Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

జాంబీ డ్రగ్‌ మత్తులో అమెరికా

2016లో విడుదలైన కొరియన్‌ హరర్‌ సినిమా ‘‘ట్రేయిన్‌ టు బూసాన్‌’’ కథాంశంలో ‘‘జాంబీ వైరస్‌’’ సోకి ప్రజలు నగర వీధుల్లో నిస్సహాయంగా, ప్రాణాపాయ దశలో జీవచ్ఛవాల వలె పడి ఉంటారని చూపారు. నేడు ‘‘జాంబీ వైరస్‌’’ స్థానంలో ‘‘జాంబీ డ్రగ్‌’’ విపత్తు ఏర్పడి అమెరికా అతలాకుతలం అవుతున్నది. గుర్రాలు, ఆవులు, గొర్రెల వంటి జంతువుల చికిత్సలో వినియోగించే ‘‘గ్జైలజీన్‌ డ్రగ్‌’’ వాడకం నర బానిసల వరకు చేరడం, బాధను తగ్గించే లక్షణాలు కలిగి ఉండడంతో యూయస్‌ ప్రజలకు దురలవాటుగా మారింది. ‘‘గ్జైలజీన్‌ డ్రగ్‌’’కు మూడు పేర్లుగా ‘ట్రాంక్‌’, ‘ట్రాంక్‌ డోప్‌’ లేదా ‘జాంబీ డ్రగ్‌’గా పిలుస్తున్న ప్రమాదకర మత్తు మందు దురలవాటుతో అమెరికన్లు తూగుతున్నట్లు తెలుస్తున్నది. శరీర అంతర్భాగాల వినాశకారిగా, మాంసాన్ని తినేస్తూనే కండరాలను బలహీనపరిచే (ప్లెష్‌ ఈటింగ్‌ డ్రగ్‌) ప్రమాదకర మత్తు మందుగా ‘‘జాంబీ డ్రగ్‌’’ అమెరికన్లను మత్తులో నింపుతున్నట్లు సంచలన వార్తలు వెలువడ్డాయి. జాంబీ డ్రగ్‌ బానిసలుగా మారిన వారి చర్మంపై గాయాలు/పుండ్లు ఏర్పడడం, కండరాలు/మాంసపు భాగాలు క్షీణించడం, అతిగా అలసిపోవడం, అవయవాలు నరికి వేయడం లాంటి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. ఉపశమనం కలిగించే మత్తు మందుగా జాంబీ డ్రగ్‌ ప్రభావంతో తీవ్ర నిద్ర, శ్వాస సంబంధ ఒత్తిడి, చర్మంపై గాయాలు కావడం లాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కేంద్ర నాడీ మండలాన్ని ప్రభావితం చేయగల డిప్రెసెంట్‌గా పొడి రూపంలో లేదా సిరంజిలో నింపిన మత్తు మందుగా జాంబీ డ్రగ్‌ మార్కెట్లో దొరుకుతుంది. శరీర భాగాలను గాయపరచగల జాంబీ డ్రగ్‌ దురలవాటుకు లోనైన వారిలో గాయాలు మానడానికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చని, కొన్ని సందర్భాల్లో అవయవాలను తొలగించవలసి రావచ్చని తెలుపుతున్నారు. ఫిలడెల్ఫియా కేంద్రంగా వాడుతున్న మత్తు మందులో జాంబీ డ్రగ్‌తో పాటు ఫెంటనైల్‌ సమ్మేళనాన్ని మిశ్రమంగా కలిపి మార్కెట్‌లో కారుచవకగా (3-4 డాలర్లు) అమ్ముతున్నారు.
ఈ డ్రగ్‌ వాడిన వారు అపస్మారక స్థితిలో వీధుల్లో పడిపోవడం, శరీరం కృంగి కృశించడం, నిద్రలో నడవడం, మతిమరుపు, కంటి చూపు మందగించడం, శ్వాస/బీపీ పడిపోవడం, రోగనిరోధక శక్తి క్షీణించడం జరుగుతున్నది. జాంబీ డ్రగ్‌ వినియోగం ఫిలెడెల్ఫియాలో ప్రారంభమై కనెక్ట్‌కట్‌, మిచిగాన్‌, మెరీలాండ్‌, న్యూయార్క్‌, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, అలబామా లాంటి 36 రాష్ట్రాలకు/ప్రాంతాలను విస్తరించడమే కాకుండా కెనడాలోకి కూడా ప్రవేశించడం ప్రమాదకరంగా మారింది. ‘గ్జైలోజీన్‌ డ్రగ్‌’తో మరో మత్తు మందు ‘హెరాయిన్‌ డ్రగ్‌’ను కలిపి వాడడంతో ప్రమాదం మరింత పెరిగినట్లు అవుతున్నది. జాంబీ డ్రగ్‌ను మోతాదు దాటి వాడితే 6.7 శాతం వరకు మరణం కూడా సంభవిస్తున్నదని నిరూపించారు. ఫిలడెల్ఫియాలో దాదాపు 90 శాతం డోప్‌ పరీక్షల్లో గ్జైలజీన్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పశువుల డాక్టర్‌ చీటీలతో సులభంగా, చవకగా లభ్యం కావడంతో జాంబీ డ్రగ్‌ వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారు.
బి.ఎం.ఆర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img