Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

తాలిబన్‌ ధోరణిని వ్యతిరేకించాల్సిందే

జావెద్‌ అక్తర్‌

పన్నెండు రోజుల క్రితం (ఈ నెల 3వ తేదీన) ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన మాటలకు ఇంత పెద్ద స్పందన వస్తుందని ఊహించలేదు. ఒక వైపున కొంత మంది సాధ్యమైనంత కరకు భాషలో తమ కోపావేశాలను వ్యక్తం చేశారు. ఇంకో వైపున దేశం నలుమూలల నుంచి ఎంతోమంది జనులు నా అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తూ సంఫీుభావ సందేశాలను పంపించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. అయితే, ముందుగా ఛానల్‌ ఇంటర్వ్యూ నేపథ్యంలో నాపై ఆరోపణలు సంధించినవారికి బదులు ఇవ్వాలను కుంటున్నా. విమర్శించిన ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అందరికీ కలిపి ఒకేసారి చెబుతున్నా.
నేను హిందూ మితవాదులనే విమర్శించాననీ, ముస్లిం మతోన్మాదులకు వ్యతిరేకంగా ఒక్కమాటా అనలేదన్నది వారి ఆరోపణ. ముమ్మారు తలాక్‌ గురించి గానీ, పరదా గురించి గానీ లేదా ముస్లింల తిరోగమన విధానాల గురించి గానీ నేనేమీ మాట్లాడలేదని ఆరోపించారు. ఇన్నేళ్ళుగా నా కార్యకలాపాల గురించి ఏ మాత్రం తెలియనివారు చేసిన ఈ వ్యాఖ్యలకు నేనేమీ ఆశ్యర్యపోవడం లేదు. నేనేం చేశాను, ఏం చేస్తున్నాను అనేది అందరికీ తెలియడానికి నేనేమీ ప్రముఖ వ్యక్తిని కాను.
వాస్తవం ఏమంటే, గత రెండు దశాబ్దాల్లో నాకు రెండు సార్లు పోలీసు రక్షణ కల్పించారు. ఇందుకుకారణం ముస్లిం మతోన్మాదులనుంచి ప్రాణాపాయ బెదిరింపులు రావడమే. ఇందులో మొదటిసారి బెదిరింపులు వచ్చింది… మూడుసార్లు తలాక్‌ అంశం దేశవ్యాప్త సంచలనంగా మారకముందే దీనిని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు ‘లౌకిక ప్రజాస్వామ్యం కోసం ముస్లింలు (ఎంఎస్‌డి) అనే సంస్థతో కలిసి దేశంలోని హైదరాబాద్‌, అలహాబాద్‌, కాన్పూర్‌, అలీగడ్‌ లాంటి అనేక నగరాలకు వెళ్ళి ఎన్నో బహిరంగ వేదికలపై దీని గురించి ప్రసంగించాను. దీంతో నా ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు రావడం ప్రారంభమైంది. ఇదంతా ముంబయిలోని ఒక ఉర్దూ వార్తాపత్రికలోనూ ప్రముఖంగా ప్రచురితమైంది. ఇది 2007లో జరిగింది. అప్పటికి ముంబయి పోలీసు కమిషనర్‌గా ఉన్న ఎ.ఎన్‌.రాయ్‌ ఈ పత్రిక ఎడిటర్‌, పబ్లిషర్‌కు సమన్లు కూడా జారీ చేశారు. ఎలాంటి హింసాత్మక చర్యలు జరిగినా అందుకు ముంబయి పోలీసులు మీ పత్రికనే బాధ్యులుగా చేస్తారని హెచ్చరించారు.
మరోసారి 2010లో ప్రముఖ ముస్లిం మత ప్రభోదకుడు మౌలానా కాల్బ్‌ జావెద్‌తో కలిసి టెలివిజన్‌ చర్చలో పాల్గొన్నప్పుడు మూఢాచారం పరదాకు వ్యతిరేకంగా మాట్లాడా. ఇది మౌలానాకు అస్సలు నచ్చలేదు. దీనిపై లక్నోలో నా దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. నన్ను వ్యతిరేకిస్తూ మెయిల్స్‌ రావడమే కాదు, ప్రాణాలు తీస్తామనే బెదిరింపులూ మరోసారి వచ్చాయి. ఈ సందర్భంలోనూ ముంబయి పోలీసులు నాకు రక్షణ కల్పించారు. ముస్లిం మతోన్మాదులకు వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదని నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం.
తాలిబన్లను కీర్తిస్తున్నానని కొంతమంది నాపై ఆరోపణ చేశారు. ఇది పూర్తిగా అసంబద్దం. ఇలాంటి భావజాలం ఉన్న వారు ఎవరినైనా నేను గట్టిగా వ్యతిరేకిస్తాను. ఈ నెలలో టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వారం రోజుల ముందు గత నెల (ఆగస్టు) 24వ తేదీన ‘కిరాతక తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకోవడంపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఎలాంటి స్పందనా కనబరచకపోయినప్పటికీ ఇందులోని ఇద్దరు సభ్యులు గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేయడం దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిని ఇంతటితో వదిలేయరాదు. దీనిపై ఎంఎస్‌ఎల్‌బి తప్పనిసరిగా తన అభిప్రాయాన్ని తెలియజేయాలి’ అని ట్వీట్‌ చేశాను.
నేను మరోసారి నా అభిప్రాయాలను పునరుద్ఘాటిస్తున్నాను. ఎందుకంటే ముస్లిం మతంలోని తిరోగమన విశ్వాసాలు, ఆచరణలను నేను వ్యతిరేకించలేదన్న హిందూ మితవాద మద్దతుదారుల మాయమాటలను ఖండిస్తున్నాను.
హిందూయిజం, హిందువులను నేను అవమానించానని కూడా వారు ఆరోపించారు. ఇందులో లేశమాత్రం నిజం లేదు. ప్రపంచంలో హిందువులు అత్యంత మర్యాదపూర్వకమైనవారు, సహనశీలురు అని ఇటీవల ఇంటర్వ్యూలో పేర్కొన్నాను. నేను మళ్ళీమళ్ళీ ఇదే చెబుతున్నా. భారత్‌ ఎప్పుడూ అఫ్గానిస్థాన్‌ మాదిరిగా తయారవదు. ఎందుకంటే భారతీయులు స్వభావసిద్ధంగా తీవ్రవాదులు కాదు. పరిస్థితులకు తగినట్లుగా పరిధులకు లోబడి మధ్యేమార్గంగా ఉండడం అనేది వారి డిఎన్‌ఏలోనే ఉంది. నేను వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలకు ఎందుకు ఆశ్చర్య పోతున్నారు. కొంతమంది నా మాటలకు ఎందుకు బాధపడుతున్నారు. దీనికి సమాధానం ఏమంటే తీవ్ర మితవాదం, మతోన్మాదం ఏ మతంలో ఉన్నా నేను స్పష్టంగా ఖండిస్తున్నాను. ఏ మతానికి చెందినవారైనా మితవాదుల ఆలోచనలు ఒక్కతీరుగానే ఉంటాయి.
ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను సంఫ్‌ు పరివార్‌ అనుబంధ సంస్థల తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశాను. మతం, కులం, జాతి ఆధారంగా ప్రజల్లో చీలికలు తెచ్చే ఎలాంటి అలోచనలనైనా నేను వ్యతిరేకిస్తాను. ఇలాంటి వివక్షను వ్యతిరేకించేవారందరి తరపున నేను నిలబడతాను. భారతదేశంలోని అత్యంత ప్రముఖ ఆలయాల్లో ఒకటైన వారణాసిలోని ‘సంకట్‌ మోచన్‌ మందిర్‌’ 2018లో నన్ను ఆహ్వానించింది. ‘శాంతి దూత’ అనే బిరుదును, ట్రోఫీని ఇచ్చింది. దేవాలయంలో నన్ను మాట్లాడమని కూడా కోరారు. నాలాంటి నాస్తికుడికి ఇది అరుదైన గౌరవమే.
తాలిబన్‌లు, హిందూ మితవాదుల ఆలోచనల్లో అనేక సారూప్యతలు ఉన్నాయని నేను చెప్పినదానిపై విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవమేమంటే, వారి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయన్నది పచ్చినిజం.
తాలిబన్లు మతం ఆధారంగా ఇస్లాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హిందూ మితవాదులు హిందూ రాష్ట్రను (రాజ్యాన్ని) కోరుకుంటున్నారు. తాలిబన్లు మహిళల హక్కులను అణచివేస్తున్నారు, వారిని వెనక్కి నెట్టేస్తున్నారు. మహిళలు, బాలికలకు స్వేచ్ఛ ఉండరాదని హిందూ మితవాదులు స్పష్టంగా చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లు మొదలుకుని కర్నాటక వరకూ చాలా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, గార్డెన్లు, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళిన యువతీయువకులను నిర్దయగా చావగొడుతున్నారు.
ముస్లిం మతోన్మాదుల మాదిరిగానే హిందూ మితవాదులూ… తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు మహిళలకు ఉన్న హక్కును అంగీకరించడం లేదు. మహిళలకు స్వతంత్రంగా ఉండే సామర్థ్యం లేదని ఇటీవలే ఒక ప్రముఖ మితవాద నాయకుడు వ్యాఖ్యానించాడు. తాలిబన్ల మాదిరిగానే హిందూ మితవాదులూ మహిళలపై అన్ని రకాలుగా తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. మైనారిటీల విషయంలోనూ అంతే. మైనారిటీలపై హిందూ మితవాదులు తమ ప్రసంగాల్లో, నినాదాల్లో, పనుల్లో ఎలాంటి అవకాశం దొరికినా వారి ద్వేషపూరిత ఆలోచనలు, భావాలను వ్యక్తీకరించినట్లుగానే తాలిబన్లు వ్యవహరిస్తారు.
తాలిబన్లు, ఈ తీవ్ర మితవాద గ్రూపుల మధ్య ఉన్న ఏకైక తేడా ఏమంటే తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో నేడు ఎవరూ ప్రశ్నించలేని విధంగా అధికారాన్ని అందుకున్నారు. మన దేశంలో ఈ ‘భారతీయ తాలిబన్‌ ధోరణి’ ని శక్తిమేర ప్రతిఘటిస్తున్నారు. భారత రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమైన దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండిరటి మధ్య ప్రస్తుతం మనకు కనపడే కీలకమైన అంశమేమంటే తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. హిందూ మితవాదులు తమ లక్ష్యాన్ని అందుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఇది భారతదేశం, భారతీయులు గట్టిగా అడ్డుకుంటున్నారు.
(ది వైర్‌ సౌజన్యంతో)
వ్యాస రచయిత కవి, స్క్రీన్‌ రైటర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img