Friday, June 9, 2023
Friday, June 9, 2023

జాతీయ విద్యా విధానంలో జెన్‌టైల్‌ సంస్కరణలు!

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

ఇటలీ విద్యావ్యవస్థను 1923లో జెన్‌టైల్‌ సంస్కరణలతో సవరించారు. అశాస్త్రీయ, మత ఆదేశాలకు అనుగుణంగా రోమ్‌ విశ్వవిద్యాలయ ఆచార్యుడు నూతన ఊహాప్రపంచవాద తత్వవేత్త జియోవాని జెన్‌టైల్‌ ప్రవేశపెట్టారు. జాతీయ ఫాసిస్టు పార్టీ స్థాపకుడు, ఇటలీ నియంత బెనిటొ అమిల్కేర్‌ ఆండ్రియా ముసోలిని మొదటి మంత్రివర్గంలో ఈయన విద్యామంత్రి. జెన్‌టైల్‌ సంస్కరణలు ఫాసిస్టులకే కాక ఐక్య ఇటలీకే ముఖ్యమైనవి. ‘‘విజ్ఞాన శాస్త్రానికి తెలియని ఆధ్యాత్మిక భావాలతో మానవ జీవితం నిండి ఉంది. భావజాల నిర్మాణంలో విద్య, సంస్కృతి ప్రాథమికాలు. ఉపాధ్యాయ-విద్యార్థి భావఐక్యత ముఖ్యం. మేధోమానసిక, నైతిక, శారీరక విద్యలన్నీ ఆత్మసేవలే. ఆత్మాభివృద్ధి సాధనాలే. ఆత్మ శరీరానికి ప్రాణం పోస్తుంది. శిక్షణ నిస్తుంది. కోరికలను అదుపు చేస్తుంది. ఆత్మ వికాసానికి మతతాత్వికత అవసరం. పిల్లలకు పిన్నవయసులోనే మతాన్ని బోధించాలి. విజ్ఞాన శాస్త్రాలను ఐచ్ఛికాంశాలుగా మార్చాలి’’ ఇవీ జెన్‌టైల్‌ భావాలు.
‘‘విశ్వవిద్యాలయాల సమూల మార్పు నా ఉద్దేశం. సాంస్కృతిక విజయానికి ప్రత్యేకతలు అవసరం.’’ అని 29.03.1923 న జెన్‌టైల్‌ అన్నాడు. 21 నకిలీ విశ్వవిద్యాలయాలను అధికారికంగా గుర్తించాడు. ఫాసిస్టు విజయానికి విద్యార్థి చైతన్యం కీలకమని, దీనికి విద్య ఆయుధమని ఇటలీ ఫాసిస్టుల ఆలోచన. 6.5.1923 న జెన్‌టైల్‌ మాధ్యమిక విద్యావిధాన చట్టాన్ని చేశారు. అందరికీవిద్య అనే ప్రజాస్వామ్య భావనను తొలగించాడు. విద్యావ్యవస్థలో నిరంకుశ పాలనా కట్టుబాట్లను, ఉప దేశాత్మక బోధనలను ప్రవేశపెట్టాడు. ఉపాధ్యాయుని బోధనా స్వేచ్ఛను నియంత్రించాడు. మాధ్యమిక విద్యను రెండుగా చీల్చాడు. ఉన్నతవర్గ విద్యలో లాటిన్‌, గణితం, భౌతికశాస్త్రం బోధిస్తారు. రెండోపద్దతిలో వీటిని తక్కువగా, విశ్వవిద్యాలయ చదువులకు పనికిరాని అంశాలను ఎక్కువగా చెప్తారు. బాలికలకు గణితం, విజ్ఞాన శాస్త్రాలను బోధించరు. ఇది విశ్వవిద్యాలయ ప్రవేశానికి, వృత్తి విద్యలకు పనికిరాని ద్వితీయశ్రేణి విద్య. విశ్వ విద్యాలయాలను మూడుగా విభజించాడు. ప్రథమశ్రేణిలో అన్ని విద్యావిభాగాలు ఉంటాయి. పరిశోధన, బోధన, ఆచార్యుల, సిబ్బంది జీతాలకు ప్రభుత్వం సాయం చేస్తుంది. ద్వితీయశ్రేణి విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ సాయం తక్కువ. తృతీయశ్రేణిలో ప్రభుత్వ సహాయం ఉండదు. ఇవి నిధులు చేకూర్చుకోవాలి. ఉచిత విద్యను అందించాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బోధించాలి. లేకుంటే ఈ విశ్వవిద్యాలయాలను రద్దు చేస్తారు. జెన్‌టైల్‌ పాత విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. ఉపాధ్యాయులు రాజ్య సిద్దాంతాలనే బోధించాలి. రాజ్య ఆదేశాలే ప్రజల అభిప్రాయాలుగా ఉండాలి. ఒకే ఉపాధ్యాయుడు బహుళ తాత్వికతలను బోధిస్తాడు. తత్వశాస్త్ర గురువులకు స్వేచ్ఛ నిచ్చారు. తత్వశాస్త్రం ప్రధాన ఆలోచనా విధానంగా గుర్తించడమైంది. అన్ని బోధనాంశాలకు అనుబంధంగా మారింది. ఈశ్వరైకవాద (దేవుడొక్కడే) సూత్రంతో సకల జ్ఞానాలను విద్యార్థులు అభ్యసించాలి. ఈ నమ్మకాలతో బోధించే పురుషులే అధ్యాపకులు. పురుషులను తయారు చేయడమే విద్య లక్ష్యం. మగపిల్లలు (బాలికల ప్రస్తావన లేదు) గురువు నుండి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ఆశించాలి. ఇటాలీ భాషను మినహాయించి ఇతర భాషా మాధ్యమాలను నిషేధించారు. జర్మన్‌, క్రొయేషియా మాధ్యమాల పాఠశాలలను మూసివేశారు. ఈ మాతృ భాషల పిల్లలు చదువు మానేశారు. స్వజాతి గొప్పది. పితృభూమి కోసం స్వీయ బలిదానానికైనా సిద్ధపడాలి. విద్యార్థుల విధేయత బోధనలో సమ్మిళితం కావాలి. విజ్ఞానశాస్త్రాల కంటే జాతీయత ముఖ్యం. ఆధ్యాత్మికశ్వాసతో పాఠశాలలు సజీవం కావాలి.
గురువు బాహ్యప్రపంచ లక్షణాలను వదలాలి. పాఠశాలల్లో పురాణాలను బోధించాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ నేర్పాలి. ఆధ్యాత్మిక సారం అందించాలి. ఇవి మనుషులను స్వర్గానికిచేర్చే మార్గాలు. విద్యార్థులను, బోధకులను మతతత్వంతో అనుసంధానిస్తాయి. విద్యార్థుల రూపురేఖలను మార్చి వారిని దేవునివైపు ఆకర్షించే, దైవీకరించే చట్రంలో గురువులను బంధిస్తారు.
ఉపాధ్యాయుల, విద్యార్థుల ఆధ్యాత్మిక జీవితాలు ఏకమైతేనే క్రమశిక్షణ, అధికారంపై గౌరవం సాధ్యమవు తాయి. ఈ ఐక్యతాసాధనే గురువుకర్తవ్యం, విద్య లక్ష్యం. విద్యార్థులను ఇళ్ళు, వీధులు, ఆటస్థలాలు, స్నేహాలు, తరగతి గదుల నుంచి ఆధ్యాత్మిక అనుభవాల దిశగా తీసుకువెళ్లాలి. వాస్తవికతలకు ఆదర్శవాదం విరుగుడు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంతర్‌దృష్టిని బలపర్చుకోవాలి. ఆత్మను విశ్వసించాలి. జీవిత స్వాభావికతలను, సాంస్కృతిక సూత్రాలను ఆచరించాలి. నేటి భౌతిక, మేధో నైతిక విద్యలు, విద్యను శాఖోపశాఖలుగా విడదీశాయి. వీటిని అనుసంధానించాలి. ఆలివ్‌చెట్లకు కొబ్బరికాయలు కాయవు. సామాజిక, మానవ సంబంధాలకు విద్య ఆటంకం కాదు. శారీరకాభివృద్ధి లేకుండా మానసిక వికాసం రాదు. ఆత్మలోనే ఐక్యత మూలా లున్నాయి. అది మనుషులను కలుపుతుంది. శరీరాలను మార్చే ఆత్మను చైతన్యపర్చాలి. క్రైస్తవమతంతో ప్రకృతి నుండి ఆత్మ విడి వడిరది. ప్రాకృతిక ప్రేరణలు ఆధ్యాత్మిక లక్ష్యానికి అడ్డంకులు. మనిషి ఈ అడ్డంకులను తొలగించి ఆధ్యాత్మిక మోక్షానికి దారితీస్తాడు. గట్టి ఇచ్ఛాబలంతో, క్రమశిక్షణతో, కండలను కరిగించి ఆత్మ అవసరాలను తీరుస్తాడు. ఆత్మ చారిత్రకాభి వృద్ధిని విద్య ప్రతిబింబిస్తుంది. దేవుడు మనకు దర్శనమిస్తాడు. ఆత్మ ప్రతిక్షణం తన సూత్రాలను నిర్దేశిస్తుంది. విషయాలను గుర్తిస్తుంది. మతం, గణితం, ఆర్థికం మగాళ్ళకే పరిమితం. చదువుకున్న మగాడే ఆత్మను గుర్తిస్తాడు. ఆత్మను (మత) విశ్వాసపు కోటలో భద్రపర్చాలి. పాలకుడు, స్ఫూర్తిదాత అయిన దేవునికి సమర్పించాలి. విద్యాలయ పవిత్రతను, విద్యుక్త ధర్మాన్ని అనుభూతి చెందని పురుషుడు ఉపాధ్యాయునిగా అనర్హుడు. మెదడుకు ఆధ్యాత్మిక పదునుపెట్టాలి. వ్యక్తిత్వ స్ఫూర్తికి ఆత్మను మించిన ఔన్నత్యాన్ని ఆపాదించరాదు. ఆత్మను కలలరూపంగా కుదించరాదు. అమానవీయ గొలుసుతో బంధించరాదు. ఆత్మ ప్రతిబింబ ఐక్యతే విద్య పవిత్రధర్మం. ఆత్మ నిజస్వరూపాలైన జీవితానుభవాల బహుళత్వాలను విద్య వ్యక్తీకరించాలి. దృఢమైన ఆత్మతో భావపరాధీనతలను నిరోధించేదే ఆదర్శమైన విద్య.
జెన్‌టైల్‌ ఫాసిస్టు విద్యావ్యవస్థకు ఇటలి నియంత ముసోలిని మద్దతిచ్చాడు. ఉపాధ్యాయ వర్గం, మతవాద పత్రికలు ఈ సంస్కరణలను ఆహ్వానించాయి. ఫాసిస్టు పత్రికా సంపాదకుడు, కార్పొరేషన్ల పూర్వ మంత్రి గిసెప్‌ బొట్టాయి జెన్‌టైల్‌ సంస్కరణలను విమర్శించాడు. కాని వాటి పాక్షిక వైఫల్యానికి వ్యవస్థ కారణమన్నాడు. వీరిద్దరూ ఫాసిస్టు విద్య భవిష్యత్తు గురించి ఆందోళన చెందారు. ఫాసిజాన్ని సమర్థించారు. తమ నాయకుడు ముసోలినిని పొగిడారు. అయితే జెన్‌టైల్‌ సంస్కరణలు విద్యకు నష్టం కలిగించాయి. విద్యావేత్తలు, విజ్ఞానశాస్త్ర సంఘాలు వీటిని ఫాసిస్టు విద్యావిధానాలని విమర్శించారు. 1928 తర్వాత ఈ విద్యావిధానం క్రమేపీ బలహీనపడిరది. 1939లో ఫాసిజపు నూతన సాంస్కృతిక విలువలతో ఫాసిస్టు పార్టీ విద్యావిధానాన్ని నిర్ణయించింది. పాఠశాలల నుంచి విశ్వ విద్యాలయాల వరకు విద్యాసంస్థలన్నీ ఫాసిస్టు విధానాలను అమలు చేశారు. ఫాసిస్టు విద్యావ్యవస్థ పౌరులను ఫాసిస్టులుగా మార్చింది. విద్యను సైనిక వ్యవస్థగా నిర్వహించింది. శిక్షణ, కార్మిక సేవలు, సైనిక తర్ఫీదులపై విద్య దృష్టి సారించింది. ‘‘కొత్త విద్యా విధానంతో గ్రామీణ విద్యాలయాలు మూత పడతాయి. గ్రామీణ ప్రాముఖ్యత గల మన దేశంలో గ్రామీణుల ప్రగతి కుంటుబడుతుంది’’ అని 1923-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తూ మాసెరట విశ్వవిద్యాలయ పీఠాధిపతి రికార్డొ బాచి అన్నారు. జెన్‌టైల్‌ సంస్కరణలు ఆధునీకరణ, సాంకేతికాభి వృద్ధికి ఆటంకాలని, పొరుగు దేశాలతో పోటీలో ఇటలి వెనుకంజలోఉంటుందని ఇటలీ విద్యామంత్రులు వాదించారు. ప్రగతిశీలురు, వామపక్ష వాదులు ఈ విధ్యావిధానం సరికాదన్నారు. 15.04. 1944న జెన్‌టైల్‌్‌ను కాల్చిచంపారు. నియంతలకు సమాజం విధించిన చారిత్రక శిక్ష ఇది. నేటి మన పాలకులు హిందుదేశాన్ని నిర్మించాలనుకుంటున్నారు. భారతీయులను తయారు చేయాలను కోవడంలేదు. విద్యను (సంఫ్‌ు వంటి) ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలన్న 2020-జాతీయ విద్యావిధాన ప్రతిపాదనలో జెన్‌టైల్‌ విద్యా సంస్కరణల సారాంశం ఉంది. భారత భవిష్యత్తు ఏమవుతుందో?
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి
చరవాణి – 9490 20 4545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img