Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

దిగజారుతున్న పార్లమెంటు ప్రతిష్ఠ

టి.వి.సుబ్బయ్య

ఏకపక్షంగా పదినిముషాలు కూడా చర్చలు లేకుండా మంది బలం ఉందని చట్టాలు చేయడం ప్రజాస్వామ్య లక్షణమా? నిరంకుశత్వమా? మాట్లాడేందుకు అనుమతించకపోవడం, ప్రభుత్వంపై విమర్శలను రికార్డుల నుండి తొలగించడం ఎలాంటి ప్రజాస్వామ్యం? మొదటి మూడు లోక్‌సభలు సగటున ఏడాదికి 120 రోజులు సమావేశమయ్యాయి. ప్రతిపక్షాలు విపులంగా మాట్లాడేందుకు, వారు చెప్పే సూచనలు తీసుకోవడం మొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నది బహిరంగ రహస్యమే.

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నాయకత్వంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పార్లమెంటు ప్రతిష్ఠ దిగజారిపోతోందని అనేక సంఘటనలు స్పష్టం చేస్తాయి. దేశ ప్రజలందరిపై ప్రభావంచూపే అనేక నిర్ణయాలపై పార్లమెంటులో సమగ్రమైన చర్చ జరగకుండానే మోదీ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలపై రుద్దుతున్నారు. కశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేయడంలోగానీ, వ్యవసాయ చట్టాలు చేయడం, కార్మిక కోడ్లను కుదించి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం, పెద్దనోట్ల రద్దు తదితర కీలక అంశాలపై చర్చలు లేవు. బడ్జెట్‌ రెండో విడత సమావేశాలు ప్రారంభమయ్యాక ఏ అంశంపైనా అరగంటకూడా చర్చలు జరగలేదు. ఫిబ్రవరి మొదటివారంలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి అదానీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జెపిసి) వేసి నిజం నిగ్గుతేల్చాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖాతరు చేయడంలేదు. ప్రభుత్వం తనకు అవసరమైన బిల్లులను ఆమోదింపజేసుకోవడానికే పార్లమెంట్‌ సమావేశాలను నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడిరది. బడ్జెట్‌ను, ఆర్థిక బిల్లును 12 నిముషాల్లో చర్చలేకుండా ఆమోదించటం అత్యంత విచారకరం. సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మోదీ ప్రభుత్వహయాంలో లోక్‌సభ చర్చించిన దాఖలాలేదు. ప్రధాని మోదీ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనడం అరుదు. ఈ సమావేశాల్లో అదానీ కుంభకోణం, రాహుల్‌గాంధీ లండన్‌ పర్యటనలో దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని దేశ ప్రతిష్ఠను దెబ్బ తీశారన్న ఆరోపణల అంశాలే ప్రధానమయ్యాయి. జెపిసిని తొలి నుంచి మోదీ ప్రభుత్వం తిరస్కరిస్తోంది. అంబానీ కుంభకోణం బ్యాంకులను, ఎల్‌ఐసి తదితర ఆర్థిక సంస్థలను ప్రత్యక్షంగా, డిపాజిట్‌దారులను పరోక్షంగా లక్షల కోట్లు నష్టపరిచినా మోదీ ప్రభుత్వం చలించకపోవడం ప్రజలంటే లెక్కలేకపోవడమని భావించవలసి వస్తోంది.
అదానీకి, మోదీకి మధ్యగల విడదీయలేని స్నేహం 2014 లో అధికారానికి రాకముందు ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక విమానాన్ని మోదీకి అదానీ సమకూర్చారన్న వార్తలు వెల్లడిరచాయి. మోదీ ప్రభుత్వహయాంలో అదానీ అనేక అవకతవకలకు పాల్పడి ప్రపంచ కుబేరులలో మూడవస్థానం దక్కించుకున్నారన్న వార్త వెలువడిన కొద్దిరోజులకే అమెరికాకు చెందిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు సంస్థ హిండెన్‌బర్గ్‌ అదానీ ఆర్థిక కుంభకోణాన్ని వెల్లడిరచింది. అదానీని కాపాడేందుకే చర్చలకు మోదీ ప్రభుత్వం అంగీకరించడం లేదనేది స్పష్టం. చర్చ జరిగితే మోదీ అండదండలు అదానీకి ఉన్నాయన్న అంశం రుజువు కావచ్చు.
అమెరికా విమర్శలు
భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లిందని మత, జాతిపరమైన మైనారిటీలపై దాడులు పెరిగాయని, భారీగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని అమెరికా విదేశాంగశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడిరచింది. 2022 నాటి నివేదికను కాంగ్రెస్‌కు (పార్లమెంట్‌) సమర్పించింది. విదేశాంగశాఖ పరిధిలో పనిచేసే ‘బ్యూరో ఆఫ్‌ డెమెక్రసి, హ్యుమన్‌ రైట్స్‌ అండ్‌ లేబర్‌’ నివేదికను రూపొందించింది. ఈ అంశాలపై ఈ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు జైలు అధికారులు, ఖైదీలు, నిందితులను క్రూరంగా హింసిస్తున్నారని, అమానుషంగా వ్యవహరిస్తున్నారని, జైళ్లలో ప్రాణాంతక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. అమెరికాకు చెందిన ఈ నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ విడుదల చేశారు. ఇంటర్నెట్‌పై ఆంక్షలున్నాయని, నిరసన ప్రదర్శనలకు అనుమతించడంలేదని, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను వేధిస్తున్నారని వ్యక్తుల గోప్యతకు భంగంకలిగే లాగా చట్ట విరుద్ధంగా ప్రైవేటు సంభాషణలు వింటున్న సంఘటనలు జరుగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. గతంలోనూ అమెరికాతో పాటు అక్కడి ఫ్రీడం హౌస్‌ ఇలాంటి నివేదికలు విడుదల చేశాయి. నివేదికలు వెల్లడిరచిన అంశాలను పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకొనేందుకు పాలకులు సిద్ధంగా లేరు. పైగా విదేశీ నివేదికలను నమ్మవలసిన పనిలేదని తృణీకరించారు. ముమ్మర చర్చలకు పార్లమెంట్‌ ధారాళ చట్రం అనేక అవకాశాలు కల్పించింది. తీవ్ర చర్చలు జరపవచ్చు. నిరసన తెలియజేయవచ్చు. ఆయా సమస్యలపై వాదోపవాదాలు జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, స్వల్పకాలిక చర్చలు, వాయిదా తీర్మానాలు తదితర నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. ప్రభుత్వ జవాబుదారీని ప్రశ్నించవచ్చు. ఇన్ని అవకాశాలు సభ కార్యకలాపాల నియమనిబంధనలు సమకూర్చినప్పటికీ ప్రభుత్వానికి ఇవి స్మరణకు రావడంలేదు. సభ గందరగోళంగా తయారు కావడానికి ప్రభుత్వం ఎక్కువసార్లు కారణమవుతోంది. చర్చలు లేకుండానే పార్లమెంట్‌ చట్టాలు చేస్తున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఏకపక్షంగా పదినిముషాలు కూడా చర్చలు లేకుండా మంది బలం ఉందని చట్టాలు చేయడం ప్రజాస్వామ్య లక్షణమా? నిరంకుశత్వమా? మాట్లాడేందుకు అనుమతించకపోవడం, ప్రభుత్వంపై విమర్శలను రికార్డుల నుండి తొలగించడం ఎలాంటి ప్రజాస్వామ్యం? మొదటి మూడు లోక్‌సభలు సగటున ఏడాదికి 120 రోజులు సమావేశమయ్యాయి. ప్రతిపక్షాలు విపులంగా మాట్లాడేందుకు, వారు చెప్పే సూచనలు తీసుకోవడం మొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నది బహిరంగ రహస్యమే. లోక్‌సభ 120 రోజులు, రాజ్యసభ 100రోజులు సమావేశం కావాలని రాజ్యాంగం పనితీరుపై సమీక్షించే కమిషన్‌ సిఫారసు చేసింది. పార్లమెంట్‌ సమావేశం అయినప్పుడు నిమిషానికి దాదాపు 2.5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంటే రోజుకు కొన్ని కోట్లు అవుతుంది. మోదీప్రభుత్వంలో లక్షల కోట్లు ప్రజాధనం వృధా అవుతోందని భావించవచ్చు.
విధిగా చర్చలు జరగడానికి, కమిషన్‌ సిఫారసు చేసినన్ని రోజులు సమావేశాలు జరగడానికి, చర్చల్లో సభ్యులు పాల్గొనేందుకు వీలు కల్పించేందుకు కట్టుదిట్టమైన చట్టం అవసరంఉంది. అయితే ఎన్ని కట్టుదిట్టాలున్నా నేటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి అడ్డంకి కాబోవని ఇప్పటి వరకు జరిగిన మోదీ పాలన అనుభవం తెలియజేస్తోంది. ఈ పరిస్థితులను మార్చుకొనే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img