చింతపట్ల సుదర్శన్
‘ఇల్లేరా అన్నిటికీ మూలం, ఆ ఇంటి విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ అనే పాట వినిపించి ధ్యాన భంగమయింది డాంకీకి. దారినపోయే ఏ గంధర్వుడో ‘టైంపాస్’ చెయ్యడానికి పాడటం లేదుకదా అని కళ్లు అన్ని దిక్కులకూ ‘రివాల్వు’ చేసి చూసింది. తనూ, డాగీ తప్ప అక్కడ మరో నరమానవుని జాడేలేదు. డాగీ విన్నావా ఇక్కడెవరో పాట పాడారు. నాకు వినిపించింది. నీకు వినిపించలేదా అని అడిగింది. పాటా ఇంకెవరున్నారిక్కడ పాడటానికి? అంటే ‘వాట్ డూ యూ మీన్’ నువ్వే నా…నువ్వే పాడానంటావా ‘ఐ కాంట్ బిలీవ్’ అంది డాంకీ. లోకంలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ నమ్మలేని నిజాలే. కానీ నేను పాడానన్నమాట మాత్రం నువ్వు నమ్మితీరాల్సిన నిజం. నికార్సయిన నిజం. అవునా! నువ్వు ‘భౌ’ మనడమే కాక పాట కూడా పాడుతున్నావా. పైగా అదేదో సినిమా పాటకు పేరడీ రచించి గానం చేస్తున్నావంటే వాగ్గేయకారుడవన్న మాటే. సంగీతంలో నాకు పోటీగా ఎదుగుతున్న వాడివే అంది డాంకీ. నేనూ నా పాటా ఇదే లోకం అనుకోకు. ఎందరో మహానుభావులు అందరికీ వందనం అను. ఇండియన్ ఐడల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా వంటి టీవీ షోల్లో ఎంతమంది పాపులరయ్యారు. పాపులర్ కావడానికి ఓవర్ నైట్ లీడర్లూ, కోటీశ్వరులూ అయి వార్తల కెక్కడానికి అదృష్టం మనకు లేదనుకో, అంతమాత్రం చేత కళాపోషణ మానేస్తామా, ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి …గాన రసం…’ అన్నారు. వామ్మో నువ్వు మాటలూ, పాటలూ, పేరడీలూ బాగానే నేర్చావు. పాటలు పాడి నాలాంటి సంగీత విద్వాంసుడ్నే పేరడీలు రాసి వాట్సప్పు కవుల్నీ ఇరుకున పెట్టేస్తున్నావు అంది డాంకీ.
ఇంతకీ పాట కంటెంటు సంగతనలేదు బ్రో నువ్వు. ఇంటి గురించి పాడా. ఇప్పుడంతా ఇళ్లు కూలగొట్టడమనే నాశనకాలం నడుస్తున్నది. ఉన్న ఫళాన ఇళ్లల్లో ఉన్న జనాన్ని మెడబట్టి బయటకు లాగి బుల్డోజర్లతో విధ్వంసం సృష్టిస్తున్నారు అందుకే ఆ పాట. నాకు చాలా భయంగా ఉంది బ్రో. మనకు ఉన్న ఈ కాస్త నీడా పోతుందేమోనని అంది డాగీ విచారంగా. ఎందుకు పోతుంది మన ఈ పాత కొంప గోడల మీద ‘ఆర్‌బి’ అని ఎవరైనా రాశారా అయినా ఈ గోడల మీద పెచ్చులు రాలిపోతుంటే రాయలేరులే. గోడమీద రాయలేకపోతే అట్ట మీద రాసి, నీ మెళ్లోనూ నా మెళ్లోనూ వేలాడదీస్తారేమో అంది డాగీ. నువ్వా బెంగపెట్టుకోకు ఈ ఇంటి ఎదురుగ్గా ఆట మైదానం తప్ప ఎక్కడా నీటి జాడలేదు. ఈ ఇల్లు ఎఫ్‌టిఎల్‌లోనూ, రివర్‌బెడ్‌లోనూ లేదు. అలాగని ఎలా చెప్పగలవు. ఏమో ఈ మైదానమంతా చెరువేనేమో. ఈ పాత కొంప చెరువు మీదే ఉందేమో. ఇక్కడ బస్తీలో జనం అర్ధరాత్రుళ్లు పూర్తి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో తమ ఇళ్ల ఫ్లోరింగ్‌కు చెవులు ఆనించి వింటున్నారట నీటి చప్పుడేమన్నా వస్తున్నదేమోనని అంది డాగీ. కళ్లు మూసినా, తెరిచినా ‘హైడ్రా’ అనే మాటే వినిపిస్తున్నదట. కొందరైతే నిద్రలో ఉలిక్కిపడి లేచి ‘హైడ్రా హైడ్రా’ అని కలవరిస్తున్నారట. నెత్తురు, చెమటతో కట్టుకున్న ఇళ్లల్లోంచి గర్భవతుల్నీ, కాటికి కాళ్లు చాపిన ముసలోళ్లనీ బయటకు లాగెయ్యడం, పెట్రోలు పోసుకుని హాహాకారాలు చేస్తున్నవాళ్లను పోలీసుస్టేషన్‌కి లాక్కుపోవడం అసలేం జరుగుతున్నదిక్కడ అని డాగీ అంటుంటే అరుగు ఎక్కాడు అబ్బాయి. ఏం జరుగుతున్నదంటే నాలాల ప్రక్షాళన, చెరువుల సంరక్షణ వెరసి ఏ బడా కంట్రాక్టర్‌కో సుందరీకరణ పేర కోట్ల తాంబూల సమర్పణ. ఇవన్నీ జరిగేనో లేదో కాని తీర్థ జైత్రయాత్ర సాగుతున్నది అన్నాడు అబ్బాయి. తీర్థం అంటే నీళ్లే కదా అన్నది అమాయకంగా డాగీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో అలజడి ఆరనిచిచ్చులా రగుల్తున్నది. ఇక్కడ తీర్థమైతే అక్కడ ప్రసాదం అన్నాడు అబ్బాయి. ప్రసాదం అంటే లడ్డూ, అదే తిరుపతి వెంకన్న లడ్డూ గురించే కదా నవ్వు అంటున్నది అంది డాంకీ. ఇప్పుడు ప్రసాదం అనే మాటకు అదొక్కటే అర్థమని ఎవరైనా ఇట్టే గ్రహిస్తారు. దీక్షలూ, మెట్లు కడగడాలు, పసుపుకుంకుం బొట్లూ, ఒట్లూ, స్టేట్‌మెంట్లూ, కౌంటర్లూ, తిట్లూ, హెచ్చరికలూ, బెదరింపులూ, ట్విట్టర్లూ, పండగ చేసుకుంటున్న యూ ట్యూబర్లు, కన్యాకుమారి నుంచి కశ్మీరం దాకా ఇదే ఇప్పుడు బర్నింగ్ టాపిక్, బ్రేకింగ్ న్యూస్ అన్నాడు అబ్బాయి.
ఇందాక నువ్వు అన్నావే స్టేట్‌మెంట్లు, అలాంటిదే మరోమాట వినపడిరది అదేవిటబ్బా అంది డాగీ. అదా పాటైతే పాడావుగాని, జనరల్ నాలెడ్జి పెరగలేదు నీకు ఆ మాట ‘డిక్లరేషన్’ అన్నమాట. ఊరికే ఆ మాట నా మొహాన్న విసిరికొట్టకపోతే ‘ఎక్స్‌ప్లెయిన్’ చెయ్యవచ్చు కదా అంది డాగీ, డాంకీతో. అది ప్రసాదానికి సంబంధించినదేలే. ఈ వివాదంలో తన తప్పులేదని ‘కోడై’ కూయడానికి ఒక నాయకుడు వెంకన్న దర్శనానికి వస్తానంటే, అటకెక్కిన చట్టాన్నొకదాన్ని దులిపి బయటపెట్టారు దాని ప్రకారం ఆ దేవుడి మీద నమ్మకం గౌరవం ఉన్న అన్యమతస్తుడు. ఆ సంగతి ఒప్పుకుని సంతకంచేసి తీరాలన్నమాట అన్నాడు అబ్బాయి.
ఓహో అదా సంగతి ప్రసాదం వల్ల లాభపడటమే కాని దేవుడి మీద నమ్మకంలేని వాడిని ఇరుకున పెట్టడమన్న మాట అంది డాంకీ. అక్కడ తీర్థం లొల్లి. ఇక్కడ ప్రసాదం లీల. మొత్తం మీద అక్కడా ఇక్కడా మనుషులకు ప్రశాంతత అన్నదే కరువైందన్నమాట అన్నది డాగీ.