైంది. అమెరికాలో ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్‌ రోజు వరకు మన దేశంలో మాదిరి ప్రవర్తనా నియమావళితో నిమిత్తం లేకుండా అనేక చర్యలు తీసుకోవటాన్ని చూశాము. అక్కడ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, ప్రవర్తనా నియమావళి లేదు. అయినా అక్కడ వృద్ధి రేటు ఎక్కువ సంవత్సరాలు దిగజారింది. కొన్ని లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాలలో నిర్ణీత కాలం వరకు చట్ట సభలు రద్దు కావు, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాంటి దేశాలూ అభివృద్ది సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి.
నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్దిల్లే విధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్దతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ప్రజాస్వామ్య కబుర్లు చెప్పే అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన దేశం మొత్తంలో ఓట్లు తక్కువ తెచ్చుకున్నా కొన్ని రాష్ట్రాలలో వచ్చిన మెజారిటీ ఆధారంగా ఎలక్టోరల్‌ కాలేజీలో పైచేయి సాధించి 2016లో అధ్యక్ష పదవిని డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు. దామాషా ప్రాతినిధ్య విధానంలో మైనారిటీ ఓట్లకూ ప్రాతినిధ్యం ఉంటుంది. డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ గెలుస్తారో లేదో తెలియదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్న వారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్య విధానం గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.
తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగుతుందని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పధకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ పేరుతో అజాగళ స్థనం వంటి అధికారాలులేని సంస్థను ఏర్పాటు చేసిన పెద్దలు గద్దె మీద ఉండగా దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే. ఒకేసారి అన్నింటికీ ఎన్నికలు అనేది ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం. ఫెడరల్‌ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్దం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. ఫెడరల్‌ వ్యవస్థను కూలదోసి యూనిటరీకి మళ్లేందుకే బీజేపీ ఈ ప్రతిపాదనను పదేపదే ముందుకు తెస్తున్నదనిపిస్తున్నది.
1983లో తొలిసారి ఎన్నికల కమిషన్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. వాజ్‌పేయి హయాంలో 1999లో లా కమిషన్‌ ద్వారా ఈ ప్రతిపాదనన తెచ్చారు. తరువాత యుపిఏ పాలనలో దాని ప్రస్తావన లేదు. మోదీ తొలిసారి అధికారానికి వచ్చి, బీజేపీకి మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం వచ్చినపుడు 2016లో నీతి ఆయోగ్‌ ద్వారా ముందుకు తెచ్చారు. 2018లో లా కమిషన్‌ ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని చెప్పింది.
మోదీ రెండవసారి అధికారానికి వచ్చిన వెంటనే మరోసారి చర్చకు తెచ్చారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో కూడా చర్చ సాగించారు. నిర్మాణాత్మక అవిశ్వాసం పేరుతో మరొక ప్రతిపాదనను లా కమిషన్‌ ద్వారా ముందుకు తెచ్చారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటానికి ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సభ విశ్వాసం పొందాలని చెప్పారు. 2022లో నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌చంద్ర ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అందుకు గాను రాజ్యాంగ సవరణ జరపాలని చెప్పారు. అదే ఏడాది డిసెంబరులో లా కమిషన్‌ అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, అధికారులు తమ సూచనలు పంపాలని కోరింది. ఇపుడు రామనాధ్‌ కోవింద్‌ నాయకత్వంలో ఒక కమిటీని వేసి మరోసారి మోదీ సర్కార్‌ ముందుకు తెచ్చింది. వివరాలు తెలియదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img