Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

తీవ్ర వేడిమిలో సభలు వద్దు

ఈ ఏడాది వేసవి తీవ్రత దేశమంతా ఎక్కువగా ఉంది. అత్యధిక వేడిమి నమోదవుతోంది. మహారాష్ట్రలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో 13మంది మరణించడం, మరో ఎనిమిది మంది ఆసుపత్రి పాలవ్వడం వేసవి తీవ్రతను తెలియబరుస్తోంది. నడి వేసవిలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోకుండా మిట్ట మధ్యాహ్నం లక్షలాది మందితో సభ నిర్వహించడం అనుచితం అయినప్పటికీ ఈ నివారింప దగ్గ మరణాలు అందరికీ కనువిప్పు కావాలి. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండలో తిరగరాదు. వీలైనంత మేరకు నీడ పట్టున ఉండాలి. అధికార వర్గాలు, రాజకీయ పార్టీలు ఆ సమయంలో సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండాలి. తప్పనిసరి అయితే మంచినీళ్లు, నీడ, గాలి వీచే ఏర్పాట్లు, ప్రాథóమిక చికిత్స అందుబాటు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో పని చెయ్యడం వీలైనంత మేర నివారించాలి. వ్యక్తిగతంగా కూడా ప్రతీ ఒక్కరూ జాగ్రత్త వహించాలి. బయటకు వెళ్లడం తప్పనిసరి అయితే గొడుగు, తలకు టోపీ, పాగా లాంటివి పెట్టుకోవడం, కాటన్‌ దుస్తులు ధరించడం, నీడ లో ఉండడం, ఎక్కువగా నీళ్ళు త్రాగడం లాంటివి చెయ్యాలి.
వేపుళ్ళు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వడదెబ్బ లక్షణాలు..కళ్ళు తిరగడం, వాంతులు ఒళ్ళు వేడెక్కడం లాంటివి జరిగితే.. వెంటనే ద్రవపదార్థాలు తీసుకోవడం, చన్నీళ్లలో తడిపిన గుడ్డతో ఒళ్లంతా తుడవడం లాంటివి చెయ్యాలి. దగ్గరలో వున్న చికిత్సా కేంద్రాలను సంప్రదించాలి. ఈ వేసవిలో అంటురోగాలు కూడా ప్రబలుతాయి. ఫుడ్‌ పాయిజనింగ్‌కు కూడా ఆస్కారం ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి అనారోగ్యం ముదరబెడ్తుంది. చిన్నపిల్లలు,వృద్ధులు మరింత జాగ్రత్త పడాలి. జూన్‌ వరకూ ఎండలు ఇలానే ఉండే అవకాశం ఉన్నందున అందరూ జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం కూడా అందుకు అనుగుణమైన విధానాలు, వెసులుబాటు కల్పించాలి.
డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img