Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

తరలిపోతున్న అపార ఖనిజ సంపద!

భారతదేశంలో అపారమైన ఖనిజ సంపద ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న మూడవ దేశం భారతదేశం. ఈ ఖనిజాలను ప్రజల జీవితానికి ఉపయోగపడేలా చేయాలి. భారతదేశంలోని ఖనిజ సంపద మీద దేశ ప్రజలందరికీ హక్కులు ఉంటాయని భారత జాతీయోద్యమం పేర్కొంది. ఖనిజ సంపద ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తికాదని చెప్పింది. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గనుల, ఖనిజ సంపదను జాతి సంపదగా గుర్తించి వాటిని నియంత్రించి, అభివృద్ధిచేసి పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం అప్పగించింది.
దేశ పాలకులు ఆ రాజ్యాంగం అప్పగించిన బాధ్యతను కూడా ఉద్దేశ పూర్వకంగా విస్మరించి, ఇతర రంగాల మాదిరిగానే ఖనిజ రంగాన్ని కూడా సామ్రాజ్యవాద కంపెనీలకు, ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద కంపెనీల దోపిడీకి నెహ్రు దగ్గర నుండి మోదీ వరకు నిలయంగా మార్చారు. మోదీ ప్రభుత్వం గత పాలకులకు మించి ఖనిజ సంపద, గనులు, అటవీ భూములను ప్రైవేట్‌ వ్యక్తుల, బహుళజాతి సంస్థల పరం చేస్తున్నది. ఫలితంగా దేశ ఖనిజసంపద విదేశాలకు తరలిపోతున్నది.
భారతదేశంలో 95 రకాల ఖనిజాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి విలువ 24 లక్షల కోట్లు. 501 మిలియన్‌ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. దేశం నుంచి కొన్ని లక్షల టన్నుల ఖనిజాలు, ముడిలోహాలు బహుళజాతి సంస్థల కార్ఖానాలకు, గిడ్డంగులకు తరలివెల్తున్నాయి. వేల కోట్ల రూపాయల్లో వీటి విలువఉంటుంది. ఖనిజాల వ్యాపారం ద్వారా స్వదేశీ, విదేశీ వ్యాపారులు వేల కోట్లు సంపాయిస్తున్నారు. ఖనిజ నిక్షేపాలు ఎవరి నేలలో ఉన్నాయో, వాటిని ఎవరు తవ్వి తీస్తున్నారో, వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఖనిజాలు ఉన్న ప్రాంతాలు, ఆదివాసి, 5వ షెడ్యూల్‌, 1/70 ప్రాంతాలు ఒడిస్సాలో ఉన్న 2/ఆఫ్‌ చట్ట సవరణ ప్రాంతాలనుంచి ఖనిజ దోపిడీ నిరంత రాయంగా కొనసాగుతున్నది. ఒడిస్సా, జార్ఖండ్‌, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాలలోని ఖనిజ నిల్వలను బహుళ జాతిసంస్థల అక్రమంగా తరలించుకు పోతున్నాయి. కర్ణాటకలో గాలి జనార్ధనరెడ్డి గనుల త్రవ్వకాలు దేశంలో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
దేశంలో గనుల త్రవ్వకం, ఖనిజాల వాడకం బ్రిటిష్‌ వలస పాలనలోనే మొదలైంది. భారత ఉప ఖండంలోని సహజ వనరులను కొల్లగొట్టి తమ దేశానికి తరలించుకు పోయి ముడి సరుకుగా వాడు కున్నారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే 1774లో రాణిగంజ్‌ లో మొదటి ఆధునిక బొగ్గు గనిని తెరవటంతో, భారతదేశంలో పరాయిదేశాల ఖనిజ తరలింపు ప్రారంభమైంది. 1851లో బ్రిటిష్‌ ప్రభుత్వం జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను ప్రారంభించింది. భూగర్భ గనుల శాఖను 1887లో ఏర్పాటు చేసింది. గనుల కోసం 1885లో భూ సంస్కరణల చట్టం చేసింది. 1923 భారత గనుల పాలనా చట్టం వంటి చట్టాలు చేసింది.
భారత పాలకులు ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం గనులను, ఖనిజాభి వృద్ధిని కేంద్ర జాబితాలోనూ, రాష్ట్రాల జాబితాలోనూ చేర్చింది. చమురు క్షేత్రాలు, చమురు సంబంధిత ఖనిజ విలువలు, పెట్రోలియం, వాటి ఉత్పత్తులు, నియంత్రణ, అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని ఇతర గనులు, ఖనిజాలు 1957 చట్టం ద్వారా భారత ప్రభుత్వం వృద్ధిరాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. గనులు, ఖనిజాల (నియంత్రణ- అభివృద్ధి) చట్టం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం అల్యూమినియం, రాగి, జింక్‌, సీసం, బంగారం, నికిల్‌ వగైరా ఖనిజాలు కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కిందకు తెచ్చారు. ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌, మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారత అల్యూమినియం కంపెనీ, హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ వంటి కేంద్ర సంస్థలు ఏర్పడ్డాయి. భారత అల్యూమినియం కంపెనీని, హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ కంపెనీని ప్రైవేటీకరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖనిజాభి వృద్ధి సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కొన్ని సంస్థలను ఏర్పాటు చేశాయి. ఇవన్నీ కూడా దేశ ప్రయోజనాలకు కాకుండా ప్రైవేట్‌ వ్యక్తుల, సంస్థల ప్రయోజనాలకే దోహద పడ్డాయి, పడుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని గనుల శాఖలు, సంస్థలు ప్రజాను కూలంగా ఖనిజాలను వెలికితీసి ఉంటే, ఖనిజ సంపద ప్రజలకు అందేది, కాని అలా జరగలేదు. పాలకులు అలాంటి విధానాలు అమలు జరపలేదు.
1947 నుంచి భారత పాలకులు గనుల రంగాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెప్పే విధానాలనే అనుసరించారు. 1957 చట్టంలో గనుల త్రవ్వకానికి ప్రైవేట్‌ వ్యక్తులకు, సంస్థలకు అప్పగించే వీలు కల్పించారు. 1960లో వెలువడిన ఖనిజాల రాయితీ నిబంధనలు ప్రైవేట్‌ వ్యక్తుల, సంస్థల చేతికి ఖనిజ నిల్వలు కట్టబెట్టటానికి అవసరమైన విధి విధానాలు రూపొందించారు. ఆర్థిక సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత 1988లో వెలువడిన ఖనిజాల సంరక్షణ, అభివృద్ధి నిబంధనలు ప్రైవేటీకరణ క్రమాన్ని పెంచాయి. 1993లో మొదటిసారిగా తయారైన జాతీయఖనిజవిధానం పూర్తిగా ప్రపంచీ కరణ శక్తుల కనుసన్నల్లో బహుళ జాతిసంస్థల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా తయారుచేశారు. 1994లో మరింతగా చట్ట సవరణ చేసి ఇనుప ఖనిజం, రాగి, మాంగనీస్‌, సీసం, క్రోమియం, ఖనిజం, జింక్‌, గంధకం, బంగారం, వజ్రాలు, నికిల్‌ మొదలైన ఖనిజాలలోకి పెద్దఎత్తున ప్రైవేట్‌ సంస్థల, బహుళ జాతిసంస్థల ప్రవేశానికి అవకాశం కల్పించారు. ఈ అవకాశం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యు కె, దక్షిణాఫ్రికాకు చెందిన బహుళ జాతిసంస్థలు నేరుగాను, దళారుల ద్వారా ఈ రంగాల్లోకి ప్రవేశించాయి. 2006లోనూ చట్టంలో అనేక మార్పులు జరిగాయి. ఖనిజాల వ్యాపారంలో విపరీత లాభాలు ఉండటంతో స్థానిక పెత్తందార్లు, వ్యాపారులు, అధికారులు, రాజకీయ నాయకులు కలగలసి మాఫియాగా ఏర్పడిరది.ఈ మాఫియా బహుళ జాతి సంస్థలతో చేతులు కలిపింది. ప్రభుత్వ అనుమతులప్రకారం గనులు తవ్వితేనే 99శాతం లాభాలు వస్తుంటే, అక్రమత్రవ్వకాల ద్వారావచ్చే లాభాలను ఊహించటం కష్టం. వారికివచ్చే లాభాల్లో ఒకశాతం మాత్రమే ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌ దేశంలోని ఖనిజ విలువలు, సంపదలో రెండవ స్థానంలోఉంది. రాష్ట్రంలో 50 పారిశ్రామిక ఖనిజాల వెలికితీత, ఉత్పత్తి జరుగుతున్న ది. పెద్దఎత్తున వీటి వ్యాపారంలో పారిశ్రామిక వేత్తలు వేల కోట్ల లాభాలు పొందుతున్నారు. దేశ ఖనిజ సంపద ద్వారా వ్యాపారం చేస్తున్న బహుళ జాతిసంస్థలు- కెనడాకు చెందిన ట్రాన్స్‌ వరల్డ్‌ గార్నెట్‌ కంపెనీ, యుఎస్‌ఏ కిచెందిన పిల్స్‌ డాడ్జ్‌ ఎక్స్‌ ప్లోరేషన్‌ కంపెనీ, ఆస్ట్రేలియాకు చెందిన బిఎచ్‌పి బిల్లిటన్‌, కెనడాకు చెందిన వెబుల్‌ క్రిక్‌ రిసోర్సెస్‌ కార్పొరేషన్‌, యుకె కి చెందిన రియో టింటో మినరల్స్‌ డెవలప్‌ మెంట్‌ లిమిటెడ్‌, దక్షిణాఫ్రికాకు చెందిన డి బీర్స్‌ కన్సాలిడేటెడ్‌ మైన్స్‌ లిమిటెడ్‌, దక్షిణ కొరియాకు చెందిన పోస్కో, రష్యాకు చెందిన ఎంఎంకె, బ్రిటన్‌ నెదర్లాండ్‌కు చెందిన కోరస్‌, భారతదేశంలో జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ స్టీ, టాటా స్టీల్‌, ఎస్సార్‌ స్టీల్‌, యుకె కు చెందిన వేదాంత రిసోర్సెస్‌ మొదలైనవి ముఖ్యంగా ఉన్నాయి.
దేశ ఖనిజ వనరులను, అటవీ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు, బహుళ జాతి సంస్థల కట్టబెట్టటానికి అడ్డంకిగా ఉన్న 1957 అటవీ హక్కుల పరిరక్షణ చట్టంలో మోదీ ప్రభుత్వం ముఖ్యమైన సవరణలు చేసింది. ఆ సవరణల ద్వారా అడ్డంకులు తొలగించి ఖనిజ సంపదను, అటవీ భూములను కార్పొరేట్ల పరం చేయటానికి సిద్ధమైంది. దీని ఫలితం ఆదివాసీ గిరిజన ప్రజలు భూములు, నివాస ప్రాంతాలు కోల్పోయి నిరాశ్రయులు అవుతున్నారు, అవబోతున్నారు. దేశ ప్రజలు సంపద కోల్పోతున్నారు.
బొల్లిముంత సాంబశివరావు, సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img