బుడ్డిగ జమిందార్
డోన్‌బాస్ రిపబ్లికుల స్వాతంత్య్రాన్ని రష్యా గుర్తించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు. ఫిబ్రవరి21సోమవారంనాడు రష్యా భద్రతా కౌన్సిల్, రక్షణమంత్రిత్వ శాఖలతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకొన్నాడు. డిపిఆర్ (డోనెట్క్స్ పీపుల్ రిపబ్లిక్), ఎల్‌ఎన్‌ఆర్ (బహాన్క్స్ పీపుల్ రిపబ్లిక్)లను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలనే చర్చ ఎప్పటినుండో జరుగుతోంది. ఈ రెండు రిపబ్లిక్‌ల భూభాగాన్ని డోన్‌బాస్ ప్రాంతంగా ఉక్రెయిన్‌లో పిలుస్తారు. రష్యన్లు మెజారిటీగా ఉన్న ఈ భూభాగంలో ఇప్పటికే 12 లక్షల మంది రష్యా పాస్‌పోర్టు కావాలని కోరుకొంటున్నారు. ఈ రిపబ్లికులను రష్యా గుర్తించకపోతే మానవతా విపత్తు, మారణహోమం జరిగే ప్రమాదముందని రష్యా ఫెడరేషన్ ఎగువసభ ఛైర్ ఉమెన్ వాలెంటీనా మాట్విమెంకో అంటున్నారు. మిన్క్స్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించడమే కాక స్లావిక్ ప్రజల మధ్య రక్తపాతం సృష్టించినట్లు గానే ఉక్రెయిన్‌రష్యా మధ్య సృష్టించాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆమె అన్నారు. మిన్క్స్ ఒప్పందాన్ని అమలు చేయని కారణం చేతనే మేమీ నిర్ణయం తీసుకొన్నామని రష్యా ప్రధాని మికైల్ విషుస్తీన్ అభిప్రాయపడ్డాడు. 2014లో అమెరికా మిత్ర దేశాలు ప్రోత్సహించిన రష్యా అనుకూల ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటును డోన్‌బాస్ ప్రజలు వ్యతిరేకించారు. స్వతంత్రంగా ఉంటామని ఈ ప్రాంత ప్రజలు ప్రకటించుకొన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వానికి
డోన్‌బాస్ తిరుగుబాటుదార్లకు మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 15 వేల మంది చనిపోయారు. కనీసం 25 లక్షల మంది ప్రజలు ఇళ్లను వదిలి వలసపోయారు. కార్కోవ్, నికోలాయెవ్, ఓడెస్సా నగరాల్లోని చాలామంది ప్రజలు ఊచకోతకు ప్రభుత్వ దమనకాండకు గురైనారు. డోన్‌బాస్ ప్రాంతం దక్షిణాన అజోన్ సముద్రం వ్యూహాత్మక నల్లసముద్రంతో కల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌ను సముద్ర రవాణాతో దిగ్బంధనం చేయాలంటే నల్ల సముద్ర నౌకాశ్రయ నగరం ఓడేసే చాలా కీలకమైనది కూడా. ఇది డోన్‌బాస్ ప్రాంతానికి పశ్చిమాన ఉంటుంది.
మిన్క్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించి డోన్‌బాస్‌లో ఉక్రెయిన్ ప్రభుత్వం దమన కాండకు దిగుతుందని, కనుకనే ఈ ప్రాంత రెండు రిపబ్లికులను దౌత్యపరంగా గుర్తించవల్సి వచ్చిందని పుతిన్ అంటున్నాడు. హింస, రక్తపాతాన్ని సృష్టించి డోన్‌బాస్ సమస్యకు మిలిటరీ అణచి వేత పరిష్కారమనుకొంటున్నారని పుతిన్ అన్నాడు. పుతిన్ ప్రకటనని నాటో జనరల్ సెక్రటరీ స్టోల్టెన్ బెర్గ్ ఖండిరచి, ‘‘ఇది ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను బలహీనపర్చటమేగాక మిన్క్స్ ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని, సంఘర్షణ పరిష్కారాలను నాశనం చేస్తుందని’’ అన్నాడు. రెండు రిపబ్లిక్‌లలో పెట్టుబడులు పెట్టనీయకుండా ఆంక్షలు విధిస్తామని శ్వేతసౌధం నుండి ఒక ప్రకటన వెలువడిరది. ఈయూ దేశాలప్రతినిధి ఊర్సులా ఖండిస్తూ, రష్యా అంతర్జాతీయ న్యాయవ్యవస్థను ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
లెనిన్ ఉక్రెయిన్
పుతిన్ తన ప్రకటనలో ‘‘ఆధునిక ఉక్రెయిన్‌ను రష్యా సృష్టించింది. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే కమ్యూనిస్టు బోల్షివిక్ కమ్యూనిస్టు రష్యా సృష్టించింది. 1917 విప్లవం తర్వాత ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమైంది’’… ‘‘చారిత్రాత్మక రష్యా ఖర్చుతోనూ, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పోలెండ్ త్యాగంతో ఉక్రెయిన్ విస్తరించిందని, పోలెండు పశ్చిమాన జర్మన్ భూభాగంతో నష్టపరిహారం పొందిందని’’ పుతిన్ అన్నాడు. సోవియట్ రిపబ్లిక్‌ల నుండి క్రిమియా ప్రాంతాన్ని విడగొట్టి 1954లో కృశ్చేవ్ ఉక్రెయిన్‌కు కట్టబెట్టాడని పుతిన్ గుర్తు చేసాడు. బోల్షివిక్ విధానం ఫలితంగా సోవియట్ యూనియన్ ఉక్రెయిన్ ఉద్భవించిందనీ, ఈ కారణాలతో నేటికీ వ్లాదీమీర్ ఇల్యెచ్ లెనిన్ ఉక్రెయిన్‌గానే పిలుస్తారని, ఉక్రెయిన్ రచయిత, వాస్తుశిల్పి లెనినే’’ అని పుతిన్ అన్నాడు. ‘‘ఈ రోజు ఇందుకు కృతజ్ఞతగా లెనిన్ విగ్రహాలను కూల్చివేసారు, కమ్యూనిజాన్ని రూపుపామాలనుకుంటున్నాడు. కమ్యూనిజాన్ని రూపు మాపాలంటే విగ్రహాలను కూల్చటం కంటే కమ్యూనిస్టులు సృష్టించిన ఉక్రెయిన్‌లో డీపీఆర్, ఎల్‌పీఆర్ ప్రాంతాల రిపబ్లిక్‌లకు సార్వభౌమాధికారం కావాలని అది గుర్తించటానికే నేనీ అడుగు వేసాను’’ అని పుతిన్ అన్నాడు. దీంతో పరోక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక, రష్యా సామ్రాజ్యకాంక్షను పుతిన్ తెలియజేయటానికి ప్రయత్నించాడు. పాశ్చాత్య కూటమిలోకి ఉక్రెయిన్ ప్రవేశం రష్యా భద్రతకు ప్రత్యక్ష ముప్పనీ, ఉక్రెయిన్‌లో ఇప్పటికే స్థాపించిన సైనిక స్థావరాలు రాజ్యాంగ విరుద్ధమని, నాటోలో భాగంగా ఉక్రెయిన్‌ను ఒక స్ప్రింగ్ బోర్డుగా ఉపయోగించు కొంటోందని, దీంతో మాస్కో ప్రత్యక్ష ప్రత్యర్థి మాస్కోపై దాడికి సిద్ధమైతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించాడు.
డా. టి. సురేష్‌బాబు స్పందన
మంగోలియా, అర్మేనియా దేశాల్లో రాయబారిగా సేవలందించి మాస్కో, మిన్క్స్‌లలోని భారత రాయబార కార్యాలయాల్లో ఉన్నత పదవులను అలంకరించిన మన విజయవాడ పౌరుడు డాక్టర్ టి. సురేష్ బాబును (ప్రథమ మేయరు టి. వెంకటేశ్వర్రావు ద్వితీయ కుమారుడు) తాజా పరిస్థితులపై విశ్లేషించమని కోరినప్పుడు…. ‘‘డిపిఆర్, ఎల్‌ఎన్‌ఆర్‌లను పుతిన్ గుర్తించటం ద్వారా మిన్క్స్ ఒప్పందాల నుండి రష్యా తప్పుకొందనీ, తద్వారా మాస్కో ఇప్పుడు కఠిన ఆంక్షలు ఎదుర్కోనుందని, దీనికై భారీ మూల్యాన్ని మాస్కో చెల్లించుకోవల్సి వస్తుందని అన్నారు. దీనివల్ల రష్యన్ జాతీయ ఆర్థిక బడ్జెట్‌పై భారం పడుతుందని, రష్యా వైఖరిని భారత్`చైనాలు సమర్థించకపోవచ్చునని, దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. పుతిన్ ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్ ప్రక్రియను వేగవంతం చేసారు. అతను సోవియట్ యూనియన్ తరహా నిర్మాణాన్ని కోరుకొంటున్నారు. ఈరోజు మాస్కోకు అర్మేనియా అధ్యక్షుడు సాషిన్సన్‌ను, అజర్‌బైజాన్‌కు చెందిన అలియేవ్‌లను ఆహ్వానించాడు. పుతిన్ తన రాజకీయ జీవితంలో పెద్ద జూదం ఆడుతున్నాడు. నాటోలో ఏదేని దేశం చేరాలంటే ముందస్తు షరతుల్లో ఒకటిగా ఆ దేశంలో విభేదాలు ఉన్న భూభాగాలు కలిగి ఉండకూడదని, నేడు ఉక్రెయిన్‌కు క్రిమియా, డోన్‌బాస్ ప్రాంతాలు వివాదమైనవి గనుక నాటో సభ్యత్వం అంత సులభం కాకపోవచ్చునని సురేష్‌బాబు అన్నారు. 2008లో పుతిన్ ఇదే ఎత్తుగడను జార్జియాలో అమలుచేసాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోకూడా అలాంటి ఎత్తుగడతోనే నాటో ప్రవేశాన్ని పుతిన్ నిరోధించగల్గుతున్నాడు’’ అని అన్నారు.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు 9849491969