నూతలపాటి రవికాంత్
ఆన్‌లైన్‌లో విద్యార్థులకు డిజిటల్ విద్య పేరుతో కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీలు దోపిడీ చేస్తున్నాయి. భౌతిక తరగతులు జరగకపోయినా లక్షల రూపా యల ఫీజులను తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నాయి. వీటిని నియంత్రించా ల్సిన ప్రభుత్వాలు చోద్యం చూడడం మినహా వాటిపై కొరడా రaుళిపించలేక పోతున్నాయి. సరైన వ్యాయామం లేక విద్యార్థులు ఇంటికే పరిమితం కావడంతో చిన్నతనం నుంచే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అంథత్వం కోరి తెచ్చుకోవడమవుతోంది. స్థూలకాయం వలన చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలను చాలామంది చిన్నారులు ఎదుర్కొంటున్నారు.
విద్య మానవుడి ప్రాథమిక హక్కు, ఈ విద్య ఆ దేశం పునాదులను నిర్మిస్తుంది. ప్రాథమిక పాఠశాలలో ప్రథమ ఉపాధ్యాయుడితో మొదలయ్యే చదువుల ప్రస్థానాన్ని ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ ఆచార్యుల ఆశీర్వాదంతో పూర్తి చేసుకుని ఎన్నో కలలతో బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతారు భావి పౌరులు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వలన అన్ని రంగాలలో కఠినమైన సవాళ్లు తలెత్తాయి. అన్నిటితో పాటు విద్యావ్యవస్థ స్తంభించింది.
భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాల, ప్రైవేటు యాజమాన్యాల, ఎయిడెడ్, కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాలలు సుమారు 20 లక్షలు. ఇందులో గరిష్టంగా ఉత్తర ప్రదేశ్‌లో 2.5 లక్షలు, అత్యల్పంగా లక్షద్వీప్‌లో 45 ఉన్నాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో 63,221 పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలు 45,013, ఎయిడెడ్ పాఠశాలలు 2346, ప్రైవేట్ పాఠశాలలు 15,862లలో 70-80 లక్షల మంది విద్యార్థినీవిద్యార్థులు చదువుకుంటున్నారు. కరోనా కాలంలో వీరందరికీ ‘‘ఆన్‌లైన్ విద్య’’ పేరుతో ప్రీకేజీ నుండి పిహెచ్.డి వరకు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. కానీ మనదేశంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించినా అవి అందరికీ అందుబాటులోకి రాలేదు. భారతదేశ జనాభా సుమారుగా 140 కోట్ల మంది ఉంటే ఇందులో ప్లే స్కూల్‌లో (0-4 సంవత్సరాల వయస్సు) ఉన్నవారు 8.4 శాతం, ప్రాథమిక పాఠశాలలో (5-12) చదువుతున్నవారు 13.4 శాతం, హైస్కూల్‌లో (13-17) విద్యనభ్యసిస్తున్నవారు 9 శాతం, కళాశాలలకు వెళుతున్నవారు (18-24) 12.4 శాతం, ఉన్నత విద్యాభ్యాసంలో ఉన్నవారు (25-34) 16.6 శాతం, పరిశోధన విద్యలో (35-44) 14.3 శాతం మంది ఉన్నారు.
ప్రధానంగా ఈ దేశంలో 2,50,000 గ్రామ పంచాయతీలు, 6 లక్షల గ్రామాలు కలిపి మొత్తంగా 64.1 శాతం జనాభా గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ గ్రామీణ ప్రాంతాలలో కేవలం సగం మందికి మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. 10 లక్షల మందికి పైగా నివసిస్తున్న 48 మహానగరాలలో మాత్రమే ఆన్‌లైన్ తరగతులు నిర్వహణ సజావుగా సాగుతోంది. 10 లక్షల లోపు నివసిస్తున్న 405 మధ్యస్థ నగరాలలో, లక్ష లోపు జనాభా కలిగిన 2500 పట్టణాలలో ఒక మోస్తరుగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి.
కరోనా కాలంలో సాంకేతిక తరగతులే కాకుండా 21 రకాల సాంకేతిక బోధనా సాఫ్ట్‌వేర్‌లు రావటం చూస్తుంటే విద్య ను ప్రభుత్వాలే వ్యాపారంగా మారుస్తున్నాయని అర్థమవుతోంది. ఈ మార్పులతో భవిష్యత్ తరాల విద్యార్థులు ఎలాంటి నైపుణ్యాలు సాధిస్తారన్నది సమాధానం లేని ప్రశ్న. యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి (3.6 బిలియన్ల మందికి) ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం లేదు. భారత్‌లో కనీసం 658 మిలియన్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులలో దాదాపు మూడిరట ఒక వంతు మంది సాంకేతిక తరగతులకు చేరలేకపోతున్నారు. చాలా మంది విద్యార్థులకు అవసరమైన మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్ ట్యాప్‌లు, కంప్యూటర్‌లు లేవు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రీ-ప్రైమరీ నుండి సెకండరీ స్కూల్ వరకు 500 మిలియన్లకు పైగా పిల్లలకు ఏ విధమైన సాంకేతిక సాధనాలూ అందుబాటులో లేవు, వీరిలో మూడొంతుల మంది అత్యంత పేద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తు న్నారు. సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల కారణంగా సాంకేతిక విద్యా హక్కుకు ఈ విద్యార్థులంతా దూరమవుతున్నారు.
వ్యాస రచయిత సెల్ 9704444108