Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

జాతీయోద్యమం ` వారసత్వం

గడ్డం కోటేశ్వరరావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (రిటైర్డ్‌)

బ్రిటీషు సామ్రాజ్యవాద పాలన నుండి దేశ విముక్తి కోసం పోరాడిరది, నేడు సజీవంగా ఉన్నది ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెసు, భారత కమ్యూనిస్టు పార్టీ.. ఈ రెండు పార్టీలు మాత్రమే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు భిన్న రూపాల్లో, దశల్లో నిర్వహించడం ద్వారా భారతదేశాన్నుండి బ్రిటీషు పాలకులను వెళ్ళగొట్టారు. పోరాటాల్లో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు, ఒడుదుడుకులు లేవా? ఉన్నాయి. అయితే దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో, పోరాటాల్లో అలాంటివి లేకుండా, శుద్ధజల ప్రవాహంలాగా, ఉద్యమాలు నడవవుÑ నడపలేరు. నడిపి, పోరాటానికి నాయకత్వం వహించినది ఈ రెండు పార్టీలే గనుక, జాతీయోద్యమ వారసత్వాన్ని పొందగలిగిన అర్హత ఈ పార్టీలకే ఉన్నది. వ్యక్తులుగా కొద్దిమంది ఆ ప్రవాహంలో కలిసిరావచ్చు. వారికి ఉద్యమంలో అంతర్భాగమైన శక్తులుగా మాత్రమే గుర్తింపు ఉంటుంది. జాతీయోద్యమ విలువలతోపాటుగా, వలసపాలన వారసత్వం ` ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అనేక దుష్ఫలితాలు కూడా భారతదేశం పొందింది.
దాదాపు వందసంవత్సరాలు సాగిన పోరాటంలో జాతీయకాంగ్రెసు ప్రధాన పాత్రధారి కాగా, మూడుదశాబ్దాలపాటు భారత కమ్యూనిస్టుపార్టీ, కాంగ్రెసు లోపల, బయటా ఉండి బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా పోరాడిరది. జాతీయ కాంగ్రెసు నాయకత్వం అత్యంత పరిణతి చెందిన, విద్యావంతులైన, కాకలుతీరిన యోధులు కాగా, వారి విధానాలతో అసంతృప్తి చెంది, ఆ బాటలో పోరాటం చేయడం ద్వారా బ్రిటీషు పాలనను అంతమొందించలేమనే భావనతో కమ్యూనిస్టు పార్టీ స్థాపించి, మరో మార్గంలో పోరాటం చేసి దేశాన్ని విముక్తి చేయవచ్చునని విశ్వసించిన యువ నాయకత్వం సి.పి.ఐ.ది. కాంగ్రెసు నాయకత్వంతో పోల్చితే తొలితరం కమ్యూనిస్టులు యువకులే! గొప్ప విద్యావంతులేం కాదు. బ్రిటీషు పాలనను అంతమొందించాలనే లక్ష్యం, దీక్ష, పట్టుదల, ధైర్యసాహసాలు, అసమానమైన త్యాగధనత, తమ జీవితాలను తృణప్రాయంగా దేశానికి అంకితం చేయగలిగిన గొప్ప దేశభక్తులుÑ సంకల్ప బలం గలిగిన యోధులు.
స్వాతంత్య్ర పోరాటకాలంలో అనేక ఇతర ఉద్యమాలు కూడా వచ్చాయి. అవేవి బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడినవి కావు. మతానికి కుల వివక్షకు సంబంధించిన ఆందోళనలే! వాళ్ళ లక్ష్యం పరిమితమైంది. హిందూ మహాసభకూ, ఆర్‌.యస్‌.యస్‌.కు ముస్లిం లీగ్‌ వ్యతిరేకం కాగా, ముస్లిం లీగ్‌కు హిందూత్వ వ్యతిరేకం పేరుతో ప్రత్యేక దేశం కావాలనే లక్ష్యం ఉండేది. అందులో కరుడుగట్టిన మతవాదులు, ‘‘అధికారం హిందువులకు వస్తుంది గానీ, మాకేంటి’’ అనే ధోరణితో దాదాపుగా ముప్పయో దశకం నుండి పోరాటాల్లో పాల్గొనడం తగ్గించారు. ఇక బ్రాహ్మణీయ వాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు అంతవరకే పరిమితమైనాయి. దేశ విభజనకూ, తదనంతర కాలంలో జరిగిన నరమేధానికి కారణం హిందూత్వవాదులు, ముస్లిం మతోన్మాదులు.
సామాజిక వ్యవస్థ విశ్లేషణకు వినియోగించే పద్ధతులను గుర్తించడం ద్వారా ఒక సమాజాన్ని, దేశాన్ని, వాటిలోని సంబంధాలను తెలుసుకోవచ్చు. ప్రతి సమాజానికి పునాదీ, ఉపరితల నిర్మాణం ఉంటాయి. అనగా సమాజంలో / దేశంలో ఆస్తి సంబంధాలు, రాజకీయ కార్యకలాపాలు, ప్రభుత్వాలు, కోర్టులు వగైరాలు ఉంటాయి. ఆర్థిక సంబంధాలను పునాది అనీ, మిగిలిన వాటిని ఉపరినిర్మాణమని సాధారణంగా అంటారు. వీటిమధ్య వైరుధ్యాలు ఉంటాయి. ఆ వైరుధ్యాలను, అందుకు కారకులైన వర్గాలను గుర్తించి విశ్లేషించి సమాజం / దేశం పోకడను తెలుసుకోవచ్చు.
1947కు పూర్వం భారతదేశం ఒక వలస దేశం. దాన్ని పరాయి దేశస్తులైన బూర్జువా వర్గాలు ప్రత్యక్షంగా పాలిస్తున్నాయి. కాబట్టి దాన్ని వలస దేశమన్నారు. దేశపాలనపై ఇతర దేశాల పాలకుల / వర్గాల ఆధిపత్యం పరోక్షంగా ఉంటే దాన్ని నయావలస పాలన అంటారు. ఒక దేశానికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలు ఆ దేశంలో కొన్ని, ఇతర దేశాల్లోని పాలకులు / వర్గాలు కొన్ని నిర్ణయాలు చేస్తూ, ఆ దేశం మీద ఆధిపత్యం కలిగివుంటే దాన్ని అర్ధవలస దేశం అన్నారు. ఈ నిర్వచనాలన్నీ సాధారణంగా ఆర్థిక గణాంకాల సహాయంతో చెప్తుంటారు. దేశంలోని జాతీయోత్పత్తిని, జాతీయ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని దాని నుంచి వచ్చే మిగులును పాలకవర్గాలు ఏ విధంగా వినియోగిస్తున్నాయి? అందులో ఏ వర్గాల భాగం ఎంత? అనే అంశాల్లోకి వెళ్ళి దేశంలోని ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలను విశ్లేషించడం పరిపాటి. ఈ అంశాలు ఏ వర్గానికి మేలు చేస్తున్నాయి? ఏ వర్గాన్ని పీడిస్తున్నాయి? అనే అంశాల్లోకి వెళితే వైరుధ్యాల మూలాల్లోకి వెళ్ళవచ్చు. అనగా శ్రమించి దోపిడీకి గురయ్యే వర్గాలు ఏమిటి? దోపిడీకి సాధనమైన ఆస్తి మీద, సంపద మీద హక్కు లేక ఆధిపత్యం కలిగినవర్గాలు ఏవి? వీటిని విశ్లేషించడంద్వారా వైరుధ్యాలమూలాలను గుర్తించవచ్చు. వ్యవస్థ స్వభావం అనగా స్వతంత్రమైందా? లేక పరతంత్ర మైందా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
అనాదికాలంగా మనదేశానికి ఆర్యులనుండి మహమ్మదీయుల వరకు పరాయి ప్రాంతాల నుండి, దేశాలనుండి వచ్చారు. ఇక్కడ పాలనాపగ్గాలు చేబట్టారు. ఆ తర్వాత కాలంలో ఆంగ్లేయులు, ఇతర ఐరోపావాసులు వచ్చారు. ఐరోపా దేశస్తులకు ముందు వచ్చిన వారెవ్వరూ మన దేశం ఆదాయాన్ని, సంపదను దోపిడీచేసి, మరే దేశానికీ తరలించలేదు. వారి పాలనకూ, విలాసవంతమైన జీవనానికీ ఆ మిగులును దుర్వినియోగం చేశారు. అందువల్ల వారి పాలనా కాలాన్ని వలస పాలన అని అనలేం. అదొక భూస్వామ్య దోపిడీ వ్యవస్థ. దాంట్లో అర్ధబానిస లక్షణాలు కూడా కనిపిస్తాయని చరిత్ర రచయితలు అంటారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారు ఇక్కడే స్థిరపడి, ఈ దేశంలో కలిసిపోయారు.
అయితే ఐరోపావాసులు, ప్రత్యేకించి బ్రిటీషు పాలకులు మన దేశ సంపదను, ఆదాయాన్ని దోపిడీ చేసి, వాళ్ళ దేశంలోని పెట్టుబడిదారీ వర్గాన్ని పోషించారు. మన దేశ పాలనాధికారం, ఆర్థిక సంబంధాలపై నిర్ణయాధికారం లండన్‌లో కేంద్రీకృతమైంది. బ్రిటీషు రాచరికపు వ్యవస్థ, దానితోపాటు బ్రిటీషు పెట్టుబడిదార్లకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటుకు భారతదేశంపై నిర్ణయాధికారాలు ఉండేవి. యుద్ధాలు, హింస, కుట్రల ద్వారా మన దేశంలో ఆనాటి సామాజిక వ్యవస్థ బలహీనతలను ఆసరాగా చేసుకుని రాజ్యాధికారాన్ని సంపాదించింది బ్రిటీషు పెట్టుబడిదారీ వర్గం. అందువలన ఆ కాలాన్ని వలసపాలనా కాలం అని అంటారు. బ్రిటీషు పాలకులు ఇక్కడ స్థిరపడలేదు. 1947 తర్వాత మూటాముల్లె సర్దుకుని వాళ్ళ దేశానికి వెళ్ళారు. అందువల్ల అంతకు ముందు వచ్చి స్థిరపడినవారినీ, దోపిడీ చేసి వాళ్ళ దేశానికి వెళ్ళినవారినీ ఒకే గాటన కట్టలేం. అదే గతానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం.
1947కు పూర్వం మన దేశంలో అనేక వైరుధ్యాలున్నాయి. ఆనాటికి మౌలిక వైరుధ్యం లేక ప్రధాన వైరుధ్యం బ్రిటీషు దోపిడీ పాలనకూ, భారతదేశ ప్రజలకూ మధ్య వైరుధ్యమే! మిగిలిన వైరుధ్యాలన్నీ ద్వితీయ, తృతీయ, తదితర స్థానాల్లో ఉన్నాయి.. ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించిన వారు బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా దేశవిముక్తికోసం పోరాడారు. అందులోఇండియన్‌ నేషనల్‌కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు ముఖ్య భూమికలు పోషించాయి. కమ్యూనిస్టు పార్టీ ‘‘జూనియర్‌ పార్టనర్‌’’ అయినా, సమరశీలమైన భాగస్థురాలు. ప్రజోద్యమాలను నిర్మించి, ప్రత్యేకించి రైతు సంఘాలను, కార్మిక సంఘాలను, విద్యార్థి, యువజన సంఘాలను, సాంస్కృతిక సంఘాలను నిర్మించి, స్వాతంత్య్ర పోరాటంలోకి దించింది కమ్యూనిస్టు పార్టీనే! ప్రజాదరణను చూరగొంది.
కుల వివక్షకు సంబంధించిన అంశంలోకి, ఉద్యమాల్లోకి కమ్యూనిస్టు పార్టీ గానీ, ఇతర సంఘాలు గానీ ఎందుకు వెళ్ళలేకపోయాయి? అనే ప్రశ్న ఇప్పటికీ ఎదురవుతుంది. సాంఘిక సంస్కరణలు, కుల వ్యవస్థ, ముఖ్యమైనవే అయినా, ఆనాటికి అవి దేశంలోని వైరుధ్యాలలో ద్వితీయ స్థానంలో ఉన్న్డాయి. ప్రధాన వైరుధ్యాల్ని పక్కనబెట్టి, ద్వితీయ, తృతీయ స్థానాల్లోని వైరుధ్యాలను భుజాన వేసుకుంటే, ఆనాటి లక్ష్యమైన దేశవిముక్తి సాధ్యమవుతుందా? కుల, మత గొడవలతో అంతర్గత కొట్లాటలతో ఇంకా కొన్నాళ్ళపాటు బ్రిటీషు పాలనను, దోపిడీని కొనసాగించడానికి దోహదపడినట్లే కదా! అలాంటి ముఖ్యకారణం రీత్యానే బ్రిటీషుపాలన దేశంలోస్థాపన జరిగిందనే చారిత్రకసత్యాన్ని విస్మరించడమే అవుతుంది కదా? అయితే కమ్యూనిస్టుపార్టీ కులవివక్ష ఉద్యమాల్లో పాల్గొనలేదా? పాల్గొంది. అణగారిన కులాలను తన శక్తిమేరకు అక్కున జేర్చుకుంది. వారి తరఫునపోరాడిరది. అయితే వాళ్ళ ప్రధాన కేంద్రీకరణ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమే! మౌలిక వైరుధ్యాల్ని పరిష్కరించడంలో తమ వంతు పాత్రను నిర్వర్తించడమే ప్రధానమని పార్టీ భావించింది. ‘‘బ్రాహ్మణేతర ఉద్యమాలు’’ లాంటి ఉద్యమాలు ఆనాడు ఈ మౌలిక వైరుధ్యం జోలికి వెళ్ళలేదు. ప్రధాన శత్రువైన బ్రిటీషు సామ్రాజ్యవాదం, శత్రువుగా చూడలేదు. ఇక ఆర్‌.యస్‌. యస్‌. హిందూమహాసభలకు మహమ్మదీయులే శత్రువులు. అందువల్ల వారు కూడా బ్రిటీషు సామ్రాజ్యవాదాన్ని ప్రధాన శత్రువుగా భావించలేదు.
సామాజిక సంస్కరణలా? సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమా? దేనికి ప్రాధాన్యతనివ్వాలి? సామ్రాజ్యవాద వ్యతిరేకపోరాటంలో, సాంఘిక సంస్కరణో ద్యమాలను మిళితం చేసి పోరాడటానికి ఆనాడు అవకాశాలున్నాయా? ఆనాటి భారతీయ సామాజిక వ్యవస్థ అలాంటి అవకాశాలు కలుగజేయగలిగి ఉండేదా? ఈ ప్రశ్నలు అప్పుడే కాదు, ఇప్పటికీ ఉత్పన్నమవుతాయి. చరిత్రను అధ్యయనం చేయదల్చుకున్న వారూ, ప్రత్యేకించి జాతీయోద్యమ చరిత్రను పునఃపరిశీలన చేయదల్చినవారూ ఈ ప్రశ్నలకు శాస్త్రీయ ప్రాతిపదికన జవాబులివ్వగలగాలి. ఆచార్య బిపిన్‌చంద్ర లాంటి చరిత్ర రచయితలు ఏమన్నారో చూడండి. ‘‘వలస వ్యవస్థగా ఉన్న స్థితిలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ప్రధానమైందిÑ వర్గం, కులాలకు సంబంధించిన సామాజిక పోరాటాలు ద్వితీయమైనవిÑ భారతీయ సామాజిక వ్యవస్థలో అంతర్గతంగావున్న పోరాటాలను ప్రారంభించ వలసి వచ్చినా, వాటి తీవ్రతను ముందుకు తీసుకెళ్ళకుండా పరస్పర విరుద్ధమైన వర్గాలకు, కులాలకు రాయితీలు ఇవ్వడంద్వారా రాజీపడాలి’’. ఆ విధంగా వారిని కలుపుకుని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళ వలసిన అగత్యం ఏర్పడిరది. ఆ క్రమంలో బ్రాహ్మణేతర ఉద్యమాలకు అనగా బ్రాహ్మణ ‘కులానికి’ వ్యతిరేకంగా కాక విభిన్న దొంతరలతో, నిచ్చెనలాగే ఉండే ‘‘వర్ణ వ్యవస్థ’’లోని దోపిడీకీ, సామాజిక అసమానతకు వ్యతిరేకంగాసాగే ఉద్యమాలకు మద్దతునిస్తూనే, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం లోకి, పీడనకుగురవుతున్న ఆ వర్గాలను నమ్మించిదించడానికి అనేక అవరోధాలు, పరిమితులు ఆనాడు ఎదురైనాయి. ఆనాటి ఆ ఉద్యమాల నాయకులు, బ్రిటీషు వారితో ‘‘చెలిమి’’ చేయడంద్వారా సంస్కరణలకు అవకాశం ఉంటుందనీ, రాయితీలు పొంద వచ్చుననీ భావించి ఉండవచ్చు. ఆ కారణంచేత, స్వాతంత్య్ర పోరాటంలో సామాజిక అసమానతలకు గురవుతున్న కులాలను ఉద్యమంలోకి తీసుకురాలేక పోయి వుండవచ్చుÑ తీసుకువచ్చినా తమ కులాలకు ఒరిగేదేమిటి అనే ప్రశ్నలూ వారి నాయకత్వాలకు ఎదురై వుండవచ్చు. ఆ విధంగా సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించేవారికీ, అందులో కీలక భూమికలు పోషించే వారికీ, అదే ప్రధానమని భావించేవారికీÑ సాంఘిక సంస్కరణలు, కుల వివక్ష వ్యతిరేక పోరాటాలకు ప్రాధాన్యత నిచ్చి అందులో నాయకత్వం వహించేవారికీ మధ్య అనుమానాలకు తావిచ్చి అఘాతం ఏర్పడిరది. ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించలేనివారూ లేక చూడ నిరాకరించేవారు తమను తాము సమర్థించు కోడానికి అనేక వాదనలను, ‘‘ఉపశ్రేణి ఉద్యమాలను’’ సమర్థిస్తూ వినిపించవచ్చు. వాటిల్లోని ‘‘హేతుబద్ధతను’’ చరిత్ర గుర్తించిందనే చెప్పాలి. ఉపశ్రేణి పోరాటాలు ప్రధాన పోరాటానికి ఆనుషంగిక పోరాటాలుగా సాగితేనే, వాటి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుంది. అయితే అలాంటి స్థితి ఆనాడు లేదు. తాత్కాలిక రాయితీలతో ఆ శ్రేణులు సంతృప్తి చెంది ప్రధాన స్రవంతికి దూరమైనారని అంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img