Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

జ్ఞానం సంపాదించిన వారంతా బౌద్ధులే!

డాక్టర్‌ దేవరాజు మహారాజు

‘‘బౌద్ధులు ఏ పుస్తకానికో, వ్యక్తికో బానిసలు కారు. బుద్ధుని అనుసరించడమంటే, తమ ఆలోచనా స్వేచ్ఛను వదులుకోవడం కాదు. స్వేచ్ఛగా బుద్ధుని మార్గంలో ఆలోచించి, జ్ఞాన ప్రపూర్ణులై తాము కూడా బుద్ధులు కావచ్చు. బుద్ధులుకాగల సామర్ధ్యం అందరిలోనూ ఉంటుంది. ప్రయత్నించి సాధించాలి!’’ అని వాట్‌ ఈజ్‌ బుద్దిజమ్‌ ? గ్రంధంలో నాద మహా థేరో అంటారు.
బుద్ధ వచనంలో గౌతమ బుద్ధుడు బోధించిన దశ శీలాలు ఈ విధంగా ఉన్నాయి. 1.హింసను ఆపండి. ఇతర జీవులకు ప్రాణహాని తలపెట్టకుండా నిగ్రహించుకోండి. 2.మీకు ఎవరూ ఇవ్వనిది, మీకు మీరే తీసుకోకుండా నిగ్రహించుకోండి. 3.స్వచ్ఛతతో, నిజాయితీగా బతకండి. ఎల్లప్పుడూ మెలకువతో మెలగండి. 4.అబద్ధాలు చెప్పకుండా నిగ్రహించుకోండి. 5. సత్యం మాట్లాడండి. అదే నమ్మదగింది. అదే ఆధారపడ దగింది. అనే విషయం రుజువు చేసుకోండి! 6. ఇతరులు గూర్చి చెడు మాట్లాడకుండా, వారిపై దుష్ప్రచారం చేయకుండా నిగ్రహించుకోండి. 7. మైత్రిని ప్రేమించండి. మైత్రి పెంపొందించే మాటలు మాత్రమే మాట్లాడండి. విద్వేషాలు విడనాడండి. విద్వేషాలు రేకెత్తించే మాటలు మాట్లాడకండి. 8.ఇతరుల మనసులు గాయపరిచే దురుసు మాటలు మాట్లాడకండి. 9. వ్యర్థ సంభాషణలు వదిలేయండి. ఖచ్చితమైన, సున్నితమైన, సభ్యమైన మాటలు మాత్రమే ఎన్నుకుని జాగ్రత్తగా మాట్లాడండి.10. అర్థవంతమైన, సవివరమైన పద్ధతిలో మీ వాదనను స్పష్టంగా వివరించండి. గౌతమ బుద్ధుడు (సుత్త పీఠకదీషునికయబ్రహ్మ జాల సుత్త) (ఈ దశ శీలాలు ప్రపంచ మానవులందరికోసం చెప్పినవి .అయితే ప్రత్యేకించి మన దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, వారి బీజేపీ పార్టీ ప్రముఖులూ పాటిస్తే దేశం కాస్త ఊపరి పీల్చుకునే అవకాశం ఉండేది!) బుద్ధధమ్మసంఘం: ఇవి త్రి రత్నాలు, బౌద్ధులైన వారు విధిగా వీటి శరణు పొందాలి. అందుకే వీటిని ‘త్రిశరనాలు’ అని కూడా అన్నారు. 1.బుద్ధ లేక బోధి అని అంటే, సుప్రీం నాలెడ్జ్‌ట్రీ ఆఫ్‌ విజ్‌డమ్‌, ఆత్యున్నతమైన జ్ఞానం పొందినవాడు గనుకనే గౌతముడు బుద్ధుడయ్యారు. తనకన్నా ముందు ఇంకా చాలా మంది బుద్ధులు ఉన్నారని స్వయంగా బుద్ధుడే చెప్పాడు. బుద్ధుడు వినయశీలిగనక, తన గూర్చి తానుగొప్పగా చెప్పుకోకుండా, తనకంటే ముందే జ్ఞాన సముపార్జన చేసిన వారున్నారని ఆయన చెప్పి ఉంటాడు. బోధిస్థితిని సాధించిన వారందరిలోకి మహావ్యక్తి బుద్ధుడే. అందువల్ల ఈ జగత్తు ఆయన ఒక్కడినే బుద్ధుడిగా గుర్తు పెట్టుకుంది. మానవుల దు:ఖవిముక్తికి దారి చూపినవాడు గనక, ఈ ప్రపంచం దృష్టిలో ఆయనొక్కడే బుద్ధుడయ్యాడు.
2.ధమ్మ అంటే, ప్రకృతి నియమానికే ధమ్మ (ధర్మం) అని అర్థం. ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, అది అధర్మం అవుతుంది. తథాగతుడు ఏది ఎలా ఉంటే అలా దాని ప్రకారం నడుచుకునే వాడు అని అర్థం. ప్రకృతి నియమాల ప్రకారం నడుచుకునేవాడు గనక బుద్ధుడి ‘తధాగతుడు’ అని పేరు. శాక్యవంశానికి చెందినవాడు గనక, ముఖ్యంగా మునిలాగా జీవించినవాడుగనక, ఆయనను ‘శాక్యముని’ అని కూడా పిలుచుకున్నారు.
3.సంఘం: మనిషి సంఘజీవి. బౌద్ధమార్గాన్ని ఆనుసరిస్తూ, మనసును నిర్మలంగా ఉంచుకుంటూ, అంకిత భావంతో, నిబద్ధతతో సమాజానికి మేలుచేసే పనులలో నిమగ్నం కావాలి. వ్యక్తిగతంగా తన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన బోధనల పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలన్నాడు బుద్ధుడు. బోధి స్థితికి చేరాలన్నా నిర్వాణ దశకు చేరాలన్నా ఎవరికి వారు కృషి చేయాల్సిందేనని కూడా చెప్పాడు. జీవితంలో తాను ఆచరించిన అంశాలే బుద్ధుడు ఇతరులకు బోధించాడు. స్వీయపరిశీలనలో తాను తెలుసుకున్న విషయాలు, గ్రహించిన అంశాలు మాత్రమే తన శిష్యులకు, అనుచరులకూ బోధించాడు.దు:ఖం అనే తిమిరం నుండి ‘నిబ్బాణం’ (నిర్వాణం) అనే వెలుగువైపు నడిచే మార్గాన్ని బుద్ధుడు ప్రబోధించాడు. తను కేవలం దారి చూపగల వాడినేకానీ,మోక్షదాతను కాదన్న వాస్తవాన్ని స్పష్టం చేశాడు.
బుద్ధుణ్ని ‘భగవాన్‌ బుద్ధ’ అని కొందరు పిలుస్తుంటారు. మానవ మాత్రుడైనవాణ్ణి. భగవాన్‌అని పిలవడమేమిటీ? అని కొందరికి అనుమానం రావొచ్చు. భగవాన్‌ అంటే అసలైన అర్థం రాగద్వేషాల్ని, మోహాల్ని భగ్నం చేసుకున్నవాడు అని అర్థం! భగవాన్‌ అనేది బుద్ధుడికి ఉన్న బిరుదు. వైదికబ్రాహ్మణహిందూ ధర్మం చెప్పే భగవాన్‌కు, బౌద్ధం చెప్పే భగవాన్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ముందుమనం దాన్ని అర్థం చేసుకోవాలి. వైదిక ధర్మం ప్రకారం భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. ఆదీ అంతం లేనివాడు. ఈ సృష్టి రచన చేసినవాడు. జగద్రక్షుడు. మహిమలు గలవాడు. పాపపుణ్యాలు లెక్కగట్టుకునేవాడు. ఎప్పుడూ ఎక్కడా కనబడనివాడు. మనిషే మెదడులో సృజించబడ్డవాడు. ఇలాఎన్నో అర్థాలున్నాయి! కానీ, బుద్ధుడు అలా కాదు. వాస్తవంగా ఈ ప్రపంచంలో పుట్టిన వ్యక్తి. రాజ్యాన్ని, సర్వసుఖాల్ని త్యజించి, సత్యాన్వేషణకు అడవుల్లో గడిపిన వాడు. ప్రకృతి పరిశీలనలో కొన్ని జీవనసత్యాల్ని గ్రహించినవాడు. తాను గ్రహించిన మానవీయ విలువల్ని, జీవన సత్యాల్ని తన శిష్యులకు, అనుయాయులకు బోధిస్తూ ఈ దేశం నాలుగు చెరగులా తిరిగిన వాడు. వైదికుల భగవంతుడు కల్పితం! బౌద్ధుల భగవాన్‌ యదార్థం!! రెంటికీ చాలా తేడా ఉంది. ఎవరైతే సాధనచేసి, మానసిక వికారాలు పూర్తిగా తొలగించుకుంటారో వారే ‘భగవాన్‌’ అవుతారు. అందుకు విపశ్యన ధ్యానం సాధన చేయాలని బౌద్ధం చెపుతుంది.
భదంతఅంటే బిక్షువు/భిక్కు/భగవాన్‌ అనే అర్థాలున్నాయి. భంతే భగవంత అనే పదాలకు కూడా అర్థం అదే పెద్దవారినీ, గౌరవనీయులను ‘భంతే’ అని పిలవాలని, చిన్నవారినీ, సమఉజ్జీలైన స్నేహితుల్ని ‘అవుసో’ అని పిలవాలని, ‘మహా పరినిబ్యాన సూత్రం’లో స్వయంగా బుద్ధుడే చెప్పాడు. బిక్షు సంఘంలోకి బుద్ధుడు ప్రత్యేకించి ఎవరినీ ఆహ్వానించలేదు. బౌద్ధ బిక్షుకావడ మన్నది ఎవరికి వారు తీసుకోవల్సిన నిర్ణయం. శ్రమించకుండా బతుకు వెళ్లదీయడానికి బిక్కు కావద్దనీ, సమాజానికి సేవలు అందించే వారు అయితేనే, భిక్కు సంఘంలో చేరాలనీ ఆయన సూచించాడు. ఎవరో లోకరక్షకుడు ఉన్నాడన్న భ్రమలో యజ్ఞాలూ, యాగాలు చేస్తూ, తమను తాము మోసం చేసుకుంటూ లోకానికి తప్పుదోవ చూపేవాడు బౌద్ధబిక్షువు కాకపోవడమే మంచిదన్నాడు. ప్రశాంత వదనంతో సత్యాన్ని సత్యంగా, కరుణ, ప్రేమ, మైత్రితో ప్రజలకు జ్ఞానం అందించేవారు మాత్రమే బౌద్ధులవుతారనీ చెప్పాడు. నీటిలో పుట్టిపెరిగిన తామరపువ్వు, నీటిలోని మురికి అంటించుకోకుండా పైకి తేలి ఎలా నిలబడుతుందో బౌద్ధులు కూడా అదేవిధంగా లౌకిక ప్రపంచపు మురికిని అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉండాలనీ బుద్ధుడు చెప్పాడు. (అంగుత్తర నికాయ1138) బుద్ధుడుచెప్నిన నైతిక విషయాలు బుద్ధుడి కంటే ముందే మరికొందరు చెప్పి ఉంటారు. కానీ, అంతవరకు ఎవరూచెప్పని అంశం ‘శాస్త్రీయతని’ జోడిరచి, బుద్ధుడు సంఘాన్ని నిర్మించాడు. మనుషులలో సోదర సమానత్వ భావనల జ్ఞానాన్ని తొలిసారి మనుషులలో కలిగించిన తాత్వికుడుబుద్ధుడు. అతీత శక్తులేవీ ఉండవని స్పష్టం చేసిన భౌతికవాది. (శ్రద్ధ, ఏకాగ్రత, సమర్పణ భావనలు గురించి చెప్పిన ఉపాధ్యాయుడు. జ్ఞానమే పునాదిగా గలదిబౌద్ధం
మానసిక ఉన్నతిని సాధించడం `బౌద్ధం!!
దయ, కరుణ, నిస్వార్థం, సత్ప్రవర్తనల గూర్చి బోధించిన బుద్ధుడు, అహింసా పద్ధతుల్ని, యుద్ధ వ్యతిరేకతని ప్రపంచానికి అందించాడు. ఒక దార్శనికునిగా తాను జీవించిన కాలానికి అతీతంగా ఆలోచించి, శీలాన్ని, ప్రగతిశీల ఆలోచనా ధోరణిని ప్రపంచానికి చాటిచెప్పిన నాగరికుడు. బుద్ధుడిని మించి శాంతిమార్గం చూపిన ప్రపంచ శాంతికాముకుడు మరొకరులేరు. పన్నెండవ శిలాశాసనంపై అశోకుడు ఒక చక్కనిమాట చెక్కించాడు. ‘‘ఎవరైతే తాము నమ్మిన ధర్మాన్ని వ్యాప్తిచేయాలని ‘ఇతరులును కించపరుస్తూ మాట్లాడు తారో, వారి నిజానికి తమ ధర్మానికే నష్టం కలిగిస్తారు’’ అని! బౌద్ధ బహుజన చక్రవర్తి అశోకుడు బ్రాహ్మణులకు, జైనులకు, ఆజీవకులకు ఎంతో ఉదారంగా దానధర్మాలు చేశాడు. అశోకుడు గానీ,అతని తర్వాత వచ్చిన ‘ఇతర బౌద్ధ చక్రవర్తులుగానీ ఇతర మతాలను, ఇతర ధర్మాలను ద్వేషించలేదు. వాటిని నాశనం చేయాలని ప్రయత్నించలేదు. కానీ, బ్రాహ్మణ పాలకుడు పుష్యమిత్ర శృంగుడు అతని వారసులు బౌద్ధ బిక్షులను చంపించారు. బౌద్ధారామాలను ధ్వంసం చేయించారు. ఆ తర్వాత ఆది శంకరుడు, రామానుజుడు అనే వైదిక మత గురువులు వారి వారి కాలాలలో హిందూ తీవ్రవాదులుగా ప్రవర్తించారు. బౌద్ధ, జైనారామాల్ని హిందూదేవాలయాలుగా మార్చడంలో ఆరితేరారు. బౌద్దాన్ని నాశనంచేయడంలో వీరూ వీరి అనుచరులు తమనితాము విజయులుగా భావించుకుని ఉంటారు. కానీ, చరిత్రలో దోషులుగా మిగిలిపోయారు. ఆ విషయాలు అలా ఉంచితే, 14అక్టోబరు 1956 అశోక విజయదశమి రోజున ప్రపంచ మేధావి డా.బి.ఆర్‌.అంబేద్కర్‌, తన తాడిత, పీడిత సోదరసోదరీ మణుల్ని సుమారు మూడు లక్షల అరవై అయిదువేల మందిని తీసుకుని నాగపూర్‌లో బౌద్ధం స్వీకరించారు. మనుషులుగా గుర్తించని హిందూ మతంపె ౖతిరుగుబాటు చేశారు. తరువాతి తరాలవారికి సైతం, ఒక జీవనవిధానాన్ని చూపించారు!
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు విజేత,జీవశాస్త్రవేత్త.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img