Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

జీవన ప్రమాణాలు పెంచే కనీస వేతనాలు కావాలి

వెలుగూరి రాధాకృష్ణమూర్తి

కార్మిక హక్కులన్నింటితోపాటు కనీసవేతనాలపై కూడా ముప్పేట దాడి జరుగుతున్నది. కార్మికసంఘాలు చేసే పోరాటాలు, ఉద్యమాలను పట్టించుకోవటంలేదు. కనీసవేతనాల నిర్ణయం, వాటి అమలుకోసం కార్మికసంఘాలు తమపోరాటాలను ఎక్కుపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కనీసవేతనం అంటే యజమానులు తమ ఉద్యోగులకు చట్టబద్ధంగా చెల్లించే అత్యల్ప వేతనమే కనీస వేతనం. ఉద్యోగులు అంతకన్నా తక్కువ ధరకు శ్రమను విక్రయించ జాలరు. 2015లో కేంద్రం రోజువారీ కూలి రూ.160లు అమలు చేసింది. 2017లో 10శాతం కలిపి రూ.176లు ప్రకటించారు. ప్రధాని మోదీ నియమించిన నిపుణుల కమిటీ 2018లో కనీస రోజువారీ కూలి రూ.375లు సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం రూ.176లు ఉన్న కనీస రోజు కూలీని రూ.178గా ప్రకటించింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, నిర్మాణ రంగంలో, రోజువారీ కూలిరేట్లు కేరళలో అత్యధికంగా రూ.837లు అమలులో ఉంది. జమ్మూకాశ్మీర్‌లో రూ.519లు, తమిళనాడులో రూ.473లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.409లు ఇస్తున్నారు. అత్యల్పంగా త్రిపురలో రూ.250లు, గుజరాత్‌లో రూ.297లు ఉన్నాయి. ఈ అరకొర ఆదాయాలతో రోజురోజుకూ, ఆకాశాన్ని అంటుతున్న ధరల పెరుగుదలను తట్టుకోలేక కార్మికులు విలవిల్లాడుతున్నారు. అనేకమంది కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2021లో 1,64000 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా, అందులో 43,000 మంది రోజువారీ కూలీలేనని ప్రభుత్వ లెక్కలు వెల్లడిరచాయి. ప్రభుత్వ లెక్కల్లోకిరాని ఇటువంటి సంఘటనలు మరెన్నో! రెండోవైపు కార్పొరేట్‌ కంపెనీల యండీలు, చైర్మన్ల వేతనాలు కోట్లల్లో! నెలకు 8,10 కోట్ల రూపాయల వేతనాలుగాక, పెర్క్స్‌ పేరుతో లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. వీరి వేతనాలు సాధారణ ఉద్యోగి తీసుకునే జీతం కంటే 2082 రెట్లు అధికం. చాలా దేశాలు 20వ శతాబ్దం చివరినాటికి కనీస వేతనచట్టాలు చేశాయి. భారతదేశంలో కనీస వేతనచట్టం 1948లో తెచ్చారు. కనీసవేతనాలు చెల్లించాల్సి వస్తుందని, జిగ్‌ వర్కర్స్‌, అప్రంటీసులు, క్యాజువల్‌ లేబర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, రోజువారీ కూలీలతో యజమానులు పని జరిపించుకుంటున్నారు. తద్వారా కనీస వేతన చట్టాలనుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీస వేతనాల చట్టం 1948లో వచ్చినప్పటికీ, అమలు అంతంతమాత్రమే. ప్రభుత్వాలు ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదు. కనీసవేతనాల సలహా మండళ్లు నామ మాత్రంగా మిగిలి పోయాయి. కనీస వేతనాలను అమలుజరిపితే, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. పేదరికాన్ని తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కావాలంటే ప్రజల కొనుగోలుశక్తి పెరగాలి. తద్వారా పరిశ్రమలు ఉత్పత్తిచేసే వస్తువులకు గిరాకీ ఏర్పడుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే, వారి దగ్గర నగదు ఉండాలి. కనీస వేతనాల అమలుతో ప్రజల ఆదాయాలు నికరంగా వుండి, వారి కొనుగోలుశక్తి పెరిగి, వస్తువులకు గిరాకీ ఏర్పడి, తద్వారా వస్తూత్పత్తిలో పెరుగుదల, ఉపాధి అవకాశాల మెరుగుదల, అంతిమంగా ఆర్థికాభివృద్ధి సాధ్యమవు తుంది. కానీ, లాభాల సంపాదనే ప్రధాన ధ్యేయంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో శ్రమ దోపిడీ సాగుతుంది గనక, కనీసవేతనాల అమలు గగనంగా ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ సజావుగా సాగాలన్నా కనీస వేతనాలు అమలు జరపాలి. కార్మికుల మెరుగైన జీవనంకోసం కనీసవేతనాలు అమలుచేయడం రాజ్యాంగ లక్ష్యంగా ప్రకటించింది. ‘వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర రంగాలలో పనిచేసే కార్మికులకు హేతుబద్ధమైన, గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వేతనాలకు సంబంధించి అనువైన శాసనాలను రూపొందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల’’ని 43వ అధికరణం పార్ట్‌ 4 ఆదేశిస్తూఉంది. ‘‘ప్రత్యేకించి గ్రామీణప్రాంతాల్లో సహకార సంఘాల ప్రాతిపదికపైనగానీ, వ్యక్తుల ప్రాతిపదికపైగానీ కుటీర పరిశ్రమలను పెంపొందించటానికి ప్రభుత్వాలు కృషి చేయాలి’’ అని రాజ్యాంగంలో వ్రాసుకున్నాం. అధికరణం 43ఏ ఫ్యాక్టరీల నిర్వహణలో కార్మికులను భాగస్వాములను చేసేందుకు తగిన శాసనాలను ప్రభుత్వం రూపొందించాల’’ ని రాజ్యాంగ సవరణ తెలియజేస్తూంది. దీన్ని 1977లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అదనంగా చేర్చారు. రాజ్యాంగంమీద గౌరవంఉంటే ‘‘లివింగ్‌ వేజ్‌’’ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వాలు కనీసవేతనాలు అమలు చేయాల్సిఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఆ జాడే లేదు. రాజ్యాంగంలోని 39, 41, 43, 43 ఏ అధికరణాలు అనారోగ్యం, వృద్ధాప్యం, నిరుద్యోగంలాంటి సమస్యలతో నలిగి పోయే కార్మికులకు కొంత వెసులుబాటు కల్పించేందుకు ఉద్దేశించడమైంది. వీటిల్లో ఈయస్‌ఐ లాంటి 9 ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. గ్రాట్యుటీ, ఈపీఎఫ్‌, పెన్షన్‌, మెటర్నిటీ బెన్‌ఫిట్‌, ఈయస్‌ఐ లాంటి చట్టాలు కూడా వచ్చాయి. కనీస వేతనాల చట్టం(1948) వచ్చింది కానీ అమలుమాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రాజ్యాంగంలోని 21వ అధికరణం ‘‘న్యాయబద్ధమైన కనీసవేతనాన్ని పొందే హక్కు’’ కు హామీ కల్పిస్తూ వుంది. 23 వ అధికరణంసుప్రీంకోర్టు తీర్పు: రాజ్యాంగంలోని 23వ అధికరణం వెట్టి చాకిరిని రద్దు చేస్తూఉంది. అందుకనుగుణంగానే వెట్టిచాకిరి నిర్ములనా చట్టం(1976) వచ్చింది. కనీస వేతనాలకంటే తక్కువ వేతనం చెల్లిస్తే, అది వెట్టిచాకిరీ క్రిందకు వస్తుందని వ్యూపిల్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీం కోర్టుతీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తికి మరో మార్గంలేని ఆర్ధిక ఒత్తిడిలో బలాత్కారస్థితి ఏర్పడినప్పుడు, అది నిర్బంధ శ్రమ తప్ప మరొకటి కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కానీ, కనీసవేతన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వెట్టి చాకిరీ నిర్ములన చట్టం క్రింద కేసులు పెట్టిన దాఖలాలే లేవు. నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వేతనకోడ్‌ యాజమాన్యాల పాలిట వరంలాంటిది. విచ్చలవిడి శ్రమ దోపిడీకి అవకాశం కల్పించేదిగా ఉంది. కనీసవేతనం అనే భావన నీరుకార్చడమైంది. గరిష్ట వేతనాలపై సీలింగ్‌ లేదు. కోడ్‌ అంటే సమగ్ర వ్యక్తీకరణ. కానీ, వేతన కోడ్‌లో అదేలేదు. ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలకు చోటే లేదు. ‘‘లివింగ్‌ వేజ్‌’’ రాజ్యాంగ హక్కు. కానీ కనీస వేతనాలకే దిక్కులేదు. మనదేశంలో 7శాతం సంఘటిత, 93 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరిని 73 షెడ్యూల్స్‌లో కవర్‌ చేశారు. అమల్లో ఉన్న ఈ 73 షెడ్యూల్స్‌ ఎంప్లాయ్‌మెంట్స్‌ ఊసేలేదు. వీటినికూడా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌గా భావించారేమో! రాష్ట్రాల హక్కులపై దాడిచేసే విధంగా కనీసవేతనాల ప్రకటనలో కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక అధికారాలు కట్టబెట్టారు. ఆక్ట్రాయిడ్‌ ఫార్ములా, ప్రముఖ న్యూట్రీషియన్ల సలహాలలోని ఆహార వినియోగం, సమతుల్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని15వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ (1957) కొన్ని సిఫారసులు చేసింది. వాటిని గానీ, సుప్రీంకోర్టు తీర్పులను, రాజ్యాంగం కల్పించిన హామీలను గానీ పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు వేతనకోడ్‌లో కనపడవు. ప్రతి 5సంవత్సరాలకు వేతన సవరణ జరగాలని చట్టాల్లో వ్రాస్తారు. కానీ 10,15 సంవత్సరాలు గడిచినా వేతన సవరణ జరగని దుస్థితి. నిత్యజీవితావసర వస్తువుల ధరలు మాత్రం ప్రతిరోజూ పెరుగుతూనే ఉంటాయి.
ఆక్ట్రాయిడ్‌ ఫార్ములా, ప్రముఖ న్యూట్రీషియన్ల సలహాలు, రాజ్యాంగం కల్పించిన హామీలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఇండియన్‌లేబర్‌ కాన్ఫరెన్సు సిఫారసులు, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐ.యల్‌.ఓ) కన్వెన్షన్లను పరిగణనలోకి తీసుకొని కనీస వేతనాలను నిర్ణయించి, అమలు జరపాలి. అందుకోసం కార్మికసంఘాలు ఐక్య పోరాటాలను ఉధృతం చేయవలసిన అవసరం ఉంది.
వ్యాస రచయిత ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img