Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

జీవ వైవిధ్య సంక్షోభం మానవాళికి ప్రమాదం

కొన్ని బిలియన్‌ ఏండ్లకు పూర్వమే ఏర్పడిన భూగోళంపై నివసిస్తున్న 8 మిలియన్ల జీవరాసుల (వృక్షాలు, జంతువులు, ఫంగీ, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు) మనుగడకు భంగం కలుగకుండా పరిరక్షించుకుంటూ, పర్యావరణ (అడవులు, ఎడారులు, చిత్తడి నేలలు, పర్వతాలు, సరస్సులు, నదులు, చెరువులు, వ్యవసాయ భూములు) సమతుల్యతను పాటిస్తూ, మానవ మనుగడ సాగించడమే జీవవైవిధ్యం. సుస్థిర వ్యవసాయం, ఎడారీకరణ, నేల క్షీణత, మహాసముద్రాలు, గిరిజన జాతులు, ఆహార భద్రత, కరువులు, నీరు లభ్యత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, అంటువ్యాధులు, జీవనోపాధి, సుస్థిరాభివృద్ధి, శక్తి వనరులు, శాస్త్రసాంకేతికత, సృజనశీలత, విజ్ఞాన వినిమయం, పట్టణీకరణ, రవాణా, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, అడవులు, పేదరికం లాంటి అనేక అంశాలు జీవ వైవిధ్యం మీదనే ఆధారపడి ఉంటాయి.
ఐరాస నిర్దేశించిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’లో జీవ వైవిధ్యానికి పెద్ద పీటవేశారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడానికి కారణం మానవుడి అనాలోచిత, స్వార్థపూరిత చేష్టలే. కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. జీవ వైవిధ్యానికి విఘాతం కలిగితే జరిగే అనేక అనర్థాలలో నేడు మనం అనుభవిస్తున్న మహమ్మారుల కల్లోలం కూడా ఒక ప్రధాన భాగం. జీవ వనరులను, ప్రపంచ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం మన కర్తవ్యం. ప్రకృతిలో ప్రధాన భాగాలైన వృక్ష సంపద, జంతు జాతులు, అనేక రకాలైన సూక్ష్మజీవులు, జన్యు వైవిధ్యం లాంటివి పర్యావరణ సురక్షకు సోపానాలు. కాలానుగుణంగా మానవాళి ప్రమేయంతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంలో భాగంగా జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలుగుతూనే ఉంది. భూమండలంపై 66 శాతం సముద్ర జలాలున్నాయి. ఇవి కలుషితమవుతున్నాయి. మానవ అనాలోచిత కార్యాలతో సముద్ర జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని గమనించాలి. ఇలాంటి పర్యావరణ విచ్ఛిన్న కార్యాల ద్వారా ఒక మిలియన్‌ జీవరాసులు అంతరించే దుస్థితి ఏర్పడిరది.
ప్రపంచంలో 3 బిలియన్ల జీవులు జలాల్లో, 1.6 బిలియన్‌ జీవరాసులు అడవుల్లో మనుగడ సాగిస్తున్నాయి. సకల జీవుల మనుగడకు రక్షణ కలగాలన్నా, కరోనా లాంటి మహమ్మారుల ద్వారా సోకే అంటువ్యాధులను నియంత్రించాలన్నా జీవ వైవిధ్య పరిరక్షణ చర్యలు విధిగా జరగాల్సిందే. జీవ వైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేస్తే 70 శాతం వరకు జంతు సంబంధ జెనెటిక్‌ వ్యాధులు ప్రబలుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా మనుగడ సాగిస్తున్న వృక్ష, జంతుజాల సమతుల్యతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలు చేయరాదు. మానవ అకారణ, అనాలోచిత క్రియలతో కొన్ని జీవరాసులు అంతరించిన యెడల వాటిపై ఆధారపడే వ్యాధికారక సూక్ష్మ క్రిములు మనవాళికి సోకడంతో భయంకర అంటురోగాలు కలుగుతాయి. జీవ వైవిధ్యం విచ్ఛిన్నమైతే వాతావరణ ప్రతికూల మార్పులు కూడా కలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు కనీసం 3 జీవ జాతులు, రోజుకు 100 – 150, ఏడాదికి 15,000 – 18,000 జీవజాతులు అంతరిస్తున్నాయని తేలింది. బీడు భూములు పెరగడంతో 74 రకాల కప్ప జాతులు, ధృవాల వద్ద మంచు కరగడంతో 22 శాతం పోలార్‌ బేర్‌లు, అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పెంగ్విన్‌లు, నెదర్లాండ్స్‌లో వాతావరణ మార్పులతో ఫ్లైకాచర్‌ పక్షులు లాంటి అనేక జీవ జాతులు అంతరించే సమయం ఆసన్నమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బి. మధుసూదన్‌ రెడ్డి, సెల్‌: 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img