Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

దళితుడు ధన్యజీవి కాదా?

కూన అజయ్‌బాబు

తరాలు మారినా భారతీయ సమాజంలో కులముద్ర మాత్రం చెరగడం లేదు. దళితులపై ఈనాటికీ వివక్ష కొనసాగుతూ వుండటమే ఇందుకు నిదర్శనం. ఈ దేశంలో భూమి, గాలి. నీరు, నిప్పు, ఆకాశం… ఇలా అన్నీ అందరికీ ఒకటే కావచ్చు. అందరి రక్తం ఒకటే కావచ్చు. మనందరి శ్వాసనిశ్వాసలు ఒకటే కావచ్చు. కానీ పుట్టుక ఒక్కటే ఒకటి కాదు. కేవలం పుట్టుకను బట్టి సమాజంలో స్థాయి మారుతోంది. మనిషి మనిషికీ మధ్య తేడా పెరుగుతోంది. కులవెర్రి తలకెక్కిన ఛాందసవాదుల పుణ్యమా అని అమానవీయఘటనలు పెచ్చు మీరుతున్నాయి. మహారాష్ట్ర లోని సోలాపూర్‌ జిల్లా మాలేవాడి గ్రామంలో కొన్ని రోజుల క్రితం హిందూమతోన్మాద కులపిచ్చి కారణంగా ఓ దళితుడికి గౌరవప్రదమైన అంత్యక్రియలు జరగలేదు. 74 ఏళ్ల దళిత వికలాంగుడు ధనంజయ్‌ సాథే మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని అగ్రకులాలవారు అడ్డుకున్నారు. దీంతో దళిత కుటుంబాలకు చెందిన సభ్యులు 18 గంటలపాటు ధర్నా నిర్వహించి, చివరకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుటే అంతిమ సంస్కారాలు జరిపారు. ఆ గ్రామంలో 90 శాతం మంది మాలీ వర్గీయులే. ఇదే గ్రామంలో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు ఐదు మాసాల వ్యవధిలో మూడుసార్లు ఈ తరహా కుల దురాగతాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో రక్తపాతం చోటుచేసుకోవడం గమనార్హం. ఒడిశాలో గత ఆగస్టులో ఒక అగ్రకుల వ్యక్తికి చెందిన పూల తోట నుంచి ఓ పదిహేనేళ్ల అమ్మాయి పూలు కోసుకుంది. ఈ బాలిక దళితురాలు. దీంతో రెచ్చిపోయిన అగ్రకులాల వారు 40 దళిత కుటుంబాలను బహిష్కరించారు. గత జులైలో కర్నాటకలో ఒక దళిత వ్యక్తిని, అతని కుటుంబాన్ని చెట్టుకు కట్టి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గత ఫిబ్రవరిలో తమిళ నాడులో ఒక దళితుడిని ఆ గ్రామానికి చెందిన అగ్రకుల పెద్దలు తీవ్రంగా కొట్టి చంపేశారు. ఒక పోటీలో ఈ దళితుడు అగ్రకులానికి చెందిన వ్యక్తిమీద గెలవడమే ఈ ఘటనకు కారణం. గత సెప్టెంబరులో ఒక దళిత న్యాయవాది బ్రాహ్మణవాదాన్ని విమర్శిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినందుకు అతన్ని చంపేశారు.
ఇటీవలనే గుంటూరులో దారుణహత్యకు గురైన ఎస్సీ యువతి, బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని దళితవర్గాలు కదిలాయి. రమ్య కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు తెలుసు కునేందుకువచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఊహించనిరీతిలో వినతులు వెల్లువెత్తాయి. లక్షలసంఖ్యలో రాతపూర్వక విజ్ఞాపనలు రావడం కమిషన్‌కు ఆశ్చర్యం కలిగింది. దళితులపై అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ కేసులవిచారణలో జరుగుతున్న జాప్యం, కేసుల విచారణలో పోలీసు అధికారులు అనుసరిస్తున్న వైఖరిని దళిత, గిరిజన, ప్రజా సంఘాలు ఈ కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లాయి. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఆ సమయంలో ఈ ప్రాంతం రసాభాసగా మారింది. ఒక దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దళితులపై జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కదలిక రావడ మంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో వుందో అర్థమవుతోంది. గడిచిన రెండు మాసాల్లో ముగ్గురు దళిత యువతులపై అఘాయిత్యాలు జరిగాయి. దళితులపై ఆగడాలనేవి ఏ పార్టీ అధికారంలో వున్నా సహజంగా మారిపోయాయి.
2019లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం దళితులపై దాడులు, అఘాయిత్యాలు 7శాతం పెరిగాయి. గడిచిన ఏడేళ్లలో దళితులతోపాటు మైనారిటీలు,మహిళలపైఅత్యధికంగా దాడులు జరిగినట్లు నివేదికలువెల్లడిరచాయి. ‘భారతదేశంలోఅస్పృశ్యులుకుల వివక్షరహస్యంగా సాగుతున్న అణచివేత’ అనే అంశంపై 113 పేజీల నివేదిక ఐక్యరాజ్యసమితికి చెందిన జాతి వివక్ష నిర్మూలన కమిటీ (సిఇఆర్‌డి)కి అందింది. ఈ నివేదికను కమిటీ సమీక్షిస్తున్నది. భారత్‌లో అస్పృశ్యత ఇంకా కొనసాగుతున్నదని 2006 డిసెంబరు 27న ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ బహిరంగంగానే అంగీకరించారు. అలా ఒప్పుకున్న తొలి ప్రధాని ఆయనే. ప్రస్తుత ప్రధానమంత్రి మాత్రం దళితుల అభ్యున్నతి గురించి మాట్లాడిన సందర్భమే లేదు. పైగా మనువాదంనాటి విధానాలకు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. మన దేశంలో ఇప్పటివరకు 16.5 కోట్ల మంది దళితులు కేవలం కులం కారణంగానే జీవితకాల బహిష్కరణకు గురయ్యారు. బి.ఆర్‌.అంబేద్కర్‌ అనే వ్యక్తి భారత చరిత్రలో లేకపోయి వుంటే, దళితుల పరిస్థితి ఎంత దయనీయంగా వుండేదో ఒక్కసారి ఊహించుకుంటే ఒళ్లు గగుర్పొ డుస్తుంది. 2001`2002లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ యాక్ట్‌ కింద 58,000 కేసులు నమోదయ్యాయి. 2005లో ప్రతి 20 నిమిషాలకు ఒక దళిత వ్యక్తిపై దాడి జరిగినట్లు ప్రభుత్వ నివేదికలు చెపుతున్నాయి. ఇక 2019 నాటికి ఈ దాడులు రెట్టింపయినట్లు మానవ హక్కుల సంస్థలు ఘోషిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో కరోనా కారణంగా దళితుల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు మరింత అట్టడుగుకి క్షీణించాయి. ఈ దేశంలో దళితుడొక్కడే ధన్యజీవి కాదేమో! 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దళితులు తమ హక్కుల కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img