Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

తీవ్రమైన నీటి సంక్షోభం

టి.వి సుబ్బయ్య

ప్రపంచమంతటా రానురాను నీటి సంక్షోభం తీవ్రమవు తోంది. ఈ సమస్య మన పల్లెలు, పట్టణాలు, నగరాలలో భారతదేశంలో ప్రజలు అనుభవిస్తున్నదే. ఇప్పటికే అనేక నగరాల్లో ప్రజల దాహార్తిని తీర్చలేని నీటి సరఫరా సమస్య ఏర్పడిరది. దేశ రాజధాని న్యూదిల్లీలో వాయుకాలుష్యమే కాదు, నీటి సంక్షోభం ఎక్కువే. ఈసారి ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత నుంచి నీటిసరఫరా తగ్గింది. ఈ సమస్య ఈ సారి ఎల్‌నినో కారణంగా అనేక దేశాలలో రుతుపవనాలు కాలంలోనే వర్షాలు తగ్గుతాయని వారం క్రితం ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక`2023 హెచ్చరించింది. ప్రత్యేకించి భారతదేశంలో గతంలో ఏనాడు లేనంతగా నీటికొరత ఎదురవుతుందని నివేదిక తెలియజేసింది. దిల్లీలో గత రెండు వారాలుగా అనేక ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఈ నెలలో ఈ సమస్య మరింత పెరుగుతుందని దిల్లీ జల్‌ బోర్డు(డీజేబి) ప్రకటించింది. దిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని వేధించడానికే లెఫ్ట్‌నెంట్‌ గవర్నరు నియమించారని భావించారు. దేశరాజధానిలో సమస్యలను తీర్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు రాదు. పైగా సమస్యలు తీర్చవలసిన బాధ్యత ఆప్‌ ప్రభుత్వానిదేననిచెప్పి తప్పించుకోవడమే గాక అనేక అధికారాలను లెఫ్టినెంట్‌ గవర్నరు ద్వారా కత్తిరిస్తోంది. దిల్లీకి హర్యానా ద్వారా ఎక్కువగా నీరు సరఫరా అవుతుంది. హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక చిక్కులు కలిగిస్తున్నందున దిల్లీలో నీటి సరఫరా మరింత తగ్గుతోంది. యమునా నది ద్వారా సరఫరా మరింత తగ్గుతోంది. యమునా నదిద్వారా సరఫరాఅయ్యే నీరు కలుషితంగా ఉంటోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయినా యమునను ప్రక్షాళన చేయడం, కాలుష్య కారకాలను నదిలో వేయకుండా చూడటం, వంటి చర్యలను ప్రభుత్వాలు అంతగా పట్టించుకోవడంలేదు. రోజుకు దిల్లీకి 1150 మిలియన్ల గాలన్ల నీరు అవసరం కాగా, 935 మిలియన్ల గాలన్లు మాత్రమే సరఫరా అవుతోంది. 34 తహసిల్స్‌ ప్రాంతంలో భూగర్భ నీరే తాగడానికి ఉపయోగిస్తున్నారు.
240 కోట్ల మందికి నీటికొరత
ప్రపంచ జనాభాలో 240 కోట్ల మందికి నీటికొరత ఉంటుందని, ఇందులో భారతదేశంలో సమస్య అత్యంత తీవ్రంగా ఉంటుందని ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక హెచ్చరించింది. వేసవికాలంలో నీటిని మార్కెట్‌లో బంగారంతో సమంగా కొనుగోలు చేయవలసి రావచ్చునని నివేదిక ప్రమాద ఘంటికలును మోగించింది. ప్రపంచజనాభాలో 18శాతం జనం మన దేశంలోఉన్నారు. అయితే మనకు ప్రపంచంలో 4శాతం నీటి వనరులే ఉన్నాయని నివేదిక అంచనావేసింది. 2031 నాటికి తలసరి నీటి అవసరం 1486 క్యూబిక్‌ మీటర్లు ఉంటుందని, అయితే 1367 క్యూబిక్‌ మీటర్ల నీరు మాత్రమే లభ్యమవుతుందని ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి మెట్రోపాలిటన్‌ నగరానికి చాలా దూరం నుంచి నీరు సరఫరా అవుతోంది. ముంబై తాన్సా, వైతర్న డ్యామ్‌లపైన ఆధారపడుతోంది. దిల్లీకి ఉత్తరప్రదేశ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ల నుంచి చెన్నయ్‌కి 200కిలో మీటర్ల దూరంలో గల సరస్సుల నుండి అలాగే తెలుగుగంగ ప్రాజెక్టుద్వారా నీరు లభిస్తోంది. పట్టణప్రాంతాల్లో భూ గర్భం నుండి నీరు తీసుకొని బాటిల్స్‌ ద్వారా నీరు ఎక్కువగా సరఫరాచేస్తున్నారు. ప్లాస్టిక్‌బాటిల్స్‌లోని నీటిలో కనిపించని ప్లాస్టిక్‌ రేణువులు విడుదలై నీరు కలుషితమవుతుంది. ఇది ఎంతమాత్రం సురక్షితం గాకపోయినా మరో మార్గం లేక తాగుతున్నారు. ఇప్పటికే ముంబైలో కనీసం రెండువేల ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వమే ప్రకటించింది. ప్రతిఏటా దిల్లీ, ముంబై, చెన్నయ్‌, బెంగళూరు, హైదరాబాదు లాంటిపెద్ద నగరాల్లోనే గాక, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, అనంతపురం తదితర అనేక నగరాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా అవుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం.
పల్లెల్లో 80శాతం తాగునీరు భూగర్భం నుంచి తీసుకుంటున్నారని పట్టణాల్లో 50శాతం ఇదే నీటిని వాడుతున్నారని నీటి వనరుల పార్లమెంటరీ స్థాయీసంఘం తన తాజా నివేదికలో తెలియజేసింది. అలాగే వ్యవసాయానికి మూడిరట రెండు వంతులు భూగర్భ జలాన్ని వాడుతున్నారని తెలిపింది. భవిష్యత్‌ తరాలకు ఆహారం, నీటి భద్రతకు భూగర్భజలమే ఆధారమవుతుందని ఈ నివేదిక నొక్కి చెప్పింది.
పరిష్కారం ఏమిటి?
పర్యావరణ కాలుష్యం భూతాపాన్ని తగ్గించాలి. మనిషి జీవన విధానం ముఖ్యంగా ఆహార అలవాట్లు మారాలి. ప్రస్తుత ఆహారపంటలు ఎక్కువ నీటి వినియోగం పంటలు. వరి, గోదుమ పంటలకు నీరు ఎక్కువ అవసరం. పూర్వం చాలాప్రాంతాల్లో జొన్నలు, సజ్జలు, ఆరికలు, కొర్రలు, సామలు, ఒరిగలు పండిరచి తినేవాళ్లు. వరి అన్నంలో పెద్దగా పోషకాల విలువ లుండనవని ఆరోగ్యజీవనానికి దోహదపడవని ఆరోగ్యనిపుణులు విశ్లేషించారు. వరి షుగర్‌ వ్యాధి కారకాల్లో ప్రధానమైందని ఆరోగ్యనిపుణులు నిర్థారిస్తున్నారు. ఇక జల వనరులను కాపాడుకోవాలి. చెరువులు, కుంటలు, సరస్సులు అక్రమణలకు గురై నీటినిల్వలు తరిగిపోతున్నాయి. మోటార్ల ద్వారా భూగర్భజలాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది నీటి నిల్వలు పెరగడానికి సహకరించదు. వర్షపునీరు వృధాగా పోకుండా పొలాల్లోనూ కొన్ని చోట్ల గుంటలు తవ్వివాటిని నింపి వాడుకుంటున్నారు. ఇక నగరాల్లో నీటి వినియోగం చాలా ఎక్కువ. అందువల్ల నగరాలను మరింత విస్తరించడం, అభివృద్ధిపేరుతో అపారంగా నిధులు వ్యయం చేయడం సరైన విధానంకాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img