Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

దేశంలో ఏం జరుగుతోంది?

రా బావ ఏదో గొణుక్కుంటూ వస్తున్నావు. మళ్లీ ఈరోజు ఏం జరిగింది. ప్రతిసారి ఏదో కొత్త అనుభవం వస్తోంది. ఏం జరగాలి. ఈ రోజు పేపరు చూడలేదా? అసలేం జరిగింది. అయినా అన్ని పేపర్లు చూడలేం కదా! ఒకే విషయం ఒక్కో పేపరులో ఒకో రకంగా రాస్తున్నారు. గతంలోలేని విధంగా పేపరు యజమానులు కూడ తమకు యిష్టమైన పార్టీని బుజాన వేసుకుని వారికి అనుకూలంగా రాస్తున్నారు. నిజమె చివరకు మీడియా కూడ పక్షపాతంగా రాస్తుంటె, ప్రజలకు నిజం తెలిసేదెలాగో అర్థం కావడం లేదు. ప్రజలనూ తెలివితక్కువ వాళ్లుగా ఎంచి తాము రాసిందే నమ్ముతారని భావించడం అలా రాయడం ఎంతవరకు న్యాయం బావ. అంతేకాదు అసలు పేపరు యాజమన్యాలు కూడ కులమతాలకు లొంగి పక్షపాతంగా రాయడమే కాక రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతున్నారనె అనుమానం కూడ ప్రజలకు కలుగు తోంది. అంతేకాదు బావ ఈమధ్య ఒక పేపర్లో చదివా. ఐఎయస్‌, ఐపియస్‌లు హైద్రాబాదు వెళ్లి రహస్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని కలుస్తున్నారని, తమ ఉద్యోగ భద్రత కోసం సర్వేలను నమ్మి అలా కలుస్తున్నారని ఆ పత్రికలో రాశారు. ఇప్పటికి రాష్ట్రంలో పనిచేసే అధికారుల్లో 80 శాతం హైద్రాబాదులోనె కాపురం ఉంటున్నారని సెలవురోజుల్లో రహస్యంగా కలుస్తున్నారని రాశారు. వారె అలా భయపడి కలుస్తుంటె యిక సామాన్య కార్యకర్తలు, ప్రజలు కూడ నమ్మే పరిస్థితి ఉంటుందని కూడ అలా రాయవచ్చుగ. అది సరె అసలు పార్లమెంటు లోను, అసెంబ్లీలోను శాసనకర్తలు ప్రజల అభివృద్ధి కోసం చట్టసభల్లో చట్టం చేస్తే ఆ జీవోలను నూరుశాతం అమలు పరచవలసిన బాధ్యత ఐఎయస్‌లది. సమాజంలో ఎంతో విజ్ఞానవంతులు, తెలివిగలవారు మాత్రమే ఐఎఎస్‌లు కాగలరని రాజకీయాలకు అతీతంగా చట్టాలను అమలు పరుస్తారని వారికి ఎంతో గౌరవం ఉంది.మరి అలాంటపుడు వారు భయపడి కలవాల్సిన పనేముంది. అది నిజమె కాని వారు కూడ మానవమాత్రులె గద బావ. మానవ బలహీనతలు సహజంగా అందరిలో ఉంటాయి. ప్రాధాన్యత ఉన్న చోట పోస్టింగుల కోసమో లేక ప్రమోషన్ల కోసమో ముఖ్యమంత్రి కనుసన్నలలో మెలగక తప్పదు కద. అది సరె వారు కూడ జీతంతో సరిపెట్టుకోకుండ అవినీతికి పాల్పడుతున్నారని, అందుకె కలెక్టర్లు స్థానిక శాసనసభ్యుడు చెప్పినవి చేస్తున్నారనె విమర్శ కూడ ఉంది. ప్రాధాన్యత పోస్టింగులో అంతరార్థం అదే కద. వారు కూడ సంపాదనకు మొగ్గు చూపితె యిక దేశంలో న్యాయమెక్కడ.
అది సరె బావ. నారా లోకేష్‌ పాదయాత్ర సంగతేంటి. ఏముంది రాజశేఖరెడ్డి తరువాత జగన్‌ పాదయాత్రచేసి ముఖ్యమంత్రి అయినట్లు గానె ఆయన కూడ అధికారం అశించి పాదయాత్ర మొదలుపెట్టారు. చంద్రబాబు నియోజక స్థాయిలో పర్యటిస్తున్నారు. వారాహితో పవన్‌ సిద్ధమవుతున్నాడు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. యన్‌టిఆర్‌ మొదలుపెట్టిన పర్యటనలు ఇలా కొనసాగిస్తున్నారు. ఆయన రాజకీయాలు చేపట్టక ముందె సినీ నటుడుగ సుపరిచితుడు. రాజశేఖరరెడ్డి, జగన్‌ ప్రతిపక్షంలో కూర్చున్నవారిగా ప్రజలకు పరిచితులె. పవన్‌ కూడ సినీనటుడుగ పరిచితుడె. వాళ్లతో పోల్చుకుంటె లోకేశ్‌ ఎలా కుదురుతుంది పైగా తెలుగు సరిగా రాక కామిడి నాయకుడవుతున్నాడు. అది సరె ప్రతి పార్టీ వాళ్లు నా వెనుక అయిదు కోట్ల ప్రజలున్నారంటారు. ఉన్న జనాభా మొత్తం ఒక పార్టీకి ఓటు వేస్తారా ఏమిటి. సరె ఆదిలోనె హంసపాదు అన్నట్లు మొదటిరోజే లోకేశ్‌ వెంట వెళ్లిన తారకరత్న చావు బతుకుల్లో ఉన్నాడు. గతంలో పార్టీ ప్రచారానికి వెళ్లి తిరిగివస్తూ యాక్సిడెంటయి ఎలాగో బయటపడ్డాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇదంతా పాపం చంద్రబాబుకు నెగిటివ్‌గా వచ్చే సూచనలంటావా బావ. ఆ సెంటిమెంటుదేముంది గాని బావ బీజేపీ, చంద్రబాబు, పవన్‌ కలయికకి అడ్డుపడుతోంది. ముగ్గురు కలిస్తేనే జగన్‌ని ఓడిరచగలమని పవన్‌ తన అశక్తతను బయటపెడుతున్నాడు. మరోసారి తన సామాజికవర్గంలో పెద్దలు కలిసి రావడం లేదంటున్నాడు. మరోసారి నాలాంటి విధ్వంసక శక్తి మరొకటి ఉండదంటాడు. జనాభాలో వారు ఎక్కువగా ఉన్నా ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే వారిలో ఉన్నా సమర్దుడైన నాయకుడు లేడనే బాధ వారిలో ఉంది. ముద్రగడ లాంటి వారు పవన్‌కు తోడయితే పరవాలేదుగాని నిలకడలేని పవన్‌ను ఆయన సమర్థించలేడు. జె.డి.లక్ష్మీ నారాయణ, తోట చంద్రశేఖర్‌ లాంటివారు వెళ్లి తిరిగి వచ్చారు. అదిసరె తోట వలన ఆ సామాజిక వర్గంలోని ఓట్లు బిఆర్‌ఎస్‌ పేరుతో చీలినా పవన్‌కు నష్టమే. అందుకే దేశాన్ని కాక కులాన్ని ప్రేమిస్తే దేశం అభివృద్ధి చెందదని అంబేద్కర్‌ ఏనాడో అన్నారు బావ. ఏదిఏమైనా కులమతాలకు అతీతంగా ఉండవలసిన రాజకీయాలు కులాల వైపు చూస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కుల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు, మంత్రి పదవుల కేటాయింపు తగనిపని. కాని ఒకరిని చూచి మరొకరు కుల నాయకులను పెంచి పోషిస్తున్నారు. ప్రజాస్వామ్యం మూకస్వామ్యంగా మారిపోతోంది. ఎక్కువమందిని వెనకేసుకున్నవాడు అనర్హుడైనా మంత్రి కాగలడు. అందుకు సదరు నాయకుడు కుల గణన కోరుతున్నారు బావ. ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ.
సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img