Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

తగ్గిన ప్రైవేటు పెట్టుబడులు

అంతర్జాతీయంగా పెచ్చురిల్లిన ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి పతనం వంటి పరిణామాలు 2021 ఏడాది చివరి త్రైమాసికం నుంచి భారత్‌ బాహ్యరంగాన్ని తీవ్ర ఒత్తిళ్ళకు గురిచేస్తూ వస్తోంది. సన్నగిల్లిన ప్రైవేట్‌ పెట్టుబడులు, కలవరపెడుతున్న ద్రవ్యోల్బణం, ఆందోళన రేకెత్తిస్తున్న నిరుద్యోగిత, పెరుగుతున్న వాణిజ్యలోటు, కరెంటు ఖాతాలోటు, రూపాయి పతనం వంటి ఆర్థిక ప్రతికూలతల మధ్య కేంద్ర ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1 న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి పతనాన్ని అరికట్టడానికి ఆర్‌బీఐ మానిటరీపాలసీ కమిటీ రంగప్రవేశం చేయవలసిన పరిస్థితి ఏర్పడిరది. 2022లో ప్రారంభమైన రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంతో కరెంట్‌ ఖాతాలోటు 2022 జూన్‌ త్రైమాసికానికి 2.8 శాతానికి ఎగబాకింది. 2013 తర్వాత ఇదే అత్యంత అధికలోటు. 2022 రెండో త్రైమాసికంలో కూడా దిగుమతులు 25 శాతం పెరుగుదలతో రు.12.16 లక్షల కోట్లు నమోదుకావడం, ఎగుమతులు ఆ స్థాయిలో పెరగకపోవడంతో సీఏడీ ఎక్కువైంది. యుఎస్‌ ఫెడ్‌ రిజర్వు భారీస్థాయిలో వడ్డీరేట్లను పెంచడంతో సెప్టెంబరు 2022 వరకు డాలరు బలపడిరది. ఆ తర్వాత వడ్డీరేట్లను సడలించడంతో సెప్టెంబరులో డాలరు ఆరు శాతానికి దిగజారింది. ఈ పరిణామం రూపాయిపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, డాలరు ఆధారిత దిగుమతుల విలువ తగ్గడానికి ఉపకరించింది 2022 జూన్‌లో పతాకస్థాయికి వస్తువుల ధరలు చేరిన తర్వాత తగ్గడం ప్రారంభం దీనికి తోడైయింది. ముఖ్యంగా భారత్‌ అత్యధికంగా దిగుమతి చేసుకొంటున్న ముడి చమురు ధరలు 66శాతం తగ్గడం, రష్యా 40శాతం రాయితీతో చమురు సరఫరాతో కొంత ఉపశమనం కలిగించాయి. జి`7 దేశాలు భారత్‌కు రష్యన్‌ చమురు సరఫరాధరపై విధించిన పరిమితి గత డిశెంబరు నుంచి అమలు చేయవలసి ఉన్నప్పటికీ, భారత్‌ రష్యా నుంచి అదే రేటుకు నేటికీ కొనసాగిస్తుండడం గమనార్హం. ఫలితంగా సగటున రోజున 1.4 మిలియను బేరళ్ళు 2022 డిశెంబరులోనూ, 1.2 మిలియను బేరళ్ళు జనవరి 2023 లోనూ దిగుమతి చేసుకోవడంతో రష్యా భారత్‌కు ముడిచమురు విషయంలో ప్రథమ సరఫరాదారుగా నిలిచింది. అంతేగాక గత జనవరి-అక్టోబరు మధ్యకాలంలో రు.1,70,000 కోట్లు విదేశీ పెట్టుబడులు వెనక్కి మరలినా, నవంబరు నుంచి ఈక్విటీ, రుణాల రూపంలో రు.40,000 కోట్లు తిరిగి దేశ ఆర్ధికవ్యవస్థలోకి ప్రవహించాయి. వాణిజ్యలోటును తగ్గించడంలో ఇవన్నీ బాగా ఉపయోగపడ్డాయి.
భారత దిగుమతుల్లో ముడిచమురు, బొగ్గు, మెషినరీ, వాటి పరికరాలు వంటివి ముఖ్యమైనవి. వీటి దిగుమతులు, వినియోగం పెరిగితే, దీర్ఘకాలంలో దేశాభివృద్ధి భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. బంగారం దిగుమతుల విషయంలో ప్రభుత్వం అధిక దిగుమతి పన్నులు విధిస్తున్నప్పటికీ, వాటి ప్రభావం దిగుమతులను కట్టడి చేయండంలో ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో వాణిజ్యలోటును నియంత్రించాలంటే ఎగుమతులను పెంచడమే కాకుండా దిగుమతులను కట్టడిచేసే ప్రయత్నాలు చేపట్టాలి. చైనా ఉత్పత్తి కోవిడ్‌ నిబంధనల కారణంగా స్తంభించడంతో ఉత్పత్తి, ఎగుమతులు చేసే పరిస్థితి కోల్పోయింది. దీనితో దేశీయ కంపెనీలకు వివిధ ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ఉత్పత్తులపెంపు, ఎగుమతులుచేసే అవకాశాలు ప్రభుత్వం కల్పించ వలసిఉంది. పియల్‌ఐ పథకాన్ని మరింత విస్తరింపజేయాలి. అలాగే మేక్‌ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌, చైనా ప్లస్‌ ఒన్‌ వ్యూహం వంటి నినాదాలను మరింత పబ్లిసిటీతో పారిశ్రామికవర్గాలకు చేర్చాలి. జూలైలో ఆర్‌.బి.ఐ ప్రవేశపెట్టిన రూపాయల్లో విదేశీ వాణిజ్య విధానంతో భారత్‌ విదేశీమారక నిల్వలను ఆదాచేయడంలో ప్రముఖపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ ప్రయోగం, రష్యాలో విజయవంతంగా అమలవుతోంది. దీనివల్ల భారత్‌కు రెండు లాభాలు 1) రష్యా తక్కువ ధరకు సరఫరా చేస్తున్నందున దేశీయ ముడిచమురు దిగుమతుల బిల్లు తగ్గడం 2) రష్యా విదేశీ వాణిజ్యంతో భారత్‌ వాణిజ్యలోటుతో రష్యాకు మన సరకుల ఎగుమతులను పెంచే అవకాశం ఏర్పడిరది. భారత్‌, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్‌ దేశాలతో రూపాయితో వ్యాపారానికై సంప్రదింపులు ప్రారంభించింది. యుఏఈ, ఆస్ట్రేలియా, ‘‘ఫ్రీ ట్రేడ్‌’’ ఒప్పందాలు విజయవంతమయ్యాయి. ఈయు, కెనడా, యుకే దేశాలతో ఈ కొత్త ఏడాదిలో జరగబోయే సంప్రదింపులు సఫలమవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనావేస్తున్నాయి.
డా.యస్‌.వై.విష్ణు, సెల్‌: 9963217252

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img