Monday, March 20, 2023
Monday, March 20, 2023

తెలంగాణలో తమిళ పార్టీ..!

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న సమయంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తమ తమ వ్యూహరచన సిధ్ధం చేసుకోగా, మిగిలిన పక్షాలు కూడా అదేదారిలో నడుస్తూ ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపేందుకు అస్త్రశస్త్రాలు సిధ్ధం చేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణల్లో భాగంగా కొన్ని వర్గాల నేతలు ఇప్పటికే సొంత పార్టీలు పెట్టుకొని భూమికను సిధ్ధం చేసుకుంటుండగా, తాజాగా తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ఇప్పటికే తమిళనాట స్టాలిన్‌ ఆధ్వర్యంలోని ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ముఖ్య భాగస్వామిగా ఉంటూ, ఒక లోక్‌సభ, నాలుగు శాసనసభ సభ్యులున్న ‘విడుతలై చిరుతైగళ్‌ కచ్చి’(విసీకే) అనే పార్టీ గత శుక్రవారం తెలంగాణలో పాదం మోపింది. వీసీకే వ్యవస్థాపక అధ్యక్షులు, చిదంబరం లోక్‌సభ సభ్యుడు తోల్‌ తిరుమా వలవన్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘వీసీకే తెలంగాణ పార్టీ’ని ప్రకటించారు. నిజానికి వీసీకే పార్టీ బీఆరెస్‌లో విలీనం కానున్నదని, ఖమ్మంలో జరిగిన బీఆరెస్‌ ఆవిర్భావ సభలోనే విలీన ప్రకటన ఉండవచ్చని భావించారు. ఆమేరకు వీసీికే పార్టీ వ్యవస్థాపకుడు, చిదంబరం తిరుమావలవన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మధ్య సుదీర్ఘమంతనాలు కూడా జరిగాయి. ఏమైందో ఏమో తెలియదు కాని, విలీనంకాకపోగా ఏకంగా తెలంగాణలో వీసీకేపార్టీ ఆవిర్భావప్రకటన వెలువడిరది. ఆరెస్సెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజా స్వామ్య, లౌకిక విలువల బలోపేతానికి తమ పార్టీ పనిచేస్తుందని, భావ సారూప్యత కలిగిన, ఆరెస్సెస్‌, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే అన్నిపార్టీలతో అవగాహనతో పనిచేస్తామని, అందులో భాగంగా తెలంగాణాలో బీఆరెస్‌తో కలిసి ప్రయాణించడానికి తాము సిధ్ధంగా ఉన్నామని తిరుమా వలవన్‌ ప్రకటించారు. తెలంగాణ అధ్యక్షుడుగా డా.జిలుకర శ్రీనివాస్‌, ప్రధానకార్యదర్శిగా ఏ.ఎం షుఐబ్‌లను నియమించారు. వీసీకేను బీఆరెస్‌లో విలీనం చేస్తాడనుకున్న తిరుమా వలవన్‌ తెలంగాణలో కొత్త దుకాణం తెరవడం, మళ్ళీ కలసి పనిచేస్తానని చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంతగా మింగుడుపడడంలేదు. ఇప్పటివరకూ జిలుకర ఆధ్వర్యంలో నడుస్తున్న ద్రవిడ బహుజన సమితి (డీబీఎస్‌)ను వీసీకేలో విలీనం చేశారు. తెలంగాణలో వీసీకేపార్టీ ఆవిర్భావంతో రకరకాల ఊహాగానాలకూ తెరలేచింది.
మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) తెలంగాణలో రాజ్యాధికారసాధన నినాదంతో పని చేస్తుండగా బహుజనులకోసం మరో రాజకీయ పార్టీ అవసరం ఏమున్నదని కొందరు బహుజన వాదులు పెదవి విరుస్తున్నారు. ఈ పార్టీ నాయకుడి ప్రయాణం సరైన మార్గంలో సాగడంలేదని, అంబేద్కరిజాన్ని సమర్ధవంతంగా ప్రెజెంట్‌ చేయడంలో ఆయన విఫలమవుతున్నాడని, ఆయన వ్యవహార శైలి ‘పరివార్‌’ భావజాల బలోపేతానికి ఉపకరించే విధంగా ఉందని మరికొందరు అంబేద్కరిస్టులు అభిప్రాయ పడుతున్నారు. ప్రవీణ్‌ కుమార్‌ బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఎంత గట్టిగా పనిచేస్తే అంత ఎక్కువగా బీజేపీకి ప్రయోజనం కలుగుతుంది. అందుకే సాధ్యమైనంత మేర పార్టీలమధ్య, కులాలమధ్య, మతాలమధ్య విభజన వాదాన్ని రెచ్చగొట్టి, ఎవరికి వారు విడివిడిగా పోటీ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటూ బీజేపీ ప్రణాళికలు రచించింది. సామ దాన బేధ దండోపాయాల ద్వారా తన దారికి తెచ్చుకునే ప్రయత్నమూ చేస్తోంది. బహుజనవాదుల చీలిక బీజేపీకి గొప్పవరం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చీలికలు పీలికలై ఎవరి దారిన వారు ఎన్నికలకు వెళితే సాలీడ్‌ ఓటు బ్యాంకును పొందవచ్చని, తద్వారా తెలంగాణాలో జెండా పాత వచ్చని బీజేపీ సంబరపడుతోంది. అందుకని అంబేద్కరిజాన్ని భుజానికెత్తు కున్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. తమ మధ్యఉన్న పొరపొచ్చాలను పక్కనపెట్టి, అహం భావానికి పోకుండా సైధ్ధాంతికపునాదులపై కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలి. అప్పుడు మాత్రమే శత్రువును ఎదుర్కొనే, నిలువరించేశక్తి లభిస్తుంది. మొత్తానికి బీఎస్‌పీ, వీసీకేలు అలాగే అంబేద్కరిస్టులు అనుకునే ప్రతి ఒక్కరూ ఒకర్నొకరు నిందించుకుంటూ శత్రువుకు ఆయుధం అందించి, మేలుచేసే బదులు సంయమనంతో, సమన్వయంతో, పరస్పర అవగాహనతో, ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా నిబద్దతతో పనిచేస్తున్న వామపక్ష పార్టీల సహకారంతో కలిసి పని చేయాల్సిన అవరమైతే ఉంది. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సెక్యులర్‌విలువలకు ముప్పుగామారిన ‘పరివార్‌’ భావజాలాన్ని అడ్డుకోవా లంటే, నిలువరించాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బహుజనులను చైతన్యపరచడంతో పాటు, అగ్రకులాల్లోఉన్న అసంఖ్యాకమంది సెక్యులర్‌ వాదుల సేవలను వినియోగించుకోవలసిన అవసరంఉంది. ఈ విషయంలో తమిళనాట కొంతమేర విజయం సాధించిన అనుభవంతో తెలంగాణలో అడుగు పెట్టిన వీసీకే ఈ మహత్తర లక్ష్య సాధనలో ఏ మేరకు విజయం సాధిస్తుందో కాలమే చెప్పాలి. ఏది ఏమైనా ఆరెస్సెస్‌, బీజేపీల నిలువరింతకు, నిర్మూలనకు ఎవరు ముందు కొచ్చినా స్వాగతించాల్సిందే. డా.జిలుకర శ్రీనివాస్‌, ఏ ఎం షుఐబ్‌ల నాయకత్వంలో వీసీికే పార్టీ తెలంగాణాలో ఆశాజనక స్థాయిలో ప్రభావం చూపాలని, చూపగలదని ఆశిద్దాం.

  • యండి. ఉస్మాన్‌ ఖాన్‌, సీనియర్‌ జర్నలిస్టు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img