జి.ఓబులేశు
రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నది. బండరాయి ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. రాజకీయ మనుగడకు ప్రత్యర్థి వర్షాలపై పగలు, కక్షలు, కార్పణ్యాలు. ప్రజలపై ఎందుకింత అక్కసు అనుకున్నా.. ముఖ్యమంత్రే స్వయంగా నేను రాచరిక వ్యవస్థలో నిర్దయులైన ప్రభువులు ప్రజలను ఎలా వేధించేవారో.. నేను దానికి సరిగ్గా అతికే మనిషినని చెప్పుకుంటున్నాడు. రాష్ట్రంలో 670 మండలాల్లో 444 మండలాల్లో కరువుతో తీవ్రమైన దుర్భిక్షం నెలకొందని, ఖరీఫ్, రబీ సీజన్లు రెండూ నిర్ధారించిన తరువాతనైనా మస్తిష్కంలో మెదడు, హృదయంలో చలనం ఉంటే మనిషి ఆలోచిస్తాడు. శరీరంలో కదిలక ఉంటుంది. బండబారిన ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ఆ స్పందనలు లేవని అర్థమవుతున్నది. కేవలం 108 మండలాలు మాత్రమే కరువుకు గురయ్యాయని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కేంద్రానికి నివేదికలు పంపకుండా, కేంద్ర పరిశీలక బృందాలను ఆహ్వానించక, తాత్కాలికంగానో, శాశ్వత పాత్రిపదికనో ఇంత సహాయం చేయమని అడగకుండా ఎలాపొద్దు పుచ్చుతున్నారు. కేంద్రానికి నిన్నటి వరకు నివేదికలు పంపకుండా పరిశీలక బృందాలను ఆహ్వానించకుండా, శాశ్వత ప్రాతిపదికన నష్టం ఎంత వచ్చిందో తెలియకుండా రూ.660 కోట్లు సహాయం కావాలని ఎట్లా అడుగుతారు. రాష్ట్రంలో 86లక్షల ఎకరాల్లో విత్తనం వేయాల్సి ఉంటే కేవలం 68 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనం వేస్తే అన్ని రకాల పంటలతో కలిపి 80లక్షల ఎకరాల్లో పంటలే పెట్టకపోతే 660 కోట్లు నష్టం అని ఎలా నిర్ధారిస్తారు. ఎకరానికి లక్ష రూపాయలు దిగుబడి వచ్చినా 80 లక్షల ఎకరాలకు 15వేల కోట్లు నష్టం రైతుకు వాటిల్లుతుంది. ఇది కంటికి కనపడని, అధికారులకు అందని నష్టం. పాలకుడు నీతి బాహ్యుడైతే నడిపించే అధికార యంత్రాంగానికి ఏమి తెగులుసోకింది? ఇది రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెల్లినా జనం నుండి వినిపించే మాట. ఈ మధ్య సీపీిఐ మూడు ప్రతినిధి బృందాలు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల కరువు పరిశీలన చేసింది. అందులో వార్తల్లోకి రాని అధికారులు, చూపునకు అందని, అంచనాలకూ దొరకని అనేక యదార్థ బాధామయ గాధలు కనిపించాయి. ఈ వ్యాసకర్త ఓబులేసు, రామచంద్రయ్యలు స్థానిక జిల్లా పార్టీలు, రైతు సంఘాల నాయకులతో అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల పర్యటనలో రైతులు, ఇతర గ్రామీణ, కష్టజీవులు ఎదుర్కొంటున్న ఒకటి, రెండు సమస్యలు ప్రస్తావించుకోవాల్సి ఉంది.అనంతపురం జిల్లా కూడేరు మండలం రైతుబాట పోలప్ప తనకున్న 5 ఎకరాల పొలంలో ఎకరాకు 80వేలు పెట్టుబడిపెట్టి విత్తనాలు, ఎరువులు, సేద్యాలు, పురుగు మందులకు ఖర్చు చేస్తే పశువులకు మేత కూడా దక్కకుండా పైరంతా ఎండిపోయిందని విలపించాడు. ఈ లెక్కన 5 ఎకరాలకు లక్ష 50వేలు పెట్టుబడి- కుటుంబ సభ్యుల చాకిరీకి విలువలేదు. పెట్టిన పెట్టుబడి లక్ష 50వేలు అయితే, సకాలంలో వర్షాలు వచ్చి పైర్లు పండితే ఎకరాకు 20 బస్తాల లెక్కన 100 బస్తాల వేరుశెనగలు-వీటివిలువ- ఇదంతా రైతు నష్టపోయాడు. కంటికి కానరాని ఈ కష్టాలు ఎవ్వరికి చెప్పుకోవాలి. GIరావాల్సిన దిగుబడికి లెక్కకట్టి ఇవ్వకపోయినా ఎకరానికి 80వేలు ఇన్‌పుట్ సబ్సిడీ రైతు అడిగితే నేరమా? 70, 80 రోజులకు చేతికి వచ్చే పంట కొర్రలు, మినుములు, ఉలవలు, బుడ్డ శనగ తదితర పంటలకు విత్తనాలు, ఎరువులు, మందులు, సబ్సిడీ ధరలకు అందిస్తే రైతు బతికి బట్టకడతాడు కదా? కానీ మన మూర్ఖ పాలకులకు అది ఇష్టం ఉండదు. కష్టజీవుల స్వేదం నుండి, ఒనకూడిన సంపద నుండి లక్షల కోట్లు బ్యాంకు ఎగవేతదారులకు, ప్రజలను పీల్చి పిప్పిచేసే కార్పొరేటు తిమింగలాలకు పాత అప్పులన్నీ రద్దు చేస్తున్నారు. రిజర్వు బ్యాంకు ఇండియా మాజీ గవర్నరు రంగరాజన్ కార్పొరేట్ కంపెనీలకు రాయితీ ఇచ్చిన, రద్దు చేసిన అప్పుల వివరాలను ప్రకటించారు. ముఖేష్ అంబాని లక్ష 87వేల 70 కోట్లు, అనిల్ అంబాని లక్షా 24వేల 956 కోట్లు, రూలీయా బ్రదర్స్ లక్ష 1వేయి 461కోట్లు, అనిల్ అగర్వాల్ లక్ష 8వేల 840 కోట్లు, గౌతం ఆదాని 96వేల 81కోట్లు, మనోజ్ గౌర్ 75వేల 165 కోట్లు, సజ్జన్ జిందాల్ ర్8వేల 171 కోట్లు , లాంకో మధు 47వేల 102 కోట్లు, జిఎంరావు 47వేల 976కోట్లు, విఎన్ ధూప్ 45వేల 400కోట్లు, జి.వి.కె రెడ్డి 88వేల 988కోట్లు ఈ విధంగా 28లక్షల కోట్ల మొండి బకాయిలు రద్దు చేశారు. వీరికి ఇంతకు పది ఇంతల ఆస్తులుఉన్నాయి. వాటిని అటాచ్ చేసి సగం రాబట్టినా రైతుల కష్టాలు తీరుతాయి. అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి, అప్పుల్లో చనిపోతున్న అన్నదాత రైతన్నకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వాలకు చేతులు రావడం లేదు. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం తిరిగి సంపాదించుకోవడానికి వడ్డీలేని, ఎటువంటి పూచీకత్తులేని రుణాలు తిరిగి ఇస్తున్నారు. ఏమైనా ఉద్యమాలు జరిగి రైతులు, ప్రజాసంఘాలు గట్టిగా అడిగితే కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమౌతుందని వాపోతున్నారు. 28లక్షల కోట్లలో సగం డబ్బులు రాబట్టినా దాన్ని రైతుల కష్టాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. అదే కుడేరు గ్రామంలో రమేష్ అనే రైతు తనకున్న 4 ఎకరాల భూమిలో అరటిచెట్లు నాటాడు. ఎకరాకు 1.50లక్షలు ఖర్చు. తన పొలంతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తంగా 12 లక్షలు పెట్టుబడి పెట్టినా చిటికినవేలు అంత లావు ఉన్నాయని అరటి కాయలు కొనేవాడు లేడు. తాడిపత్రి మార్కెట్‌లో టన్ను 20వేలు ఉంటే మధ్య దళారులు గ్రామాలపై పడి 15వేలకు ఇస్తే సరి.. లేకుంటే అంతే సంగతులు అంటున్నారని – సంగటి, కారానికి వచ్చినా సాల్లే అని ముందే బేరం కుదుర్చుకుంటున్నారు. పొరపాటున ఒక తడికినీల్లు వచ్చినా పంట దిగుబడి వస్తుంది. అదంతా దళారి జేబులోకే. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామ మొత్తానికి 7వేల ఎకరాలు భూమి ఉంది. అందులో వేరుశనగ 4వేలు, కంది 2వేలు, ఆముదం 1000 ఎకరాలు. మొత్తం పైర్లన్నీ ఎండిపోయాయి. భూములు ఎండమావులను తలపిస్తున్నాయి. ఇన్‌పుట్ సబ్సిడీ 40వేలు ఎకరాలు ఇచ్చి, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 200 రోజులు పనిని ఇచ్చి రోజు కూలి 600రూపాయలు అడుగుతున్నారు. ఇది నేరమా? ఇవ్వ సాధ్యం కానిదా? కేంద్రమే పనిదినాలు పెంచుతున్నాం.. కూలీ పెంచుతామంటున్నారు. కేరళ చేసి చూపించింది. జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా మేనమామ నియోజక వర్గం కమలాపురం దగ్గర ఉన్న చదిపిరాళ్ళ పల్లెకు వస్తే ఆ ఊర్లో ఉన్నది 1000 ఎకరాల పొలం. అందులో 500 ఎకరాల్లో విత్తనమే వేయలేదు. మినుములు, వేరుశనగ వేసిన 500 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. నవంబరు, డిసెంబరులో తుఫాన్లు వస్తే బుడ్డశనగ వేసుకుందామనుకుంటే అందులో కూడా అవినీతే. బయట మార్కెట్‌లో శనగలు రూ. 6000 ఉంటే, ప్రభుత్వం రూ. 8,500 పెట్టి కొని 80శాతం సబ్సిడీతో విత్తనాల సరఫరా చేస్తున్నామని బడాయి ప్రచారం చేసుకుంటున్నది. గ్రామంలో ఉన్న 1000 ఎకరాల్లో 500 ఎకరాల్లో విత్తనమే వేయక, వేసినది ఎండిపోతే అది కరువు గాక ఇంకేమిటి? రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడట. ఇక్కడ జిల్లాలో మామా అల్లుళ్ళ పరిస్థితి అలాగే ఏడుస్తున్నదని ఆ (గ్రామానికి చెందిన రైతులు భాస్కర్‌రెడ్డి, క్రిష్టారెడ్డి విలపిస్తున్నారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ అనుంగ శిష్యుడా? సుధీర్‌రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే నిర్వాకం వామికొండ, సర్వరాయ సాగర్ రిజర్వాయర్ల క్రింద ఆయకట్టు రైతుల బాధలు గురించి వివరించకపోతే నాకు (ఒకప్పుడు ఆ ప్రాంతానికి జెడ్పీటీసీ మెంబరుగా పనిచేసిన) మనసొప్పదు. జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలంలో ఒంటిగారిపల్లె అనే చిన్న గ్రామం వామికొండ రిజర్వాయరు ఆయకట్టు క్రింద ఉంది. అక్కడ 60 కుటుంబాలు, 170 జనాభా ఉంది. మునక గ్రామంగా తీసుకోనందున రిజర్వాయర్ నుండి నీటి వూట వచ్చి గ్రామాన్ని మొత్తం ముంచెత్తింది. జమ్ము, పీచు పడి 200 ఎకరాలు పొలం పాడైంది. దారులన్నీ మూసుకుపోయాయి. . పాములు, జర్రులతో జనం సహజీవనం . ఒకటికాదు, రెండు కాదు 4ఏండ్లుగా ఇదే బాధ. గ్రామాన్ని మునక ప్రాంతంగా ప్రకటించి ఇంటికో కోటి పరిహారం ఇస్తే ఇంకోచోటు సురక్షితంగా బ్రతుకుతారు. వామికొండ రిజర్వాయర్ ఉత్తర కాల్వ మరమ్మత్తులు చేస్తే, సర్కారు కంప తొలగించి పంట కాల్వలు తవ్వితే వ్యవసాయానికి నీరు దొరుకుతుంది. అంగట్లో అన్నీ ఉన్నాయి. అల్లుడి నోట్లో శని అని రిజర్వాయర్లలో నీళ్లుండి పంట పొలాలకు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం. ఇదే 8వేల 4కోట్లు ఖర్చు చేస్తే 11,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. రైతులు, ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుదాం అంటే కుదరదు. ఉద్యమించాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం, రాయచోటి, కడప ప్రాంతాల నుంచి వేలకు వేలు వలసలు అటు బెంగుళూరు, ఇటు చెన్నై నగరాలకు వెళ్లిపోతున్నారు. మనవారు పరాయి నేల మీద కడుపు చేతపట్టుకుని అవమానాలకు గురై జీవచ్చవంలా బతుకుతూ ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించి కరువు సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. పశువులకు ఉచితంగా మేత సరఫరా చేయాలి. కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ప్రతి కుటుంబానికి అవసరమైన మేర బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి. కరువు పనులు ప్రారంభించాలి. ఇందుకోసం రేపు 20,21 తారీఖుల్లో జరిగే సీపీఐ ఆందోళనలో ప్రజలంతా పాల్గొని జగన్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి.