జీవితం అంటే పని తప్ప ఇంకేమీ ఉండడానికి వీల్లేదని ఇన్పోసిస్ నారాయణమూర్తి ప్రవచించారు. యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఆదేశించినంత పని చేశారా. నారాయణమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అభివృద్ధికి, ఎక్కువ గంటలు పనికి అవినాభావ సంబంధం ఉందా అనే అంశమూ చర్చకొచ్చింది. వ్యక్తి వారానికి ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని గంటలు పని చేసే దేశాలు అభివృద్ధి చెందాయి, పని గంటల ఆధారంగానే అభివృద్ధి సాధ్యపడుతుందా అనే విషయాలపై వివిధ రకాలైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత చాలా తక్కువని నారాయణమూర్తి అన్నారు. పని ఉత్పాదకతను మనం మెరుగుపర్చుకోకపోతే, అద్భుత ప్రగతి సాధించిన దేశాలతో పోటీపడలేమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. మూర్తికి మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు స్పందించారు. ఈ స్పందనల్లోనే ఇన్ఫోసిస్‌లో జరుగుతోన్న శ్రమ దోపిడీ వార్తల్లోకి ఎక్కింది. తక్కువ వేతనాలిస్తూ ఎక్కువ పని చేయించుకునే సంస్థగా ఇన్పోసిస్‌పై కొందరు విమర్శలు చేశారు. ఐటీ కంపెనీల్లో కొత్తవారు, సీఈవోలు అందుకుంటున్న వేతనాలను పోల్చుతూ ఐఏఎస్ అధికారి అశోక్‌ఖేమ్కా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. 2012లో ఇన్ఫోసిస్ సీఈవోకు ఇస్తున్న వేతనం రూ.80 లక్షలు కాస్తా 2022 నాటికి 79 కోట్లకు చేరింది. అదే రీతిలో ఇతర ఐటీ ఉద్యోగులకు ఎందుకు పెరగలేదని గట్టిగానే నిలదీశారు. సంస్థకోసం సీఈవో ఎంత పని చేస్తున్నారో ఇతర ఉద్యోగులు కూడా అంతే పని చేస్తుండగా వారి మధ్య వేతనాల్లో 2,200 రెట్ల వ్యత్యాసం ఎందుకుందని చేసిన ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి.
దేశంలో ఇప్పటికే నిరుద్యోగం తీవ్ర స్థాయిలోకి చేరింది. కరోనా దెబ్బ నుంచి ఇప్పటికీ కోలుకోలేపోతోంది. స్వాతంత్య్రానంతర భారతంలో ఇప్పుడున్నంత నిరుద్యోగం మునుపెన్నడూ లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత ఆర్థిక విధానాల కారణంగా గత తొమ్మిదిన్నరేళ్లలో దాదాపు 14 కోట్ల మంది ఉపాధి అవకాశాల్ని కోలోయినట్టు వివిధ సర్వేల్లో వెల్లడైంది. దీని ఫలితాలు 2023లో విడుదలైన ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం దిగజారడం ద్వారా బహిర్గతమయ్యాయి. 125 దేశాల జాబితాతో వెలువడిన ఈ నివేదికలో భారత్‌ది 111 స్థానం. 2021లో 101, 2022లో 107వ స్థానంలో ఉన్న భారత్ స్థితి ఈ ఏడాది మరింత దిగజారింది. ఈ తరుణంలో ఎనిమిది గంటల పని స్థానంలో నారాయణమూర్తి పేర్కొన్నట్టు 12 గంటల పని అమలైతే షిప్టు పద్ధతి పని విధానంలోనూ మార్పు వస్తుంది. ప్రస్తుతమున్న మూడు షిప్టుల స్థానంలో రెండు షిప్టుల పని అమలవుతుంది. ఇదే జరిగితే ఉద్యోగాలను పోగొట్టుకునే కార్మికుల సంఖ్య కోట్లలోనే ఉంటుంది. నిరుద్యోగం, ఆకలి సమస్య ఏ స్థాయిలో పెరుగుతుందో అంచనాలకు చిక్కదు.
అసలు విరామం లేని పని కారణంగానే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనధికారికంగా అమలవుతున్న అధిక పనిగంటల కారణంగా కుటుంబంతో గడిపేందుకు సమయం లేకుండా పోతోందనే బాధ అన్ని రకాల ఉద్యోగ, కార్మిక వర్గాల్లోనూ ఉంది. ఇక రోజుకు 12 గంటల సమయం అధికారికమై, కంపెనీల అనధికారిక పని గంటల్ని అమలు చేస్తే పరిస్థితి ఏమిటనే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వ్యాయామం విషయం పక్కన పెడితే కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా సమయం ఇవ్వలేని స్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే భారత్‌లోని కార్మికవర్గం తాము సమాజంలో అంతర్భాగం అనే విషయాన్నే మరిచి పోయే స్థితిలోకి పాలకులు నెట్టారు. సాధించుకున్న కార్మిక హక్కులను ప్రభుత్వమే కాలరాస్తోంది. పని గంటలు తక్కువ కావడం వల్లనే దేశంలో ఉప్పాదకత తక్కువగా ఉందని నారాయణమూర్తి అంటున్నారు. కానీ ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత పౌరులే ఎక్కువ గంటలు పని చేస్తున్నారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) స్పష్టం చేసింది. ఐఎల్‌ఓ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం కరోనాకి ముందు భారతీయులు ప్రతీ ఏడాది సగటున 2 వేల గంటలకు పైగా పనిచేశారని వెల్లడించింది. ఇది అభివృద్ది చెందిన అమెరికా, బ్రెజిల్, జర్మనీలతో పోలిస్తే చాలా ఎక్కువని తెలిపింది. ఐఎల్‌ఓ ప్రకారం ఉత్పాదకతకు ఎక్కువ గంటలు పని చేయడానికి ఎటువంటి సంబంధంలేదని తేలిపోయింది. ఐఎల్‌ఓ ప్రకారం ఉత్పాదకతను పెంచడం అంటే పని గంటలు పెంచడం కాదని నారాయణమూర్తి గ్రహించాల్సి ఉంది. చేస్తున్న పని పట్ల నిబద్దత, అవసరమైన వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారానే ఉత్పాదకత పెరుగుతుంది. నాణ్యమైన పని ఎక్కువ గంటల పనికన్నా మెరుగైన ఫలితాలను ఇస్తోందనేది అభివృద్ధి చెందిన దేశాల అనుభవం. అందుకే చాలా దేశాల్లో నాలుగు రోజుల పని విధానం అనే దిశగా కదులుతున్నాయి. కార్మికుల వేతనాల్లో కోతలు లేకుండా వారానికి నాలుగు రోజుల పాటు పని హక్కు కోసం బెల్జియం 2022లోనే తమ చట్టాల్లో మార్పులు చేసింది. ఉత్పాదకతను మరింత పెంచడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్ డిక్రూ చెప్పారు. వారంలో నాలుగు రోజులు పని కోసం కృషి చేస్తోన్న ‘4 డే వీక్ గ్లోబల్’ సంస్థ ఆరు నెలల పాటు చేసిన ట్రయల్‌లో పాల్గొన్న 61 కంపెనీల్లో 56 కంపెనీలు నాలుగు రోజుల పనివిధానంలోకి వస్తామని చెప్పాయి. వాటిలో 18 కంపెనీలు రోజుల పని విధానాన్ని తాము శాశ్వతంగా అమలు చేస్తామని ప్రకటించాయి.
భారత్‌లో ఉన్న బలంగా ఉన్న కార్మిక చట్టాలను నీరుగారుస్తున్న మోదీ సర్కారు ఆశలకు అనుగుణంగానే నారాయణమూర్తి ఆ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. ఇందుకు అనుగుణంగా యూపీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఫ్యాక్టరీల్లో పని సమయాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కార్మికవర్గం తిరుగుబాటుతో వెనక్కి తగ్గాయి. ప్రపంచ ఆనంద సూచీ 2023లో భారత స్థానం అట్టడుగునే ఉంటోంది. 146 దేశాల జాబితాలో మనది 126 స్థానంలో ఉన్నాం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్ విడుదల చేసే ఈ నివేదిక విశ్లేషించించిన డేటాలో స్థూల ఉత్పత్తి, ప్రజల ఆయుష్షు దానగుణం, సామాజిక స్థితి, స్వేచ్చ అనేవి ప్రధానంగా ఉన్నాయి. వీటన్నిటిపై పని గంటల ఒత్తిడి పడి ప్రజలకు ఆనందం అనేది అందని ద్రాక్షే అవుతుంది. కాబట్టి మనిషి జీవితంలో పని ఒక భాగం మాత్రమే. పనే జీవితం కారాదని గుర్తిద్దాం.
డాక్టర్. సీ.ఎన్ క్షేత్రపాల్ రెడ్డి,
9059837847