Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

త్రిపురలో బీజేపీ హింసాకాండ

ఎన్నికలు కాగానే త్రిపుర మళ్లీ కల్లోలంలో పడిపోయింది. ఈశాన్యరాష్ట్రం త్రిపురలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయ వలసిందేమిటో ఆలోచించి పెట్టుకున్న బీజేపీ సాగించిన దమనకాండను అమాయకప్రజలు అనుభవిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో స్వల్పకాలం ప్రశాంతంగా ఉండవచ్చునని ప్రజలు ఆశించారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా తాత్కాలికంగా అయినా బీజేపీ హింసా రాజకీయాలకు విరామం ఇస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశించారు. తామేదో గొప్ప విజయాలు సాధించామని బూటకపు ప్రచారం సాగించిన బీజేపీ నాయకులు రాష్ట్రంలో ప్రశాంతత నెలకొల్పుతామని నమ్మబలికారు. ప్రజలను మోసగించడానికి వేసిన ఎత్తుగడే ఈ ప్రచారం. ఎన్నికల క్రమంలో హింసాకాండ సాగించే పార్టీకి బీజేపీ ప్రతీక. తాజా ఫలితాలు వెల్లడికాగానే ప్రజలపై ప్రతీకారం తీర్చుకొనేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ శక్తులు పెద్దఎత్తున ఏనాడూ లేనంతగా హింసాకాండ సాగించాయి. బీజేపీలో పెద్ద తలకాయలైన మోదీషా ద్వయం మెజారిటీ వాదాన్ని ప్రజలపైన రుద్ది రెండోసారి పాలనను ప్రారంభించారు. భుజబలం ఉపయోగించారు. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. గెలుపే లక్ష్యంగా అన్ని అక్రమ మార్గాలు అనుసరించారు. రాష్ట్రంలో అనేకమంది కేంద్ర మంత్రులు ఇక్కడే తిష్టవేసి ప్రజలను అనేక విధాలుగా మభ్యపెట్టారు. ఎట్టకేలకు తక్కువ మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈ సారి పదకొండు తగ్గాయి. పదిశాతం ఓట్లు కొల్పోయారు. మొత్తం 60 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలపై దాడులు సాగించాలని తన కార్యకర్తలకు ఆర్‌ఎస్‌ఎస్‌ బోధిస్తుంది. ఈ సంస్థ భావజాలమే ఇది. ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌` బీజేపీ శక్తులు ప్రజలకు గుణపాఠం నేర్పాలన్న నినాదంతో తీవ్రమైన దాడులు చేశాయి. తాము గెలుపొందిన నియోజకవర్గాల్లోనూ ప్రజలకు ఈ బాధలు తప్పలేదు. ఫాసిస్టు భావజాలంతో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చిన పాలకపార్టీ ప్రజాస్వామ్యం, ప్రకటిత విలువలపై ఎల్లవేళలా దాడిచేసేందుకు సిద్ధంగానే ఉంటోంది. త్రిపురలో ప్రజాస్వామ్యశక్తులు ప్రస్తుతం దాడుల అనుభవాన్ని పొందుతున్నారు.
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ఇప్పటికే కావలసిన ఏర్పాట్లు చేసింది. అవసరమైన సాయుధసంపత్తిని సమకూర్చుకుంది. క్రూరత్వాన్ని, మోసాన్ని ఇబ్బడిముబ్బడిగా ఉపయోగించింది. అధికారం చేజిక్కించుకోవడమేవారి అజెండా. మేఘాలయలో బీజేపీ రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ పార్టీ అసలు స్వరూపాన్ని మోదీ ప్రదర్శించారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి కాన్రాడ్‌ కే సంగ్మా అవినీతికి పెట్టిందిపేరని అవినీతిలో మొనగాడని మోదీ, షాలు తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ రాత్రికి రాత్రే ఎత్తుగడనుమార్చి సంగ్మా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నాడు. ఈ పనిమీదనే మోదీ ప్రత్యేకంగా షిల్లాంగ్‌కు వెళ్లారు. సంగ్మా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యాడు. నాగాలాండ్‌ కథ కూడా ఎమీ మార్పులేదు. ఇక్కడకూడా బీజేపీ అధికారంలో భాగం పంచుకున్నది. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ అధికారంలో భాగస్వామ్యం కావడానికి మోదీ వెనుకాడడంలేదు. దోచుకుంటున్న అదానీ వంటి వాళ్లకు అండగా నిలిచేందుకు ఏదో ఒక విధంగా అధికారం సంపాదించడానికి ఉన్నారు. ప్రశాంతంగా జీవించడానికి ప్రజాస్వామ్య హక్కులను కోరు కుంటున్న వారిని అణచివేసేందుకు, వారి గొంతులు వినపడకుండా చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మార్గాన్ని సుగమం చేసుకుంది. ప్రస్తుతం త్రిపుర కల్లోల పరిస్థితుల్లో ఉన్నది. అందువల్ల అన్ని ప్రజాస్వామ్య శక్తులు త్రిపుర సోదర, సోదరీమణులకు అండగా నిలవాలి.
వ్యాస రచయిత సీపీఐ కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img