Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

డాక్టర్‌ దభోల్కర్‌ ఓ దారిదీపం

నార్నె వెంకటసుబ్బయ్య

మనదేశంలో హేతువాద ఉద్యమానికి వేలసంవత్సరాల చరిత్రవుంది. క్రీస్తుకి పూర్వం 500 సంవత్సరాల క్రితం పొట్టకూటికోసం దేవుడిపేరుతో జరిపే మతకర్మకాండని, యజ్ఞయాగాలను, తద్దినాలపేరుతో జరిగే తంతును స్వార్థపరుల సృష్టి అని చార్వాకులు ఆనాడే గేలిచేశారు. ఆ తరువాత వచ్చిన మతోన్మాదులు నాస్తికులను నాలుకలుకోసి, గానుగల్లో వేసి హత్యచేశారు. అయినా హేతువాద ఆలోచన చావలేదు. మరింత ఉవ్వెత్తున ఎగసింది.17 వశతాబ్దంలో ప్రజాకవి వేమన తద్దినాలనూ, ముహుర్తాల పేరుతో జరిగే దోపిడీని ఉతికి ఆరేసాడు. ఆ తరువాత మహారాష్ట్రలో జ్యోతిరావు పూలె, సాహుమహారాజ్‌, అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పెరియార్‌ రామస్వామి, త్రిపురనేని రామస్వామి, గోరా, కేరళలో నారాయణగురులాంటి వారు హేతువాద నాస్తికోద్యమానికి ఎనలేని కృషి చేశారు. ఈరోజు సమాజంలో శాస్త్రీయ విజ్ఞానం పెరిగిపోతుంది. మూఢనమ్మకాలు తగ్గాలి. కానీ మూఢ నమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మూఢ నమ్మకాలను నిర్ములించాలన్న తపనతో మహరాష్ట్రలో డాక్టరు నరేంద్ర దభోల్కర్‌ గత ముప్పై సంవత్సరాలుగా , ఎంతో కృషిచేశాడు.
పదిసంవత్సరాలు డాక్టరుగా పనిచేసి, చేతబడులు, నరబలులు, దొంగ బాబాలు ….ప్రజల బలహీనతలతో వ్యాపారం చేసే దొంగల ఆటకట్టించేందుకు మహరాష్ట్రలో 1989లో ‘‘ మహరాష్ట్ర అంధశ్రద్ద నిర్మూలన సమితి ‘‘ ఏర్పాటు చేసి విద్యార్థులలో శాస్త్రీయస్పూర్తి, అవగాహన కల్పించేందుకు శిక్షణా శిబిరాలు నిర్వహించాడు. బాబాల గుట్టు రట్టు చేస్తూ , వాస్తు జ్యోతిష్యం పేరుతో మోసంచేసే వారి బండారం బయటపెట్టాలంటే ‘‘ మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం’’ అవసరమని భావించి, అందుకోసం 2008లో ఒక నమూనా చట్టం రూపొందించి ఆనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టించాడు. ఆనాడు అసెంబ్లీలో మెజారిటీ సభ్యులుగా ఉన్న బీజేపి వారు ఆ బిల్లును తిప్పి పంపారు.
2008లో మూఢనమ్మకాల నిర్మూలన బిల్లుని అసెంబ్లీ తిప్పిపంపినా, 2011 ఆగస్టు11 వతేదీ ఎట్టకేలకు పోరాడి సరికొత్త బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టించాడు. బిజెపి శాసనసభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారు. దభోల్కర్‌ మాత్రం పట్టువీడని విక్రమార్కుడిలా పోరాడారు. ఇది సహించలేని మతోన్మాదులు 2013 ఆగస్టు 20 వతేదీ పూనాలో ఉదయం వాకింగ్‌ చేస్తున్న సమయంలో దభోల్కర్‌ను తుపాకీతో కాల్చిచంపారు. అ మరుసటిరోజే మహరాష్ట్ర అసెంబ్లీలో ‘‘మూఢనమ్మకాల నిర్మూలన చట్టం’’ ఆర్డినెన్స్‌ను ఆ తరవాత చట్టంగా చేశారు. డాక్టరు దభోల్కర్‌ను చంపిన తరువాత మహారాష్ట్రలోనే సంఘసంస్కర్త పన్సారేను, కర్ణాటకలో మేధావి రచయిత, మాజీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టరు కల్బుర్గిని, గౌరీ లంకేశ్‌ను కూడా మతోన్మాదులు పొట్టన పెట్టుకున్నారు. అయినా ఉద్యమం ఆగలేదు. ఈనెల 20న డాక్టరు దభోల్కర్‌ వర్ధంతిని, ఆగస్టు 30న కల్బుర్గి వర్దంతిని పురస్కరించుకొని, దభోల్కర్‌, పన్సారే, కల్బుర్గి, గౌరిలంకేశ్‌ ఆశయాలను పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఉద్యమించటమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి కాగలదు.మూఢనమ్మకాల నిర్మూలనకోసం పోరాడేవారికి డాక్టర్‌ దభోల్కర్‌ ఒక దారిదీపం. ఒక వేగుచుక్క.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img