Friday, September 22, 2023
Friday, September 22, 2023

తెలంగాణ ప్రత్యేకంగా ఏం సాధించింది ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీరు, నియామకాలు, నిధుల కోసం జరిగింది. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ భాష, యాసలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులను చిన్నచూపుచూడటం జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను పట్టించుకోకుండా సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, వంటావార్పు, రైలు రోకో, బతుకమ్మ లాంటి నిరసన కార్య క్రమాలు నిర్వహించి ఉద్యమ కాంక్షను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ దశాబ్ది వేడుకలను 20 రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించ డానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కమిటీలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాష, యాసను చిన్న చూపు చూశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస లకు పట్టాభిషేకం కట్టారు. సినిమాలలో విలన్‌ లకు, పని మనుషులకు మాత్రమే వాడిన భాష, యాస ఇప్పుడు హీరో, హీరోయిన్‌లకు ఉపయోగిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు చిన్న చూపు చూశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు మంచి రోజులువచ్చాయి. పాఠ్యపుస్తకాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, పండుగ, పసందులకు స్థానం కల్పించారు. తెలంగాణ కవుల, రచయితల రచనలకు పుస్తకాలలో అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి పండుగకు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. తెలంగాణ ఏర్పడితే కరెంట్‌ కోతలు, నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతారని ఏవేవో భయ పెట్టారు. వారి అంచనాలను తారు మారు చేస్తూ 24 గంటల కరెంటు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయతో నీటి సమస్యలు పరిష్కారంతోపాటు తెలంగాణలోని 33 జిల్లాలలోని అన్ని గ్రామాల్లో చెరువులు, బావులు నీళ్ళతో నిండి పంట పొలాలు పచ్చగా నిగనిగలాడుతూ కన్పిస్తున్నాయి.
తెలంగాణ కోసం పాటలను పాడి, తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన కళాకారులకు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు, ప్రముఖ కవి, గాయకులు రసమయి బాలకృష్ణ సారధిగా 526మంది కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారధిని ఏర్పాటుచేసి ఉద్యోగాలను కల్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కే.జి నుండి పి.జి.ఉచిత విద్యలో భాగంగా గురుకులాలు ఏర్పాటుచేసి నాణ్యమైనవిద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ బడులు శిథిలావస్థకు చేరుకున్న వాటికి నూతన భవనాలు నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభిం చడంతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, ఉచితంగా యూనిఫాంల పంపిణీ, ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందించడం వల్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షితులవుతున్నారు. వితంతు పెన్షన్‌, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్‌ సౌకర్యం, గర్భిణీలకు కెసిఆర్‌ కిట్‌, రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలు, రాష్ట్రంలోని అన్ని కులాలకు, బ్రాహ్మణులు, రెడ్డి, వైశ్యులకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి భూములు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటుచేసి ప్రజలకు అందిస్తున్నారు. ప్రైవేట్‌ రంగాలలో ఐ.టి., కంప్యూటర్‌ రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పర్మినెంట్‌ చేశారు. రాష్ట్రంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు సీనియారిటీ ప్రకారం పూర్తి కాలం వేతనం ( పర్మినెంట్‌) చేశారు.
( తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
పెద్ద యెత్తున నిర్వహిస్తున్న సందర్భంగా…..)
డాక్టర్‌. ఎస్‌. విజయ భాస్కర్‌, సెల్‌ :9290826988

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img