Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

డిజిటల్‌ యుగంలోనూ వివక్షేనా?

అరుణ, సెల్‌: 9705450705

అజాది అమృత్‌ మహోత్సవంలో ఆమె మరణించింది. అయినా, ఆమె మానం నుండి రక్తం స్రవిస్తూనే ఉంది. కశ్మీర్‌ నుండి కన్యాకుమారి దాకా… అత్యాచారాలకు గురైన శవాలు ఎందుకో ఈ మట్టిలో ఇంకటం లేదు. మనువాదం, ఫాసిజం, పితృస్వామ్యం దేశంలో నలుదిశలా ఊరేగుతున్నాయి. ఆమె మాన ప్రాణాలు ఉక్కు పాదాల కింద నలుగుతూనే ఉన్నాయి.శ్రీదేవి. ‘‘ముళ్ల పొదల్లో ఓ ఆడశిశువు...చెత్తకుండీలో మరో ఆడశిశువు... ఇద్దరు అప్పుడే భూమి మీద పడిన పసికూనలు’’... ఇలాంటి వార్తలు నిత్యం వస్తుంటాయి. 1910 నుండి మార్చి8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వస్తున్నాయి. పోతున్నాయి. కానీ మహిళల సామాజిక స్థితిగతుల్లో మార్పు రావటంలేదు. ఈ పరిస్థితిలో ఈ అజాదీ ఎవరిది? ఈ ఉత్సవాలు ఎవరివి? అన్న ప్రశ్న వస్తుంది. రోజురోజుకు స్త్రీలపై హింస రకరకాల రూపంలో పెరిగిపోతూఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ముందు తరాలవారికి హింసలేని సమాజాన్ని అందించలేమా? ఆకాశంలో సగమైన స్త్రీలు, శ్రమ, ఉత్పత్తిలో సగానికి తక్కువ ఏమి కాదు. కానీ కడుపులో బిడ్డను కనాలన్నా, తాను ఏమి చదవాలి, ఎంతవరకు చదువుకోవాలి, ఎలా జీవించాలనే విషయాలలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ మాత్రం స్త్రీకి లేదు. స్త్రీ నడక, నడత చివరకు నవ్వుపై కూడా ఆంక్షలు విధించారు. ఇలా స్త్రీలంటే చిన్నచూపు, వివక్ష. స్త్రీ ఎప్పుడు మగవాడి కనుసన్నల్లో జీవించాలి. చిన్నప్పుడు తండ్రి, పెళ్లి తర్వాత భర్త, మసలితనంలో కొడుకుల ఆధీనంలో జీవించాలి అంటూ స్త్రీని బందీని చెయ్యటం ఈ సమాజంలో మొదటి నేరం. ఘనమైన మన చరిత్ర, సంస్కృతిలో కూడ స్త్రీని పురుషునికి సొంత ఆస్తిగా మలిచారు. ఇలా భూస్వామ్య, పితృస్వామిక, సంస్కృతిని వ్యవస్థీకృతం చేశారు. ఈ పరిస్థితి మారాలి. స్త్రీని కనీసం మనిషిగా చూసి గౌరవించే ఒక మానవీయ సమాజాన్ని నిర్మించే కృషి అందరూ చేయాలి. అమలుకు నోచుకోని చట్టాలతో స్త్రీలపై కుటుంబ, లైంగిక హింస, రాజ్య హింస రోజురోజుకు పెరిగిపోతుంది. 1956, 1986 లలో చేసిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం స్త్రీ,పురుష తేడా లేకుండా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. కానీ భూస్వామిక, పితృస్వామ్య వ్యవస్థలో ఏ కుటుంబం మహిళలకు ఆస్తిలో సమానవాటా ఇవ్వటం లేదు. 1961 వరకట్న నిషేధచట్టం చేసినప్పటికి, వరకట్నం అమలు చేస్తున్నారు. పెళ్లి పేరుతో జరిగే తంతు పక్తువ్యాపారంగా మారి, మహిళలకు శాపమైంది. ఈ దురాచారానికి ఎంతో మంది స్త్రీలు బలైపోతున్నారు. ఈ దురాచారం కారణంగా ఆడశిశువుల భ్రూణ హత్యలు జరిగి, ఆడపిల్లలను గర్భంలోనే చంపుతున్నారు. ఫలితంగా దేశంలో స్త్రీల జనాభా తగ్గిపోయి పెళ్లికాని ప్రసాద్‌లు పెరిగిపోతున్నారు. ప్రకృతికి విరుద్ధమైన ఈ చర్యను నిలువరించటానికి 1994 గర్భస్థ శిశువు పరీక్షల నియంత్రణ చట్టం చేశారు. అయినా భ్రూణ హత్యలు ఆగలేదు. ఏ డాక్టరు, తల్లిదండ్రులకు గాని శిక్షలు పడ్డ సందర్భం లేదు. కనీసం కేసులు కూడ రిజిష్టరు కావటం లేదు. ఆడపిల్లలు లేకుండ కొత్త సహస్రాబ్దంలోకి మనం అడుగు పెట్టబోతున్నట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకరం. ప్రకృతి సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరం మూల్యం చెల్లించక తప్పదు. ప్రకృతిపరంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం బతుకుతారు. జన్యుపరంగా ఆడపిల్లలు బలంగా ఉండటమే దీనికి కారణం. భారతదేశంలో భ్రూణహత్యల కారణంగా స్త్రీల జనాభా తగ్గిపోతూ ఉంది. అనేక దేశాలలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య అధికంగా ఉంది. చట్టాల అమలులో చిత్తశుద్ధి లోపించడంతో ఆడపిండాలను గుర్తించి మొగ్గలోనే తుంచి వేస్తున్నారు. డయాగ్నోస్టిక్‌ పరీక్షా కేంద్రాలు మృత్యు కుహరాలుగా మారాయి. దీనికి తోడు 1991 నుంచి దేశంలో ప్రపంచీకరణ దశ మొదలై పాశ్చాత్య విష సంస్కృతి పెచ్చరిల్లి స్త్రీ శరీరం సరుకుగా, అంగడి బొమ్మగా, విలాస వస్తువుగా మర్చారు. ఫలితంగా స్త్రీలపై లైంగిక హింస పెరిగిపోయింది. ఈ విష సంస్కృతి కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఐదుగురిపై అత్యాచారాలు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. బహుళ జాతి కంపెనీలు తమ వస్తువులను ప్రచారం చేసుకొని, అమ్ముకొని సొమ్ము చేసుకోవటం కోసం బుల్లితెరలో వస్తున్న ప్రోగ్రామ్స్‌ సీరియల్స్‌లో ఆడవారినే విలన్లుగా చూపిస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్ల పాత్ర అర్ధనగ్నంగా, ఆత్మగౌరవం లేనిదిగా చిత్రీకరిస్తున్నారు. హీరోలైతే జులాయిలగా, అమ్మాయిలను వెంటాడి వేధించటమే ప్రేమగా చూపిస్తున్నారు. చివరకు ఉపాధ్యాయులను కూడ వదలటం లేదు. దీని ప్రభావం నేటి యువతపై పడి మానవీయ సంబంధాలు దెబ్బతింటున్నాయి. పెరిగిన వస్తు వ్యామోహం, వినిమయం, పాశ్చాత్య విష సంస్కృతి కారణంగా మొత్తం మానవ సంబంధాలు మార్కెట్‌ సంబంధాలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిని నిలువరించాల్సింన పాలకులు బహుళజాతి సంస్థలకు, ధనికులకు అమ్ముడుపోయి బాధ్యతారహితంగా నడుచుకుంటున్నారు. మహిళల సమస్యలు చర్చించుకొని పరిష్కరించుకోటానికి చట్టసభలలో కనీసం స్త్రీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏనాడు పార్లమెంటులో మహిళా ప్రతినిధులు 11 శాతానికి మించిలేరు. గత యుపిఎ ప్రభుత్వం చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇస్తూ మహిళా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కానీ ఆమోదం మాత్రం పొందలేదు. ఒకవేళ పొందిన స్త్రీలు చట్టసభలకు ఎన్నికైతే పంచాయితీరాజ్‌ అనుభవమే పునరావృతం అవుతుంది. స్త్రీలు డమ్మీలుగా మిగిలిపోగలరు. స్త్రీలను ఇంటికే పరిమితం చేసే భూస్వామ్య భావజాలం నేడు రాజ్యమేలు తుంది. ఈ రకంగా మొదటి నుండి రాజకీయపరమైన వివక్ష కొనసాగు తూనే ఉంది. తీవ్ర ప్రజా ఉద్యమం ఫలితంగా యుపిఎ ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకువచ్చిన నిర్భయ చట్టం2013 అమలులోకి వచ్చిన స్త్రీల మీద హింసారూపాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయేగాని తగ్గటం లేదు. బిల్కిస్‌ బానో కేసులో శిక్షలు పడిన 11 మంది దోషులను ‘‘అమృతోత్సవం’’ పేరిట వదిలివేయగావారు, హారతులందుకొని మరీ స్వాగత సత్కారాలు పొందారు. అలాగే యూపీ లోని ‘హత్రాస్‌’ లో దళిత యువతిని సామూహికంగా అత్యాచారంచేసి తగులపెట్టారు. కశ్మీరులో ఆసిఫా అనే ముస్లిం పసికూనను పవిత్ర దేవాలయంలో రోజుల తరబడి అత్యాచారంచేసి చంపిన నిందితులను అరెస్టు చేస్తే, అక్కడి బీజేపీ నిందితులను విడుదల చేయమని ఊరేగింపులు చేయటం లాంటి సంఘటనలతో సభ్య సమాజం నివ్వెరపోయి సిగ్గుపడిరది. ఈ సంఘటనలు ‘బేటి బచావ్‌’ ప్రభుత్వ (బిజెపి) అసలు రంగు బయటపెట్టింది.
సామాజిక పరిణామంలో మొదట స్త్రీలకు మంచి గౌరవం ఉండేది. మాతృస్వామిక వ్యవస్థే ఇందుకు ఉదాహరణ. ఆ తరువాత వ్యక్తిగత ఆస్తి, వర్గ సమాజం ఏర్పడ్డాక స్త్రీలకు ఆస్తిహక్కు లేకుండా పోయింది. దీంతో స్త్రీలకు విలువపోయి వంటింటి కుందేలైంది. ఇదే నేటి వరకు కొనసాగుతూ ఉంది. సరిగ్గా వివక్ష ఇక్కడే మొదలైంది. స్త్రీలను రెండు రకాల బానిసలుగా మార్చివేసింది వర్గ సమాజం. ఇంటి బయట జీతమిచ్చే బానిసగా, ఇంట్లో జీతంలేని బానిసగా చేసింది. స్త్రీలు శ్రమచేయటం తప్ప వారికి ఆస్తిని కలిగి ఉండే హక్కు లేదు. ఇది స్త్రీలను పూర్తిగా బలహీనపరిచింది. అప్పటి నుండి నేటి వరకు స్త్రీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారు. స్త్రీల దోపిడీకి, వివక్షకు మూలం పెట్టుబడిదారీ మార్కెట్‌ ఉత్పత్తి విధానం. ఆర్థిక అసమానతలతో కూడిన ఈ విధానం నశించాలి. అందుకు మరో స్వాతంత్య్ర పోరాటం జరగాలి. సోషలిస్ట్‌ వ్యవస్థలు ఏర్పడాలి. సోషలిస్ట్‌ వ్యవస్థలో సామాజిక ఉత్పత్తిలో శ్రమ విముక్తి జరిగి స్త్రీల భాగస్వామ్యం పెరిగి వారి విముక్తికి దారి తీస్తుంది. ఇదే స్త్రీ విముక్తికి, అన్ని సామాజిక సమస్యల పరిష్కారానికి మార్గం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img